విశాఖపట్నం

గేదెల రాజును హత్యచేయించింది నేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 21: రౌడీషీటర్ గేదెల రాజును హత్య చేయించింది తానేనని ఆర్టీసి విజిలెన్స్ డిఎస్పీగా ఉన్న రవిబాబు పోలీసుల ముందు అంగీకరించాడు. గేదెల రాజు హత్య జరిగిన తరువాత సుమారు 12 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రవిబాబు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో చోడవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అతనిని న్యూ పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు డిసిపి రవికుమార్ మూర్తి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు రవిబాబును మీడియా ముందు ప్రవేశపెట్టారు.
గేదెల రాజును హత్య చేయించింది తానేనని రవిబాబు అంగీకరించారు. కాకర నూకరాజు కుమార్తె పద్మలత మరణానంతరం గేదెల రాజు తనను పదేపదే వేధిస్తుండడం వలన అతనిని వదిలించుకోవాలని నిర్ణయించి, గాజువాక కేంద్రంగా నడుస్తున్న క్షత్రియభేరి అథినేత భూపతిరాజు శ్రీనివాసరాజుతో 25 లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నానని రవిబాబు పోలీసులకు చెప్పాడు. అడ్వాన్స్‌గా 10 లక్షల రూపాయలను ఇచ్చారు. రవిబాబు కుమారుని పేరున ఉన్న రెండు చెక్కులను భూపతిరాజుకు ఇచ్చాడు.
రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న భూపతిరాజుకు రౌడీషీటర్లతో కూడా అంతకు మించి పరిచయాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే భూపతిరాజు, గేదెల రాజు మధ్య స్నేహం ఏర్పడింది. గేదెల రాజు ప్రైవేటు సెటిల్‌మెంట్లు చేస్తూ, రౌడీయిజం చెలాయిస్తుండేవాడు. ఇదే సమయంలో గాజువాక ఏసిపిగా పనిచేస్తున్న రవిబాబుకు భూపతిరాజు, గేదెలరాజు దగ్గరయ్యారు. ఒక భూ వివాదంలో భూపతిరాజుకు, గేదెల రాజుకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం రవిబాబు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సెటిల్ చేశాడు.
ఇదిలా ఉండగా 2000-03 మధ్య రవిబాబు యలమంచిల సి.ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్.రాయవరం ఎంపిపి కాకర పద్మాలతతో పరిచయం ఏర్పడింది. పద్మలత తండ్రి నూకరాజుపై నమోదైన ఒక కేసును రవిబాబు పరిష్కరించారు. అప్పుడే పద్మాలతను వలలో వేసుకున్నాడు. ఆమె భర్తకు విడాకులు ఇస్తే, పెళ్లిచేసుకుంటానని పద్మలతను నమ్మించాడు. 2008లో పద్మలత భర్త మరణించాడు. ఆ తరువాత తనను పెళ్లిచేసుకోమని చెప్పగా, రవిబాబు నిరాకరించాడు. దీంతో పద్మలత జీవితం చిన్నాభిన్నమైంది. కానీ, రవిబాబును వదులుకోడానికి ఇష్టపడని పద్మలత తనను వివాహం చేసుకోమని పదేపదే రవిబాబును డిమాండ్ చేసేది. పద్మలతను రవిబాబు దూరం పెడుతూ వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన పద్మలత 2016 మార్చిలో అప్పటి డిజిపికి, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రవిబాబు తనతో సన్నిహితంగా ఉన్న భూపతిరాజు, గేదెల రాజును పిలిచి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాల్సిందిగా కోరాడు. తన దగ్గర ఉన్న ఒక స్థలాన్ని విక్రయించి, ఆ మొత్తాన్ని పద్మలతకు ఇవ్వజూపాడు. అయితే, ఆమె అందుకు అంగీకరించలేదు. తనను వివాహం చేసుకోవాలనే డిమాండ్ చేసింది. దీంతో పద్మలతను హతమార్చాల్సిందిగా గేదెల రాజును పురమాయించి, కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలను భూపతిరాజు ద్వారా గేదెల రాజుకు ఇప్పించాడు. పద్మలతకు విషం పెట్టి చంపాలని కుట్రపన్నిన గేదెల రాజు ఆమె తండ్రి నూకరాజుకు దగ్గరవుతూ వచ్చాడు. ఈనేపథ్యంలోనే గాజువాక ఆల్ఫా హోటల్‌లో పద్మలతకు విషపూరిత బిర్యానీ తినిపించాడు. తిన్న కొద్దిసేపటికే పద్మలకు వాంతులు కావడంతో ఆమెను కేజిహెచ్‌కు తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. అక్కడి నుంచి డిస్‌చార్జ్ అయిన తరువాత పద్మలతను కొంత కాలం తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. అప్పుడే ఆమెకు స్లో పోయిజన్ ఇచ్చి, ఆమె మరింత నీరసించిపోయేలా చేశాడు. అయితే, పద్మలత విషయంలో తనను ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు గేదెల రాజు ఆమెను రేకపల్లి తీసుకువెళ్లి, తాయత్తు కట్టిస్తానని పద్మలత కుటుంబ సభ్యులను నమ్మించాడు. రేకపల్లి తీసుకువెళ్లేటప్పుడు పద్మలత తమ్ముడు మురళి, అతని స్నేహితుడు కూడా వెంట వెళ్లారు. అయితే, మార్గమధ్యంలో మురళి, అతని స్నేహితుడిని కొంత దూరంలో ఉంచి, పద్మలతకు విషం ఇచ్చాడు. దాంతో పద్మలత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. పద్మలత శవాన్ని నూకరాజు ఇంటికి తరలించారు. పద్మలత మృతిపై నూకరాజు కుటుంబ సభ్యులకు అనుమానాలున్నా అవి నివృత్తి కాకుండానే, శవాన్ని దహనం చేశారు. పద్మలతను హతమార్చాడానికి జరిగిన ఒప్పందం మేరకు మిగిలిన 50 లక్షలు ఇవ్వాల్సిందిగా రవిబాబును పదేపదే అడిగేవాడు. దీంతో రాజును వదిలించుకునేందుకు రవిబాబు భూపతిరాజుతో 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రవిబాబు కుమారుడు పేరుతో ఉన్న రెండు చెక్‌లను ఐదు లక్షల చొప్పున భూపతిరాజుకు రవిబాబు అందచేశాడు. క్షత్రియ భేరి కార్యాలయంలోనే గేదెల రాజును హతమార్చడానికి భూపతిరాజు రంగం సిద్ధం చేశాడు. హత్యకు 15 రోజుల ముందు శ్రీనివాసరాజు గుమ్మడి రవి, మహేష్, ఆయన కారు డ్రైవర్ కేశవతో గేదెల రాజును హతమార్చడానికి స్కెచ్ వేశాడు. గేదెల రాజును భూపతిరాజు తన కార్యాలయానికి పిలిపించుకుని, అప్పటికే, అక్కడ సిద్ధంగా ఉన్న హంతకులతో రాజును అక్కడికక్కడే హత్య చేయించాడు.

ఇంకా ఉంది!
* సమాధానాలు దాటవేసిన పోలీసులు

విశాఖపట్నం, అక్టోబర్ 21: గేదెలరాజు, పద్మలత హత్యలకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. చోడవరంలో శుక్రవారం లొంగిపోయిన రవిబాబును శనివారం మీడియా ముందుకు తీసుకువచ్చారు. శనివారం కమిషనరేట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో డిసిపి రవికుమార్‌మూర్తి మాట్లాడారు. గేదెలరాజు హత్య జరిగిన తరువాత ఏర్పాటు చేసిన తొలి విలేఖరుల సమావేశంలో మీడియాకు ఏదైతే చెప్పారో..దాదాపూ అదే కథనాన్ని మరోసారి వినిపించారు. గేదెల రాజును హత్య చేయించింది రవిబాబే అని నిర్థారించారు. గేదెల రాజు హత్య జరిగిన తరువాత రవిబాబు ఏజెన్సీలో తలదాచుకున్నట్టు చెప్పాడని తెలిపారు. గేదెలరాజు హత్యకు ముందు బీచ్ రోడ్డులో ఎన్.సుధీర్‌కు చెందిన గెస్ట్ హౌస్‌లో ఏడుగురు వ్యక్తులు సమావేశమయ్యారని ఆయన తెలియచేశారు. అయితే, ఈ ఏడుగురు ఎవరని ప్రశ్నిస్తే, త్వరలోనే తెలియచేస్తామని డిసిపి సమాధానం చెప్పారు. పద్మలత హత్యకు సంబంధించి ఇంకా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. గేదెలరాజు హత్య కేసులో ఏ2గా ఉన్న భూపతిరాజు ఇంకా దొరకాల్సి ఉందని, అతనిని త్వరలోనే పట్టుకుంటామని డిసిపి చెప్పారు. అతని దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆగస్ట్ 13వ తేదీ నుంచి గేదెల రాజు హత్య జరిగిన రోజుకు మధ్య చోటు చేసుకున్న అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటికి సంబంధించి ఆధారాలు లభించాల్సి ఉంది. అవి దొరికిన వెంటనే తెలియచేస్తామని డిసిపి రవికుమార్ మూర్తి చెప్పారు. రవిబాబును ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ‘నువ్వు చోడవరంలో ఎందుకు లొంగిపోయావు’ అని అడిగామని, మీరంటే భయమని, అందుకే అక్కడ లొంగిపోయానని రవిబాబు సమాధానం చెప్పాడు.’ అని డిసిపి చెప్పారు. పద్మలత హత్య రూరల్ ప్రాంతంలో జరిగితే, నగర పోలీసులు కేసు ఎలా నమోదు చేశారని విలేఖరులు ప్రశ్నించగా, రవిబాబు అప్పట్లో సిట్‌లో పనిచేసేవాడని సమాధానం ఇచ్చారు. పద్మలత హత్యపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మర్రిపాలెంలో ఉన్న ఆమె బంధువు కృష్ణవేణి, అలాగే కాకర నూకరాజును ప్రశ్నించారా? ‘ఆయన మీకు స్టేట్‌మెంట్’ ఇచ్చారా?’ అని డిసిపి విలేఖరులను ఎదురు ప్రశ్నించారు. 2013లో రవిబాబు బ్యాంకాక్ వెళ్లాడని విలేఖరులు ప్రశ్నంచగా, ఆయన ఎందుకు, ఎవరితో బ్యాంకాక్ వెళ్లాడో తెలియదని అన్నారు. రవిబాబు తనకు అన్యాయం చేశాడని పద్మలత ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేఖరులు ప్రశ్నించగా, ఎస్.రాయవరంలో పోలీస్ స్టేషన్‌లో అప్పటి, ఎస్.ఐ, సి.ఐ ఎవరో ఇంకా విచారించాల్సి ఉందని డిసిపి చెప్పారు. పద్మలత తమ్ముడిని విచారించారా? అని ప్రశ్నించగా, లేదని ఆయన సమాధానం చెప్పారు. పద్మలతను డిజిపి దగ్గరకు విమానంలో తీసుకువెళ్లిన కశింకోటకు చెందిన మహిళా నాయకురాలిని విచారించారా? అని అడిగితే ఇంకా విచారించాల్సి ఉందని అన్నారు. ఈ కేసులో మీడియా దృష్టికి వచ్చిన కీలక అంశాలను పోలీసుల ముందుంచినప్పుడు, వీటన్నింటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను త్వరలోనే మీ ముందుంచుతామని డిసిపి మీడియా సమావేశాన్ని ముగించారు.

వీడని అనుమానాలు

విశాఖపట్నం, అక్టోబర్ 21: గేదెలరాజు, పద్మలత హత్య కేసును చేధించడానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. నిజాలను నెమ్మదిగా బయటపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు హత్యల్లో కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పటికీ అనేక అనుమానాలు కొనసాగుతునే ఉన్నాయి.
* ఆల్ఫా హోటల్‌లో బిర్యానీ తిన్న తరువాత పద్మలత వాంతులు చేసుకుంది. అంటే ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుస్తోంది. దీనిపై ఆల్ఫా హోటల్ యాజమాన్యాన్ని ఎందుకు విచారించలేదు?
* ఆల్ఫా హోటల్‌లో బిర్యానీ తిన్న తరువాత అస్వస్థతకు గురైన పద్మలతను కేజిహెచ్‌లో చేర్చారు. ఆ సమయంలో ఆమెకు వైద్యం అందించిన డాక్టర్లను, సిబ్బందిని పోలీసులు ఇంకా ఎందుకు విచారించలేదు?
* పద్మలత తమ్ముడు మురళిని ఎందుకు విచారించలేదు?
* పద్మలత హత్యకు సంబంధించి లిఖితపూర్వకంగా ఎవ్వరూ ఫిర్యాదు ఇవ్వలేదు. పద్మలత హత్యకు రవిబాబే కారణమని ప్రాథమికంగా నిర్థారణ అయినా, కనీసం తన కుమార్తె మరణంపై విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
* పద్మలత మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేశాయి. వారు కూడా ఇప్పుడు ఎందుకు వౌనంగా ఉన్నారు.
* పద్మలతను హైదరాబాద్ తీసుకువెళ్లిన కళ్యాణిని ఎందుకు విచారించలేదు?
* రవిబాబు, పద్మలత మధ్య రాజీ కుదిర్చేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు ప్రశ్నించారా?
* తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది పోలీసు అధికారులు తనను ఈ కేసులో ఇరికించారని రవిబాబు చెపుతున్న మాటల్లో నిజం ఎంత? ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతారా?
* తనకు రవిబాబు అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయమని పద్మలత డిజిపికి, నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో ఎస్.రాయవరం పోలీసులను ఎందుకు విచారించనున్నారు?

ప్రాణాలు తీసిన పిచ్చి ప్రేమ
* పద్మలత పచ్చని కాపురంలో రవిబాబు చిచ్చు
* గేదెలరాజు నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయిన పద్మ

విశాఖపట్నం: కట్టుకున్న భర్తను వదిలిపెట్టి తనతో వచ్చేయడానికి సిద్ధపడిన అమాయకురాలిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. తనే సర్వస్వం అని నమ్మిన ఆమెను విషమిచ్చి అతి కిరాతకంగా చంపేశారు. తండ్రికి రాజకీయ వారసురాలిగా ఎదగాల్సిన ఆమె జీవితాన్ని మధ్యలోనే తుంచేశారు. ఈ కథ ఎవరిదో కాదు.. డిఎస్పీ రవిబాబు మాయమాటలు నమ్మి, అతనిని ప్రేమించి, చివరకు కర్కశుల చేతులో బలైపోయిన కాకర పద్మలత కథ. పద్మలత చిన్నప్పటి నుంచి పట్టుదలతో కలిగిన వ్యక్తి. తను అనుకున్నది సాధించాలని చూసేది. ఇంట్లో పద్మలతను గారాబంగా పెంచారు. ఎం.పి.సి గ్రూపులో ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసుకున్న పద్మలత ఇంట, బయట పనులు చక్కబెట్టేది. పొలం పనులు స్వయంగా చూసుకునేది. పై చదువులు చవడానికి ఇష్టం లేకపోవడంతో కనే్నపల్లి జగదీష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయితే, పద్మలత భర్తతతో అంతంతమాత్రంగానే ఉండేది. ఎంపిపిగా ఎన్నికైన తరువాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. రాజకీయంగా బయట తిరుగుతున్నా, ఏ వ్యక్తితోనూ చనువుగా ఉండేది కాదు. దర్పం ప్రదర్శించేంది. హుందాగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యేది. ఇదే సమయంలో యలమంచిలి డిఎస్పీ రవిబాబు ఆమెకు మాయమాటలు చెప్పి, బుట్టలో వేసుకున్నాడు. గుండె ధైర్యం, పట్టుదల కలిగిన పద్మలతను ఆయన చాకచక్యంగా తనవైపునకు తిప్పుకున్నాడు. రవిబాబు, పద్మలత మధ్య ఉన్న పరిచయాన్ని తండ్రి నూకరాజు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చేవారు. పద్మలత అంటే నూకరాజుకు అమితమైన ప్రేమ. నూకరాజు రాజకీయ నిర్ణయాల్లో పద్మలత పాత్ర ఎక్కువగా ఉండేది. అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో ఇంత ఆత్మస్థైర్యం కలిగిన పద్మలత నిర్జీవమైపోయింది. తన కుమారుడు శ్రీనివాసును చూసుకుంటూ ఇంట్లోనే కాలం గడిపేది. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ రవిబాబుపై ఆమెకు దృష్టి మళ్లింది. తన భర్త చనిపోయినందువలన, తనను వివాహం చేసుకోవాలని రవిబాబుపై వత్తిడి తెచ్చింది. దీనివలన రవిబాబు కుటుంబంలో కూడా కలహాలు ఆరంభమయ్యాయి. ఈ వత్తిడి తట్టుకోలేక పద్మలతను హతమార్చాలని రవిబాబు స్కెచ్ వేశాడు. ఇందుకోసం రౌడీషీటర్ గేదెలరాజు సహకారం తీసుకున్నాడు. పద్మలతకు విషం ఇచ్చి చంపాలన్నది గేదెలరాజు పథకం. అందులో భాగంగానే గాజువాకలోని ఆల్ఫా హోటల్‌లో పద్మలతకు విషాహారం తినిపించాడు. అయితే, ఆసుపత్రిలో చేరి పద్మలత తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. అయితే, అది తాత్కాలికమేనని ఆమెకు తెలియదు. తన వెంట ఉన్నది తన మేలు కోరేవాడు కాదని, తనను అంతమొదించడానికి వచ్చిన వాడని ఆమె గ్రహించలేకపోయింది. హంతకుని ఇంట్లోనే ఉంటూ స్లో పోయిజన్ తీసుకుంటున్నానని కూడా పద్మలత కనిపెట్టలేకపోయింది. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒంట్లో అవయవాలన్నీ సహకరించడం మానేస్తున్నాయి. అయినా, విధిలేని పరిస్థితుల్లో ఆమె ఆ కిరాతకుని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. తన వారిని కూడా చూసుకోలేని దయనీయ స్థితికి చేరుకుంది. తన కథ ముగిసే సమయంలో కూడా గేదెలరాజు తన ప్రాణాలు హరించడానికి వచ్చిన యుముడని గ్రహించలేకపోయింది. తన ఆరోగ్యం మెరుగుపడేందుకు తనను ఎక్కడికో తీసుకువెళుతున్నాడన్న భ్రమలోనే పద్మలత మెలిగింది. మనిషి సంచారం లేని చోటికి తీసుకువెళ్లి, మళ్లీ విషమిచ్చి పద్మలత అక్కడికక్కడే మరణించేలా చేశాడు గేదెలరాజు. తనను పిచ్చిగా ప్రేమించిన పద్మలతను ఇంత భయంకరంగా చంపించిన రవిబాబును ఏమనుకోవాలి? పద్మలత పచ్చని కాపురంలో చిచ్చురగల్చడమే కాకుండా, ఆమె ప్రాణాలు తీసిన వైనం ఆమె కథ తెలిసిన అందరిని కలిచి వేస్తోంది.

కెమిస్ట్రీ సదస్సుకు రూ.1.65 లక్షల విరాళం

విశాఖపట్నం, అక్టోబర్ 21: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న 36వ భారతీయ కౌన్సిల్ ఆఫ్ కెమిస్ట్రీ 2017 వార్షిక సదస్సు నిర్వహణకు గ్రాన్యూల్స్ ఓమ్నికెమ్ రూ.1.65 లక్షలు విరాళంగా ప్రకటించింది. సంస్థ సిఇఓ కెవివి రాజు తరపున అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఠాగూర్ రూ.1.65 లక్షల చెక్కును ఎయు విసి ప్రొఫెసర్ జి నాగేశ్వర రావుకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా విసి నాగేశ్వర రావు మాట్లాడుతూ వర్శిటీలో డిసెంబర్ 26 నుంచి 28 వరకూ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సదస్సుకు ఓమ్నికెమ్ విరాళం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ సంచాలకులు ఆచార్య ఆర్ మురళీకృష్ణ, విభాగాధిపతులు ఆచార్య బసవయ్య, డాక్టర్ పి శ్యామల, వి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.

రెక్టార్‌గా బాధ్యతలు స్వీకరించిన గాయత్రి దేవి

విశాఖపట్నం, అక్టోబర్ 21: ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన రెక్టార్‌గా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, సంస్కృత విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె గాయత్రిదేవి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వర రావు తన కార్యాలయంలో ప్రొఫెసర్ గాయత్రిదేవికి ఉత్తర్వులు అందజేసి అభినందించారు. వర్శిటీ పాలనలో అవసరమైన సూచనలు అందిస్తూ పనిచేయాలన్నారు. వర్శిటీ పాలన పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి ఉమామహేశ్వ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ గాయత్రిదేవి రెక్టార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదోన్నతులు పొందిన ఆచార్యులకు శనివారం ఉదయం వర్శిటీ విసి నాగేశ్వర రావు ఉత్తర్వులు అందజేశాసి, అభినందించారు.

సాఫ్ట్‌స్కిల్స్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి
*రెక్టార్ ప్రొఫెసర్ గాయత్రి దేవి

విశాఖపట్నం, అక్టోబర్ 21: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు సాఫ్ట్‌స్కిల్స్ ఎంతగానో ఉపకరిస్తాయని ఎయు రెక్టార్ ప్రొఫెసర్ కె గాయత్రీదేవి అన్నారు. ఎయు ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఐదు రోజుల సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల స్వభావంతో మార్పును తీసుకురావడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వర్శిటీలో విద్యార్థులందరికీ కార్యక్రమాల్లో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమం అనంతరం సమన్వయ కర్త చల్లా కృష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ ఐదు రోజుల శిక్షణ శిబిరంలో భాగంగా జర్నలిజం, ఆర్కియాలజీ, హిస్టరీ, లైబ్రరీ సైన్స్, ఎకనామిక్స్ విభాగాల విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ అందించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె శాంతి, డాక్టర్ జయశ్రీ శెట్టి, బి పద్మజ, ఉమామహేశ్వర రావు, అన్వర్, సాయిబాల, జెవి సురేష్ తదితరులు ప్రసంగించారు.

సాహసానికి మారుపేరు సీకేడెట్లు
* క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్‌వి బాలసుబ్రహ్మణ్యం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 21: త్రివిధ రక్షణ దళాల్లో నావికాదళం కీకలపాత్ర పోషిస్తుటందని, నావికాదళంలో ప్రాధమిక శిక్షణలో చేరిన సీకేడెట్లు దేశ రక్షణలో భాగస్వామ్యమైనందుకు గర్వపడాలని రాష్ట్ర క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. రుషికొండ యాటింగ్, జల క్రీడల కేంద్రం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సీకేడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. సాహసమే ఊపిరిగా సీకేడెట్లు సుదీర్ఘ శిక్షణ పూర్తి చేసుకోవాలన్నారు. తదుపరి అక్కడే ఉన్న జలక్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా క్రీడాకారులు సాధన చేయాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రుషికొండ సమీపంలో జలక్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇటువంటి క్రీడలు నగరంలోను, జిల్లా తీర ప్రాంతంలోను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. రుషికొండ జలక్రీడల కేంద్రంలో 70 మందికి శిక్షణ ఇస్తునన్నామని అనుకూలత మేరకు మరికొంత మందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రుషికొండ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, పర్యాటకంగా ఎన్నో వసతులు ఇక్కడ కల్పించడంతో పాటు వినోద కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రోజంతా నిరంతరం కొనసాగేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాప్) ఎండి బంగార్రాజు మాట్లాడుతూ క్రీడలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం రుషికొండలో జలక్రీడల ట్రైల్న్స్ నిర్వహించారు. 10 కయాక్‌లు, 2సర్ఫ్ బోట్లు, ఒక యాట్‌లో శిక్షణ పొందుతున్న జల క్రీడాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జిల్లా క్రీడల శాఖ అధికారి జూన్ గెలియట్, శాఖా పరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఇడి శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.