విశాఖపట్నం

రూపుమారనున్న పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్న లక్ష్యంతో జివిఎంసి ముందుకు సాగుతోంది. నగర పరిధిలోని పార్కులు, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుందరీకరణ చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో నగరంలో పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్కుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక, డిజైన్లు, ఎస్టిమేట్‌లను కార్పొరేషన్ రూపొందిస్తుంది. కాలనీల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో పార్కులను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని జివిఎంసి ఇప్పటికే చేపట్టింది. దీనిలో భాగంగా 2013 నుంచి 2015 వరకూ 93 పార్కులను అభివృద్ధి పరచిన జివిఎంసి తాజాగా మరో 37 పార్కులను ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం రూ.20 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. పార్కుల అభివృద్ధికి సంబంధించి ప్లాన్, డిజైన్, ఆర్థిక అంచనాలను కార్పొరేషన్ సమకూర్చగా మొత్తం అంచనా వ్యయంలో రెండు వంతులు జివిఎంసి సమకూర్చుతుంది. మిగిలిన ఒక వంతు నిధులను రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు భరించాల్సి ఉంటుంది. ఇక జివిఎంసి సొంతంగా అప్పుఘర్ సమీపంలోని లుంబిని పార్కును అభివృద్ధి చేయనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. కేంద్రం సమకూర్చే రూ.1.07 కోట్లతో లుంబిని పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనిలో పాటు నగరంలోని పలు ఖాళీ ప్రదేశాలు, ముడసర్లోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు జివిఎంసి ప్రణాళికలు రూపొందించింది. జివిఎంసి పరిధిలో గల 1178 ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచే ఆలోచన చేస్తున్నారు.