విశాఖపట్నం

అన్నీ ఉన్నా..సిబ్బంది లేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో టెర్మినల్ ప్రారంభమైనా, పూర్తి స్థాయిలో అది పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎయిర్ కార్గో టెర్మినల్‌ను అట్టహాసంగా ప్రారంభించినా, ఇందులో పనిచేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బందిని మాత్రం ప్రభుత్వం కేటాయించకపోవడం గమనార్హం. విశాఖ నుంచి ఎయిర్ కార్గో రవాణా చేసే బాధ్యతను జిఎస్‌ఇసి సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి ఏడాదికి 40 వేల టన్నుల కార్గోను రవాణా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఆక్వా ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే, విమానాశ్రయంలో డ్రగ్ కంట్రోలర్ అనుమతి తప్పనిసరి. అయితే, ఇక్కడ డ్రగ్ కంట్రోలర్‌ని ఇప్పటి వరకూ నియమించలేదు. సీ ఫుడ్స్‌ను ఎగుమతి చేయాలంటే, యానిమల్ క్వారంటైన్ ఆఫీసర్ అనుతి తప్పనిసరి. ఆ అధికారిని కూడా నియమించలేదు. కాగా, కార్గోటెర్మినల్ భద్రతకు 175 మంది భద్రతా సిబ్బంది అవసరం ఉంది. కానీ, ఇక్కడున్నది 135 మంది మాత్రమే. మరో 40 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది కావాలని ఎయిర్‌పోర్టు డైరక్టర్ లేఖ రాసినా, ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సంవత్సరానికి 70 వేల టన్నుల కార్గో ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్ జిడిపిలో ఏనిమిదవ స్థానంలో ఉంది. జిడిపిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న విశాఖ నుంచి కార్గో ఉత్పత్తులు పెంచడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోలేకపోతోంది. విశాఖ నుంచి ఆక్వా, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తులు దుబాయ్ మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అటువంటిది విశాఖ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం శోచనీయం. అలాగే విశాఖ నుంచి వివిధ దేశాలకు కేవలం కార్గోను మాత్రమే రవాణా చేసే డెడికేటెడ్ కార్గో ఫ్లైట్ అవసరం ఎంతైనా ఉంది. ఇవేవీ లేకుండా విశాఖ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించినా ప్రయోజనం ఏముంటుంది?

విశాఖ-జగ్దల్‌పూర్ స్పెషల్ ట్రైన్
కిరండల్ వరకూ పొడిగింపు
విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖపట్నం-జగ్దల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను కిరండల్ వరకూ పొడిగించారు. జగ్దల్‌పూర్‌కు ఇది మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలుగా వాల్తేరు డివిజన్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం-కిరండల్-విశాఖపట్నం ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకూ కిరండల్ వరకూ నడవనున్న ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిరండల్‌లో ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దేరి, మర్నాడు తెల్లవారుజాము మూడు గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అలాగే విశాఖలో ప్రతి రోజు రాత్రి 10.15 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 10 గంటలకు కిరండల్ చేరుకుంటుంది.

వాల్తేరు డివిజన్‌లో భద్రతా సదస్సు
విశాఖపట్నం, నవంబర్ 21: వాల్తేరు డివిజ్‌లో భద్రత, సమయ పాలనపై సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సును డిఆర్‌ఎం ముకుల్ శర్‌ణ్ మాథూర్ ప్రారంభించారు. ముఖ్యంగా ప్రయాణికుల రైళ్లు నిర్ణీత సమయానికి ఆయా రైల్వే స్టేషన్లకు చేరడం, ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మొక్కలు మాథూర్ మొక్కలను నాటారు.

గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు
విశాఖపట్నం, నవంబర్ 21: గత రెండు రోజులుగా గుడ్లగూబలను చూసి వింతజీవులంటూ జనం హడావుడి చేస్తున్నారు. అవి సామాన్యమైన గుడ్లగూబలేనని, పగటిపూట అవి నిలబడే ఉంటాయని, వాటిని వింత జంతువులుగా జనం భావిస్తున్నారని ఆంధ్రా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భరతలక్ష్మి చెప్పారు. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు స్పందించి, రెండు గుడ్లగూబలను మంగళవారం పట్టుకున్నారు. మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు అరుదైనవని వారు నిర్థారించారు. వీటి సంరక్షణ బాధ్యతను జూ అధికారులకు అప్పగిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

హోటళ్లపై విజిలెన్స్ దాడులు
* 23 గ్యాస్ సిలెండర్లు స్వాధీనం
విశాఖపట్నం, నవంబర్ 21: నగరంలోని పలు హోటళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. గృహావసరాల నిమిత్తం వినియోగించే గ్యాస్ సిలెండర్లను హోటళ్లలో వాడడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో 23 గ్యాస్ సిలెండర్లను అధికారులు సీజ్ చేశారు. స్థానిక కప్పరాడ పరిధిలోని 35, 27 వార్డుల్లోని కొన్ని హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిలెండర్లను సీజ్ చేశారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పెద్ద హోటల్‌పై దాడి చేసి ఏడు సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిలెండర్లను సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐ మల్లిఖార్జునరావు, శ్రీనివాసరావు, ఎస్‌ఐ రమేష్, తహశీల్దారు సుమబాల తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
విశాఖపట్నం, నవంబర్ 21: స్థానిక వన్‌టౌన్ ఏరియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం 12.30 గంటలకు వి.వెంకటేష్ (28) కోటవీధి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. వెంకటేష్ విసిటిపిఎల్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా మినీ ట్రక్ వచ్చి వెంకటేష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. వెంటనే వెంకటేష్ రోడ్డుపై పడ్డాడు. అతనిని వెంటనే కెజిహెచ్‌కు తరలించారు. అప్పటికే వెంకటేష్ మరణించినట్టు డాక్టర్లు చెప్పారు.

26,27 తేదీల్లో స్కూల్ పిల్లల
సందర్శనకు యుద్ధ నౌకలు
విశాఖపట్నం, నవంబర్ 21: భారత నౌకాదళ వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని స్కూల్ పిల్లల సందర్శన కోసం యుద్ధ నౌకలను ఉంచనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ నౌకలను సందర్శించడానికి వీలుంటుంది. నౌకలను చూసేందుకు వచ్చే పిల్లలకు విధిగా ఉపాధ్యాయులు తోడుగా ఉండాలని నేవీ అధికారులు సూచించారు. స్కూల్ పిల్లలు విధిగా స్కూల్ యూనిఫారం ధరించి ఉండాలని, అలాగే మన దేశానికి చెందిన వారై ఉండాలని అధికారులు సూచించారు. నౌకలను చూసేందుకు వచ్చే పిల్లలను శాతవాహన బస్ స్టాప్ వద్ద ఉన్న పల్లవ గేట్ నుంచి లోపలకు పంపించనున్నారు. నౌకలను సందర్శించేందుకు వచ్చే వారు విధిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. బ్యాగ్‌లు, కెమేరాలను లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.