విశాఖపట్నం

దగాపడ్డ నిరుద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబు వైఖరిపై మండిపడ్డ వైసీపీ యువత

విశాఖపట్నం, డిసెంబర్ 13: చంద్రబాబు మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోయారని వైసీపీ యువజన, విద్యార్థి సంఘ నాయకుడు జక్కంపూడి రాజా అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, ఇవ్వకపోవడాన్ని నిరిసిస్తూ వైసీపీ యువజన నాయకుల నేతృత్వంలో స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా ధర్నా జరిగింది. తొలుత వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వచ్చి, గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు సంపాదించేందుకు చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు భృతి ఇవ్వకుండా మోసం చేశాడని విమర్శించారు. జాబు కావాలంటే, బాబు రావాలని ఆరోజు అన్నారు. ఆయన వచ్చిన తరువాత కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు పోయాయని, బాబు పోతేనే జాబులు వస్తాయని అన్నారు. యువత తలుచుకుంటే, ప్రభుత్వాలను మార్చే పరిస్థితి ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని రాజా కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజ్ రీఅంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడం వలన లక్షలాది మంది విద్యార్థులు ఉన్న విద్యలను అభ్యసించారని అన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్ని చంద్రబాబు నిరుద్యోగాన్ని పెంచుతూ వస్తున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే, నిరుద్యోగ సమస్య లేకుండా ఉండేదని అన్నారు.
వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో చేపట్టిన తరువాత విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. రాష్ట్రం ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లడుతూ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. హోదా రావడం వలన ప్రయోజనాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. హోదా రాకపోవడం వలన ఏపీ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని మళ్ల అన్నారు. తూర్పు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, వెస్లీ, ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కేకే లైన్‌ను పరిశీలించిన రైల్వేబోర్డ్ చైర్మన్
* కార్మికులను అభినందించిన చైర్మన్ లొహాని
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 13: రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లొహాని బుధవారం వాల్తేరు డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. కేకే లైన్‌లో ఇటీవల దెబ్బతిన్న పిల్లర్, బ్రిడ్జిని భారతీయ రైల్వేలో మునుపెన్నడూ లేనివిధంగా కేవలం 58 రోజుల్లోనే పునరుద్ధరించిన కార్మికులను అభినందించడానికి చైర్మన్ ఇక్కడికి వచ్చారు. విశాఖ నుంచి ప్రత్యేక రైలులో చైర్మన్ లొహాని, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్, విశాఖ రైల్వే డివిజన్ మేనేజర్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎస్‌కే శర్మ తదితరులు వెళ్లి కేకే లైన్‌ను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని బోర్డు చైర్మన్ పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతను పాటించారని, అదేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టడం ముదావహమని అన్నారు. ఇందులో కార్మికులు, అధికారులు చిత్తశుద్ధి కనిపిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ లొహాని ట్రాక్‌మెన్, గ్యాంగ్ ఉమెన్‌ను కలుసుకుని, వారికి అభినందనలు తెలియచేశారు. రైల్వే ఇంజనీర్ల పనితీరు అభినందనీయమని అన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అలాగే ట్రాక్ నిర్మాణానికి కావల్సిన వౌలిక సదుపాయాలను కల్పించనున్నామని ఆయన తెలియచేశారు. ఆ తరువాత బోర్డు చైర్మన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ప్లాట్‌ఫారంలు, వెయిటింగ్ రూంలు, టాయిలెట్లు, క్యాటరింగ్ యూనిట్ల నిర్వహణను ఆయన పరిశీంచారు. స్టేషన్ పరిశుభ్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే యూనియన్ నాయకులతోపాటు, ఉద్యోగులను వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడారు. రైల్వే ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యతతో రైల్వేను మరింత ఉన్న శిఖరాలకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రైల్ దాబాను పరిశీంచి, అక్కడ బీమ్ యాప్‌ను ఆవిష్కరించారు.

-ళనఆ
ఫైల్‌నెం : 13ఎఆర్-1

గీతం అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు ప్రారంభం
విశాఖపట్నం, డిసెంబర్ 13: గీతం డీమ్డ్ యూనివర్శిటీ అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు జిమ్‌సర్ క్రీడా మైథానంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లను అభినందిస్తూ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గీతం ప్రోవైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణయ్య, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే లక్ష్మీప్రసాద్, ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీ గణపతి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి కే రామకృష్ణారావు, మాజీ రంజీ క్రికెటర్ ప్రొఫెసర్ ఎంబీ పాత్రుడు తదితరు పాల్గొన్నారు. నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో తొలి రోజు పోటీల్లో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌పై గీతం బెంగళూరు జట్టు విజయం సాధించగా, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ జట్టుపై గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ జట్టు, గీతం స్కూల్ ఆఫ్ లా జట్టుపై గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మశీ జట్టు, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌పై గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్లు విజయం సాధించాయి.

డీఐసీ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
* విశాఖ పోర్టులో అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన
విశాఖపట్నం, డిసెంబర్ 13: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను నూరు శాతం ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విశాఖ పోర్టులో అఖిలపక్ష కార్మిక సంఘాలు పోర్టు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. గత కొద్ది రోజులుగా డీసీఐ ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనకు అఖిలపక్షం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యునైటెడ్ పోర్టు అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ పద్మనాభ రాజు మాట్లాడుతూ డీసీఐ 1976లో ఏర్పాటైనప్పటి నుంచి లాభాలు ఆర్జిస్తోందన్నారు. నాలుగు దశాబ్ధాల కిందట రూ.28 కోట్ల పెట్టుబడులతో ఏర్పటైన డీసీఐ ప్రస్తుతం రూ.6వేల కోట్ల మేర ఆస్తులు సంపాదించిందన్నారు. లాభాల బాటలో ఉన్న డీసీఐని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించడం దారుణమన్నారు. దేశంలోని మేజర్ పోర్టులు, భారత నౌకాదళానికి అవసరమైన డ్రెడ్జింగ్ పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తోందన్నారు. గతంలో కొన్ని ప్రైవేటు కంపెనీలు మధ్యలో నిలిపివేసిన పనులను సైతం డీసీఐ పూర్తి చేసిన సందర్భాలను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ డీసీఐని ప్రైవేటీకరిస్తే లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయని, తద్వారా మేజర్ పోర్టులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా అనేక పోర్టులు రానున్నాయని, ఈ తరుణంలో ప్రభుత్వ రంగ డీసీఐని ప్రైవేటీకరించాలన్ని బీజేపీ నిర్ణయం దేశ ప్రయోజనాలకు నష్టమని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా డీసీఐని బీజేపీ దేశ భద్రతకు కూడా ప్రమాదకరమన్నారు. విహెచ్‌పిడబ్ల్యు ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మసేన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే టాప్-10 డ్రెడ్జింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉందని, విదేశీ వర్క్ ఆర్డర్లు సంపాదించి సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. డీసీఐకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమన్నారు. ఎన్‌పీటీఈ ప్రధాన కార్యదర్శి కే పరదేశి నాయుడు మాట్లాడుతూ డీసీఐ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడతారన్నారు. ఇది పోర్టు అభివృద్ధికి ఆటంకమన్నారు. ధర్నాలో సీఐటీయు నాయకులు పరశురాం, కెఎస్ కుమార్, జే సత్యనారాయణ, కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

24న బీజేపీ ఆధ్వర్యంలో ఓబీసీ సదస్సు
* ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మధుసూదన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 13: రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మధుసూదన్ తెలిపారు. నగర బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఏర్పాటు చేసిన బీసీ ఫెడరేషన్లు అమలు కావట్లేదన్నారు. ఇప్పటి వరకూ ఈ ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గాలను నియమించడం మినహా సాధించింది శూన్యమని మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి నిధుల విడుదల కూడా అంతంతమాత్రంగానే ఉందని ఆరోపించారు. కింది స్థాయి లబ్ధిదారులకు నిధులు చేరడం లేదని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని బీసీ ఫెడరేషన్లను బలోపేతం చేయడంతో పాటు వాటిని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాల్లో విద్యాభివృద్ధికి సంబంధించి సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై మధుసూదన్ మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో వౌలిక వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే సంక్షేమ హాస్టళ్లలో వౌలిక సద సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న బీసీ చైతన్య సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని అందుకు బీజేపీ చొరవ తీసుకోవాలని సూచించారు. బీజేపీ బీసీల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నాలుగు మహా సభలు జరుగాయని పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు మాదేటి కనకారావు, బొమ్మిడి సుజాతరావు, సతివాడ లక్ష్మీప్రసాద్, ఉరుకొటి అప్పారావు, జీవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

శిరోముండనం కేసులో ఎమ్మెల్యే త్రిమూర్తులను శిక్షించాలి
* ప్రజా సంఘాల డిమాండ్
విశాఖపట్నం, డిసెంబర్ 13: దళితులకు శిరోముండనం చేయించిన కేసులో ప్రధాన నిందితుడు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామంలో దళితులపై దాడిచేసి వారిని దారుణ రీతిలో అవమాన పరచిన సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే, అతని అనుచరులు నిందితులని పేర్కొన్నారు. దళితులపై దాడి, శిరోముండనం కేసు నుంచి ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు సాక్ష్యాలను బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారిపై దాడి చేసిన సంఘటన ఇంకా మదిలో మెదులుతోందన్నారు. కేసు నమోదు చేసి 21 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నిందితులకు శిక్షలు పడలేదన్నారు. అప్పటి ఎన్నికల సందర్భంగా దళితులు త్రిమూర్తులుకు ఓటేయలేదన్న అక్కసుతో అమానుషంగా హింసించారని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చెలరేగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎమ్మెల్యేను అరెస్టు చేసి జైలుకు పంపిందన్నారు. అప్పట్లోనే జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేకు సౌకర్యాలు కల్పించారని ఆరోపించారు. ఎమ్మెల్యే త్రిమూర్తులుకు శిక్ష ఖరారైన పక్షంలో దళితులు, బాధితులపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓపీడీఆర్ అధ్యక్షుడు సి భాస్కరరావు, దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ, ప్రతినిధి బీ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

23న ఆర్కే బీచ్‌లో వైజాగ్ బే మారథాన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 13: ప్రైమ్‌లైఫ్ స్పోర్ట్స్, దీప్ ట్రస్టు సంయుక్తంగా ఈ నెల 23న వైజాగ్ బే మారథాన్ నిర్వహిస్తున్నట్టు రేస్ సంస్థ డైరెక్టర్ మురళి నన్నపనేని తెలిపారు. ఆర్కే బీచ్ వేదికగా సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి వెబ్‌సైట్‌ను అమరాతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సాగే బే మారథాన్‌లో 10కే, 5కే విభాగాల్లో రన్ ఉంటుందన్నారు. హాఫ్ మారథాన్‌గా 21.1 కిమీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, బే మారథాన్‌కు అనూహ్య స్పందన లభిస్తుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు.

నేషనల్ రూర్బన్ మిషన్ పనుల పర్యవేక్షణ
విశాఖపట్నం, డిసెంబర్ 13: అరకులోయలో అమలు చేస్తున్న నేషనల్ రూర్బన్ మిషన్ పథకం ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమీక్షలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా అరుకులోని 11 పంచాయతీలను కేంద్రం గుర్తించిందన్నారు. వీటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామం పెదలబుడు గ్రామం కూడా ఉందన్నారు. పథకం నియమ నిబంధనలకు అనుగుణంగా 14 ప్రాధాన్యతాంశాలను గుర్తించినట్టు వెల్లడించారు. విద్య,వైద్యం, రవాణా, రహదార్లు, మంచినీటి సదుపాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని, ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి అభివృద్ధి కన్పించాలన్నారు. పథకంలో భాగంగా 11 గ్రామ పంచాయతీల్లోనూ శత శాతం సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల సదుపాయం వంటి కార్యక్రమాలు ఎన్‌ఆర్‌ఈజీ, పంచాయతీరాజ్ కన్వర్జెన్స్‌లో జరగాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమీక్షలో సంయుక్త కలెక్టర్ జీ సృజన, జెడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ, డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఆడాళ్లూ పైలెట్లు కావచ్చు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 13: విమానాలు నడిపే సత్తా మీలోనూ ఉంది. మీలో అటువంటి ఆలోచనలు ప్రోత్సహించేందుకు మే అండగా ఉంటాం అంటూ లోకెడ్ మార్టిన్ సంస్థతో కలిసి ఉమన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్ ఇండియా విభాగంతో కలిసి పాఠశాల విద్యార్థినులను చైతన్య పరిచారు. నగరానికి చెందిన కేంద్రీయ విద్యాలయం, రామ్‌నాథ్ సెకండరీ పాఠశాల విద్యార్థులను బుధవారం విశాఖ విమానాశ్రయానికి తీసుకువెళ్లి పైలెట్లు కావాలంటే అంశంపై అవగాహన కల్పించారు. భారత యువత ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తోందని, అలాగే ఏవియేషన్ రంగంలో కూడా సత్తా చూపాల్సి ఉందని లోకెడ్ మార్టిన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఫిల్ షా అన్నారు. బాలికల్లో పైలెట్లు కావాలన్న ఆకాంక్ష ఎంతో మందికి ఉంటుందని, అయితే అందుకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. ఈ అంశానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉమన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్ ప్రతినిధి రాధా భాటియా తదితరులు పాల్గొన్నారు.

జలాశయాలు, చెరువుల్లో 2.90 లక్షల చేప పిల్లల విడుదల
నర్సీపట్నం, డిసెంబర్ 13: జలాశయాలు, చెరువుల్లో చేపల పెంపకం చేపడుతున్నట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి తెలిపారు. బుధవారం నర్సీపట్నం పెద్ద చెరువులో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ధర్మసాగరం చెరువులో ఎం.పి.పి. సుకల రమణమ్మ చేపలను విడుదల చేసారు. ఈసందర్భంగా ఎ.డి. మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 2.90 లక్షల చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వదులుతున్నామన్నారు. మత్స్యకార సహకార సంఘాల ద్వారా చేపల పెంపకాన్ని చేపడుతున్నామన్నారు. మత్స్యకారులకు జీవనోపాధిని పెంపొందించేందుకు చేపల పెంపకం దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చేపల పెంపకానికి అనువుగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధిక సంఖ్యలో చేప పిల్లలను వేయడం జరిగిందన్నారు. కళ్యాణపులోవ, కోనాం, ఎన్టీ ఆర్ జలాశయాలతో పాటు రోలుగుంట ఆవ, నర్సీపట్నం పెద్ద చెరువు, పెదబొడ్డేపల్లి పెద్ద చెరువు, ధర్మసాగరం చెరువుల్లో రెండు లక్షల 90 వేల చేప పిల్లలను విడుదల చేసామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది , మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

వాతావరణంలో మార్పులతో తగ్గిన చలి
* దట్టంగా కురుస్తున్న పొగ మంచు

నర్సీపట్నం, డిసెంబర్ 13: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో విశాఖ ఏజన్సీ , మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత వారంరోజులుగా చలి తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. ఈనెల మొదటి వారంలో లంబసింగి , చింతపల్లి ప్రాంతాల్లో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గత వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం లంబసింగిలో 12 డిగ్రీలు , చింతపల్లిలో15 డిగ్రీలు ,జి.కె.వీధిలో 13 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ నెలాఖరు నుండి డిసెంబర్ మొదటి వారం వరకు చలిగాలలు వీపరీతంగా వీచాయి. ప్రజలు కూడా చలితో ఇబ్బందులు పడ్డారు. తాజాగా చలి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంత మేర ఉపశమనం పొందుతున్నారు. అయితే పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారు జాము నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా మన్యాన్ని తలపించే విధంగా మైదానప్రాంతంలో సైతం పొగ మంచు కురుస్తోంది. ఇక్కడ కూడా తొమ్మిది గంటల వరకు మంచు విపరీతంగా పడుతోంది. పొగ మంచు కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఉబ్బసం, ఎలర్జీ ఉన్న వారు పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం ఉదయం చింతపల్లిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్తవ్రేత్త దిలీప్ తెలిపారు. ప్రస్తుతం మన్యంలో చలి తీవ్రత తగ్గిందని , అదే సమయంలో పొగ మంచు విపరీతంగా కురుస్తోందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు.

సాంకేతిక రంగంలో విద్యార్థులు నైపుణ్యత సాధించాలి
* విశాఖ పోర్టు ట్రస్టు చైర్మెన్ కృష్ణబాబు

మాకవరపాలెం, డిసెంబర్ 13: సాంకేతిక రంగంలో విద్యార్థులు మంచి నైపుణ్యత సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మెన్ కృష్ణబాబు అన్నారు. బుధవారం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పీ 2కె17 పేరుతో విద్యార్థులకు సాంకేతిక సదస్సును నిర్వహించారు. రెండు రోజుల పాటు ఇక్కడ నిర్వహించే కార్యక్రమాన్నికి ఆయన మొదటి రోజు ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం ఎంతైనా అవసరమన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. చెన్నై ఐ. ఐ.టి. ప్రొసెసర్ జానకిరామ్ మాట్లాడుతూ నేడు సాంకేతిక రంగంలో మెళుకువలు పాటించాలన్నారు. ఇంటర్నెట్, ఆన్‌లైన్ రంగంలో పాల్గొనే విద్యార్థులు ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో రాణిస్తున్నారన్నారు. ఎన్టీ పి.సి. జనరల్ మేనేజర్ నవకుమార్ సింహా మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ రంగాలకు పరసర్పర సంబంధం ఉందన్నారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలకు వెళ్ళే సమయంలో స్కిల్స్ , అక్కడ ఎటువంటి మెళుకువలు పాటించాలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేసారు. కళాశాల ప్రిన్సిపల్ సి.మోహన్‌రావు మాట్లాడుతూ కళాశాల ఏర్పాటు చేసి అనేక మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించి విద్య ప్రగతికి పాటుపడిందన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్మెన్ ప్రియాంక సదస్సుకు హాజరైన అతిధులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బలిమెల నీటి నిల్వలపై సమీక్షా సమావేశం

సీలేరు, డిసెంబర్ 13: బలిమెల జలాశయంలో నీటి వాడకాలపై బుధవారం ఆంద్రా- ఒడిషా ఇరు రాష్ట్రాల అధికారుల స్థానిక గెస్ట్ హౌస్‌లో సమావేశమై చర్చించారు. బలిమెల నుంచి 2017-18 నీటి సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రాలు ఎంతెంత నీటిని వినియోగించుకున్నాయనే దానిపై లెక్కలు తేల్చారు. దీని ప్రకారం గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ఒడిషా కంటే అధికంగా 26.7611 టి. ఎం.సి.లతో కలుపుకుని ఈ ఏడాది 2017 జూలై నుంచి నవంబర్ నెలాఖరు నాటికి 41.9111 టి. ఎం.సి.ల నీటిని వినియోగించుకుందని తేల్చారు. ఒడిషా 2017 జూలై నుంచి నవంబర్ నెలాఖరు నాటికి 38.9005 టి. ఎం.సి.ల నీటిని వాడుకున్నట్లు లెక్కలు తేల్చారు. ఆంధ్రా ఒడిషా కంటే 9.0406 టి. ఎం.సి.ల నీటిని అధికంగా వినియోగించుకున్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు లెక్కలు తేల్చారు. బలిమెల జలాశయంలో జోలాపుట్‌లో ఉన్న నీటిని కలుపుకుని 72 టి. ఎం.సి.ల నీరు నిల్వ ఉందని , దీనిలో 40.5203 టి. ఎం.సి.లు ఒడిషా వాటా కాగా, 31.4797 టి. ఎం.సి.లు ఆంద్రా వాటాగా నిర్ణయించారు. ప్రస్తుతం బలిమెల జలాశయం నుండి ఆంధ్రాలో గ్రిడ్ డిమాండ్ , గోదావరి డెల్టా సాగు నిమిత్తం ఐదువేల క్యూసెక్కుల నుంచి ఆంద్రా వాడుకునేందుకు , ఒడిషా అవసరాల నిమిత్తం 750 క్యూసెక్కుల నీటిని డిసెంబర్ నెలాఖరు వరకు వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈసమావేశంలో బలిమెల మల్కన్‌గిరి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్. ఎస్.పి.రావు, డిప్యూటీ మేనేజర్ రామ్‌దాస్, సివిల్ ఇంజనీర్లు ఎన్.దాస్, కడాదర్, ఆంధ్రా తరుపున ఎస్. ఇ. సివిల్ మురళీమోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. ఎల్.రమేష్, డి. ఇ.సుధాకర్, ఎ. ఇ.డి. పాపారావు, ఎ. ఇ.చలపతిరావు పాల్గొన్నారు.

అధికారులు ఆదేశిస్తే గోదావరి డెల్టాకు నీరు విడుదల
సీలేరు, డిసెంబర్ 13: గోదావరి రబీ పంటకు సీలేరు నుంచి విడుదలవుతున్న నీటిని సామర్ధ్యాన్ని పెంచమని ఎ.పి.జెన్‌కో ఉన్నతాధికారులను ఇరిగేషన్ అధికారులు కోరారని డి. ఇ. వి. ఎల్.రమేష్ తెలిపారు. ఈసందర్బంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్స్ నుంచి గోదావరి డెల్టాకు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అధికారులు ఆదేశిస్తే గోదావరి డెల్టాకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 31.4797 టి. ఎం.సి.లు నీరు ఉందని, ఈనీటిని జూన్ నెలాఖరు వరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చుతూ గోదావరి డెల్టాకు నీరు అందించాలని విద్యుత్ ఉత్పత్తి లేకుండా గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తే వేసవిలో సీలేరు కాంప్లెక్స్‌లో నీటి సమస్యల తలెత్తుందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని ఆయన తెలిపారు.

23న అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
కె.డి.పేట, డిసెంబర్ 13: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో ఆల్ ఇండియా క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఈనెల 23న కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి పి. అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ డి.వి. ఎస్.రాజు తెలిపారు. కె.డి.పేట అల్లూరి పార్కులో చేపడుతున్న విగ్రహ నిర్మాణ ఏర్పాట్లును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆల్ ఇండియా క్షత్రియ సంఘం ఏర్పాటు నిర్ణయించిందన్నారు. ఈమేరకు 15 లక్షలతో విగ్రహ నిర్మాణం , ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈకార్యక్రమానికి క్షత్రియ సంఘం నాయకులతో పాటు స్థానిక ఎం.పి.లు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారని ఆయన తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రావికమతం, డిసెంబర్ 13: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎం.పి.పి. డి.రామకృష్ణ తెలిపారు. మండలంలో కళ్యాణపులోవ రిజర్వాయర్‌లో బుధవారం మత్స్యశాఖ సమకూర్చిన 40 వేల చేప పిల్లలను రిజర్వాయర్‌లో విడిచిపెట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈప్రాంత మత్స్యకారుల జీవనోపాధి నిమిత్తం ఈచేప పిల్లలను విడిచిపెట్టామన్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్ మత్స్యశాఖ ఎ.డి. ఎం.నిర్మలాకుమారి మాట్లాడుతూ మిషన్ ఫింగర్ లింక్స్ పథకంలో భాగంగా రిజర్వాయర్‌లో బొచ్చు పలు రకాల చేప పిల్లలను వదిలిపెట్టామన్నారు. నూరుశాతం రాయితీపై ఈ చేపలు ఎదిగిన తరువాత మత్స్యకారులకు ఇస్తామని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.