విశాఖపట్నం

పారిశ్రామిక సదస్సులో మెరిసిన మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు విశాఖలో బుధవారం ప్రారంభమైంది. సార్క్ దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవ్స్, ఆప్ఘనిస్థాన్, బూటాన్, నేపాల్ దేశాల నుంచి మహిళా పారిశ్రామివేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆయా దేశాల్లోని ప్రముఖ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకుచ్చి వాటిని వివిధ దేశాల వారికి పరిచయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆయన వివరించారు. సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఆయా దేశాల్లో డిమాండ్ ఉన్న వస్తువులు, వాటి ఉత్పత్తికి అనువైన ప్రదేశాల గురించి చర్చించుకున్నారు. ఆనందపురం మండలం గిడిజాలలో మహిళా అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక వాణిజ్య కేంద్రానికి 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వం, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటప్రిన్యూర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రమాదేవి ఎంఓయూ కుదుర్చుకున్నారు.

భారతీయులు చిత్తశుద్ధితో పనిచేస్తారు
’నేను ఫిజీలో రీ సైక్లింగ్ కర్మాగారాన్ని నడుపుతున్నాను. రీ సైక్లింగ్ చేసిన బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, బూట్లు, బొమ్మలు, పుస్తకాలను విక్రయిస్తుంటాను. రీసైక్లింగ్ వస్తువులకు మా దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంది. దీనివలన ముడిసరుకును ఆస్ట్రేలియా నుంచి కూడా రప్పించుకుంటుంటాను. తాము చేసిన ఉత్పత్తులకు వివిధ దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది ఈ కంపెనీలు స్థాపిస్తున్నారు. తమ దేశంలో భారత దేశానికి చెందిన వారు కార్మికులుగానే కాదు, వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా చెరకు పంటను సాగుచేసేదంతా భారత దేశానికి చెందిన వారే. వీరికి చిత్తశుద్ధి ఎక్కువగా ఉందని గమనించాం. వీరి వలనే మా దేశంలో అధిక ఉత్పత్తులు సాధించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ సదస్సులో రీ సైక్లింగ్ కర్మాగారాలకు కావల్సిన సాంకేతిక సహకారం అందుతుందన్న విశ్వాసంతో వచ్చాను. అవకాశం వస్తే, భారత దేశానికి చెందిన మరింత మందిని తమ దేశానికి తీసుకువెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నాను. విశాఖ నగరం ఎంతో అందంగా ఉంది. మేము ఒక ద్వీపంలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నా, విశాఖ సముద్ర తీరానికి వచ్చేప్పటికి ఏదో కొత్తదనం కనిపిస్తోంది.
వీరా చూట్
డైరక్టర్
పసిపిక్ ఐలెండ్ రీసైకలర్స్ ప్రై.లిమిటెడ్
ఫిజీ

రసాయనాల వినియోగంలేకుండా సబ్బుల తయారీ
సాధారణంగా సబ్బుల తయారీలో ఎంతో కొంత రసాయనాలు వినియోగిస్తారు. అయితే, నేను తయారు చేసే సబ్బులో ఎటువంటి రసాయనాలు వాడను. నాలుగు సంవత్సరాల నుంచి సబ్బులు తయారు చేస్తున్నాను. నా భర్త పోర్టుట్రస్ట్‌లో పనిచేస్తున్నారు. నేను తయారు చేసిన సబ్బును ముందుగా పోర్టు వర్కర్స్‌కు ఇచ్చాను. అందరూ బాగుందన్నారు. మా అబ్బాయి ఐర్లెండ్‌లో పనిచేస్తున్నాడు. నేను ఉత్పత్తి చేసిన సబ్బులను ఆ దేశానికి కూడా పంపించాను. అక్కడ కూడా క్లిక్ అయింది. తను తయారు చేసే చామామైల్‌లో చామంతి పువ్వు రెక్కలను ఎక్కువగా వినియోగిస్తాం. చామంతి ఆయిల్, ఆలివ్, ఆల్మండ్ తదితర రకాల ఆయిల్స్ అన్నీ ఈ సబ్బులో ఉన్నాయి. ఈ సబ్బులో పసుపు, తులసి వగైరాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే ఈ సబ్బులను తయారు చేస్తున్నాం. త్వరలోనే యాభై లక్షల పెట్టుబడితో పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. అలాగే, తను తయారు చేసే వైట్ బర్డ్ లిక్విడ్ వంట సామగ్రిని క్లీన్ చేసుకోడానికి ఉపయోగిస్తారు. దీన్ని వాడడం వలన ఎటువంటి చేతులకైనా ఎలర్జీ రాదు. దీంట్లో కెమికల్ ఉన్నా, చాలా తక్కువగా ఉంటుంది.
--పద్మజ
మురళీనగర్, విశాఖపట్నం

సీఈఓలుగా ఎదగడానికి మరికొంత సమయం
మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు కంపెనీల సీఈఓలుగా ఎదగాలంటే మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో స్ర్తిలపై ఎక్కువ బరువు బాధ్యతలు ఉంటాయి. భర్తతోపాటు, పిల్లల ఎదుగుదల, వారి అభివృద్ధిపైనే మహిళకు ఎక్కువ దృష్టి ఉంటుంది. సీఈఓలుగా ఎదగే శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నా, వారు మొట్టమొదట కుటుంబ బాధ్యతలనే ఎంచుకుంటారు. బాధ్యతల నుంచి మహిళలు తప్పించుకోలేరు. ఒక పురుషుడు పదేళ్లలో సీఈఓగా ఎదిగితే, ఒక స్ర్తికి 15 సంవత్సరాలు పట్టచ్చు. అయితే, మహిళలు తామేంటో నిరూపించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి. గడచిన ఐదు, ఆరు సంవత్సరాల్లో టెక్నాలజీ రంగంలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. విధుల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. వాటిని తట్టుకుని నిలదొక్కుకుంటే విజయం మహిళల వశమవుతుంది. మన దేశంలో మహిళలకు గతంలో అనేక కట్టుబాట్లు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో మహిళ కూడా పనిచేయకపోతే, కుటుంబం గడిచే పరిస్థితి లేదు. అందుకే అన్ని రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తాను ఐటీ ఉద్యోగం చేసి, దాన్ని వదిలిపెట్టి అమెరికాలో సిద్దేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమిని ప్రారంభించాను. భారతీయ నృత్యాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాను.
--స్వాతి అట్లూరి
సిద్దేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమి నిర్వాహకురాలు
న్యూజెర్సీ, అమెరికా

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారు
ఆంధ్రా యూనివర్శిటీలో బీటెక్, ఎంటెక్, బిర్మశీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ కోర్సులను చదువుతున్న విద్యార్థినులు ఎక్కడోచోట ఉద్యోగం చేసుకువాలన్న ధృక్పథంతో లేరు. తమకు తాముగా ఒక పరిశ్రమను నెలకొల్పి, మరికొంతమందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నారు. అటువంటి వారికి ఈసదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. వర్శిటీలో ఇన్నొవేషన్ సెంటర్ వచ్చే ఏడాదికి సిద్ధమవుతుంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న విద్యార్థినులకు ఇన్నొవేషన్ సెంటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పించనున్నాం. ప్రభుత్వం కొద్దిపాటి ప్రోత్సాహం అందిస్తే సరిపోతుంది. ఇటీవల సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఈనెలాఖరుకు సిద్ధమవుతుంది. 300 కోట్ల రూపాయల విలవైన ఎక్విప్‌మెంట్ వర్శిటీకి ఇచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ డిపార్ట్‌మెంట్ విద్యార్థినులకు శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ పూర్తవగానే, వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వర్శిటీ ఫెసిలిటేట్ చేస్తుంది. రుణాల మంజూరు కూడా మార్గాన్ని సుగమమం చేసుకుంటాం. వౌలిక సదుపాయాలు కూడా వర్శిటీయే కల్పిస్తుంది. ఈనెల 25న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి వస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు. వాటి ఆధారంగా మనం మరికొన్ని కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించేందుకు కృషి చేయాలనకుంటున్నాం. ఈ సదస్సులకు, శిక్షణకు హాజరైన విద్యార్థినుల్లో కనీసం పది శాతం మందినైనా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నది తమ లక్ష్యం
-ప్రొ.జి.నాగేశ్వరరావు
ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్

భార్యకు భర్త ప్రోత్సాహం అవసరం
మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే భర్త, అతని కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతైనా అవసరం. భర్త బయటకు వెళితే, కుటుంబాన్ని, తనను ఎక్కడ పట్టించుకోదో! అన్న అనుమానం భర్తలో ఉండకూడదు. ఒక మహిళ తన కుటుంబ వ్యవహారాలన్నీ చూసిన తరువాతే, ఇతరత్రా పనులపై దృష్టి మళ్లిస్తుంది. ఒక కుటుంబంలో భార్య, భర్త ఉద్యోగులైతే, వారి పిల్లలు బాగుంటారు. ఇది అనేక కుటుంబాల్లో రుజువైంది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అనేక ఇబ్బందులు ఉండచ్చు. వాటన్నింటినీ దాటి బయటకు రావాలి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సజావుగా తిరిగి చెల్లించే బాధ్యత మహిళా పారిశ్రామికవేత్తలపై ఎక్కువగా ఉంటుంది.

--శైలజా కిరణ్
మేనేజింగ్ డైరక్టర్, మార్గదర్శి

మరింత సాధికారిత సాధించాలి
అలిప్ ఇండియా కోశాధికారి కవితా రాజేష్
మహిళలు మరింత సాధికారిత సాధించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం సహకారం ఎంతో అవసరం. ప్రస్తుతం మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహిళల్లో విద్య ప్రాధాన్యత పెరగడంతో ఇది సాధ్యమైందని చెప్పాలి. ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగానే స్పందించడం శుభ పరిణామం. నవ్యాంధ్ర విషయానికొస్తే కొద్ది సంవత్సరాలుగా మహిళా సంఘాల ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. డ్వాక్రా సంఘాలు సొంతంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. వీరు మరింత కృషి చేస్తే మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు లేకపోలేదు. మహిళల అలోచనలకు ప్రభుత్వం కూడా ఊతమిస్తే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా (అలిప్) ఈ విషయంలో కీలక నిర్ణయాత్మక శక్తి కానుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అలిప్ నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి పారిశ్రామిక రాయితీలే కాకుండా, మహిళా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విద్యార్థినుల ఆలోచనలకు జీవం
తాము మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించే దిశగా గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్‌లో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాం. బాలిక విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్‌పై అవగాహన కల్పించడంతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాల్లోని పలు అంశాలను వివరించేలా చూస్తున్నాం. అలాగే మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే బాలికా విద్యార్థినులకు వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు సంధాన కర్తగా వ్యవహరిస్తాం. తద్వారా సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే బాలిక విద్యార్థినులు పెట్టుబడుల కోసం అనే్వషించే ఇబ్బందులు తొలగుతాయి. తద్వారా బిజినెస్‌లో వారు స్థిరపడేందుకు మంచి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనే ప్రారంభించిన ఈ విధానంలో ఇప్పటి వరకూ సుమారు 15 మంది విద్యార్థినులు ప్రాజెక్టులను ఏర్పాటు చేసి పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా స్థిరపడ్డారు. వీటిలో అత్యధికంగా ఆన్‌లైన్ జ్యూవెలరీ రంగంలో చక్కగా రాణిస్తున్నారు.