విశాఖ

వైసీపీ గ్రామాలలో పాగాకు దేశం తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 20: అరకులోయ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న గ్రామాలలో పాగా వేసేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అన్ని గ్రామాలలో తమ పార్టీ బలంగా ఉండేవిధంగా పావులు కదుపుతున్న దేశం నాయకులు ప్రతిపక్ష పార్టీకి ఎక్కడా బలం లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే వైసీపీ బలంగా ఉన్న గ్రామాలను గుర్తించిన దేశం నాయకులు ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమవైపు తిప్పుకునేందుకు వూహ రచన చేసారు. ఈ మేరకు నియోజకవర్గంలో వైసీపీ పునాదులను కదిలించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, గిరిజన ప్రాంత అభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీకి పట్టు ఉన్న గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి ఆయా ప్రాంతాల గిరిజనులను ఆకర్షించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో వైసీపీ వైఫల్యాలను కూడా ఎండగట్టి గిరిజనులలో అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని భావిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీకి పట్టు ఉన్న గ్రామాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు ఆయా గ్రామాలలో వౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. తమ అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చడం ద్వారా ఆయా గ్రామాల గిరిజనులను ఆకర్షించి తమ పార్టీవైపు తిప్పుకోవాలన్నది తెలుగు తమ్ముళ్ల ఆలోచనగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రప్రధమంగా అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దలపతిగుడ గ్రామంలో తమ వ్యూహానికి శనివారం అంకురార్పణ చేసారు. దలపతిగుడ గ్రామం ఎప్పటి నుంచో వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఈ గ్రామంలోని గిరిజనులంతా ప్రతిపక్ష పార్టీ వెంటే ఉంటూ అధికార పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. దీంతో ఈ గ్రామాన్ని ముందుగా ఎంచుకున్న తెలుగుదేశం నాయకులు శనివారం ఆ గ్రామస్తులతో సమావేశమై తమ ప్రభుత్వ గొప్పదనాన్ని, గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు నేతృత్వంలోని ఎం.పి.పి. కె.అరుణకుమారి, జెడ్పీటీసీ కూన వనజ, తెలుగుదేశం నాయకులు శెట్టి బాబురావు, సమర్డి రఘునాధ్, పొద్దు అమ్మన్న తదితరులు దలపతిగుడ గ్రామాన్ని సందర్శించి ముందుగా ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఎ. మాట్లాడుతూ గిరిజనులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని, ఈ పథకాలలో అర్హులైన గిరిజనులంతా భాగస్వాములై వాటి ప్రయోజనాలను పొందాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా, గిరిపుత్రిక కల్యాణం, ఎన్.టి.ఆర్.విద్యాన్నోతి వంటి పథకాలను ఆయన గిరిజనులకు వివరించారు. తమ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం జరుగుతుందని, తాగునీటి ఎద్దడిని పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. దలపతిగుడలో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించి ఈ గ్రామ గిరిజనులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతునిచ్చి రానున్న కాలంలో అభివృద్ధికి బాట వేయాలని ఈ సందర్భంగా కిడారి గిరిజనులను కోరారు. దలపతిగుడ గ్రామం నుంచి తెలుగుదేశం నాయకులు ప్రారంభించిన పార్టీ పటిష్టత కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో విస్తరించి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైసీపీ బలంగా ఉన్న గ్రామాలను తమవైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా వైసీపీకి పట్టులేకుండా చేయాలన్నదే తెలుగు తమ్ముళ్ల లక్ష్యంగా చెబుతున్నారు.

లఘు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ
మాడుగుల, జనవరి 20: యువకులు లఘు చిత్రాలపై ఆశక్తి కనబరుస్తున్నారు. సమాజంలో జరుగుతున్న కుటుంభం, వ్యవసాయం, ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం వంటి అంశాలపై నిర్మిస్తున్న లఘు చిత్రాలపై యువత మక్కువ చూపుతుంది. ఈ లుఘ చిత్రాల నిర్మాణానికి పేరుగుతున్న ఆదరణతో మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన బేజలపు శ్రీను యనే యువకుడు లఘ చిత్రాన్ని నిర్మించారు. యువతీ యువకుల ప్రేమ వ్యవహారాన్ని ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకుని ప్రేమించిన వారితో వెళ్లిపోతే తల్లిదండ్రులు పడే బాధను ఇందులో వివరించారు. ఈ లఘు చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి లఘు చిత్రాల వలన యువతకు సామాజిక అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు దోహదపడనున్నట్టు పలువురు భావిస్తున్నారు. . అంతేకాకుండా మానవ సంబదాల గొప్పతనం, తల్లిదండ్రుల ప్రాధాన్యం వంటి ఎన్నో అంశాలను యువత అవగతం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సమాజంలోని వివిధ రుగ్మతలను నిర్మూలించేందుకు దోహదపడే మరిన్ని లఘ చిత్రాలను నిర్మించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.