విశాఖపట్నం

ప్రేమ పరిమళం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.
‘‘తను ఎక్కడికి వెళ్లింది ఆంటీ?’’ తాళం అందుకుంటూ అడిగాడు.
‘‘నీకు చెప్పలేదా? చెప్పానని నాతో అంది కదా’’
‘‘ఆ గుర్తుకొచ్చింది. చెప్పింది లెండి’’ అనేసి అక్కడి నుండి వచ్చేశాడు.
‘చెప్పకుండా వెళ్లింది అంటే ఆంటీ ఆరా తీస్తుంది. ఎందుకొచ్చిన సమస్య. అయినా పరిమళ ఎక్కడికి వెళ్లింది?’ అనుకుంటూ ఇంటి తలుపు తీశాడు.
ఇల్లు మొత్తం నీటుగా సర్ది ఉంది. బట్టలు ఇస్ర్తి చేసి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద కిరణ్‌కి ఇష్టమైన వంటలవీ ఉన్నాయి.
‘ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా?’ అనుకున్నాడు కిరణ్.
ఏమీ స్ఫురించలేదు.
అంతా బాగానే ఉంది గానీ పరిమళ ఎక్కడికి వెళ్లింది? పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంటికి గానీ, వాళ్ల ఇంటికి గానీ వెళ్లే పరిస్థితి లేదు.
తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాడు. అందరూ పరిమళ రాలేదనే సమాధానం చెప్పారు.
ఎక్కడికి వెళ్లింది? అని ఆలోచిస్తుంటే టేబుల్ దగ్గర ఒక కాగితం కనిపించింది.
గబగబా తెరచి చూశాడు.
‘ప్రియమైన కిరణ్‌కు...
మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. ఇంట్లో వాళ్లని కాదనుకోవడం మరో పొరపాటు. నేను కోరుకున్న భాగస్వామిని పొందానన్న ఆనందం కన్నా మీరు నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు, మీ స్వభావం నాకు నచ్చలేదు. ఉదయం ఆఫీసుకి వెళ్లి రాత్రికి వస్తున్నారు. అంత వరకు ఒక్క ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ ఉండదు. అడిగితే ఆఫీసులో బిజీ వర్క్ అంటారు. నేను ఇక్కడ ఒంటరిగా వంట చేసుకుని, తిని, బోర్ కొడితే టివి చూస్తూ గడపాలి. పోనీ నేను కూడా ఉద్యోగం చేస్తానంటే మీకు ఇష్టం ఉండదు. లంకంత కొంపలో ఒంటరిగా ఉంటున్నాను. మీ ఇంట్లో వాళ్లతోను, మా ఇంట్లో వాళ్లతోను మనకు సంబంధాలు లేవు. మన బంధువులు బద్ధ శత్రువులయ్యారు. ఈ సమయంలో నువ్వైనా నాతో ప్రేమగా ఉంటావని, నా కోసం సమయం కేటాయిస్తావని అనుకుంటే అలాంటిది ఎప్పుడూ లేదు. ఉదయం పెందలాడే వెళ్లిపోయి, రాత్రి బాగా చీకటి పడాక వస్తావు. పోనీ వచ్చిన తర్వాతైనా కాస్సేపు సరదాగా మాట్లాడతావా అంటే అదీ లేదు. రాగానే తినేసి నిద్రపోతావు. పోనీ ఏ ఆదివారమైనా నాతో గడుపుతావని అనుకుంటే ల్యాప్‌టాప్ తీసి దాంతోనే కాలం అంతా గడుపుతావు. ఇంట్లో నేను ఉన్నాననే విషయం కూడా గుర్తు లేనట్లు ప్రవర్తిస్తున్నావు. సరికొత్త వంటకం చేసి నీకు పెడదామనుకుంటే హోటల్ నుండి ఆర్డర్ చేస్తావు. అసలు నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడంలేదు. నన్ను ప్రేమించి చేసుకోవడం వల్ల కట్నం మిస్ అయ్యానని బాధపడుతున్నావా? అందుకే ఓ వారం రోజులు నీకు కనబడకూడదని, అప్పుడైనా నీలో మార్పు వస్తుందని, రావాలని తెలిసిన వారింటికి వెళ్లిపోతున్నాను...
నువ్వు కావాలని కోరుకునే
నీ పరిమళ!
ఆ ఉత్తరం చదివి కిరణ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
‘ఎంత పని చేశావు పరిమళ. నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా?’ అని నిస్సత్తువుగా సోఫాలో కూలబడ్డాడు.
ఇంతలో కాలింగ్‌బెల్ మోగింది.
గబగబా వెళ్లి తలుపు తీశాడు.
ఎదురుగా లక్ష్మమ్మ!
‘‘బాబూ పరిమళ వచ్చిందా? నువ్వు ఏమైనా తిన్నావా?’ అంటూ అడిగింది లక్ష్మమ్మ.
‘‘తిన్నాను ఆంటీ!’’
‘‘పరిమళ గురించి ఏమైనా తెలిసిందా?’’
‘‘తెలిసింది ఆంటీ! తను వాళ్ల ఫ్రెండింటికి వెళ్లిందట. వంట చేసే వెళ్లింది’’ అన్నాడు కిరణ్.
‘‘నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా?’’ అనుమానంగా అడిగింది లక్ష్మమ్మ.
‘‘అలాంటిదేం లేదు ఆంటీ’’
‘‘ఎందుకు బాబూ నా దగ్గర అబద్ధాలు ఆడతావు. ఎంతో మంది జీవితాలు చూసిన దానిని. ఎవరెలా ఉన్నారో వారి ముఖం చూస్తేనే తెలిసిపోతుంది’’ అంది లక్ష్మమ్మ.
కిరణ్ ఆమెని లోపలికి పిలిచి పరిమళ రాసిన ఉత్తరం చూపించాడు.
ఉత్తరం చదివిన లక్ష్మమ్మ ‘‘తను నీ ప్రేమని కోరుకుంటోంది. నిర్లక్ష్యం చేయకు’’ అని చెప్పింది.
‘‘నేను ప్రేమగానే ఉన్నాను ఆంటీ. తనే నన్ను అర్ధం చేసుకోలేదు. తనకి నేను, నాకు తను తప్ప మాకు ఎవరూ లేరు ఆంటీ. అలాంటప్పుడు నేను తప్పుగా ప్రవర్తిస్తానా? నేను సంపాదిస్తుంది అంతా తన కోసమే కదా. కట్నం లేదని బాధపడుతున్నానేమో అంది. అది నాకు బాధ కలిగిస్తోంది. నన్ను విడిచి తను వెళ్లిపోతే నేను సంతోషంగా ఎలా ఉండగలను ఆంటీ?’’ కన్నీళ్లతో అన్నాడు కిరణ్.
‘‘సంపాదిస్తున్నదంతా తన కోసమే అన్నావు. అన్నివేళలా ఆడవాళ్లు సంపాదనే చూడరు. ప్రేమను కూడా కోరుకుంటారు. ఆ ప్రేమే లేకపోతే ఎంత సంపాదించినా దండగే. భర్త పట్టించుకోకపోతే ఏ ఆడదైనా తట్టుకోలేదు. అనేక అనుమానాలు కూడా పుట్టుకు వస్తాయి. మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకుంటున్నప్పుడు ఉండే ప్రేమ పెళ్లయ్యాక ఎందుకు ఉండదు?’’ సూటిగా ప్రశ్నించింది లక్ష్మమ్మ.
ఆ మాటకి కిరణ్ మాట్లాడలేకపోయాడు.
‘‘ప్రేమించుకునేటప్పుడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ‘గుడ్‌మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్‌నైట్, తిన్నావా? పడుకున్నావా? లేచావా? అంటూ మెసేజులు పెట్టుకుంటారు. పెళ్లయ్యాక ఒక్క మెసేజ్ పెట్టరు. ఒక్క క్షణం ఖాళీ చేసుకుని ఆఫీసుకి వెళ్లాక ఒక్క మెసేజ్ పెడితే ఆడది ఎంత సంతోషిస్తుందో కదా. ఈ రోజు నువ్వు బాగున్నావు. నీ డ్రెస్ బాగుంది. చీర బాగుంది అనేటి అందమైన మాటలు, పొగడ్తలను ఆడవారు కోరుకుంటారు. ఆ మాత్రం భార్య కోసం చేయలేవా?’’ అంది లక్ష్మమ్మ.
కిరణ్‌కి తను చేసిన తప్పేంటో అర్ధమయింది.
‘‘సారీ ఆంటీ! తప్పు నాదే. డబ్బు సంపాదించాలి. పరిమళకి ఏ సమస్యా రాకూడదు అనుకున్నానే గానీ తనకి ప్రేమను పంచివ్వాలనే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఇప్పుడు అర్జెంట్‌గా పరిమళని చూడాలని ఉంది’’ అన్నాడు.
‘‘పరిమళ నా దగ్గరే ఉంది’’ అంది లక్ష్మమ్మ.
‘‘మీ దగ్గరా?’’ ఆశ్చర్యంగా అన్నాడు కిరణ్.
‘‘అవును! తనని నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. ఏదో కోల్పోయినట్లు ఉంటోంది. ఆరా తీశాను. విషయం అర్ధమయింది. నా ఆలోచనతో ఈ ప్లాన్‌ని అమలు చేశాను. మీ ఇద్దరి కలతలను తొలగించాను’’ అంది లక్ష్మమ్మ.
‘‘్థ్యంక్స్ ఆంటీ’’ అంటూ లక్ష్మమ్మతో కలసి వెళ్లి పరిమళని తీసుకొచ్చాడు.
చేసిన వంటలను ఇద్దరూ ఒకరికొకరు వడ్డించుకుంటూ తృప్తిగా తిన్నారు.

- నల్లపాటి సురేంద్ర,
కొత్తగాజువాక,
విశాఖపట్నం.
సెల్ : 9490792553.

పుస్తక సమీక్ష

హుదుద్‌ను వర్ణించిన
కవితా సంకలనం

ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాంధ్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు. రాకాసి గాలుల ప్రచండ భీకర దాడికి ఓ నగరం వణికిపోయింది. హుదుద్ తుపాను ధాటికి కకావికలం అయిన తీరును శ్రీకాకుళం జిల్లా దీనబంధుపురానికి చెందిన ఉపాధ్యాయుడు కలమట సోమేశ్వరరావు ‘ఓ ప్రకృతి విలయమా...! విశాఖపై అంత కోపమా’ అనే శీర్షికతో రాసిన ఈ పుస్తకం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సువిశాల సాగరతీరం/అందమైన ప్రకృతి సోయగంతో ఈ దీర్ఘకవిత ప్రారంభమవుతుంది. నేటితరం/ మరచిపోయిన అనేక అంశాలను/సాకారంగా సమూలంగా గుర్తు చేశావు/విద్యుత్ స్తంభాలు కూల్చేసి/నిశీథిలో నాలుగు రాత్రులుంచి/ దీపపు బుడ్డి విలువేంటో/ప్రత్యక్షంగా చూపించావు/సెల్‌ఫోన్ల నిత్య సమాచారం/హోరెత్తిన టివి ప్రసారాలు/మూగబోయిన సమయాన ఫ్లాష్...్ఫ్లష్... న్యూస్ కోసం మూలన పడి ఉన్న రేడియోలను సైతం వెదికి మరీ తీయించి ఆపదలో ఆసరా అయ్యేలా చేశావు. ఇంటింటా విద్యుత్ మోటార్లు మీట నొక్కితే ట్యాంకులో నీరు పడి సుఖమయమైన జీవితం నీ రాకతో ఒక్కసారిగా జీవితం ఎలా తల్లకిందులవుతుందో తెలియజేశావు. విద్యుత్ లేదు... మోటార్లు పని చేయవు. తాగడానికి గుక్కెడు నీరు లేదు. అయిదు రోజుల పాటు స్నానం లేదు. ఎడారిలో ఒయాసిస్సులా బావులు, చేతి పంపుల విలువేంటో తెలియజేశావు. అవి లేకపోతే జరగబోయే పరిణామాలు గుర్తు చేశావు. ప్రతి నీటిబొట్టు విలువను తెలియజేశావు. కరెంటుపై అధికంగా ఆధారపడితే ఏమవుతుందో చవి చూపించావు అంటూ కవి మనమెలా జీవిస్తున్నామో కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. ఇంతటి భీకర విధ్వంసాన్ని చవి చూసి మొక్కవోని దీక్షతో, ధైర్యంతో ఈ విపత్తు నుండి బయటపడిన వైనాన్ని కూడా కవి వర్ణించారు. ఈ సంకలనాన్ని పొందాలనుకునే వారు కలమట సోమేశ్వరరావును 9949457443 నెంబరులో సంప్రదించవచ్చు.

- చందన రవీంద్ర,
పొందూరు,
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9492118960.

జీవిత సత్యం!

ధర్మార్థ
కామమోక్షాలు
శాస్త్రం చెప్పింది ధర్మార్ధ కామమోక్షాలు
మనిషి తప్పనిసరిగా అనుసరించాల్సినవి
ధర్మార్ధాలను మొదటి వరుసలో
కామ-మోక్షాలు చివరిగా చెప్పిరి!
ధర్మార్ధాలను కలిపిన ఆంతర్యం
అర్ధాన్ని ధర్మమార్గంలో గణించాలి
ధర్మమార్గంలోనే వినియోగించాలి
అప్పుడే ధర్మార్ధాలకు సార్థకత!
భూలోక వాసులు తనను
ఇనుప పెట్టెలో బంధిస్తారని
శ్రీలక్ష్మీదేవి భూలోకం రానన్నారట
శ్రీమన్నారాయణుడు నలుగురు
సేవకులనిచ్చి పంపారట!
ధర్మదేవత - నృపుడు అగ్ని చోరుడు
ఈ నలుగురు సేవకులు సంపాదనపై
పర్యవేక్షిస్తూ ధర్మరక్షణ కావిస్తుంటారు
సంపాదన వినియోగం అధర్మమైతే దండిస్తారు!
మనిషికి అత్యవసరమైనది మోక్షం
చివరగా చేర్చబడిన అతి ముఖ్యమైనది
కామం (కోరిక) ధర్మానుసారంగా ఉండాలి
కామాన్ని విడిచిపెడితేనే మోక్షము!
కామం మోహితుల్ని చేసేది
మోహం అరిషడ్వార్గాలకు కారణం
మాయలో పడవేసేది మోహం
మాయా మోహాలు దాటితే మోక్షం!

- శ్రీమతి గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం
సెల్ : 9441567395.

మినీకథలు

ఊహ - వాస్తవం

వ్యవసాయం అంటే రేసుల కంటే ప్రమాదంగా మారిన ఈ రోజుల్లో ఉన్న ఎకరం భూమిని రామిగాడు ఎలాగో ఒకలా సాగు చేస్తున్నాడు. రామిగాడికి ఒక సమస్య వచ్చింది. తన గ్రామంలోను, చుట్టుపక్కల గ్రామాల్లోను చాలా మంది రైతులకు రుణమాఫీ వచ్చింది. రామిగాడికి మాత్రం రాలేదు. కారణం తెలియదు. బ్యాంకు వాళ్లు చెప్పింది రామిగాడికి అర్ధం కాలేదు. స్థానిక నాయకుల చుట్టూ తిరిగాడు. నెలలు గడిచాయి. ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఏం చేయాలో రామిగాడికి తోచలేదు. ఇంతలో ఏదో ఊరిలో ఒక వ్యక్తి పేదలకు ఇచ్చే మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఒక సెల్‌టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించడంతో అధికారులు, నాయకులు బతిమాలి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి కిందకు దింపారని టివిలో చూశాడు. వెంటనే రామిగాడి బుర్రలో అదే పథకం రూపుదిద్దుకుంది.
మరునాడు రామిగాడు తన ఊరిలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. జనం పోగయ్యారు. నాయకులు, అధికారులు, పత్రికల వాళ్లు, టివిల వాళ్లు వచ్చారు. తనకు రుణమాఫీ చేయకపోతే దూకేస్తానని బెదిరించాడు. అందరూ బతిమాలారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రామిగాడు ఆనందంగా కిందకి దిగాడు. వెంటనే ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద పోలీసులు రామిగాడిని అరెస్టు చేశారు. వాస్తవానికి, ఊహకు ఎంత తేడా ఉందో రామిగాడికి తెలిసి వచ్చింది.

శేఖరమంత్రి శంకరరావు,
కరణాలవీధి, అనకాపల్లి-531001. సెల్ : 7286963020.

తెలివితో గెలవాలి!

రాజు, రాణిలది ప్రేమ వివాహం. ఇద్దరి తల్లిదండ్రులు కొంత ఎదురు చెప్పినా వారి పెళ్లి మాత్రం సజావుగానే జరిగిపోయింది. వేరింటి కాపురం కూడా పెట్టారు. రాజు తల్లిదండ్రులు కొడుకు కట్నం తేలేదని కొన్నాళ్లు మొరాయించినా కోడలు నడవడి చూసి సర్దుకుపోయారు.
రాణి ఇంటి ముందు చక్కటి పూలతోట పెంచడం వల్ల ఆ పరిసరాలు మంచి పరిమళంతో ఆహ్లాదకరంగా మారాయి.
అలాగే ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పెంచడం మొదలుపెట్టి ఇంటి అవసరాలకు కావలసిన కూరలు సొంతంగా సాగు చేసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల వారికి కూరల ఖర్చు బాగా తగ్గింది. రాజు తల్లిదండ్రులు కోడలి తెలివి తేటలకి సంతోషించారు. ఆమె పొదుపరితనం వారికి బాగా నచ్చింది.
గతంలో పెరట్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండేవి. రాణి కూరల సాగు మొదలుపెట్టిన తర్వాత ఆ పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి రాజు సాయంతో పంచాయతీ చెత్త బండిలో వేయించింది. ఆమెని చూసి ఇరుగు పొరుగు కూడా చెత్తని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పంచాయతీ చెత్త బండిలో వేయడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల ఆ కాలనీ అంతా పరిశుభ్రంగా తయారయింది. అందరూ రాణిని మెచ్చుకున్నారు.
భార్య తన తల్లిదండ్రుల వద్దే కాకుండా కాలనీ అందరి వద్ద మంచి పేరు తెచ్చుకోవడంతో రాజు రాణిని అభినందించాడు.

- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ. సెల్ : 7680812592.

మనోగీతికలు

నాయకుని వందనం
సమత్వం అనే నినాదంతో
పేదబ్రతుకు నాదని
తిండికి మెతుకు లేదని
జనులసేవే పరమార్థమని
ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన నాయకా!
గెలిచాక సిరులు పోగొట్టి
దీనజనులఘోష విన్నావా?
పేదప్రజల కడుపుకొట్టి
స్వార్థపరత పెంచుకొని
అరాచకాలు మొదలెట్టి
నీతి ప్రక్కదారి మళ్లినా
ఏదయినా ప్రజల మంచికేనని
అధికార దాహంతో అడ్డదారులు త్రొక్కి
చట్టం నా చుట్టమని
చకచకా పరుగులెత్తే నాయకా!
ఓసారి వెనుకకు చూడవోయి
నిర్భాగ్యుల వేదన, నిరుపేదల ఆక్రందన!

- కుబిరెడ్డి చెల్లారావు
చోడవరం, సెల్ : 9885090752.

అందుకో నా చేయి!
నా చెంత నువ్వుంటే
మనసంతా సందడే
నను మరచి నువ్వెళితే
బతుకంతా దండగే
నీతోడుంటే
ప్రపంచాన్ని జయిస్తా
నువ్వు కాదంటే విరాగినైపోతా
అందుకే నేస్తమా
అందుకో నా చేయి!

- మనోహర్
విశాఖపట్నం.

ఏమో! ఏవౌతుందో?
వర్తమాన హిమఖండపు అంచులపై
ఎగబాకిన ఉత్సాహంతో నిగిడి
భూభ్రమణగతులను,
కళ్ళళ్ళో, నక్షత్రాలను ఉంచి...
రాబోయే కాలం లోతులను
ఊహల పాథోమీటరుతో కొలుస్తుంటాను
కరిగిన గత సముద్రాన్ని
సాముద్రాన్ని చిలకలేక...
వర్తమాన ఘణాన్ని నిర్లక్ష్యం చేస్తూ
పయనించే మేఘాలలో నీటి పరిమాణాన్ని... అంచనా వేస్తుంటాను...
వర్ణములు మారుతున్నా...
గగనం నన్ను హెచ్చరిస్తున్నా...
నిశల్చంగా ఉన్న సూరీడు
జగతిగతిని నిర్దేశిస్తున్నా....
నాలో బలహీనతల కెరటాలు....
అలజడులు రైపుతుంటాయి
నా కళ్ళ లోగిళ్ళలో
కాలుష్యపు తెరలు కమ్మేస్తున్నా...
కనిపించని వెనె్నల వనంలో....
వికసించని కమలాలను దర్శిస్తున్నాను.... మలినం పేరుకు పోయిన
దిక్కుల చేతుల్తో అగ్ని దుప్పట్లను
తొలగిద్దామనుకున్నా....
పొగమంచు ముళ్ళపరుపయింది....
అంతరించుకు పోతున్న వన్య మృగాళ్ళాగా!.... నాలో శక్తి హరించుకు పోతోంది....
నా బుద్ధి మొగ్గ వికసించే రోజుకోసం...
నా మరుగుజ్జు మనసు ఎదురు చూస్తోంది...

- చావలి శేషాద్రి సోమయాజులు
పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 9032496575.

గర్భశోకం
గర్భశోకం - మాతృశోకం
పోయినా బంగారు బిడ్డలు
వత్తురా - తిరిగొత్తురా!
ఉద్యమాల - ఉగ్రరూపాలు
విద్యార్థుల - ఆవేదనలు
నాయకుల - కన్నీటి బాసలు
మేధావుల - పల్కు తేనెలు
గర్భశోకం.....
ముందుచూపు కొంచముంటే
ఇటువంటి ఘోరాలు జరుగవేమో?
ఆశల బంగారు వృక్షాలు
నేలకూలటం-బాధేకదా?
యువకిశోరాల ఆత్మహత్యలు
ఆవేశాల - తీవ్రచర్యలు
జాతికి - గొడ్డలిపెట్టులె
కన్నతల్లుల - కుడుపుకోతలె
గర్భశోకాలే.....
జాతికివి తలవంపులైనా
తిరిగి ఎన్నడు జరుగుకుండా
చూచుకొనుటే ఎంతోమేలు
జాతికిది గుణపాఠమే...

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి,
సెల్ : 9246666585.

జలసిరులు!
ఇంకుడు గుంతలతో భూగర్భానికి జలసిరులు
సేద్యానికి కొత్త కళలు
నగర, గ్రామీణానికి కొత్త ఊపిరులు
నువ్వు, నేను అంతా కలసి
వర్షపునీటిని ఒడిసి పడదాం
నీటి లేమిని తరిమికొడదాం!

- చలన
శ్రీకాకుళం.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. ళ్ఘౄజ: ౄళూఖఔఖ్పఒఔబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- నల్లపాటి సురేంద్ర