విశాఖ

వైసీపీలో ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మే 24: అరకులోయ నియోజకవర్గంలోని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగుతుంది. వైసీపీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ గ్రూప్ రాజకీయాలను పెంచిపోషిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకగణం తమదే పైచేయిగా ఉండాలని తహతహలాడుతూ వర్గ పోరుతో కొట్టుమిట్టాడుతుండడం వైసీపీకి శరాఘాతంగా మారిందని చెప్పవచ్చు. అరకులోయ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కిడారి సర్వేశ్వరరావు శాసనసభ్యుడిగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఒంటి చేత్తో కష్టపడుతుండగా, వైసీపీ నాయకులు మాత్రం అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తాను కనబరచడం లేదనే చెప్పాలి. నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో వైసీపీకి బలమైన పట్టు ఉన్నప్పటికీ ప్రజాబలాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో వైసీపీ శ్రేణులు అడుగడుగునా విఫలం చెందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలను పెంచిపోషిస్తూ ఆదిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతుండడంతో పార్టీకి ఉన్న బలం కూడా నానాటికీ అంతరించే పరిస్థితి దాపురిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిడారి వైసీపీ నుంచి గెలుపొంది అధికార దేశం పార్టీ గూటికి చేరడంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడిందనే చెప్పాలి. ఈ పరిస్థితిలో స్టేట్‌బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చెట్టి ఫల్గుణ వైసీపీలో చేరి పార్టీ బాధ్యతలను తన భుజ స్కందాలపై వేసుకుని నడిపిస్తున్నారు. ఫల్గుణ చేరికతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు ఊపందుకుని వైసీపీకి జీవం పోసినప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు గతంలో వైసీపీలో ఉంటూ గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కలేదనే అక్కసుతో వైసీపీకి గుడ్‌భై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే దేశం పార్టీలో కూడా ఇమడలేని రవిబాబు మళ్లీ ఇటీవల వైసీపీ పంచన చేరారు. దీంతో ఫల్గుణతో పాటు రవిబాబు కూడా నియోజకవర్గంలో నాయకత్వ బాధ్యతలు వహిస్తుండగా, మాజీ ఎం.పి.పి. శెట్టి గంగాధరస్వామి కూడా వైసీపీ పక్షాన పనిచేస్తుండగా ఆయనను ఎస్.టి.సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో ఒకవైపు ఫల్గుణ, మరోవైపు రవిబాబు, ఇంకోవైపు గంగాధరస్వామి వైసీపీలో నాయకత్వ బాధ్యతలు వహిస్తుండగా వీరి ముగ్గురు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ను దక్కించుకోవాలంటే ఇప్పటి నుంచే తమ సత్తాను చాటుకోవాలనే ఉద్ధేశ్యంతో వీరు గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను చేపడుతూ ఆదిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను నెత్తికెక్కించుకున్న ఈ ముగ్గురు నాయకులు మూడు వర్గాలుగా విడిపోయి చేస్తున్న పార్టీ కార్యకలాపాలు కూడా పలువురిని విస్మయానికి గురిచేస్తున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాల్సిన ఈ నేతలు గ్రామాలలో పోటాపోటీ పర్యటనలు సాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు గ్రామాలలోకి వేర్వేరుగా వెళుతున్న వీరు ఆయా గ్రామాలలో పాదయాత్రలు చేపడుతూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారనే చెప్పాలి. గ్రామాలలో పోటాపోటీగా పాదయాత్రలు చేస్తూ తమ సత్తాను చాటుకోవాలనే తాపత్రయంలో ఉన్న వీరు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాలలోకి వెళుతున్న ఈ ముగ్గురు నాయకులు కనీసం గిరిజనులతో కలిసి సమావేశమైన సందర్భాలు కూడా ఉండడం లేదని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా వీరు చేయడం లేదని చెబుతున్నారు. గ్రామాలలో పాదయాత్రలతో సరిపెడుతున్న ఈ నాయకులు అసలు గ్రామ పర్యటనలు ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. తమ పార్టీలో నాయకులుగా ఉన్న ఈ ముగ్గురు నేతలు గ్రూపులుగా విడిపోయి బల నిరూపణ కోసం చేస్తున్న కుస్తీలు వైసీపీ కార్యకర్తలను అయోమమానికి గురిచేస్తుంది. తమ నాయకుల తీరుతో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం మాట అటుంచితే ఉన్న బలం కూడా నాశనమయ్యే పరిస్థితి దాపురిస్తుందని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో నేతల గ్రూపు రాజకీయాల పుణ్యమాంటూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.