విశాఖపట్నం

భీమిలి నీదా... నాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21 : విశాఖ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న గంటా, అవంతి ఇప్పుడు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఒకే సీటు కోసం పట్టుపట్టి, అధిష్ఠానాన్ని సైతం కలవరపెడుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఒక్కసారిగా బయటపడింది. అనూహ్యంగా గంటా అలకపాన్పు ఎక్కడంతో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పరిశీలకుల దృష్టంతా విశాఖపై కేంద్రీకృతమైంది. 2009 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబుది ఒకే మాట.. ఒకే బాట. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఈ ముగ్గురు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురూ టిక్కెట్లు తెచ్చుకుని గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి ఈ ముగ్గురూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. 2009లో పీఆర్పీ తరపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అవంతి శ్రీనివాసరావును 2014 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని గంటా, చంద్రబాబు కోరడంతో ఎంపీగా వెళ్లడానికి ఇష్టం లేకపోయినా, అవంతి సరే అన్నారు. అప్పుడు గంటా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించి, మంత్రి అయ్యారు. ఎంపీగా పని చేయడానికి ఇష్టపడని అవంతి 2019 ఎన్నికల్లో తను తిరిగి భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని అధిష్ఠానానికి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే సమయంలో తను కూడా వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచే పోటీ చేస్తానని, కనీసం 50 వేల మెజార్టీ తెచ్చుకుంటానని ప్రకటించారు. దీంతో ఈ సీటును దక్కించుకోవాలన్న పట్టుదల అవంతి, గంటాలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గంటాకు భీమిలిలో జనం మద్దతు లేదంటూ ఒక సర్వే పత్రికల్లో రావడంతో గంటా అలకపాన్పు ఎక్కారు. దీనిపై అవంతి మాట్లాడుతూ తను తాత్కాలికంగానే భీమిలి నియోజకవర్గాన్ని ఖాళీ చేసి ఇచ్చానని, ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని తిరిగి తనకే ఇవ్వాలంటూ అవంతి పట్టుపడుతున్నారు.
ఇద్దరూ ఇద్దరే!
ఒకే నియోజకవర్గం గురించి ఇద్దరు సమబలులు పోటీ పడడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకూ పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలుపొందుతూనే ఉన్నారు. ఓటమి అంటే ఆయనకు తెలియదు. ఎన్నిక నిర్వహణలో ఆయనకు మంచి పట్టు ఉందని రాజకీయ విశే్లషకులు చెపుతుంటారు. ఒక సందర్భంలో అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణ గంటాను విమర్శించినప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తే, తాను అక్కడే పోటీ చేస్తానని, గెలుపు ఎవరిదో తేల్చుకుందామని గంటా సవాలు విసిరారు. అన్నమాట ప్రకారం 2009లో వీరిద్దరూ అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, గంటా కొణతాలను ఓడించారు. అయితే గంటా ప్రతి ఎన్నికల ముందు తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయంగా ఉంటుందోనని సర్వే చేయించుకుంటారు. అలాగే, ప్రణాళికాబద్ధంగా ఎన్నిక జరుపుకొని గెలుస్తూ వస్తున్నారు.
ఇక అవంతి శ్రీనివాసరావు కూడా ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో దిట్ట. భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందిన తరువాత జనాల మధ్యకు వెళ్లిపోయారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో జనం అతనిని వదులుకోడానికి ఇష్టం లేకపోయినా, విధిలేని పరిస్థితుల్లో అనకాపల్లి పార్లమెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో అవంతి ఎన్నిక నల్లేరుపై నడకే అయింది. అయితే, తనకు భీమిలిలో జన బలం ఉందని రూఢిగా నమ్ముతున్న అవంతి తిరిగి అక్కడికే రావాలని ప్రయత్నిస్తున్నారు. ‘తను తన ఇంటిని అయిదేళ్ల పాటు అద్దెకు ఇచ్చాను. అద్దెకున్నవారు ఆ ఇల్లు తమదేనంటే ఎలా?’ అని అవంతి ప్రశ్నిస్తున్నారు. గంటా ఎప్పుడైతే భీమిలిని వదిలి వెళ్లేది లేదని ప్రకటించారో, అవంతిని తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ గేలం వేసింది. అవంతి టీడీపీని వీడి వెళ్లిపోతారన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది. కాపు సామాజికవర్గానికి చెందిన అవంతిని వదులుకోడానికి చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు జోక్యంతోనే అవంతి కొంత కాలంగా వౌనంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. గంటా అలక తీర్చేందుకు గురువారం నగరానికి వచ్చిన ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి భీమిలి నియోజకవర్గం గంటాదేనని ప్రకటించారు. ఇదే ఖాయమనుకుంటే, అవంతి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఒకవేళ ఆయన పట్టుదలకు పోయి పార్టీ వీడి వేరే పార్టీ తరఫున భీమిలి నుంచే పోటీ చేస్తే, భీమిలి గంటాకు దక్కుతుందా? అవంతి చేజిక్కించుకుంటారా? భీమిలి రాజకీయం రసవత్తరంగా మారింది కదూ!