విశాఖపట్నం

ఎప్పుడు చూసినా రైళ్లు రద్దీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: రైళ్ళకు ప్రతిరోజూ సీజనే అయిపోయింది. సంక్రాంతి, వేసవి, దసరా పండగ సందర్భాల్లోనే రైళ్ళకు సీజన్ అంటూ ఉండేది. ఆ తరువాత పెళ్ళిళ్ళ రోజుల్లో రద్దీ తప్పేది కాదు. ఏడాదిలో మిగిలిన రోజులన్నీ సాధారణ రద్దీతోనే ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్లు కనిపించేవి. అటువంటిది గత రెండేళ్ళకాలంగా రైళ్ళకు ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. అనూహ్యంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైళ్ళను పెంచకపోవడం, కనీసం ప్రత్యామ్నాయం చూపకపోవడం, డిమాండ్‌ను బట్టి అయినా అదనపు కోచ్‌ల సదుపాయం కల్పించకపోవడంతో సమస్య తీవ్రతరమవుతోంది. సరిపడే రైళ్ళు, కోచ్‌లు లేకపోవడంతో ముఖ్యమైన సామాన్యులు నలిగిపోతున్నారు. దూర ప్రయాణాలంటే భయపడుతున్నారు. కాలేజీలు తెరుచుకోవడం, మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ రావడంతో గత నాలుగు రోజుల నుంచి రైళ్ళన్నీ విపరీతమైన రద్దీతో రైళ్ళన్నీ నడుస్తున్నాయి.
పేరుకే 130 రైళ్ళు
విశాఖ నుంచి దేశ నలుమూలలకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్టులు, పాసింజర్లతో కలిపి 130కి పైగానే రైళ్ళు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ పేరుకే తప్ప సామాన్యుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఏసీ కోచ్‌లు ప్రముఖులకు, పారిశ్రామికవేత్తల వంటి సంపన్నులకే పరిమితమవుతుండగా, స్లీపర్‌క్లాస్‌లు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండటంలేదు. వీటిల్లో బెర్తులు అందని ద్రాక్షగా మారుతున్నాయి. కొన్నాళ్ళ ముందుగానే టికెట్లు కొనుగోలు చేసినా బెర్తుల కన్ఫర్మేషన్ సాధ్యపడటంలేదు. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న చాంతడంత వెయిటింగ్‌లిస్ట్ ఏడాది మొత్తంమీద కొనసాగుతూనే ఉంది. 15ఏళ్ళ కిందట నాటి రైళ్ళతోనే సరిపెడుతున్న ఈస్ట్‌కోస్ట్‌రైల్వే కొత్తగా రైళ్ళను పట్టాలెక్కించడంలేదు. ఒకటి, రెండూ వచ్చినా వీటి వలన ప్రయాణికుల సమస్యలు తీరడంలేదు. అవసరమైన, డిమాండ్ కలిగి ఉండే రైల్వే మార్గాల్లో కొత్త రైళ్ళను నిర్వహిస్తే ఫలితం వచ్చేది. 15వేల నుంచి ఏకంగా లక్షకు చేరుకున్న ప్రయాణికులను దృష్టిలోపెట్టుకుని అయినా రైళ్ళను నిర్వహించడంలేదు.
విశాఖ-వారణాసి ఊసే లేదు
విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైలు నిర్వహించాల్సిందిగా గత పదేళ్ళ నుంచి ప్రయాణికుల డిమాండ్ ఉంది. అలాగే దీంతోపాటు విశాఖ నుంచి మైసూర్, సికింద్రాబాద్, తిరుపతి, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి ముఖ్య పట్టణాలకు ప్రత్యేక రైళ్ళు నిర్వహించాలని లేనిపక్షంలో కనీసం సీజన్లలోనైనా వీటిని నిర్వహించాల్సిందిగా గత కొనే్నళ్ళుగా ప్రయాణికులు రైల్వేబోర్డును కేంద్రరైల్వేమంత్రిత్వశాఖను కోరుతూనే ఉన్నారు. డివిజన్, జోన్ స్థాయిలో జరిగే రైల్వేయూజర్స్ కన్సల్టేటేటీవ్ కమిటీ సమీక్షల్లోను ప్రతిసారి దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. చివరకు రైల్వేబడ్జెట్‌కు ప్రతిపాదనలు వెళ్తున్నాయి. వీటితోపాటు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విశాఖ-కాకినాడల మధ్య షటిల్ రైళ్ళు, విశాఖ నుంచి రాయగడ, భువనేశ్వర్‌ల వైపు మరికొన్నింటినీ నిర్వహిస్తే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని కోరుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేకపోతోంది. విశాఖ-షిరిడి, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ (ప్రశాంతి), విశాఖ-తిరుపతి (తిరుమల) రైళ్ళకు విపరీతమైన డిమాండ్ ఉన్నా ఈ మార్గంలో ప్రత్యేకరైళ్ళకు అవకాశం లేకుండాపోతోంది. ఒక్క తిరుపతికి మాత్రం అదీ సీజన్‌లకే ప్రత్యేకరైలు పరిమితమవుతోంది.
జోన్ల మధ్య నలిగిపోతున్న వాల్తేరు
ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్, దక్షిణమధ్య రైల్వేజోన్ మధ్య వాల్తేరుడివిజన్ నలిగిపోతోంది. ఆగ్నేయరైల్వే (ఎస్‌ఇ రైల్వే)లో ఉన్నపుడూ వాల్తేరుడివిజన్‌కు ఇబ్బందులే. కొత్త రైళ్ళు, కొత్త కోచ్‌ల కేటాయింపులో తీరని అన్యాయానికి గురవుతూనే కనీసం సీజన్లలోనైనా వీటికి నోచుకోవడంలేదు. ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్ హెడ్‌క్వార్టర్ భువనేశ్వర్ నుంచి కోల్‌కత్తా, బిహార్, మధ్యప్రదేశ్,మహారాష్టల్ర మీదుగా దేశ నలుమూలలకు అవసరమైనన్నీ రైళ్ళను నిర్వహించగలుగుతోంది. అయితే భువనేశ్వర్ నుంచి విశాఖవైపుగా ప్రత్యేకరైళ్ళు, డిమాండ్ కలిగి ఉండే వాటికి ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం తీవ్ర వివక్ష చూపుతోంది. అలాగే దక్షిణమధ్య రైల్వేజోన్ విజయవాడ నుంచి విశాఖ వైపు కాకుండా దేశ నలుమూలలకు నిర్వహిస్తోంది. రద్దీని దృష్టిలోపెట్టుకుని 106 ప్రత్యేక రైళ్ళను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వేజోన్ విశాఖ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్ళేందుకు ఒక్క రైలును ప్రవేశపెట్టలేదు. ఈ విధంగా ఈస్ట్‌కోస్ట్, దక్షిణమధ్య రైల్వేజోన్ల మధ్య వాల్తేరుడివిజన్ ఎపుడూ నలిగిపోవడమే.