విశాఖపట్నం

ప్రాథమిక రంగానికి ఊతమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ప్రాథమిక రంగానికి మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జలవనరులు, ప్రాథమిక రంగం అభివృద్ధిపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక రంగంలో తీవ్ర వెనుకబాటు కన్పిస్తోందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కీలకమైన సాగునీటి వనరుల అభివృద్ధికి పెద్దపీట వేయాల్సి ఉందన్నారు. జిల్లాలో సుమారు 6.31 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం లేదని, ఈ భూములను సాగులోకి తీసుకువస్తే ఉత్పాదకత పెరుగుతుందని, తద్వారా అనుకున్న వృద్ధి రేటును సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం ఎడమ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేయా ల్సి అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. పోలవరం ఎడమ కాలువ 1,3 ప్యాకేజీ పనులు అనుకున్న విధంగా సాగలేదని, ఈ విషయంలో ఎదురైన సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్టైతే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను జిల్లా మం త్రులు, ఎమ్మెల్యేలకు వివరించడంతో పాటు అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రాష్ట్రం ఎటువంటి కరవు పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భూగర్భ జలాలను వృద్ధి చేసే కార్యక్రమాలను ప్రభు త్వం చేపడుతోందన్నారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్ధేశించిన ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తే జిల్లాను కరవు బారి నుంచి రక్షించడంతో పాటు అనుకున్న మేరకు ప్రాథమిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు.
ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ఎద్దడి నెలకొందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల తాగునీటి అవసరాలతో పాటు స్టీల్ ప్లాంట్ తదితర పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు వీలుగా నీటి సరఫరాను పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. అవసరమైతే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఏలేరు కాలువకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే సందర్భంలో జివిఎంసి పరిధిలో భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నగర ప్రజలకు తాగునీరందించేందుకు వీలుగా అవసరమైతే తాండవ, రైవాడ నీటిని మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పూర్తయితే జిల్లాకు తాగు, సాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని,ఎడమ కాలువ నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను మంత్రి యనమలకు వివరించారు. సమావేశంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, వంగలపూడి అనిత, పీలా గోవింద్, కెఎస్‌ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.