విశాఖ

పార్టీ మార్పే ప్రాణాలను బలి తీసుకుంది ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 25: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఎందుకు హతమార్చారు? హత్య చేయాల్సిన తప్పిదాన్ని ఆయన ఏం చేసారు?? అన్నదే అందరి మదిలో నెలకొన్న ప్రశ్నలు. బాక్సైట్ కారణంగానే కిడారిని హత్య చేసారని కొందరు, గూడ అక్రమ క్వారీ వలనే చంపేసారని మరికొందరు ఎవరికి తోచిన రీతిన వారు చర్చించుకుంటూ కిడారి హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలను ఎంచుకోవడం షరా మామూలుగా మారిపోయింది. విశాఖ ఏజెన్సీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఇదే చర్చ జోరుగా సాగుతుంది. అయితే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులు వేరేగా కనిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో చేరడమే కిడారిని బలి తీసుకుందని విశ్వసనీయంగా అందిన సమాచారం బట్టి తెలిసింది. 2014వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి అరకులోయ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన అత్యధిక మెజార్టీతో గణ విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిడారి 2016వ సంవత్సరం ఆగస్టులో అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేరడమే కిడారి కొంప ముంచిదని, వైసీపీలో కొనసాగి ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది కాదని తెలుస్తోంది. మావోయిస్టులు కిడారి పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన ప్రాణాలు తీసే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ మేరకు 2015వ సంవత్సరంలో మావోయిస్టులు నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కిడారి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించినట్టు తెలియవచ్చింది. బాక్సైట్ పట్ల ఆయన అనుసరిస్తున్న మెతక వైఖరిని ఈ సందర్భంగా మావోయిస్టులు చర్చించి ఆయన వ్యవహారశైలిపై అసంతృప్తి వెల్లగక్కారని సమాచారం. బాక్సైట్‌పై గట్టి పోరాటం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని భావించిన మావోలు కిడారికి బుద్ది చెప్పాలని మాత్రమే అప్పటి ప్లీనరీ సమావేశంలో తీర్మానించినట్టు తెలిసింది. అయితే 2016వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదిన రామగుడ వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చావు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ తమ ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘటన అనంతరం చాలాకాలం తరువాత తేరుకున్న మావోయిస్టు పార్టీ గత ప్లీనరీ సమావేశాలలో చేసుకున్న తీర్మానాలపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కిడారిపై భౌతిక దాడి చేయాలన్న గత ప్లీనరీ సమావేశ తీర్మానాన్ని మావోయిస్టు అగ్ర నేతలు సమీక్షించినట్టు తెలియవచ్చింది. అయితే అప్పటికే అధికార దేశం పార్టీలో సర్వేశ్వరరావు చేరిన వైనాన్ని, ఆ తరువాత ఏజెన్సీలో చోటుచేసుకున్న పరిణామాలను విశే్లషించుకున్న మావోలు కిడారిపై గత కొంతకాలంగా ఆగ్రహాంతో ఉన్నట్టు తెలిసింది. అధికార పార్టీ పంచన చేరిన కిడారి వైఖరిని మావోయిస్టులు తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా గిరిజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని భావించినట్టు తెలిసింది. అనంతగిరి మండలంలో గిరిజనుల భూములను అక్రమంగా కాజేసారనే ఆరోపణలు వెల్లువెత్తడం, గూడ క్వారీని అక్రమంగా నిర్వహిస్తున్నారని గిరిజనులు ఆందోళన చేయడం వంటి పరిణామాలను మావోయిస్టు ఆగ్రహానికి ఆజ్యం పోయడంతోవీటిని తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. అధికార పార్టీలో చేరిన కిడారి తన అధికారాన్ని వినియోగించుకుని అక్రమ వ్యాపారాలను కాపాడుకుంటున్నారని, భూముల దందాను చేస్తున్నారని మావోయిస్టులు భావించి ఆయనపై కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. తాము వ్యతిరేకిస్తున్న అధికార పార్టీలో చేరి కిడారి తప్పు చేయడమే కాకుండా అధికారాన్ని అడ్డంపెట్టుకుని గిరిజనులకు పలు అంశాలలో నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారన్నది మావోల అభియోగంగా తెలుస్తోంది. దీంతో ఆయనను భౌతికంగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారని, లేకుంటే హెచ్చరించి వదిలిపెట్టేవారని తెలిసింది. ఈ మేరకు అదును కోసం వేచి చూసిన మావోలు వ్యూహ్మాత్మకంగా దాడి చేసి ఆయనను హతమార్చినట్టు తెలుస్తోంది. కిడారిని హతమార్చేముందు కూడా మావోయిస్టులు అధికార పార్టీలో ఎందుకు చేరావని, గూడ క్వారీని ఎందుకు నిర్వహిస్తున్నావని ప్రశ్నించిన అంశం ఈ సందర్భంగా గమనార్హాం. పార్టీ మారడం, మారిన తరువాత జరిగిన పరిణామాలే కిడారి ప్రాణాల మీదకు తెచ్చిందని తెలుస్తోంది.
నేతల మృతికి నివాళి
పాడేరు, సెప్టెంబర్ 25: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలకు ఐ.టి.డి.ఎ. అధికారులు, సిబ్బంది మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయం వద్ద వీరంతా ఐదు నిమిషాల పాటు వౌనం పాటించి సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వీరు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయాల వద్ద కూడా ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు కిడారి, సోమలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి వి.ఎస్.ప్రభాకరరావు, పరిపాలన అధికారి వేగి అప్పారావు, డి.ఎస్.ఒ. ఎం.వెంకటేశ్వరరావు, వెలుగు ఎ.పి.డి. నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి డి.కొండలరావు, డిప్యూటీ తాహశీల్ధార్ వి.చిన్నిక్రిష్ణ, పలువురు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.