విశాఖ

జీవో నెంబరు 132పై కదం తొక్కిన ఉపాధ్యాయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 10: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబరు 132ను వ్యతిరేకిస్తూ గిరిజన ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఏజెన్సీ పదకొండు మండలాల పరిధిలో పనిచేస్తున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు సోమవారం మూకుమ్మడిగా సెలవులు పెట్టి పాడేరులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన విద్యకు తీవ్ర విఘాతం కల్పిస్తున్న జి.ఒ.నెం.132ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట వందలాది మంది ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించి ఆందోళనలో భాగస్వామ్యమయ్యాయి. స్థానిక తలారిసింగ్ కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాల నుంచి ఐ.టి.డి.ఎ. వరకు ఉపాధ్యాయులంతా భారీ ర్యాలీ నిర్వహించి ఐ.టి.డి.ఎ. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఉపాధ్యాయుల ఆందోళనతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఐ.టి.డి.ఎ. ఎదుట భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఆందోళనకారులు లోపలకు చొరబడకుండా గట్టి చర్యలు చేపట్టారు. దీంతో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి గిరిజన విద్యకు ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. ధర్నా అనంతరం ఐ.టి.డి.ఎ. ఎదుట ఉపాధ్యాయులు నిరవదిక రిలే నిరాహర దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం నేతలు చిట్టపులి శ్రీనివాస్‌పడాల్, కిల్లు గంగన్నపడాల్, పలాసి క్రిష్ణారావు, జి.శేషగిరిరావు తదితరులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ప్రశాంతంగా సాగుతున్న విద్యావిధానానికి జి.ఒ.నెంబరు 132 ద్వారా ప్రభుత్వం విఘాతం కల్పించిందని విమర్శించారు. ఈ జి.ఒ. వలన ఆశ్రమాల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగించారని, అధికారాలు లేకపోతే ఆశ్రమాల నిర్వహణ బాధ్యతను ఏలా చేపట్టగలరని వారు ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థులు ఉండే ఒక్కొ ఆశ్రమ పాఠశాలలో ప్రదానోపాధ్యాయులు అన్ని బాధ్యతలు తీసుకుంటూ సక్రమంగా నడిపిస్తుండగా జి.ఒ.132 వలన ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి బాధ్యతలు లేకుండా చేసారని వారు పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయులకు అధికారాలు లేకపోతే బాధ్యత కూడా ఉండదని, ఈ పరిస్థితుల్లో ఆశ్రమాలన్నీ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం లేకపోలేదని వారు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రదానోపాధ్యాయుల అధికారాలను గిరిజన సంక్షేమ సహాయ అధికారికి బదలాయించడంతో ఇప్పటికే ఆశ్రమాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొందని వారు అన్నారు. మండలానికి ఒక్కరే ఉండే
సీఎం దత్తత పంచాయతీలో పనుల జాప్యమేల?
*ఐ.టి.డి.ఎ. పి.ఒ. బాలాజి అసంతృప్తి
అరకులోయ, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. పెదలబుడు పంచాయతీలో అభివృద్ధి పనులను చేపట్టి సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి కాకపోవడానికి గల కారణాలపై అధికారులను ఆయన నిలదీసారు. స్థానిక ఎం.పి.డి.ఒ. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దత్తత పంచాయతీలో జరుగుతున్న పనుల పురోగతి, మండలంలోని పలు పథకాల అమలు వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదలబుడు పంచాయతీలో అభివృద్ధి పనులు సకాలంలో జరగకపోవడానికి అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందని అన్నారు. సకాలంలో పనులు చేపట్టకుండా జాప్యం చేస్తున్న అధికారుల తీరు సరైనది కాదని ఆయన ఆక్షేపించారు. ముఖ్యమంత్రి దత్తత పంచాయతీలో పనులపైనే అధికారులు అలసత్వం వహిస్తున్నారంటే, మిగిలిన పనులలో ఇంకేలా ఉంటుందోనని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి పెదలబుడు పంచాయతీలో అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్.ఆర్.ఎం.ఎం.లో నిర్మించనున్న వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగి నిర్మాణానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన చెప్పారు. బస్ షెల్టర్ల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు చేయని కంట్రాక్టర్‌లను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఆయన ఆదేశించారు. మండలంలోని సుంకరమెట్ట, చినలబుడు, మాలసింగారం, నందివలస ఆశ్రమ పాఠశాలల్లో ఆదనపు తరగతి గదుల నిర్మాణాలపై ఆయన ఆరా తీసారు. గ్రామాలలో చేపడుతున్న సిమ్మెంట్ రహదారులు, సబ్ సెంటర్ల భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అడ్వెంచర్ పార్కు నిర్మాణానికి టెండర్లను పిలవాలని ఆయన సూచించారు. తాంగులగుడ గ్రామంలో ఇంటింటికి తాగునీటి కుళాయి పనుల పురోగతిని బాలాజి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంప్రసాద్, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి. భాగ్యారావు, ఎం.పి.డి.ఒ. విజయకుమార్, పలు ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ధరలు పెంచితే చర్యలు తప్పదు
* లాడ్జింగ్ యజమానులకు సబ్ కలెక్టర్ హెచ్చరిక
అరకులోయ, డిసెంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచి పర్యాటకులకు ఇబ్బంది కలిగించే లాడ్జింగ్‌లు, రిసార్ట్స్‌ల యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. స్థానిక తాహశీల్ధార్ కార్యాలయంలో లాడ్జింగ్‌లు, రిసార్ట్స్‌ల యజమానులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాడ్జింగ్‌లలో గదుల అద్దె ధరల వివరాలను తెలియచేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యాటకుల నుంచి అధికంగా ఆద్దెలు వసూలు చేస్తున్నారనే పిర్యాదులు అందుతున్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే లాడ్జింగ్‌ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. లాడ్జింగ్ యజమానులు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ పర్యాటకులను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేసారు. వ్యాపారుల శైలి వలన పర్యాటకులు ఇబ్బంది పడుతుండడమే కాకుండా అరకులోయ పర్యాటక ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. పర్యాటకులలో పేదలు, మధ్య తరగతి వారు కూడా ఉంటారన్న సంగతిని విస్మరించరాదని, ఇటువంటి వారి నుంచి అధిక ధరలను వసూలు చేయరాదని ఆయన చెప్పారు. లాడ్జింగ్ గదులలో పర్యాటకులను 12 గంటలకు మాత్రమే అనుమతిస్తున్నట్టుగా తమకు పిర్యాదులు అందుతున్నాయని, 24 గంటల పాటు వారికి అనుమతి కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. అరకులోయ పట్టణంలో అనధికారికంగా ఇళ్ల గదులను పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రతి వారం లాడ్జింగ్‌లను తనిఖీ చేస్తామని, తమ తనిఖీలో ఎటువంటి లోపాలు బైటపడినా చర్యలు తప్పవని ఆయన చెప్పారు. లాడ్జింగులు, రిసార్ట్స్‌ల యజమానులు ప్రభుత్వానికి జి.ఎస్.టి. చెల్లించాలని ఆయన ఆదేశించారు. అనంతరం స్థానిక సినిమాహాల్‌ను వెంకటేశ్వర్ తనిఖీ చేసి ధియేటర్‌లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహశీల్ధార్ పి.శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత పాటించకపోతే బిల్లులు నిలుపుచేస్తాం
*ఐ.టి.డి.ఎ. పి.ఒ. బాలాజి హెచ్చరిక
అరకులోయ, డిసెంబర్ 10: వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులలో నాణ్యతను పాటించకపోతే బిల్లుల చెల్లింపును నిలుపుదల చేస్తామని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో సోమవారం సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అరకులోయ పట్టణంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వైద్యాధికారుల నివాస గృహాలను, శరభగుడ గ్రామంలో సి.సి.రోడ్డు నిర్మాణ పనులను, గంజాయిగుడ గ్రామం వద్ద 45 లక్షలతో నిర్మిస్తున్న కాటేజీలను, 15 లక్షలతో నిర్మిస్తున్న పెదలబుడు రహదారి పనులను ఆయన తనిఖీ చేసారు. పెదలబుడు గ్రామంలో ఆయన పర్యటించి అంతర్గత సి.సి.రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపాన్ని గుర్తించిన ప్రాజెక్టు అధికారి అధికారులు, కంట్రాక్టర్లపై ఆగ్రహాం వ్యక్తం చేసారు. లక్షలాది రూపాయలను వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలలో నాణ్యత ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. కంట్రాక్టర్లు చేస్తున్న నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదేనని, తమ బాధ్యతలను విస్మరించి నాశిరకం పనులకు ఆమోదం తెలియచేస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నాణ్యత లేని పనులు చేపట్టి చేతులు దులుపుకోవాలనుకుంటే బిల్లుల సంగతి మర్చిపోవలసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులను తాను తరచుగా తనిఖీలు చేసి నాణ్యతను పరిశీలిస్తామని, ఎక్కడ నాణ్యత కొరవడినా ఇందుకు సంబంధించిన బిలులను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. పెదలబుడు ప్రధాన రహదారి తారురోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేసిన ఆయన రోడ్డుపై క్రషర్ బుగ్గి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పెదలబుడు గ్రామంలో అంతర్గత సి.సి.రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులు పి.ఒ. దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రాజెక్టు అధికారి బాలాజి గిరిజనులతో చర్చించి అభివృద్ధి పనులకు అడ్డుతగలవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, పలు ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
* పార్టీ శ్రేణులకు మంత్రి కిడారి పిలుపు
అరకులోయ, డిసెంబర్ 10: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పర్యాటక శాఖ అతిధి గృహం ఇష్టాగోష్టి మందిరంలో నియోజకవర్గం స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనకు పెద్ద బాధ్యతను అప్పగించారని, దీనిని సద్వినియోగం చేసుకోవలసి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని ఆయన చెప్పారు. నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నా వాటిని విడనాడి అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐకమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అన్న విషయాన్ని విస్మరించరాదని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలపై ఎంతమంది ప్రచారం చేస్తున్నారన్నది నాయకులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్న నాటి నుంచి మరణించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు. తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా ఉండే పనులను చేపడతామని ఆయన పేర్కొన్నారు. మండల, పంచాయతీ స్థాయిలో ఇకపై సమావేశాలు నిర్వహించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతంగా పూర్తి చేయాలని, సభ్యత్వ నమోదే తమకు దిక్చూచిగా ఆయన పేర్కొన్నారు. లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదును పూర్తి చేసేందుకు నాయకులంతా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తామని, పార్టీ కోసం అంకితబావంతో పనిచేస్తామని సమావేశంలో పాల్గొన్న నాయకులతో ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అరకులోయ పోలీస్ స్టేషన్లపై దాడి ఘటనలో అరెస్టయిన వారిని విడిపించేందుకు తాను శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నానని, తన స్వంత డబ్బులు వినియోగించి వారి బెయిల్ కోసం కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై పలువురు తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తుండడం సరికాదని ఆయన అన్నారు. ఈ సంఘటనను రాజకీయ కోణంలో చూస్తూ రాద్ధాంతం చేయడం మంచిదికాదని ఆయన హితవు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల వారు చేసే విమర్శలు, ఆరోపణలకు పార్టీ నాయకులు ధీటుగా సమాధానం చెప్పాలని ఆయన కోరారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబరు 132 సమస్యను వారం రోజులలోగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ జి.ఒ. రద్దుకు అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రావణ్‌కుమార్ చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పలువురు బాధితులకు మంజూరైన చెక్కులను మంత్రి పంపిణీ చేసారు. ఈ సమావేశంలో ఎస్.టి., ఎస్.సి.కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, ఎం.పి.పి.లు, కె.అరుణకుమారి, పైడితల్లి, ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొట్యాడ అప్పారావు, దేశం నాయకులు శెట్టి లక్ష్మణుడు, బాకూరు వెంకటరమణరాజు, వెంకటరమణ, పద్మ, నాగేశ్వరరావు, శెట్టి బాబురావు, అప్పాలు, అమ్మన్న, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.