విశాఖ

అదుపుతప్పిన బెలూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 17: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో నిర్వహించనున్న బెలూన్ ఫెస్టివల్ ట్రయల్ అదుపుతప్పడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు మూడు రోజుల పాటు అరకులోయలో బెలూన్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపచంలోని 15 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనే ఈ ఫెస్టివల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బెలూన్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని పర్యాటక శాఖ బుధవారం సాయంత్రం ట్రయల్ నిర్వహించింది. స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానం నుంచి నిర్వహించిన ఈ ట్రయిల్‌లో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా ఒక బెలూన్‌లో విహరించారు. అయితే ఈ బెలూన్ అదుపుతప్పి కోడిపుంజువలస గ్రామ సమీపాన కొండ ప్రాంతంలో దిగిపోయింది. అదుపుతప్పిన ఈ బెలూన్‌లో విహరించిన శుక్లాకు తృటిలో ప్రమాదం తప్పి క్షేమంగా బైటపడ్డారు. కోడిపుంజువలస గ్రామ కొండపై దిగిన బెలూన్ నుంచి బైటపడిన శుక్లాను అధికారులు, సిబ్బంది వాహనం ద్వారా అరకులోయకు తీసుకువచ్చారు. కాగా బెలూన్ ఎందుకు అదుపుతప్పిందనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. అరకులోయలో బెలూన్ ఫెస్టివల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ట్రయిల్ విఫలం కావడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తూ ఇందులో లోపాల కోసం అనే్వషిస్తున్నారు. అయితే బెలూన్ ట్రయిల్ విఫలం కావడం వెనుక గల కారణాలు మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
వీరవెల్లిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
* దళిత సంఘాల ఆందోళన * పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు
మాడుగుల, జనవరి 17: మండలంలోని వీరవెల్లి అగ్రహారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్థరాత్రి సమయంలో ధ్వంసం చేసారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై దళిత సంఘాలు గురువారం ఆందోళన చేపట్టాయి. వీరవెల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం రెండు చేతులు, ముక్కు భాగాన విరగొట్టారు. దీంతో దళిత సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వీరవెల్లి గ్రామంతో పాటు వడ్డాది ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించి, స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు జంగా త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి వేచలపు సహదేముడు, సంఘం నాయకులు కుదరా నాగేశ్వరరావు, మరువాడ ఈశ్వరరావు, పాము కామరాజు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసారు. దీంతో అనకాపల్లి డి.ఎస్.పి. ప్రసాద్, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు హుటాహుటిన మాడుగుల చేరుకుని ఆందోళనకారులతో చర్చలు నిర్వహించారు. అంతకుముందు వీరవెల్లి గ్రామాన్ని వీరు సందర్శించి ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. వీరవెల్లి గ్రామస్తులను వీరు విచారించి విగ్రహాం ధ్వంసం వెనుక గల కారణాలు, ఈ సంఘటనకు పాల్పడిన అనుమానితుల వివరాలను సేకరించారు. పోలీసు అధికారులు నిర్వహించిన విచారణలో ప్రాధమిక సమాచారం ప్రకారం అనుమానితులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి. హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు తమ ఆందోళనను విరమించారు.