విశాఖ

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఫిబ్రవరి 20: విశాఖ మన్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్‌మీడియట్ పరీక్షలు నిర్వహించాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె. బాలాజీ ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 18వ తేది వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించాలని ఆయన ఆదేశించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలలో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్షలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సిసిపుటేజ్‌లను పరిశీలించాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఐ.టి.డి.ఎ. నుంచి అన్ని విధాలా సహకారం అందించనున్నట్టు ఆయన తెలిపారు. గూడెంకొత్తవీధి మండలం సీలేరు జూనియర్ కళాశాల విద్యార్థులకు జి.కె.వీధిలోనూ, అనంతగిరి, డుంబ్రిగుడ విద్యార్థులకు అరకులోయలోనూ, ముంచంగిపుట్టు విద్యార్థులకు పెదబయలులో పరీక్షలు రాస్తున్నందున విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కల్పించాలని ఇంటర్ బోర్డు రీజినల్ ఇన్‌స్పెక్టర్ నగేష్ కోరారు. ఇందుకు స్పందించిన ప్రాజెక్టు అధికారి ఆయా సెంటర్ల విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు భోజన వ్యయానికి ఐ.టి.డి.ఎ. నుంచి మంజూరు చేయనున్నట్టు బాలాజి చెప్పారు. సమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డి.ఎస్.పి. రాజ్‌కమల్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, హైపవర్ కమిటి సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

రూ.4కోట్ల ఇంటి పన్ను బకాయిలు
అరకులోయ, ఫిబ్రవరి 20: పాడేరు డివిజన్‌లో 4 కోట్ల 45 లక్షల రూపాయల ఇంటి పన్ను వసూలు కావల్సి ఉందని డివిజనల్ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎం.పి.డి.ఒ., గ్రామ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో ఐదు కోట్ల 43 లక్షల రూపాయలు ఇంటి పన్ను వసూలు కావల్సి ఉండగా, ఇంతవరకు 98 లక్షల రూపాయలు వసూలైనట్టు చెప్పారు. ఇంటి పన్ను వసూళ్లలో అరకులోయ మండలం వెనుకబడి ఉన్నట్టు ఆయన అన్నారు. అరకులోయ మండలంలో కోటి 48 లక్షల 77 వేల 175 రూపాయలు ఇంటి పన్ను వసూలు కావల్సి ఉండగా కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే వసూలయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇంటి పన్ను బకాయిలు వసూలు కాకపోవడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆయన అన్నారు. మండలంలో గ్రామ కార్యదర్శులు తక్కువగా ఉండడంతో పన్నుల వసూళ్లకు ఆటంకం ఏర్పడడానికి కారణవౌతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారని, వీరిలో ఓ కార్యదర్శి సెలవుపై వెళ్లిపోవడంతో కార్యదర్శుల కొరత ఏర్పడినట్టు ఆయన తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లలో గ్రామ రెవిన్యూ అధికారుల సహకారం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. పర్యాటకాభివృద్ధి సంస్థ 88 లక్షల రూపాయలు పన్ను బకాయి పడిందని ఈ శాఖ నుంచి పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పాడేరు ఐ.టి.డి.ఎ. కూడా పన్ను బకాయి ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ బకాయి నిధులను చెల్లించేందుకు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి అంగీకరించినట్టు ఆయన చెప్పారు. డివిజన్ పరిధిలో ఈనెల 28వ తేది వరకు పారిశుధ్య వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎం.పి.డి.ఒ. వెంకటరాంబాబు, పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నేడు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ పర్యటన
అరకులోయ, ఫిబ్రవరి 20: జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ ఈ నెల 21న అరకులోయ ప్రాంతంలో పర్యటిస్తున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ బుధవారం విలేఖరులకు తెలిపారు. కమిషన్ చైర్మన్ నందకుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం అనంతగిరి మండలం బొర్రా గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో ముచ్చటించనున్నట్టు ఆయన చెప్పారు. అరకులోయ మండలం సుంకరమెట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వీరు సందర్శిస్తారని, కొత్త్భల్లుగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేస్తారని ఆయన అన్నారు. అనంతరం స్థానిక హరితా రిసార్ట్స్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ పర్యటనను పురస్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని బాలాజి ఆదేశించారు.