విశాఖపట్నం

నౌకల పండుగకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపపట్నం: నగర ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, వివిధ దేశాల నౌకాదళ సిబ్బంది మన కళ్ళ ముందు అద్భుత విన్యాసాలు చేయబోతున్నారు. తూర్పు తీరంలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళం భారీ ఏర్పాట్లు చేసింది. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ,
ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా, సుమారు 30 దేశాలకు చెందిన నేవీ అధికారులు, వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతీనిధులు నగరానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి నౌకాదళ అధికారులు, ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. ఆరవ తేదీన భారత రాష్టప్రతి సముద్ర తీరంలో బారులు తీరిన దేశ, విదేశీ నౌకలను సమీక్షిస్తారు. ఆరవ తేదీన ప్రధాని ఆర్‌కే బీచ్‌లో జరిగే ఫ్లై పాస్ట్ (విమాన విన్యాసాలు), దేశ, విదేశాల నావికాదళ సిబ్బంది నిర్వహించే కవాతును తిలకిస్తారు. ఇవి కాకుండా రాష్టప్రతి, ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. భారత రాష్టప్రతి, ప్రధాని సుమారు రెండున్న రోజులు ఉండడం ఇదే ప్రథమం కావచ్చు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులపాటు ఇక్కడే ఉంటారు.
ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రమాబు నాయుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్టప్రతి డేగా విమానాశ్రయం నుంచి తూర్పు నౌకాదళంలోని నేవీ మెస్‌కు చేరుకుంటారు. వెనువెంటనే ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో డేగాకు చేరుకుంటారు. ఆయనకు కూడా గవర్నర్, ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి స్వాగతం పలుకుతారు. నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక విక్టరీ ఎట్ సీ వద్ద అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఎయు కళాశాల్లో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్ ఐదవ తేదీన నగరానికి వస్తున్నారు. అదే రోజున నేవల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వేడుకలను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభిస్తారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11.45 గంటల వరకూ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటల నుంచి 6.30 గంటల వరకూ సాముద్రికలో నేవీ బ్యాండ్ కచేరీని రాష్టప్రతి తిలకిస్తారు. రాత్రి 7.25 గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ మెస్‌లో రాష్టప్రతి గౌర విందులో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఏడవ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి ఆరు గంటల వరకూ ఆర్‌కె బీచ్‌లో విన్యాసాలను తిలకిస్తారు. 6.20 గంటల నుంచి ఏడు గంటల వరూ అంతర్జాతీయ సిటీ పెరేడ్‌లో పాల్గొంటారు. 8వ తేదీన నేవల్ ఇనిస్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. కాగా, ఆరవ తేదీ ప్రధాని మోదీ తీర ప్రాంత ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సమావేశం కానున్నారు.
నేడు ఫుల్ డ్రస్ రిహార్సల్స్
ఫ్లీట్ రివ్యూని తిలకించడానికి పాస్‌లు దొరకలేదా? ఆంక్షలకు భయపడి ఫ్లీట్ రివ్యూలో పాల్గొనలేకపోతున్నారా? అయితే, గురువారం ఆర్‌కే బీచ్‌లో జరగనున్న ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌ను తిలకిస్తే సరిపోతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకూ ఫ్లై ఫాస్ట్, ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఉంటుంది. అయితే సందర్శకులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల లోపు ఆర్‌కే బీచ్‌కు చేరుకుంటే, ట్రాఫిక్ ఆంక్షల నుంచి బయటపడగలుగుతారు.

అనాలోచిత చర్యలతో ఆందోళన
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారన్న ఆనందం ఆవిరైపోతోంది. ఐఎఫ్‌ఆర్‌కు వస్తున్న అతి ముఖ్యులు, ముఖ్యల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఐఎఫ్‌ఆర్ సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ బీచ్ రోడ్డుకు మాత్రమే పరిమితమైన ఆంక్షలు, నిబంధనలు బుధవారం నుంచి బీచ్‌కు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు విస్తరించాయి. సన్నాహక కార్యక్రమాలకే పోలీసు యంత్రాంగం ఇంతగా జాగ్రత్తలు తీసుకుంటే, ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు, దేశ, విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నెల 7న జరిగే ఐఎఫ్‌ఆర్ సిటీ పెరేడ్ నిమిత్తం సన్నాహక కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఆర్‌కె బీచ్‌లో ప్రదర్శించారు. తొలి సన్నాహక కార్యక్రమానికి సామాన్య ప్రజానీకంతో పాటు నౌకాదళం సిబ్బందికి తిలకించే అవకాశం కల్పించారు. నౌకాదళ సిబ్బందికి విఐపిలకు కేటాయించిన గేలరీల్లో కుర్చీలను కేటాయించగా, సామాన్య ప్రజానీకాన్ని మాత్రం ఆర్‌కె బీచ్‌లో ఏర్పాటు చేసిన గేలరీల్లోకి వదిలిపెట్టారు. సాయంత్రం 5.20 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, మూడు గంటల నుంచే సందర్శకులు రావడం మొదలు పెట్టారు. అయితే వేడుకలు జరిగే ఆర్‌కె బీచ్‌కు చేరుకునే అంశంలో ప్రజానీకానికి ఇబ్బందులు తప్పలేదు. బస్సులు, ఆటోల్లో వచ్చే సందర్శకులను కెజిహెచ్ ఓపి గేటు వద్దే నిలిపివేశారు. ఇక్కడ్నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడంతో సందర్శకులు ఎటు పోవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ఇక ద్విచక్ర వాహనాల్లో వచ్చిన సందర్శకులను జిల్లా పరిషత్ వరకూ వదిలిపెట్టారు. మరో వైపు సిరిపురం నుంచి వచ్చే సందర్శకులను ఎపిఐఐసి స్థలంలో పార్కింగ్ కేటాయించారు. ఇక్కడ్నుంచి నడకమార్గంలోనే వేడుకలకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే వాల్తేరు, ఎంవిపి కాలనీల మీదుగా వచ్చే వారి వాహనాలను ఎంజిఎం పార్కు వద్దే నిలువరించారు. బస్సులను సైతం ఇక్కడ వరకూ మాత్రమే అనుమతించారు. దీనికి తోడు నగరంలోని ప్రధాన కూడళ్లలో గంటల కొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర అవస్తలు తప్పలేదు. వేడుకలు పూర్తయినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చింది. విఐపి వాహనాలు వస్తున్నాయంటూ ఎపిఐఐసి గ్రౌండ్స్‌లో పార్క్ చేసిన వాహనాలను బయటకు వదిలిపెట్టలేదు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇక వేడుకలు ముగిసిన తర్వాత ఆర్‌కె బీచ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చేందుకు సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. జగదాంబ జంక్షన్ వరకూ నడిచివచ్చి అక్కడ్నుంచి ఆటోలను ఎక్కి కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఈ నెల 7న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే సిటీ పరేడ్‌కు ముఖ్యులు, అతిధులు, ప్రముఖులు మొత్తంగా సుమారు 2000 మంది వరకూ ఉంటారని భావిస్తున్నారు. వివిఐపిల వాహనా శ్రేణిని వదిలిన తర్వాత, విఐపిల వాహనాలు, ఇతర ప్రముఖుల వాహనాలను వదులు తారు. ఆ రోజు వేడుకలకు అతిధులు, ప్రముఖులు దాదాపు 20 వేల మంది వరకూ హాజరవుతారని భావిస్తున్నారు. వీటికి తోడు దాదాపు 1.5 లక్షల మంది సందర్శకులు వేడుకలను తిలకించేందుకు వస్తారని అంచనా. సన్నాహక కార్యక్రమానికే పోలీసులు ఇంతగా అతిప్రదర్శిస్తే ఇక ప్రముఖులు వచ్చినప్పుడు సామాన్యులకు ఎన్ని ఇబ్బందులో ఊహిస్తేనే గుండె జలధరిస్తోంది. ఈ విషయంలో తాము ప్రముఖుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, సామాన్య ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకునే అవకాశం ఉండదని ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నదున్నట్టు వెల్లడించారు.

చూడముచ్చటగా తొలి సన్నాహక సిటీ పెరేడ్
* పాల్గొన్న 22 దేశాల నౌకాదళాలు
* ఆకట్టుకున్న స్వీడన్ ప్రదర్శన
* విశ్రాంత నౌకాదళ సిబ్బంది అదనపు ఆకర్షణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సన్నాహక కార్యక్రమం ఆర్‌కె బీచ్‌లో బుధవారం చూడముచ్చటగా సాగింది. సుమారు 22దేశాల నుంచి నౌకాదళ ప్రతినిధులు సిటీ పెరేడ్‌లో పాలుపంచుకున్నారు. ఆయా దేశాల జాతీయ జెండాలతో వారి,వారి సాంప్రదాయ పద్ధతుల్లో పెరేడ్‌లో పాల్గొని అలరించారు. భారత నౌకాదళం ప్రధానికి గౌరవ వందనం చేస్తూ పెరేడ్‌ను ముందుండి నడిపించారు. కోస్ట్‌గార్డ్, ఎపి పోలీస్, వాయుసేన, ఎన్‌సిసి, కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు, ఎన్‌సిసి విద్యార్థులు ప్రధానికి గౌరవ వందనం చేస్తూ ముందుకు సాగారు. ఈ ప్రదర్శనలో 1971 యుద్ధంలో పాల్గొన్న మాజీ నౌకాదళ ఉద్యోగులు తమ ప్రదర్శన ఇచ్చారు. 93 సంవత్సరాల వయస్సులో కెప్టెన్ సి రాములు ఈ బృందానికి సారధ్యం వహించారు. అనంతరం ఇతర దేశాలకు చెందిన నౌకాదళ బృందాలు ప్రధాని ఎదురుగా తమ ప్రదర్శన ఇచ్చారు. తొలుత ఆస్ట్రేలియా నౌకాదళం ప్రధాని ఎదుట ప్రదర్శన ఇవ్వగా, బంగ్లాదేష్, చైనా, ఫ్రాన్స్, జపాన్, ఇరాన్, ఇండోనేషియా, మలేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నైజీరియా, ఒమన్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, శ్రీలంక, థాయ్‌లాండ్, సీషెల్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన నౌకాదళ బృందాలు ప్రధానికి గౌరవ వందనం చేస్తూ ముందుకు సాగారు. స్వీడన్‌కు చెందిన నౌకాదళ ప్రతినిధులు వారి సాంప్రదాయాన్ని అనుసరించి సిటీ పెరేడ్‌లో నృత్యంతో సాగారు.

పేలవంగా శకటాల ప్రదర్శన
సిటీ పెరేడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. సుమారు ఏడెనిమిది అంశాలతో సిటీ పెరేడ్‌లో శకటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు రూపమైన ‘మేకిన్ ఇండియా’ అంశాన్ని శకటం రూపంలో ప్రదర్శించారు. ప్రధాని దృష్టిని ఆకర్షించేందుకు మేకిన్ ఇండియా గుర్తును శకటంగా ఏర్పాటు చేశారు. అనంతరం భారత నౌకాదళానికి వెనె్నముక అయిన నౌకా నిర్మాణాన్ని మరో అంశంగా ప్రదర్శించారు. నౌకానిర్మాణంలో పూర్వ వైభవాన్ని సాధిస్తాం అన్న అర్ధం స్పురించేలా శకటాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ అత్యంత ఇష్టపడే స్మార్ట్‌సిటీ అంశాన్ని కూడా శకటం రూపంలో ప్రదర్శించారు. యుఎస్ సహకారంతో దేశంలో మూడు స్మార్ట్‌సిటీల నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 20 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని మోదీ తలపెట్టారు. ఇదే అంశాన్ని సిటీ పెరేడ్‌లో ప్రదర్శించారు. అయితే ప్రధాని అంతటి వ్యక్తి పాల్గొనే సిటీ పెరేడ్‌లో బుధవారం నాటి శకటాల ప్రదర్శన పేలవంగా ఉంటుందని సందర్శకులు భావించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ఇంతకంటే ముచ్చటైన శకటాల ప్రదర్శనలు తిలకించిన ప్రజానీకాన్ని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సిటీ పెరేడ్‌లో చూసిన అంశాలు ఆకట్టుకోలేకపోయాయి.
ఇక సాంస్కృతిక కార్యక్రమాల విషయానికొస్తే ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజేషన్ సారధ్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తేలిపోయాయి. అయితే సిటీ పెరేడ్ చివరగా నౌకాదళ బ్యాండుకు అనుగుణంగా పాఠశాల విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. బ్యాండ్ సంగీతానికి అనుగుణంగా వారు చేసిన నృత్య ప్రదర్శన చూడముచ్చటగా సాగింది.

తీరం వెంబడి పేరుకుపోయిన చెత్త చెదారం
* బీచ్‌లో ఫ్లీటూ రీవ్యూ ప్రారంభమవుతున్న శుభ్రం చేయని పారిశుధ్య సిబ్బంది
* యాటింగ్ రిహార్సల్స్ జరుగుతున్న పట్టించుకొని అధికారులు
సీతంపేట, ఫిబ్రవరి 3: ఇంటర్నేషనల్ ఫ్లీటు రీవ్యూ సందర్భంగా నగరం సుందరగా ముస్తాబయిన అప్పుఘర్ సముద్రతీరం వెంబడి పేరుకుపోయిన చెత్తచెదారం నగర పరిశుభ్రతకు ఓ మచ్చలా కనిపిస్తుంది. అయినా సరే ఐఎఫ్‌ఆర్ నిర్వాహకులకు, జివిఎమ్‌సి సిబ్బందికి చీమ కుట్టునట్టయిన లేకపోవడం గమనార్హం. బుధవారం నుండి ఐదు రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీటు రీవ్యూకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరై ఐఎఫ్‌ఆర్ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తున్న సంగతి విదితమే. ఐఎఫ్‌ఆర్ కార్యాక్రమాలకు సుమారు 50దేశాల నుండి మంత్రులు, అధికారులు, ఆయా దేశాల ప్రతినిధులు హాజరవుతున్న రీత్యా నగర భద్రతతో పాటు నగరాన్ని, సముద్ర తీరాన్ని అధికారులు సుందరంగా తీర్చి దిద్దడానికి గత నెల రోజుల నుండే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద, జాతీయ రహదారి మధ్య మార్గంలో రెడీమేడ్ చెట్లను జివిఎమ్‌సి సిబ్బందితో అధికారులు నాటించారు. ఒక్క రోజులోనే చెట్లు ఇంతగా పెరిగి విశాఖను అందగా మార్చి వేశాయా అని నగర ప్రజలు కూడ ముక్కున వేలేసుకున్నారు.
అయితే ఇంటర్నేషనల్ ఫ్లీటు రీవ్యూ జరిగే తీరం వెంబడి పరిశుభ్రతే, నగర పరిశుభ్రత కన్న ముఖ్యమన్నది తెలిసిందే. ఫ్లీటు రీవ్యూను తిలకించడానికి నిర్వాహకులు తాత్కాలిక కుర్చీలతో ఓ రేడీమేడ్ స్టేడియంను ఏర్పాటు చేసి, దీనికి ఆనుకుని ఉన్న తీరాన్ని మాత్రమే శుభ్రం చేసి మమ అనిపించడం విశేషం. పామ్ బీచ్ తీరం నుండి అప్పుఘర్ తీరం వరకు అధిక సంఖ్యలో చెత్త పేరుకుపోయిన ఇప్పటి వరకు అధికార గణం పట్టించుకోకపోవడం గమనార్హం. తీరం వెంబడి చెత్తచెదారం పేరుకుపోయి ఉన్న చోటనే నేవల్ సిబ్బంది బోట్లతో యాటింగ్ రిహార్సల్స్ చేయడం మరింత దారుణం. చెత్తచెదారం అక్కడి బీచ్‌లో కనిపించిన వెంటనే అధికారులకు తెలియజేసి శుభ్రం చేయించాల్సిన నేవీ సిబ్బంది కూడ చూసి చూడనట్టు ఉండి, యాటింగ్ రిహార్సల్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైన అధికారులు, జివిఎమ్‌సి సిబ్బంది కళ్ళు తెరిచి నగరంలోని తీరం వెంబడి పేరుకుపోయిన చెత్తచెదారం తొలగిస్తే మంచిది. లేకపోతే ఫ్లీటూ రీవ్యూ జరుగుతున్నప్పుడు వీహాంగ వీక్షణం ద్వారా కెమెరాలకు తీరంలోని చెత్తచెదారం కనిపించి, ఓ మచ్చలా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచ దేశాలకు విశాఖ అందాలు కనిపించడం ఖాయం.

ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు
* వీక్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
* వైద్య సేవలకు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధం
* అదనంగా మరో 5 ఎన్‌క్లోజర్లు
* కలెక్టర్ యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: విశాఖలో జరిగే అంతర్జాతీయ నౌక విన్యాసాల ప్రదర్శన (ఐఎఫ్‌ఆర్)వీక్షించేందుకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఐఎఫ్‌ఆర్ వద్ద సీటింగ్ ఏర్పాట్లు, బారికేడింగ్, ఎన్‌క్లోజర్ల ఏర్పాట్లకు సంబంధించి మ్యాప్ సరిదిద్దామని, కొత్త మ్యాప్ ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలన్నారు. బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నౌక విన్యాసాల ప్రదర్శనను వీక్షించేందుకు భారీగా వచ్చే జనాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లీట్ రివ్యూను తిలకించేందుకు వచ్చిన వారి కోసం ఆర్కే బీచ్‌లో సీటింగ్ ఏర్పాట్లు, ఇసుక ప్రాంతంలో ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్ 1 నుంచి 33 వరకు, బి1 నుంచి బి37 వరకు ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో ఆర్ సిరీస్ 5, బి సిరీస్ 5 ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్‌క్లోజర్లను సెక్టార్ల వారీగా విభజించి పోలీస్ అధికారులను, పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఐదు ఎన్‌క్లోజర్లకు ఒక మండల అభివృద్ధి అధికారిని, ఒక్కొ ఎన్‌క్లోజరుకు ఒక పంచాయతీ సెక్రటరీని, పోలీసు బందోబస్తు, వైద్య సిబ్బందిని నియమించామన్నారు. అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎన్‌క్లోజర్లకు చీడికాడ ఎంపిడిఒను, మరో 5 ఎన్‌క్లోజర్లకు ఎపిడిని నియమించినట్టు చెప్పారు. జివిఎంసి ద్వారా ఎన్‌క్లోజరులో తాగునీటి డ్రమ్ము, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశామన్నారు. అంతర్జాతీయ నౌక విన్యాసాల ప్రదర్శన సందర్భంగా కార్పొరేట్ ఆసుపత్రులు, కెజిహెచ్ ఆసుపత్రులు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ కోయ ప్రవీణ్, డిఎంహెచ్‌ఒ సరోజిని, డ్వామా పిడి శ్రీరాములనాయుడు, జెడ్పి సిఇఒ జయప్రకాష్ నారాయణ, బిసి కార్పొరేషన్ ఇడి మహేశ్వరరెడ్డి, ఎంపిడిఒలు, జివిఎంసి అధికారులు, ఆర్టీసీ అధికారులు, వైద్యాధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

స్పెషల్ పోలీసులకు నూతన భవనం
* భవనాన్ని ప్రారంభించిన ఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: నగరంలోని కైలాసగిరిలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసుల కోసం ‘బ్యారక్ ఫర్ కంబైన్డ్ యాక్షన్ పార్టీస్’ భవనాన్ని బుధవారం ఎస్పీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ పార్టీల సిబ్బంది ఉండేందుకు తాత్కలిక నివాస భవనాన్ని నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో నిషిత్ కుమార్, అట్టాడ బాబూజీ, అడిషనల్ ఎస్పీ ఎన్‌జె రాజ్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్ పి.కిషోర్, డిఎస్పీ ఎస్‌విడి ప్రసాద్, డిఎఆర్‌లు వైవి రమణ, ఎవి సుబ్బరాజు, డిఎస్పీలు భూషణంనాయుడు, పి.నాగేశ్వరరావు, ఆర్‌ఐలు ఎం.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అంబేద్కర్ స్మారక ఉద్యాన వనానికి శ్రీకారం
* వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్మారక ఉద్యానవన నిర్మాణానికి వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన ఎయులోని కలెక్టర్ నివాసానికి ఎదురుగా అంబేద్కర్ పార్కును అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తిని అందించే విధంగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. రెక్టార్ నారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సంపదగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యాకేంద్రంగా వర్శిటీని నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సొసైటీ అధ్యక్షుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అంబేద్కర్ అధ్యయన కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రెండు నెలల్లో పార్కును అభివృద్ధి చేస్తామని ప్రొఫెసర్ ఎంవిఆర్ రాజు అన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పార్కును తీర్చిదిద్దుతామన్నారు. ఎయులో ప్రారంభించిన అధ్యయన కేంద్రానికి రూ.1.5 లక్షలు వర్శిటీ తరపున అందించారు. పార్కు అభివృద్ధికి వైస్ ఛాన్సలర్ రూ.10వేలు, ఫార్మసీ ప్రిన్సిపల్ గంగారావు రూ.10వేలు, పిఎస్ అవధాని రూ.10వేలు, గాయత్రిదేవి రూ.10వేలు, అంబ్కేర్ అధ్యయన కేంద్రానికి న్యాయకళాశాల ప్రిన్సిపల్ ఎ.సుబ్రహ్మణ్యం రూ.10వేలు విరాళంగా ప్రకటించారు. పార్కు అభివృద్ధికి ఎయు పూర్వ విద్యార్థి డి.సువర్ణరాజు రూ.25వేలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎన్‌ఎడి పాల్, డైరెక్టర్ ఎల్‌డి సుధాకర్‌బాబు, డాక్టర్ హరనాద్, కె.రజనీ, అబ్బులు, హరిప్రకాష్, ప్రేమానందం, డీన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జగన్ ఓ సైకో
* వంగవీటి కేసులో తాను నిర్ధోషిని
* పరువునష్టం దావా వేస్తాం
* తన నియోజకవర్గంలో నిలబడి గెలవాలి : ఎమ్మెల్యే వెలగపూడి
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఓ సైకో అని, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఎంవిపి కాలనీ టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షలతో తన పేరు వంగవీటి రంగా హత్య కేసులో చేర్చారని, అభియోగం వేరు, నిరూపణ వేరుగా పేర్కొన్నారు. 188లో కేసు అయితే 2002లోనే రంగారెడ్డి జిల్లా కోర్టులో తనను నిర్ధోషిగా తేలుస్తూ కేసు కొట్టివేసిందన్నారు. అయినా ఇంకా ముద్దాయినీ అనడంలో అర్ధంలేదన్నారు. 50 ఏళ్ళ తన జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే తెలుసునన్నారు. దేశ చరిత్రలోనే సుమారు లక్ష కోట్ల కుంభకోణంలో సూత్రధారి విజయసాయిరెడ్డి అయితే, జగన్ పాత్రదారి కాదా అంటూ ప్రశ్నించారు. బోగస్ కంపెనీల పేర్లతో వేలాది కోట్లు దిగమించిన జగన్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 11 సిబిఐ చార్జిషీట్లు, రెండు ఎన్‌ఫోర్స్‌మెంటు చార్జీషీట్లలో జగన్ ప్రధాన ముద్దాయి కాగా, అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలున్నాయన్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని హెటిరో, అరబిందో, రామ్‌కీ, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రఘురాం సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ హమ్ వంటి వాటికి అక్రమ మార్గాల్లో రాయితీలు, ప్రభుత్వ స్థలాలు మంజూరు చేయించి పెట్టుబడులు పెట్టిన మాట నిజం కాదా అంటూ ప్రశ్నించారు. మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలు అవినీతి చట్రంలో చిక్కుకోవడానికి జగనే కారణమన్నారు. తన నియోజకవర్గంలో నిలబడి ప్రజల నుంచి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. నాటి కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని, న్యాయస్థానాలు నిరూపించినా దానినే పదేసార్లు ఎత్తిచూపడం వెనుక అంతర్యమేమిటో దమ్ముంటే ఆధారాలతో బయటపెట్టాలన్నారు. నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రతిపక్ష నేతగా మాట్లాడాల్సిన తీరులో కాకుండా పదేసార్లు ఆరోపణలు ఏమాత్రం తగవన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ చోడె వెంకటపట్టణాభిరామ్, పార్టీ కార్యనిర్వాహాక కార్యదర్శి బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ళ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బిసిల జనాభా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచాలి
* ఏపీ విద్యుత్ బిసి ఉద్యోగుల సంఘ రాష్ట్ర నేత పోలాకి
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: రాజ్యాంగ సవరణ ద్వారా బిసిల జనాభా దామషా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచిన తరువాతనే బిసి జాబితాలో ఇతర కులాలను చేర్చాలని ఏపీ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సంఘ ప్రతినిధులతో బుధవారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి కమీషన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కును కల్పించాలని, బిసి జనగణనను వెంటనే కేంద్రం విడుదల చేయాలని కోరారు. అలాగే ఒబిసి/ బిసి రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, బిసి కార్యాలయ ప్రతినిధులు, సభ్యులను వేధించే విదానాన్ని విడనాడాలని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు బిసిలపై బనాయించకూడదన్నారు. బిసి ఉద్యోగులకు ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులతో సమానంగా దామాషా (ఏబిసిడి) ప్రకారం పదోన్నతులు ఇవ్వాలన్నారు. వర్క్‌లోడ్ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని, రాష్ట్ర రాజధానిలో విద్యుత్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యాలయానికి, నాలుగు కంపెనీల కార్యాలయాలకు 500 చదరపు గజాల వంతున స్థలాన్ని కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సిఎండి, డైరెక్టర్ల నియామకాల్లో 50 శాతం పోస్టులు బిసిలకు రిజర్వు చేయాలని, ప్రాధాన్యత గల ఉద్యోగాల్లో 50 శాతం పోస్టులు బిసిలకు రిజర్వు చేయాలన్నారు. వీటితోపాటు కంపెనీల ఆర్ధిక నష్టాలను ప్రభుత్వమే భరించాలని, పూలేకు భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు ఎస్.రామకృష్ణ, బివి రామారావు తదితరులు పాల్గొన్నారు.

అందాల నగరానికి ఆనవాళ్ళు ఆ రహదారులు
* ఎల్‌ఇడి లైట్లతో దేదీప్యంగా వెలిగిపోతున్న విశాఖ
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: గతుకుల రోడ్లు, వీధిదీపాలు లేని రహదారులు వీధిపాలున్నా, వెలగని పరిస్థితులపైన తీవ్రంగా స్పందించిన జివిఎంసి కమీషనర్ ప్రవీణ్‌కుమార్ వాటన్నింటినీ పరిశీలించారు. తక్షణమే చర్యలు తీసుకున్నారు. స్మార్ట్ సాధనకు రోడ్లు, వీధిదీపాలు అవసరమైన వౌలిక సాధనాలుగా గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో దృష్టిసారించారు. ఒక్కొక్క రహదారిని బిటి చేస్తూ, వీధుల్లో జాతీయ రహదారిలో ఒక్కో ప్రాంతానికి విద్యుత్ స్తంభాలు, ఎల్‌ఇడి లైట్లు అమర్చేవిధంగా చర్యలు తీసుకున్నారు. ఇఇయస్‌ఎల్ సంస్థతో కుదుర్చుక్ను ఒప్పందంతో నగరమంతటా ఎల్‌ఇడి లైట్లను అమర్చడం ద్వారా చీకట్లను తొలగించడానికి, విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకోవడానికి శ్రీకారంచుట్టారు. జివిఎంసి పరిధిలో ఏకంగా 97వేల ఎల్‌ఇడి లైట్లను అమర్చి చీకట్లను తొలగించారు. అందుకుగాను జాతీయ స్థాయిలో ప్రథమ,ద్వితీయ స్థానం పొంది కేంద్ర విద్యుత్‌శాఖామంత్రి పీయాష్ గోయల్ చేతులమీదుగా న్యూఢిల్లీలో అవార్డులందుకున్నారు. వాటికి తోడుగా నాలుగు మాసాల కిందట ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి విశాఖ ఎంపికైనందున మొత్తం నగర సుందరీకరణ, విద్యత్ వెలుగులు, రహదారి వనాలు, గ్రీన్ బెల్ట్, పుట్‌పాత్‌లు, రహదారులకు బిటి రోడ్లు, రోడ్ మార్జిన్లు, బెర్మలకు, డివైడర్లకు పెయింటింగ్, రహదారులకిరువైపుల బ్లొంకింగ్ స్టడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేశారు. ఇందుకోసం రూ.90 కోట్ల వరకు వ్యయం చేశారు. నగర సుందరీకరణతో విశాఖ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందనడంలో సందేహం లేదు. ఫుట్‌పాత్‌లను ఆనుకుని ఖఆళీ స్థలాల్లో విచ్చలవిడిగా బహిరంగ మలమూత్ర విసర్జనకు ఆలవాలమైన ప్రదేశాలను అందమైన వనాలుగా తీర్చిదిద్దారు. ఇపుడక్కడ ఏ ఒక్కరూ బహిరంగమలమూత్ర విసర్జన చేయడంలేదు. చేయడానికి అవకాశంలేదు. ఇక రహదారుల మాటకొస్తే అన్ని రహదారులను బిటి చేసి అందంగా మార్కెంగ్ చేయడతం, అవసరమైనచోట సైనేజీ ఏర్పాటుతో ఇవి విశాఖనగర రోడ్లేనా అంటూ నగరవాసులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. రైల్వేస్టేషన్, ఫ్లైఓవర్, తాటిచెట్లపాలెదం, రైల్వే కల్యాణమండపం రోడ్లను ఉదాహరణగా చెప్పవచ్చు. చావులమదుం, కానె్వంట్ జంక్షన్ ఇదే తరహాలో సుందరీకరణగా మారాయి.

ఏయు స్థలాన్ని సింగ్‌పూర్ ప్రైవేటు సంస్థలకు కేటాయించొద్దు
* ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్న ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థలాన్ని సింగ్‌పూర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థ పేరు మీద గోవింద్ హోలిడింగ్స్ అనే సంస్థకు వెయ్యి చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలనే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ యూనివర్సిటీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండగి ప్రభుత్వ భూములు, విద్యాసంస్థల భూములు తన ఇష్టానుసారంగా ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోందన్నారు. దీనిలోభాగంగా విశాఖలో లక్ష ఎకరాలు భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టిడిపి ప్రభుత్వం సింగ్‌పూర్, జపాన్, మలేషియా వంటి దేశాలకు ఆంధ్ర రాష్ట్రంలోని భూములను దారాదత్తం చేస్తుందన్నారు. ఏయు ఇప్పటి వరకు అనేక సంస్థలతో ఎంఓయులు, ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ఎపుడు ఏయు స్థలాలను ప్రైవదేటు సంస్థలకు ఇచ్చిన సందర్భాల్లేవన్నారు. ఇపుడు దానికి భిన్నంగా ఒక ప్రైవేటు డిప్లమో కోర్సు కోసం వెయ్యి చదరపు మీటర్ల స్థలాన్ని ఏయులో కేటాయించడం దుర్మార్గమన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్ధి, ఉద్యోగ, అధ్యాపక సంఘాలన్నింటితో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా
* నగర సుందీకరణకు పోర్టు కృషి
విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో విశాఖపోర్టుట్రస్టు కృషి చేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి విశాఖ పోర్టు ఆవిరళంగా కృషి చేస్తోంది. స్మార్ట్‌సిటీగా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటోన్న నగరాన్ని దాదాపు 33 కోట్ల వ్యయంతో ఆధునీకరించింది. షీలానగర్ నుంచి కానె్వంట్ జంక్షన్ వరకు, ఇండస్ట్రీయల్ బైపాస్‌రోడ్డు, వై జంక్షన్, సీహార్స్ జంక్షన్ రోడ్లను పునర్ నిర్మించింది. కాంతులీనే ఎల్‌ఇడి బల్బులను అమర్చి నూతన శోభను తీసుకువచ్చింది. రోడ్ల మధ్య డివైడర్స్ ప్రాంతంలో అందమైన పూలమొక్కలను పెంచుతోంది. ప్రమాదాలకతీతంగా నగరాన్ని మార్చేందుకు రోడ్లకిరువైపులా చిన్న గోడల్ని నిర్మిస్తోంది. నాలుగు రోడ్లమధ్య ఉండే ఐలాండ్స్‌లో విభిన్న రకాల పూలమొక్కలను పెంచుతూ సందర్శకుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. పచ్చికబయళ్ళు, ప్రకృతి సహజసిద్ధ అందాలతో నగరాన్ని నింపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇప్పటికే రోడ్లకిరువైపులా 35 వేల మొక్కలను, నగర శోభను ద్వగుణీకృతం చేసే 61వేల రంగురంగుల మొక్కలను, 20వేల చదరపు మీటర్లలాన్‌గ్రాస్ ప్లేట్లను నగరమంతా ఏర్పాటు చేసింది.
నాలుగు కోట్లతో వ్యయంతోపోర్టు పాసింజర్ జెట్టీని అత్యంత అధునికంగా తీర్చిదిద్దింది. దీనిని క్రూయిజ్ టూరిజం జెట్టీగా అభివృద్ధి చేసే ప్రణాళిక అమలవుతోంది. ఎతె్తైన రెయిలింగ్స్, గ్రిల్స్ ఏర్పాటు చేసి, వ్యూపాయింట్ నిర్మించి వీక్షకులకు కనువిందు చేయనుంది. 14 కోట్లు వెచ్చించి (బీచ్ నరిష్‌మెంట్) డ్రెడ్జర్ సాయంతో బీచ్‌లో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఇసుక తినె్నల నిర్మాణం చేపట్టింది. దీనివల్ల సమీప భవిష్యత్‌లో జాతీయ అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా విశాఖ విలసిల్లనుంది.

బాక్సైట్ తవ్వకాల కోసమే పోలీస్ క్యాంప్‌లు
* మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ
సీలేరు, ఫిబ్రవరి 3: బాక్సైట్ ఖనిజం తవ్వడం కోసమే చింతపల్లి మండలం బలపం పంచాయతీ రాళ్ళగెడ్డ కొత్తూరులో పోలీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. బుధవారం ప్రకటనను విడుదల చేసారు. ఒక వైపు బాక్సైట్ తవ్వకాలకు జారీ చేసిన జి. ఓ. నెంబర్ 97ను రద్దు చేసామని చెబుతూనే మరో పక్క ఈ జి. ఓ.ను పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలను వేగవంతం చేయడానికి వందకు పైగా బి. ఎస్. ఎఫ్. క్యాంప్‌లను, వందకు పైగా సెల్ టవర్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. గ్రామాలపై వందల మంది పోలీసు బలగాలను తీసుకువచ్చి ఆడామగా , పిల్లలు అనే తేడా లేకుండా ఆదివాసీలను నిర్ధాక్షిణ్యంగా హింసించి ఇళ్ళలోని సామగ్రిని ధ్వంసం చేసి బంగారం, డబ్బు దోచుకుపోయారన్నారు. జెర్రెల పంచాయతీకి చెందిన 16 మంది ఆదివాసీలను నిర్ధాక్షిణ్యంగా నిర్భంధించారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయిన జిల్లా ఎస్పీ, ఎస్.బి.హెచ్. వెంకట్రావులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. కార్పొరేట్ కంపెనీలను కాపాడేందుకు నడుంబిగించిన వీరిద్దరూ అమాయక ఆదివాసీలపై దాడులు చేస్తూ ఆదివాసీ ప్రజానీకానికి ద్రోహులుగా మారారన్నారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు . రాళ్ళగెడ్డ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న పోలీస్ క్యాంప్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజల మాటను కాదని పోలీసులు మొండిగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టులు ధ్వజమెత్తారు. టి.డి.పి, బిజెపి ప్రభుత్వాలు గిరిజనుల మనోభావాలు గౌరవించకుండా బాక్సైట్ తవ్వకాలకు మొగ్గు చూపుతూ ప్రజలను నిర్వాసితులను చేయడం తగదని ఇది దేశద్రోహం కింద వస్తుందన్నారు. మన్యంలో పోలీసుదాడులకు పై రెండు పార్టీల నాయకులే బాధ్యత వహించాలన్నారు. టిడిపి, బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని తూర్పుడివిజన్ కమిటీ పిలుపునిచ్చింది.

కారు బోల్తా ఒకరు మృతి, ఇరువురికి గాయాలు
పాడే