విశాఖ

ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న ఆధునిక హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 14: ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే పిల్లలకు విద్య సక్రమంగా అబ్బదని పాఠ్యాంశాల బోధన సక్రమంగా ఉండదనే భావం బడుగు బలహీనవర్గాల్లో సైతం బాగా పెరిగిపోయింది. దీంతో నిరుపేదలు సైతం ఆర్థిక భారం అనుకూలించకపోయినా ఏదో బాధలు పడి ప్రైవేట్ స్కూల్స్‌లోనే తమ పిల్లలను చదివించేందుకు ఆసక్తి కనబరిచేవారు. దీంతో దాదాపుగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా విద్యార్థుల సంఖ్య నానాటికీ బాగా తగ్గుతూ వచ్చింది. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ స్కూల్స్‌లో సైతం అధునాతన హంగులు, బోధనా విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఐఐటి కోర్సుల బోధన, ఆంగ్లంలో బోధన తదితర ఎన్నో నూతన విధానాలను గడచిన రెండేళ్ల కాలంగా ప్రభుత్వం దశలవారీగా ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తూ వస్తోంది. ఇందుకు మంచి సానుకూల ఫలితాలనే ప్రభుత్వ స్కూళ్లు సాధించగలిగాయి. ఇటీవలె విడుదలైన పబ్లిక్ పరీక్షల్లో సైతం జిల్లాస్థాయిలో ఉత్తీర్ణత సైతం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రభుత్వ స్కూల్స్‌పై తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రవేశాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థులు లేక డీలా పడిపోయిన పలు హైస్కూళ్లు సైతం పెరుగుతున్న విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఆంగ్లంలో విద్యాబోధన, ఐఐటి కోర్సులపై ప్రత్యేక బోధన ఫలితంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సంబంధిత బోధన పొందిన విద్యార్థులు 9 పాయింట్లకు పైగా ఫలితాలను సాధించారని గాంధీనగరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దువ్వూరి శ్రీనివాసరావు తెలిపారు. పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో కూడా పెరగడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
జిల్లా వ్యాప్తంగా 120 స్కూళ్లల్లో ఈ-టీచింగ్ బోధన ఈ విద్యాసంవత్సరం నుండి పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. రిలయన్స్ జియో ఆర్థిక సహకారంతో జిల్లాలో ఎంపిక చేయబడిన 120 స్కూళ్లలో 6 నుండి 8 వరకు అన్ని సబ్జెక్టులలోను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యేకమైన శిక్షణనిస్తున్నారు. ఈ విధంగా అనకాపల్లిలోని ఐదు హైస్కూళ్లతోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఈ-టీచింగ్ బోధన ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా బోధనా విధానం విద్యార్థులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది నుండి నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సిసిఇ) బోధనా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20మార్కులు సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు చేతుల్లోనే ఉంటాయి. మిగిలిన 80 మార్కులకు మాత్రమే పరీక్ష జరుగుతుంది. 8, 9 తరగతులకు సైతం అర్ధాంతర, త్రైమాసిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 20మార్కులకు సంబంధిత విద్యార్థి సృజనాత్మకతను బట్టీ మార్కులను వేస్తారు. విద్యార్థుల్లో క్రియేటివిటీ పెంచేందుకు ఈ బోధన ఎంతో ఉపయోపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇంతవరకు హిందీ సబ్జెక్టులో అర్హత సాధించేందుకు వందకు 20 మార్కులుంటే సరిపోయేది. కానీ ఈ విద్యాసంవత్సరం నుండి మిగతా సబ్జెక్టుల మాదిరిగానే హిందీకి కూడా 35మార్కులను కనీస మార్కులుగా నిర్ధారించారు.
జీవిఎంసి పరిధిలోని మున్సిపల్ హైస్కూళ్లలో ఐఐటి కోర్సులపై ప్రత్యేక బోధనా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్కూల్ సమయం ప్రారంభానికి గంట ముందు, స్కూల్ ముగిసాక మరో గంట అదనంగా ఐఐటి కోర్సులపై బోధన విధిగా సాగించాలి. ఆ విధంగా బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయులకు గంటకు 250 రూపాయల మొత్తాన్ని అదనంగా వేతనంగా చెల్లిస్తున్నారు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రంతోపాటు లాంగ్వేజ్‌లను కూడా ఈ ఐఐటి కోర్సుల బోధనలో చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఐటి కోర్సులను బోదించడం వలన ఆ విధంగా బోధన పొందిన విద్యార్థులు టెన్త్‌లో పదికి పది గ్రేడ్ పాయింట్‌లు సాధించారు.
అదే విధంగా డ్రిడ్జింగ్ కార్పొరేషన్ సౌజన్యంతో తొలి విడతగా జిల్లాలోని మూడు హైస్కూళ్లలో బాలికల కోసం ప్రత్యేకంగా బయోటాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేసారు. గాంధీనగరం హైస్కూల్‌తోపాటు యలమంచిలి బాలికల హైస్కూల్, ఆరిపాక జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో పది యూనిట్లు కలిగిన బయో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేసారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అధునాతన హంగులు, బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటంతో తిరిగి ఈ స్కూళ్లలో తమ పిల్లలను చదివించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిని కనబరుస్తున్నారు.