విశాఖపట్నం

పడిలేచిన కెరటం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రమ్యా! ప్లీజ్ ఏడవకు. నీకేం కాదు. త్వరగా కోలుకుని మళ్లీ మామూలు అవుతావు. నేనున్నానుగా’’ అంటూ బెడ్ మీదున్న తన భార్యకి ధైర్యం చెబుతూ ఓదారుస్తున్నాడు రమ్య భర్త విశాల్.
‘‘నావల్ల నీకెంత ఇబ్బందో చూడు విశాల్. పెళ్లయి పట్టుమని ఏడాదన్నా కాలేదు. నేనింత అందవికారంగా అయిపోయాను. నన్ను మీవాళ్లు రానిస్తారా? నీతో నేనెలా బయటికొస్తాను? అందరూ నా ముఖం చూసి అసహ్యించుకుంటారు. నేనేం పాపం చేశానని నాకీ ఘోరశిక్ష? నాకీ బతుకెందుకు?’’ అంటూ ఏడుస్తోంది రమ్య.
‘‘ఎంతన్నా ఖర్చు చేసి నీకు నేను ట్రీట్‌మెంట్ చేయిస్తాను. నా మునుపటి రమ్యలా మార్చుకుంటాను సరేనా ప్లీజ్. ముందు నువ్వు విశ్రాంతిగా నిద్రపో. నినె్నవరూ అసహ్యించుకోరు’’ అంటూ బుజ్జగించాడు విశాల్.
రమ్యకి నిద్ర పట్టేసింది.
భార్య మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని సమయానికి మందులు వేస్తూ, అప్రమత్తంగా చూసుకుంటున్నాడు విశాల్. నిద్రపోతున్న భార్య వంక పరీక్షగా చూసిన విశాల్‌కి గుండెల్లో నుండి దు:ఖం పొంగుకొచ్చింది. ‘ఎంత చక్కటి భార్య ఇలా అయిపోయింది. ఇంటర్వ్యూకి రైల్లో చెన్నై వెళుతుండగా ఆ స్కౌండ్రల్‌ని ప్రేమించలేదన్న పాపానికి ఇంత ఘోరానికి ఒడిగడతాడా? ముఖం మీద యాసిడ్ పోస్తాడా? ఆ పశువు కారణంగా తన భార్య అన్యాయంగా బలైపోయింది. వాడిని బతకనివ్వకూడదు. ఎలాగైనా వాడిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను’ అనుకున్నాడు విశాల్. రమ్య హాస్పటల్ నుండి డిశ్చార్జి అయింది కానీ చాలా కాలం అందరి ముందుకు వచ్చేది కాదు. ఏదో తెలియని న్యూనతాభావంతో కుంగిపోసాగింది.
* * *
ఒకరోజు టివిలో లోకల్ ఛానల్ చూస్తున్నాడు విశాల్.
‘సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న శ్రీమతి రమ్యగారితో ముఖాముఖి’ అంటూ ప్రసారం చేస్తున్నారు. యాంకర్ ఇంటర్వ్యూ చేస్తోంది.
‘‘రమ్యగారూ! అన్నదానం గురించి విన్నాం. విద్యాదానం, అవయవదానం, రక్తదానం ఇలా అన్ని రకాల దానాల గురించి విన్నాం గానీ మీరు చేస్తున్న ఈ చర్మదానం గురించి, చర్మసేకరణ గురించి ఎక్కడా వినలేదు. వినడానికే విచిత్రంగా ఉంది. అలాగే మీ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అసలు మీకీ ఆలోచన ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించింది.
‘‘నా చదువు పూర్తయ్యాక వెంటనే నాకు వివాహం అయింది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి చెన్నై వెళదామని రైలెక్కాను. బెర్త్ మీద పడుకున్న నాకు సగం రాత్రి వేళ ముఖం అంతా మంటగా అనిపించి మెలకువ వచ్చింది. ఆర్తనాదం చేశాను. ప్రేమించలేదన్న నేరానికి ఒకడు రహస్యంగా నన్ను ఫాలో అయి నా ముఖం మీద యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడికి గురైన నేను నా భర్త సహకారంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తిరిగి మామూలు మనిషిని అయ్యాను. ఆ సంఘటనే నన్నీ పనికి ప్రోత్సహించింది. నాలాగా యాసిడ్ దాడికి గురైన వాళ్లు, అగ్నిప్రమాదాలకు గురై, ముఖం కాలిపోయిన వాళ్లను గుర్తించి వారికి సర్జరీ అవసరమైన చర్మాన్ని దాతల నుండి సేకరించి వారికందిస్తున్నాను. ఎంతో మంది యువతులు ఇలాంటి ప్రమాదాలకు, అన్యాయాలకు గురై అందవిహీనంగా మారిపోతున్నారు. దాంతో వారు ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతున్నారు. అటువంటి వారికి చేయూత ఇచ్చేందుకే నా ప్రయత్నం’’ అంటూ ముగించింది రమ్య.
‘పడిలేచిన కెరటం నా స్వీట్ రమ్య’ టివి చూస్తున్న విశాల్ ఆనందంగా అనుకున్నాడు.

- శ్రీమతి కొంకేపూడి అనూరాధ, విజయనగరం. సెల్ : 9618425243.