విశాఖపట్నం

దేశ ద్రోహులకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: దేశ ద్రోహులకు మద్దతిస్తున్న కాంగ్రెస్, వామపక్షాల తీరుకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆక్రోశ యాత్రను నిర్వహించారు. నగర బిజెపి అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్, వామపక్షాల శవ యాత్రను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ యాత్రలో పాల్గొని కాంగ్రెస్, వామపక్షాల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడిన వారికి కాంగ్రెస్, వామపక్షాలు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నాగంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారాయని దుయ్యబట్టారు. భారతదేశ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. భారత మాతను గౌరవించని వారిని వెనకేసుకొస్తూ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం పటిష్టంగా ముందుకు సాగుతోందని, దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఈ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. అరాచక శక్తులతో చేతులు కలిపి, దేశ విచ్ఛితికి కాంగ్రెస్, వామపక్షాలు తోడ్పాటునివ్వడం దారుణమన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు భగం వాటిల్లే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను బిజెపి తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి నిరోధకులకు మద్దతునివ్వడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు బిజెపి వెనుకంజవేయబోదని, దీనిలో భాగంగానే పార్టీ ఆదేశాల మేరకు ఆక్రోశ యాత్రలు చేస్తున్నట్టు వెల్లడించారు.
జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి శవయాత్ర బయలుదేరినప్పుడు బిజెపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఊరేగింపుగా ఆశీల్‌మెట్ట ఫ్లై ఓవర్ వద్ద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు సుబ్బరామిరెడ్డి, జె పృధ్వీరాజ్, ఎస్‌విఎస్ ప్రకాశరెడ్డి, నరేంద్ర ప్రకాష్, నగర పదాధికారులు, మహిళ, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

పూలసాగుపై రైతుల మొగ్గు
* సిరులు కురిపిస్తున్న పూలు
ఆనందపురం, మార్చి 25: పూలసాగు యాజమాన్య పద్ధతులు మిగిలిన పంటల కంటే బహు తేలికగా ఉండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ వేసవి ఆనందపురం మండల పూల రైతులకు కాసులు కురిపించనుంది. ప్రస్తుతం పెళ్లి ముహూర్తలు, శుభకార్యాలు ఉండటంతో పూల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రైతులు ఆనందపరవశులవుతున్నారు. మండలంలోని పాలవలస, బంటుమిల్లి, గుడిలోవ, పొడుగుపాలెం, పెద్దిపాలెం, గోట్టితెల్లి చందక, వేల్తేరు, దుక్కవానిపాలెం తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో పూలసాగు చేస్తున్నారు. మల్లె, కనకాంబరం, జాజులు, కాగడాలు, బంతి, గులాబిలతోపాటు చేమంతి రకాలకు ఇక్కడ విస్తారంగా సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రైతులకు వేములవలస పూలమార్కెట్ అందుబాటులో ఉండటం వల్ల విక్రయాలకు సులువుగా ఉంది. జనవరి నుంచి జూలై వరకు మల్లెలు ఈ ప్రాంతంలో విస్తారంగా పూస్తాయి. ప్రస్తుతం కిలో రూ.600 ధర పలుకుతుంది. ఇక ఏడాది పొడవునా విరబూసే కనకాంబరాలు, మల్లెలతోపోటీపడి రూ. 400 నుంచి రూ.600 వరకు బంతిపూలను తట్టుకొని కాగడాలు సైతం రైతుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాయి. ఏది ఏమైనా పూలసాగుతొ రైతులు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారని చెప్పవచ్చు.

భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే జరపాలి
* ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 25: ఆంధ్ర రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి భూములను రీ సర్వే జరపాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వీడియో కానె్ఫరెన్స్‌హాలులో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుభవం ఆధారంగా గ్రామాల్లో భూములు రీ సర్వే చేయించాలన్నారు. అపుడే సబ్‌డివిజన్లు అనే దానిలో స్పష్టత ఉంటుందన్నారు. చట్టాలనేవి తాము తయారు చేయమని, ప్రభుత్వం చేసిన వాటినే తాము అమలు చేస్తుంటామన్నారు. 60 రోజుల్లో ఎన్‌ఓసి ఇవ్వాలని ప్రభుత్వమే చెబుతోందని, అయ్తి దీని మంజూరులో చిన్నచిన్న తప్పిదాలను భూతద్దంలో చూపుతుండటం సరైందికాదన్నారు. ఈ పనిని మునిసిపాలిటీలకు అప్పగిస్తే సరిపోతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులను కించపర్చడం సర్కార్‌కే మచ్చగా పేర్కొన్నారు. భూముల పాస్‌పుస్తకాలు బుట్టదాఖలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అలాంటపుడు తప్పులు వెలికి తీయాల్సి ఉందన్నారు. అలా కాకుండా ఎక్కడో ఒకచోట జరిగిన తప్పుగా రెవెన్యూ వ్యవస్థపైనే నింద వేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ ఉద్యోగుల అసలు విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఎన్‌ఆర్‌జిఎస్ పనులు, పించన్ల పంపిణీ, విత్తనాల పంపిణీ వంటి వాటిని ప్రభుత్వం అప్పగిస్తోందన్నారు. దీనివల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు అందించలేని పరిస్థితులుంటున్నాయన్నారు. 95శాతం మంది రైతులు తమ భూమి వివరాలను, సేవలను నేరుగా పొందేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం అభినందించిదగినదిగా పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి రెవెన్యూపై పెట్టిన విశ్వాసం, సంస్కరణలను విజయవంతంగా పూర్తి చేస్తున్న శాఖ అంటూ ఉందంటే అది ఒక్క రెవెన్యూ మాత్రమేనన్నారు. సాధారణ బదిలీలు ఈసారి కౌనె్సలింగ్ ద్వారా 20శాతానికి లోబడి నిర్వహించాలని, 50 ఏళ్ళు నిండిని రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు ఏజేన్సీ ప్రాంతాలకు జరగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఆర్‌టిఐ కమిషనర్లు పరిమితులు దాటి రాజ్యాంగ పదవులతో స్వైరవిహారం చేస్తున్నారన్నారు. పనుల వత్తిడి కారణంగా డిప్యూటీ తహశీల్దార్లనే పిఐఓలుగా పెడుతున్నామన్నారు. భవిష్యత్‌లో సమస్యలు వస్తే కమిషనర్ల విధులు, పర్యటనలు బహిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జె.రామారావు, ప్రధాన కార్యదర్శి బిఎస్ ప్రకాష్‌రావు, రాష్ట్ర నాయకులు పేడాడ జనార్ధనరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు సత్తి నాగేశ్వరరావురెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సంఘ ప్రతినిధులు పి.వేణుగోపాలరావు, టి.గోవింద్, అంజి ప్రసాద్, జి.శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి అవార్డు కోసం పరిశీలనకు కేంద్రం బృందం రాక
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండి కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ విద్యాలయ, భూసార పరీక్ష కార్డుల అంశంలో ఇచ్చే ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డులపై జిల్లా పరిస్థితులను చిత్రీకరించేందుకు కేంద్రం ఒకటి శుక్రవారం పర్యటించింది. కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సమావేశాలకు సంబంధించి వీడియో చిత్రీకరణ చేశారు. భూసార పరీక్ష కార్డుల్లో జాతీయ స్థాయిలో తుది పరిశీలనకు విశాఖ జిల్లాతోపాటు గుజరాత్‌లోని నర్మద జిల్లా మిగిలాయన్నారు. అందువల్ల ఇక్కడ చిత్రీకరణకు బృందం వచ్చిందన్నారు. స్వచ్ఛ విద్యాలయంలో విశాఖ జిల్లాతోపాటు కర్ణాటకలోని అనంతనాగ్ జిల్లా తుది పరిశీలనకు ఎంపికయ్యాయన్నారు. వచ్చేనెల మొదటి వారంలో అవార్డుగ్రహీతలను ఎంపిక చేసి వెల్లడిస్తారన్నారు. అలాగే వచ్చేనెల 21వ తేదీన వాటిని ప్రదానం చేస్తారని కలక్టెర్ చెప్పారు. జిల్లా ఈ రెండింటిలో ఒక అంశంలోనైనా అవార్డు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ విద్యాలయ అంశంలో పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ విషయమై విశాఖ జిల్లా నుండి చేసిన వినూత్న ఆలోచనలను గుర్తించే అవకాశం ఉందన్నారు. జిల్లాస్థాయిలో పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ఒక సొసైటీని ఏర్పాటు చేసి, ప్రజల నుండి వాటి నిర్వహణకు ఒక పన్ను వసూలు చేయాలని, విద్య లభించిన ఆదాయాన్ని మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించుకుని సూచించామన్నారు. దీంతోపాటు మరుగుదొడ్ల నిర్వహణ ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు కేటాయించాలని సూచించినట్టు చెప్పారు. భూసార కార్డుల విషయంలో దీనిని సుస్థిరపరిచేందుకు కొన్ని సూచనలు చేశామన్నారు.
విశాఖ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం
* ఆయా రంగాల నిపుణులతో 15 సబ్ కమిటీలు
* రెండంకెల వృద్ధి రేటు సాధనే లక్ష్యం
* కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 25: విశాఖ నగరం, జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించడం, ప్రభుత్వం చేసే అభివృద్ధి ప్రయత్నాలతో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలను, సంబంధిత వర్గాల వారిని ఆయా రంగాల అభివృద్ధిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో 15 సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. దీంతోపాటు జిల్లా, నగరానికి చెందిన సీనియర్ అధికారులతో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నగరం, జిల్లాఅభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించి, ఆయా రంగాల్లో జిల్లా ఏ తీరిన అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలనే అంశంపై ఆయా కమిటీలు ఈ నెల 31వ తేదీలోపు నివేదికలు అందజేయాలన్నారు. రెండంకెల అభివృద్ధి వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధి కోసం ఏర్పాటైన సబ్ కమిటీలు సభ్యులు, అభివృద్ధి భాగస్వామ్యంతో కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వ భూములు తదితర వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని అవకాశంగా చేసుకుని జిల్లా అభివృద్ధికి సరైన వాతావరణాన్ని, పరిస్థితులను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో వౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు పెద్దఎత్తున చేపడుతున్నామని ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి అభివృద్ధికి సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతుందన్నారు. సాగరమాల ప్రాజెక్టు కూడా వస్తోందన్నారు. జిల్లాలో పారిశ్రామిక, నగర అవసరాలకు అవసరమైన నీటిని గోదావరి నుండి నేరుగా పైప్‌లైన్ వేసి నగరానికి అందించే ప్రతిపాదన ఉందన్నారు. పోలవరం ఎడమకాలువ ద్వారా వచ్చే నీటిని నిల్వచేసేందుకు తగిన సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదించామన్నారు. వివిధ రంగాల కోసం జిల్లా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలను ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సమన్వయం చేస్తారన్నారు. పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, పర్యాటకం, వ్యవసాయ అనుబంధరంగాలు, స్థిరాస్థి రంగం, స్మార్ట్ సిటీగా అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, పర్యావరణం, అటవీ, వన్యప్రాణి సంరక్షణ, వారసత్వ సంపద పరిరక్షణ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రణాళికల రూపకల్పన, గణాంకాల సేకరణ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి, శాంతిభద్రతలు, పౌరుల రక్షణ, తదితర అంశాలపై ఈ కమిటీలు ఏర్పాటైనట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ ఫిబ్రవరి 18న నగరాన్ని సందర్శించినపుడు ఈ కమిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారని ఏప్రిల్ మొదటి వారంలో నగరానికి వచ్చేటపుడు ఈ అంశంలో పురోగతిని సమిక్షిస్తారన్నారు. కమిటీల సభ్యులు ఆయా రంగాల్లో జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు. జిల్లా అధికారులతో కూడిన కోర్‌గ్రూప్ కూడా సమావేశమై నివేదిక ఇస్తుందన్నారు. కలెక్టర్ సమన్వయకర్తగా కోర్‌గ్రూపు ఏర్పాటయ్యిందని ఇందులో నరగ పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా విసి బాబురావునాయుడు, రూరల్ ఎస్‌పి కోయప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ పిఓలతోపాటు ఇతర జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లా అదికారులకు అదనంగా స్టీల్‌ప్లాంటు సిఎండి, హెచ్‌పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్‌టిపిసి సింహాద్రి, లాలం కోడూరు నుండి ఒకరు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ నెలకోసారి సమావేశమవుతుందన్నారు. ముఖ్య ప్రణాళిక అధికారి రామశాస్ర్తీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని కమిటీ సభ్యులు సిపిఓకు సమాచారం అందించాలని కోరారు. నగరంలో పరిశుభ్రత సాధించడం ప్రజలందరి భాగస్వామ్యం, పౌరుల్లో చైతన్యం ద్వారానే సాధ్యమని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నగరంలోని ప్రముఖులు, సంస్థలు ఈ దిశగా సహకరించాలన్నారు. జెసి జె.నివాస్, జెసి-2 డి.వెంకటరెడ్డి, వుడా అదనపు విసి రమేష్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు సాంబశివరావు, తదితరులు అధికారులు పాల్గొన్నారు.

58 కేజిల గంజాయి పట్టివేత
అనంతగిరి, మార్చి 25: ఒరిస్సా నుంచి మహారాష్టక్రు అక్రమంగా తరలిస్తున్న 58 కేజిల గంజాయిని అనంతగిరి పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు అనంతగిరిలో కాపుకాసి సుమోలో వెళుతున్న 58 కేజిల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర పూనెకు చెందిన దీపక్, శంకర్, రామేశ్వర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు, రెండు సెల్‌ఫోన్లు, వాహనాన్ని సీజ్ చేసారు. ఈ దాడుల్లో ఎస్.ఐ దామోధరనాయుడు, అనంతగిరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
150 కేజీల గంజాయి స్వాధీనం
చింతపల్లి, మార్చి 25: తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 150 కేజీల గంజాయిని అన్నవరం ఎస్సై జగదీశ్వరరావు పట్టుకున్నట్లు తెలిసింది. అన్నవరంలో ఒక ఇంటి వద్ద ఈ గంజాయిని తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై సిబ్బందితో వెళ్ళి గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టెన్త్ పరీక్షల్లో ఎ వన్‌గ్రేడ్ సాధిస్తే ఇంటర్మీడియట్‌లో కార్పొరేట్ విద్య
* డిడి రమణమూర్తి
నర్సీపట్నం,మార్చి 25: 10వ తరగతి పరీక్షల్లో ఏ వన్ గ్రేడ్ సాధిస్తే ఇంటర్‌లో కార్పొరేట్ విద్యావకాశం కల్పించనున్నట్లు సోషల్ వెల్ఫేర్ డిడి బి రమణమూర్తి చెప్పారు. శుక్రవారం వేములపూడి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ పరిసరాలను, విద్యార్థుల భోజన వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిడి రమణమూర్తి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఏ వన్ గ్రేడ్ సాధిస్తే ఇంటర్మీడియట్‌లో కార్పొరేట్ విద్యావకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతీ విద్యార్థి ఏ వన్ గ్రేడ్ సాధించాలని ఆయన సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కులే విద్యార్ధి భవిష్యత్‌కు నాంది అన్నారు. ఇప్పటికే తెలుగు1,2, హిందీ పరీక్షలు పూర్తయ్యాయని, మిగతా పేపర్లలో కూడా మంచి మార్కులు సాధించి ఎ వన్ గ్రేడ్ సాధించాలని సూచించారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యనభ్యసించాలంటే ఎంతో కష్టసాధ్యమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎ వన్ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల్లో సీట్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈసమావేశంలో ఆయా వసతి గృహాల వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గొట్టివాడ ఇసుక రేవుపై గనుల శాఖ దాడులు
కోటవురట్ల, మార్చి 25: మండలంలో గొట్టివాడ ఇసుక ర్యాంప్‌పై శుక్రవారం మైనింగ్ శాఖ అధికారులు , పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ర్యాంప్ నుంచి ప్రభుత్వ పనుల పేరుతో పెద్ద ఎత్తున ఇసుక గత నెల రోజుల నుంచి తరలివెళ్తుంది. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ఇసుకను పలువురు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కొందరు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నర్సీపట్నం సిఐ ఆర్‌వి ఆర్‌కె చౌదరి, అనకాపల్లి మైనింగ్ ఎడి ఆర్‌పి నాయుడు ఆకస్మికంగా గొట్టివాడ ర్యాంప్‌పై దాడి చేశారు. ఆసమయంలో నాలుగు లారీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మైనింగ్ ఎడి ఆర్‌పి నాయుడు మాట్లాడుతూ గొట్టివాడ ర్యాంప్ నుంచి అచ్యుతాపురం ఇసుక తరలి వెళ్తుందన్నారు. అయితే అక్రమంగా తరలివెళ్తుందన్న అనుమానంతో దాడులు చేశామన్నారు. రికార్డులను పరిశీలించి తగిన చర్య తీసుకుంటామన్నారు. నర్సీపట్నం సిఐ చౌదరి మాట్లాడుతూ వంతెనలు, మంచినీటి స్కీమ్‌లు, టవర్‌లు తదితర కట్టడాలకు 500 మీటర్లు దూరంలో ఇసుక తవ్వకాలు జరపాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో స్థానిక ఎస్సై రమేష్ పాల్గొన్నారు.