విశాఖపట్నం

నాణేనికి అటూ ఇటూ! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుభద్రాదేవి చాలా అందగత్తె. చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త అన్నా, అతని అనురాగమన్నా పూర్తిగా తెలియకముందే ఇద్దరు పిల్లల తల్లైంది. మేనరికం కావడం వల్ల ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు వయసు పెరుగుతోంది. భర్తకు ఆమెకు వయసు అంతరం పదేళ్లు కావడంవల్ల ఆమె మనసు కోరికల్ని అతడి వయసు తీర్చలేకపోతోంది. అలా స్వయంగా సుభద్రే అందరు అమ్మాయిల్లా అనుకుంటోంది.
తెలుగు రాష్ట్రంలో అమ్మాయిల్లో చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతుంది. పదో తరగతి స్థాయికి చేరేసరికే కాబోయే భర్త కోసం వెదుకులాట మొదలవుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ నాటికి వివాహం, సంతానం... క్రమంగా జీవితం నిస్సారం అయిపోతుంది. చదువు పేరిటో, ఇంకా వేరే కారణాలో వాళ్ళ ఆలోచనా ధోరణుల్ని మార్చేసి యాంత్రిక జీవనానికి అలవాటు చేస్తాయి.
ఆ వీధిలోనే ఉండే సుశీల స్నేహం కల్సింది. అది తర్వాత కాలంలో పెను మార్పులకు కారణమై ఆమె మనసును అల్లకల్లోలపరుస్తుందని తెలీదు ఆమెకు అప్పట్లో.
‘సురేష్ నాకీ వాచ్ కొనిచ్చాడు’ అంది సుశీల.
‘ఎవరు సురేష్’ అంది సుభద్రాదేవి.
‘నాకు పరిచయస్తుడ్లే. కాలేజీలో చదువుతున్నాడు’
‘అప్పుడే వెయ్యిపైన ఖర్చు పెట్టగలిగాడు అంటే డబ్బున్న కుర్రాడు అయి ఉండాలి’ అనుకుంది సుభద్రాదేవి. బైటకి మాత్రం ‘సంతోషం’ అంది ముక్తసరిగా!
నెల రోజులు గడిచాయి.
ఒకరోజు కొత్త సైకిల్‌తో వచ్చిందామె.
‘సురేష్ కొన్నాడా?’ ప్రశ్నించింది ఆమె.
‘కాదు గోపీచంద్ ఇచ్చాడు’ అంది సుశీల.
‘ఎవరీ గోపీచంద్?’ మళ్లీ అడిగింది సుభద్రాదేవి.
‘సురేష్‌కన్నా కావాల్సినవాడు’ ముక్తసరిగా జవాబిచ్చింది సుశీల.
‘ఆహా!’
‘వాడే నా బాయ్ ఫ్రెండ్’
‘ఈ కాలం అమ్మాయిలే నయం. బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా మెయిన్‌టైన్ చేస్తున్నారు’ అనుకుంది సుశీల. ‘నేనంటే పడి చస్తాడు తెల్సా’ అంది కళ్ళింతలు చేసుకుని.
‘అంటే’ అంటూ సంభాషణ పొడిగించింది సుభద్రాదేవి.
‘నేనొక్కరోజు కాలేజీకి రాకపోయినా పిచ్చెక్కిపోతాడు తెల్సా’ సంభాషణ ఇలా సాగింది.
‘మరి సురేషో’
‘వాడో మొద్దు’ హేళనగా అంది సుశీల.
‘ఎలా’
‘అమ్మాయికేం కొనాల్సొస్తుందోనని ఎప్పుడూ భయపడ్తాడు వాడు. కొంచెం ఖరీదైన వస్తువు కొనమంటే మొహం గంటు పెట్టుకుంటాడు. గోపీచంద్ అలాక్కాదు. ఏది కావాలంటే అది, అడగడమే ఆలస్యం’.
‘వాళ్లివ్వడమేనా? నువ్వేమైనా ఇచ్చావా?’
‘బర్త్‌డే గిఫ్ట్‌గా వాడికో కిస్, వీడికో హగ్ అంతే’
‘తప్పుకదూ!’
‘మనకొచ్చేవాడు పవిత్రంగానే వస్తాడంటావా?’
‘అలా నమ్మేదే సంప్రదాయం. దానికి రూపమే పెళ్లి’
‘షిట్. మీ రోజుల్లో అలాగేమో! ఇప్పుడు సెల్‌ఫోన్‌లు వచ్చాయి. ఇంటర్నెట్‌లు అన్నీ చూపించేస్తున్నాయి. మనం కాదంటే మరొకరు ఆ అవకాశం ఎత్తుకుపోతారు.’
‘శృంగారం ఒక్కటే జీవితం కాదుకదా!’ అంది సుభద్రాదేవి.
‘ఆ రోజుల్లో నీకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరా?’
‘లేరు’
‘లవ్ లెటర్స్ అయినా వచ్చేవా?’
‘చదువుకోవడం తప్ప... వేరేం పనే్లదు అప్పట్లో’
‘నువ్వు చాలా లైఫ్ మిస్సయిపోయావ్’ అదోలా అంది సుశీల.
‘ఏమో! మరి’
‘నీ శృంగార జీవితం బాగుందా?’
‘నాకేం ఇద్దరు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. ఆయనది మంచి ఉద్యోగం. జీవితానికేం లోటు లేదు.’
‘సిన్మాలు, షికార్లు వగైరా!’
‘అందరూ బాగుందంటే ఆ సిన్మాకెళ్లేవాళ్లం.’
‘అవునవును, మీ కాలంలో అవే సిన్మాలు కదా!’
సుభద్రాదేవి మరేం మాట్లాడలేదు. మళ్లీ సుశీలే అంది.
‘అందుకే మంచి జీవితం మిస్ అయిపోయావ్ అంటున్నా’
అదీ నిజమేనేమో అన్పించింది.
అవును, తన జీవితంలో భర్త తన ప్రమేయం లేకుండానే వచ్చేశాడు. ఆ రోజుల్లో తాను తండ్రి ముందు ఎంత ఏడ్చిందో చదువుకుంటానని. కట్నాల క్రమంలో తూగలేనని భయంతో తండ్రి మేనరికం చేజారకుండా వివాహం జరిపించేసి బాధ్యత తీరిన తృప్తితో వెంటేసుకున్న అనారోగ్యం తోడు రాగా చనిపోయాడు పెళ్లైన రెండు నెలలకే.
సుశీల జీవితంలోని సుఖసంతోషాలు తనకూ వస్తే బావుణ్ణు అనుకుంది మొట్టమొదటిసారి సుభద్రాదేవి.
తనకెవరైనా లవ్ లెటర్ రాసినా, తనంటే ఇష్టపడి చొరవ చూపినా బావుణ్ణు అనుకుంది ఆమె.
అనుకోకుండా క్లాస్‌మేట్ నగేష్ కలిశాడు. ఆప్యాయంగా పలుకరించాడు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
మెల్లగా మాటలు కలిశాయి. చనువు పెరిగింది. ఏకవచన ప్రయోగాలు మొదలయ్యాయి.
భర్త దగ్గర లభించని ఆప్యాయతేదో నగేష్ దగ్గర లభించినట్లుగా ఫీలయింది. చనువుగా సిన్మాలకు వెళ్లడం, ద్వంద్వార్థ సంభాషణలు క్రమంగా చోటుచేసుకున్నాయి. బాధ్యతలే తప్ప తనపై ఎప్పుడూ ఆప్యాయత చూపించలేని భర్తకన్నా నగేష్ గొప్పవాడిగా కన్పించాడామెకు.
ప్రతి కుటుంబంలోనూ ఇలా జరిగే పరిస్థితో, ప్రమాదమో తప్పదు. ప్రేమ రాహిత్యం స్థానంలో కామ భావనలకు రూపం కలిగే స్థితి మొదలవుతుంది. నగేష్‌తో జీవితం పంచుకుంటే బావుణ్ణు అన్పించింది.
‘నగేష్! నా పిల్లలకు తండ్రివవుతావా?’ అందామె అతడి మనసు తెలుసుకోవాలన్నట్టుగా!
‘మనిద్దరం కొత్త జీవితం మొదలుపెడ్తాం’ అన్నాడు నగేష్.
‘అలాగే ఆలోచిద్దాం. రేపు నా అభిప్రాయం చెబుతా’ అంది సుభద్రాదేవి.
మర్నాడు భళ్ళున తెల్లారింది. కిటికీ నుండి వినిపిస్తున్న అరుపులు ఆమెను అటువైపు లాగాయి.
సంభాషణా సారాంశం ఇలా ఉంది - సుశీల ఎవరితోనో లేచిపోయిందని, కాస్సేపు గడిచాక రెండు వీధుల అవతల ఉన్న నగేష్ సుశీలతో వేకువజామున వెళ్లిపోయాడని.
‘అమ్మో!’ అనుకుంది సుభద్రాదేవి మంగళసూత్రం గుండెలపై బరువుగా కదలగా!
‘అవును. ఈ కాలం సంబంధాల్లో పెద్దల ప్రమేయం లేకుండా జరిగే పెళ్లిళ్ల వంటివి ఎక్కువగా కట్నపు చావులుగానో, కోర్కె తీర్చుకోవడానికో మారిపోతుంటే సమాజంలో నైతిక విలువలెలా నిలబడ్తాయి. ఇంటర్నెట్‌లు చెప్పలేని ప్రశ్నలివి.
సంపాదన లేని నగేష్, బాధ్యత తెలియని సుశీల కాపురం ఎలా ఉంటుంది అన్పించి భయమేసిందామెకు.
‘గుండెల మీద మంగళసూత్రం నేనున్నానంటూ ధైర్యం చెప్పింది’ - సుభద్రాదేవికి.
రాబోయే రోజుల్లో నిశ్చింత జీవితం వైపు ఆలోచన్లతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది సుభద్రాదేవి. భర్త రూపాన్ని మనసు నిండా నింపుకుని.

- శ్రీనివాసభారతి
శ్రీకాకుళం.

మినీకథ

ఆత్మస్థైర్యం
‘‘ఎందుకురా నాయనా మనకు తగవులు. ఇంటి వద్ద ఉండవచ్చు కదా’’ అంటూ కుమారుని వారించింది కిరణ్ తల్లి. కిరణ్‌ది పాతిక సంవత్సరాల వయస్సు. ఉడుకు రక్తం గల వయసది. రంగారావు ఆ గ్రామానికి నాయకుడు. ఆయన చేయని కుట్ర లేదు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఉన్న అవినీతిని బయటికి లాగి ప్రజల ముందుంచే తత్వం కలవాడు కిరణ్. ఒకసారి కిరణ్ ఉంటున్న వీధికి సిమెంట్ రోడ్డు మంజూరు అయింది. అది కాస్త పాచిక మార్చి రంగారావు తన ఇంటి ముందరగా వేయించుకున్నాడు. వచ్చిన అధికారుల చేయి తడిపి తన పనులు కానిచ్చుకున్నాడు. దాని వల్ల సగం డబ్బు మిగిలింది రంగారావుకి. మరుసటి రోజుకి ఆ రోడ్డు రంగారావు ఇంటి ముందు బీటలు వేసి లోపలికి కూరుకుపోయింది. అది తెలిసిన కిరణ్ అధికారులకు తెలియజేశాడు. ‘‘పోనీలేవయ్యా మరొక గ్రాంటులో పెడదాం’’ అంటూ అధికారులు తేలిగ్గా కొట్టిపారేయడంతో కిరణ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే అధికారులు వెళ్లి రంగారావు మింగిన డబ్బు కక్కించారు.
అప్పటి నుండి రంగారావుకి కిరణ్‌పై కోపం ఎక్కువైంది. తర్వాత కిరణ్ చేసే ప్రతి పనిని అధికార బలంతో అడ్డుకోవడం మొదలుపెట్టాడు రంగారావు. కొన్నాళ్లకు సర్వీస్ కమిషన్ ద్వారా కిరణ్‌కు ఉద్యోగం వచ్చింది. అయితే ముందు కిరణ్ ప్రవర్తన గురించి మీ గ్రామంలో ఇద్దరు పెద్ద మనుషుల సంతకాలు చేయించమని అధికారులు తెలిపారు. కిరణ్ తెలిసిన ఒక పెద్దాయనతో సంతకం పెట్టించి రంగారావు దగ్గరకు వెళ్లాడు. ఇదే అదను అనుకుని రంగారావు కిరణ్ ప్రవర్తన బాగా లేదని రాసిచ్చేసరికి ఉద్యోగం పోయింది. కిరణ్ దీనిని జీర్ణించుకోలేకపోయాడు. కిరణ్ తల్లి తల్లడిల్లిపోయింది. రంగారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. గ్రామంలో బంజరు భూమి, గెడ్డలు ప్లాట్లుగా వేసి అధికారుల అండతో అమ్మడం మొదలుపెట్టాడు. చివరికి శ్మశానం కూడా ప్లాటుగా మార్చేశాడు. ఇది చూసిన కిరణ్ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి తూతూ మంత్రంగా వచ్చి సర్వే చేసి వెళ్లిపోయారు.
కిరణ్ ప్రతి పనికీ అడ్డు పడుతున్నాడని తెలిసి రౌడీలతో కొట్టించాడు రంగారావు. తీవ్రంగా గాయపడిన కిరణ్ చివరికి రెండు కాళ్లు కోల్పోయాడు. కొన్నాళ్లకు పింఛన్ కోసం దరఖాస్తు చేయగా రంగారావు తన అధికారంతో తిరస్కరింపజేశాడు. కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లి కొన్నాళ్లకు కన్ను మూసింది. కిరన్ పట్టువదలని విక్రమార్కుడిలా కొంత మంది స్నేహితుల సాయంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో రంగారావుపై విచారణ జరిపి వెధవ పనులన్నీ బయటికి లాగి జైలుశిక్ష విధించారు. అప్పటి వరకు ఎదురు లేని ఆధిపత్యంతో ఉన్న రంగారావు సామాజ్య్రం కూలే సరికి గ్రామంలో గల పౌరులంతా కిరణ్ చేసిన మంచి పనిని మెచ్చుకుని కృత్రిమ అవయవాలు కొని ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో చిన్న పరిశ్రమ స్థాపించి పది మందికి ఉపాధి చూపే మార్గదర్శకుడయ్యాడు.

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖ జిల్లా.
సెల్ : 9885090752.

పుస్తక సమీక్ష

మానవతను మేల్కొలిపే కిరణాలు

ప్రపంచంలోకెల్లా భారతదేశంలోని సంస్కృతీ సంప్రదాయాలు మానవుని జీవనానికి ఎంతో మేలు కలిగేలా తోడ్పడుతున్నాయి. ఎందరో రుషిపుంగవులు తమ జీవితాలను త్యాగం చేసి తపస్సులు, పరిశోధనలు చేసి ఆ సంప్రదాయాలను మనకు అందించారు. అయితే, పాశ్చాత్య సంస్కృతి మూలంగా ఇవి కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకున్నాయి. తత్ఫలితంగా మానవుని జీవన విధానం కూడా మారిపోతోంది. అంతా స్పీడ్ యుగం వచ్చేసింది. వినోద సాధనాలు కాళ్ళ దగ్గర తిరుగుతుండడంతో అనుబంధాలు, ఆప్యాయతలు, పలకరింపులు మట్టికొట్టుకుపోయి, బద్ధకం పెరుగుతోంది. మొలకెత్తిన వివాదాలు ముదిరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇటువంటి అస్తవ్యస్త బతుకుల నడుమ మానవత్వం ఎలా ఆహుతవుతోందన్న విషయాన్ని తెలియజెప్పి, భారతీయుడిలోని ఉన్న ఆ ఆదర్శ వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని మేల్కొపిన కిరణాలు.. విశాఖ రచయితల సంఘం ప్రతినిధి అడపా రామకృష్ణ ఆధ్వర్యంలో వెలువడిన ‘విశాఖ కథా తరంగాలు’. ఈ కథా సంకలనంలో మొత్తం 21 కథలు ఉన్నాయి. ఇందులో కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి కాగా, మరికొన్ని ఈ సంకలనానికి ప్రత్యేకంగా రాసివిగా ఉన్నాయి.
‘ఆ వయస్సులో వారినొదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా? కష్టమొస్తే వారిని ఆదుకునేదెవరు? అక్కడ చదువైపోయిన వెంటనే తిరిగి రావడానికి కుదరదు. ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోన్ తీర్చాలి. ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి. తిరిగి రావాలంటే.. కనీసం అయిదారేళ్ళయినా పడుతుంది. ఈ అయిదారేళ్ళలో నాకు పెళ్ళవకుండా ఉంటుం దా?, పిల్లల్ని కనకుండా ఉండగలనా? నా భార్యాపిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రానంటారేమో. పోనీ, అమ్మానాన్నలను అక్కడికి తీసుకుపోదామంటే, ఉహూ.. వీళ్ళు కచ్చితంగా కదిలిరారు. వయస్స మీరిన తల్లిదండ్రులిక్కడా మేము అక్కడా ఉంటే.. నా మనస్సు కుదురుగా ఉంటుందా? మా పిల్లల ముద్దూ మురిపాలకు అమ్మానాన్నా దూరం అయిపోరూ! అందరిలా వారికీ మనవళ్ళతో ఆడుకోవాలనీ, జోల పాడాలని సరదా ఉంటుంది కదా. ఎవరికైనా తమ పిల్లల మీద కంటే పిల్లల పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందట’’. ఇదీ ఆ కుర్రాడి ఆవేదన... నిజానికి ఇటువంటి మనస్సు నేటి రోజుల్లో ఎంతమందిలో ఉంటుంది? అమెరికా ‘ఎగిరిపోవాలని’ ఉన్నా కని, పెంచి పోషించిన దైవ సమానులు తల్లిదండ్రుల పరిస్థితి గుర్తుకు వచ్చిందీ కుమారుడికి. రావాలి కూడా. అయినా, తల్లి నుంచి వత్తిడి పెరిగింది. కొడుకు అమెరికా వెళ్ళి, తాము వచ్చి నీ దగ్గర ఉంటామని ‘భ్రమ’పడకు అనే విషయాన్ని, ఒక వేళ ఉండినా కొడుకు, కోడలు మానసిక స్థితి ముందే పసిగట్టిన ఆ మాతృమూర్తి తమ తోవను ‘ముందుచూపు’తో చూసుకుంది. ఓల్డేజ్ హోమ్‌లో చేరిపోవడానికి నిర్ణయించుకున్నారు ఆ వృద్ధ దంపతులు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అమెరికా వెళ్ళడం.. కోడలి ‘రుసరుసలు’ (సహజంగానే), వీటిని విన్న కుమారుడికి బాధ. అందుకే ఆ మానవత్వం గల మనిషి- తల్లిదండ్రులు ఊహించిన ‘ముందుచూపు’ తప్పుకాదని మూగగా రోదించాడు. రచయిత శానాపతి ప్రసన్నలక్ష్మి ఎంచుకున్న అంశం అభినందించదగ్గది. నేటి తరం వాళ్ళు తప్పక చదవాల్సిన కథ ఇది. తమను తాము, తమ కుటుంబాన్ని, తద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా ముందుకు నడిపిస్తుందీ కథ.
ఓ వివాహం వల్ల ‘చెరువు’ సమస్య సమసిపోయింది. భూమిని నమ్ముకున్న వాళ్ళకు చెరువుప్రాధాన్యం తెలుస్తుంది. అందుకే చెరువు సొంతం చేసుకోవడానికి కొనే్నళ్ళుగా ఆ రెండు గ్రామాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో ఆ గ్రామాలకు చెందిన యువతి, యువకుడికి పెళ్ళి సంబంధం కుదరడం.. వారు రెండు గ్రామాల శ్రేయస్సు దృష్ట్యా ‘చెరువు’ సమస్య ఎలాగైనా పరిష్కరించాలని నడుంకట్టడడం, అందుకు తమ పెళ్ళిని ఆయుధంగా మార్చి, మొత్తానికి అక్కడి సమస్యను తమ ‘కుర్ర’ తెలివితో పద్మ, విశ్వం పాతరేసి శభాష్ అనిపించుకున్నారు. రచయిత లోగిశ లక్ష్మీనాయుడు అభినందనీయుడు.
ఆ దంపతుల కలలు కల్లలయ్యాయి. జయలక్ష్మి అదృష్టం మాయమైపోయింది. విధిరాత అంటే ఇదేనేమో. కొడుకు రాజేశ్వరరావు బాగు కోసం ఆస్తినంతా అమ్మి, దూరదేశంలో చదివిస్తున్నారు. కానీ ఏం లాభం? పాపం చివరకు అందరినీ శోకసంద్రంలో ముంచేశాడు. బహుశా ఆ దంపతులు దురాశ పడ్డారమోనని ‘చీకటిలో చిరునవ్వు’ చదివాక అనిపిస్తుంది. అంగర కృష్ణారావు తన రచననైపుణ్యంతో పాఠకున్ని ముగింపువరకూ తీసుకుపోయారు. వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని మలిచిన కథ ‘ఇది మరో దిద్దుబాటు’ (రచయిత గుండాన జోగారావు), సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ రాసిన ‘పాపం సుబ్బారావు’, ఎన్.జగదీశ్వరి కలం నుంచి వెలువడిన ‘బంగారు పట్టీలు’, శ్రీ చరణ్‌మిత్ర ‘మనసు పరిధి స్వలం’, అడపా రామకృష్ణ ‘తప్పెవరిది?’, ‘డ్రైవర్ బాబు’ (రాగతి రమ), నందచైనత్య ‘దీపకళిక’, మేడా మస్తాన్‌రెడ్డి ‘స్వామికార్యం..!’, టి.శ్రీనివాసరావు ‘జనని’, శ్రీనివాస్ ‘కర్మయోగి’, భమిడిపాటి సుబ్బారావు రాసిన ‘మానవత్వం’, రాజేష్ యాళ్ళ ‘నీలకంఠం’, అంగర కృష్ణారావు ‘బాకీ కథల కమామిషు’, డాక్టర్ రేవరకొండ సహదేహరావు రాసిన ‘సాధనతో...’, వివి కూర్మారావు ‘తాపత్రయం’ చక్రరావు ‘కంట్లోనలుసు’, ఎం.ఉండవిల్లి ‘అమ్మ’, రావులపల్లి రామలక్ష్మి ‘హుద్‌హుద్’ కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. సీనియర్ రచయిత అడపా రామకృష్ణ కొంతకాలం దూరంగా ఉండి, మళ్ళీ సాహిత్య సేవలోకి రావడం ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు. వచ్చిందే తడవుగా విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్న ఔత్సాహిక రచయితల రచనలను శ్రమపడి సేకరించి, ‘విశాఖ కథా తరంగాలు’గా వెలువరించడం వర్ధమాన రచయితలకు సంబరమే.

- జి.కృష్ణమూర్తి,
సెల్ : 9493802010.

మనోగీతికలు

మన జెండాకు వందనం!
ఎందరో మహానుభావుల త్యాగఫలం
మన త్రివర్ణ జెండా
అందుకే ప్రతి ఒక్క భారతీయుడిలో
ఉండాలి నిజమైన దేశభక్తి గుండె నిండా
మూడు రంగుల జెండాయే కదరా
సమస్త భారతీయులకు అండ
నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు మెలగాలి
అప్పుడే కదా దేశఖ్యాతి పాకుతుంది
ఖండాంతరాల గుండా
దేశ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడే ఈ జెండాయే మనకు చల్లని నీటికుండ
మనమంతా ఒక్కటై బతకాలి
జాతి, మతం, కులం అని తిట్టుకోకుండా
తెలుగు తల్లికి మల్లెపూదండ
నేటి బాలలే రేపటి పౌరులు
వారే మన దేశానికి బంగారు కొండ

నాగాస్త్రం నాగు, వడ్లపూడి.
సెల్ : 9966023970.

తెలుగు వెలిగించండి!
నా మాతృభాష తెలుగు....
నాకు దారిచూపే వెలుగు.....
నా తెలుగు తేనెలూరే భాష....
తెలుగు అక్షరములు అజంతములు....
తెలుగు పదములు జయంతమ్ములు...
తెలుగు జవసత్వాలు కలది....
తెలుగు సున్నిత సుకుమార వెలది...
అమ్మానాన్న అన్నది కమ్మనైన పిలుపు....
సంతానపు ఆత్మీయత అది తెలుపు...
ఆంధ్రుల్ని తెలుగులో పలకరించండి....
నమస్కార సంస్కారంతో పులకరించండి...
సుమధుర తెలుగులో భాషిస్తూ
ఆత్మీయ ఆప్యాయతని చిలకరించండి...
తెలుగు పద్యాలూ జాతీయాలూ
సామెతల సొగసుల్ని
భావితరానికి వివరించండి...
అమృతతుల్య మాతృభాషని
మృతప్రాయం చెయ్యకండి...
పరభాషా వ్యామోహంలో
అస్తిత్వాన్ని వీడకండి!

- జోగారావు గుండాన,
సెల్ : 9490185708.

ఆహ్వానం
నవరక్తానికి జవసత్వాలీయగ
మహిమత్వానికి మార్గం చూపగ
విద్యార్థి మొక్కలకిప్పుడు
విజ్ఞాన దాహం విలువను నేర్పేవారు కావాలి
నైతిక, మానవతా పాదాలతో
ప్రగతిదారుల పరుగులు పెట్టించే
ఆనందతీరాలకు చేర్పించే
శాంతిపూల పంటను పండించే
ఆచార్య కర్షకులు కావాలి
సమాజం నిండా
దివ్య పరిమళాలను వ్యాప్తి చేసే
చందన శ్రీలు కావాలి
గడ్డి పరకలను గట్టిపరిచే
ఆశాంహకార చెదలను దులిపే
ప్రయోజక వైతాళికులు కావాలి
అపుడే
జీవనక్రాంతి నక్షత్రమై మెరిసేది
రెపరెపలాడే జెండా రెప్పల్లో
దాగున్న స్వప్నం విరిసేది

- జె.బి. తిరుమలాచార్యులు, సాలూరు.
సెల్ : 9966229136.

చొరవగా దూకకపోతే.....

ఎప్పటివరకు
ఎదురుచూడాలో తెలిస్తే
ఆశను నిలుపుకోవచ్చు
ఎటువంటి
ప్రయత్నాలు చేయాలో
ఊహించ గలిగితే
ఆరాటపడవచ్చు
కానీ....
ఏ ప్రయత్నం లేకుండా
ఆశపడుతూ కూర్చుంటే
చర్మం ముడతలు పడిపోతుంది
ఆ తరువాత
ప్రయత్నం వెంట
ఒడిఒడిగా పరుగులు తీసినా
ఫలితం అందేసరికి
ప్రాణం కొడిగట్టిపోతుంది
కాబట్టి
అనుకున్నదే తడవుగా
ఆలోచనలకు పదును పెట్టాలి
అవకాశం చిక్కగానే
లక్ష్యాన్ని ఛేదించాలి
సరికొత్త ఆలోచనలతో
ప్రతి నిత్యం
నిన్ను నీవు ఆవిష్కరించుకోవాలి
అప్పుడే విజయం పలకరిస్తుంది
శిఖరం అందుతుంది
విజేతగా నిలిచి
స్ఫూర్తిదాతలమవుతాం!

- గగనం శ్రీనుకుమార్,
పెద్దరామకోవెల దగ్గర,
పాతవీధి, యలమంచిలి,
విశాఖజిల్లా.
సెల్ : 8008262514.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- శ్రీనివాసభారతి