విశాఖపట్నం

తీర్పు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని నమ్ముకున్నాడు రామావధాన్లు. భార్య, ఒకే ఒక్క కొడుకు. సంసారం చిన్నపాటిదే అయినా తను చేస్తున్న వృత్తికి భారమైనదే.
కాలం మారింది. పల్లెలు పట్టణాలయ్యాయి. వీధిబడులు మూతపడ్డాయి. ప్రతి వీధిలోను ఒక కానె్వంట్ స్కూలు. తెలుగు భాషకు తెలుగు పుట్టింది. ఆంగ్లం అందలమెక్కింది. ఇంగ్లీసు చదువుల మోజులో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. తెల్లవారకుండానే పిల్లలు, పెద్దలు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. చెట్ల మీద పక్షుల్లా తెలతెలవారకుండానే వెళ్లి మళ్లీ చీకటిపడ్డాక గూడు చేరుతున్నారు. ఇలా అందరి జీవితాలు వేగం పుంజుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలకు చోటెక్కడుంది? కాలంతో పాటు రామావధాన్లు కూడా మారక తప్పలేదు. తన కొడుకుని ఇంగ్లీషు చదువులోనే పెట్టాడు. అదృష్టం కొద్దీ కొడుకు ప్రశాంత్ చదువులో ముందంజ వేస్తూ తన తెలివితేటలతో ఉపకార వేతనాలు పొందుతూ బిటెక్ కూడా పూర్తిచేశాడు. క్యాంపస్‌లో జరిగిన ఉద్యోగ మేళాలో మంచి కంపెనీల ఆఫర్లు వచ్చాయి. కొడుకు చేతికంది వచ్చాడన్న ఆనందంతో తల్లిదండ్రులు మురిసిపోయాడు.
కాని ప్రశాంత్ ప్రైవేట్ సంస్థలో పని చేయడానికి ఉత్సాహం చూపించలేదు. వాళ్లు చూపించిన ఆశల వలయంలో చిక్కుకోదల్చుకోలేదు. జీతం తక్కువైనా ప్రభుత్వ కొలువుకే సుముఖత వ్యక్తం చేశాడు. అందుకు కారణాలు రెండే రెండు. తన మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులకు దూరంగా ఉండకూడదనుకోవడం, ఉద్యోగం భద్రత, పరోక్షంగా దేశం కోసం తన పాటు పడినట్లు ఉంటుందని.
రామావధాన్లు స్థితిమంతుడు కాకపోయినా, ప్రశాంత్‌కు డబ్బున్న సంబంధాలే వస్తున్నాయి. రామావధాన్లు దంపతులు చదువు, సంస్కారం ఉన్న పిల్ల సంప్రదాయక కుటుంబానికి చెందితే చాలనుకున్నారు. ప్రశాంత్‌కు నచ్చితే చాలు. వరకట్నాలపై ఏమాత్రం మోజు చూపలేదు.
ఒకనాడు తలవని తలంపుగా ఆ ఊళ్లోనే ప్రభుత్వ హైస్కూల్లో పని చేసి విశ్రాంతి పొందిన కనకయ్యగారు వచ్చి తమ ఒక్కగానొక్క కూతురిని ప్రశాంత్‌కి ఇచ్చి వివాహం జరిపించాలన్న కోరికను తెలియజేశారు.
కనకయ్యగారి కూతురు శాంతి ప్రశాంత్‌లానే బిటెక్ చదివింది. ప్రశాంత్ కంటే రెండేళ్లు జూనియర్. తాము బతికుండగానే కూతుర్ని ఒక ఇంటి కోడలుగా చూడాలన్న ఆరాటంతో రామావధాన్లను కలసి మాట్లాడడం, ఆ ఊళ్లో కనకయ్యగారికి గల మంచి పేరు తెలిసిన అవధాన్లు పిల్ల, పిల్లడు ఇద్దరూ ఇష్టపడితే తనకు ఏ అభ్యంతరం లేదన్నాడు.
ప్రశాంత్, శాంతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కనకయ్యగారి అదృష్టం పండింది. రామావధాన్లు దంపతులు కోడలిలోనే కూతుర్ని చూడాలన్న కోరిక కూడా నెరవేరింది. ఉద్యోగార్హత ఉన్న శాంతిని ఆ వైపు దృష్టి మళ్లించవద్దని హితవు చెప్పాడు. అందుకు మరో కారణం కూడా ఉంది. అటు తల్లిదండ్రుల వయసు మళ్లింది. తాము కూడా అదే దశకు చేరుకున్నారు. పోతే ప్రశాంత్ సంపాదనతో సంసారం తృప్తిగా సాగిపోతుంది. ఆమె కూడా ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పక దొరుకుతుంది. అలా అయితే అవసరమున్న మరో వ్యక్తికి లభించక, ఆ కుటుంబం పొట్ట కొట్టినట్లవుతుంది. అదీ కాక, ఉరుకులు పరుగులు ప్రపంచంలో పరుగులు తీయవద్దని ఉపదేశించాడు. శాంతి వౌనం అంగీకార సూచకమవడంతో, నిరాడంబరంగా శాంతి, ప్రశాంత్‌ల వివాహం జరిగిపోయింది.
కాలం పరుగులు తీసింది. శాంతి కడుపు పండింది. ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఇంట్లో లక్ష్మి అవతరించిందని అందరూ ఆనందించారు. ప్రశాంత్‌తో పాటు హైదరాబాద్ వెళ్లింది. పాప ఆలనాపాలనతో శాంతికి రోజంతా ఏ చీకూ చింతా లేకుండా గడచిపోతుంటుంది. సంవత్సరానికి ఒకసారి విశాఖపట్నం వెళుతూ కొన్నిరోజులు రెండిళ్లలో గడిపేవారు ఆనందాన్ని పంచి ఇచ్చేవారు.
మూడేళ్లు మూడు క్షణాల్లా గడిచిపోయాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు. శాంతి తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ సంగతి ప్రశాంత్‌కు తండ్రి వర్తమానం పంపించడంతో హుటాహుటిన శాంతి, కూతురుతో పాటు ప్రశాంత్ వెళ్లాడు. పరిస్థితుల్ని ప్రత్యేకంగా అర్ధం చేసుకున్నారు దంపతులిద్దరూ. తండ్రి కోలుకోవడానికి సమయమే కాదు. ఆర్థికంగా ఆదుకోవలసిన పరిస్థితి ఎదురైంది. ప్రశాంత్ తండ్రితో మామగారిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలనీ, డబ్బు విషయంలో సందేహించవద్దని చెబుతూ తండ్రికి కొంత సొమ్మిచ్చి, మామగారితో త్వరలోనే నయమవుతుందని, దిగులు చెందవద్దని ధైర్యం చెప్పి కుటుంబంతో తిరుగు ప్రయాణమయ్యాడు.
తండ్రి పరిస్థితిని తెలుసుకున్న శాంతి ప్రశాంత్‌తో ‘‘ఏమండీ! ఈ సమయంలో ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. చిన్నదైనా సరే ఏమంటారు?’’ అనడిగింది.
ప్రశాంత్ కాదనలేదు. తనకు తెలిసిన కంపెనీ వాళ్లతో చెప్పి ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పాడు. ‘కొడుకైనా, కూతురైనా నువ్వే కదా అనుకోవలసింది. నాన్నగారు తేరుకునే వరకు సాయం చెయ్యి’’ అన్నాడు.
శాంతికి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. పాపను చూడడానికి, ఇంటి పనులు చేయడానికి, మంచి జీవితాన్ని గడిపి, ఆపదల్లో చిక్కుకున్న ఒక మధ్య తరగతికి చెందిన నడివయస్కురాలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆమె పేరు సుశీల. నిజంగా సుశీలే. ఆ ఇంట్లో మనిషిలా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి భగవంతుడే ఏర్పాటు చేసినట్లు భావించారిద్దరూ.
తన తెలివితేటలతో, సాంకేతిక పరిజ్ఞానంతో కొద్ది కాలంలోనే కంపెనీకి విశేషంగా లాభాలను తెచ్చిపెట్టిన శాంతికి ఆ బ్రాంచ్ మేనేజర్‌గా పదోన్నతి ఇచ్చారు. దాంతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలను అందించారు. ఆమెకు భర్త ఆదాయం కంటే రెండు రెట్లు పెరిగింది. ప్రశాంత్ గడ్డుకాలం తీరిందని ఆనందించాడు.
కాని శాంతిలో ఆ సంఘటన మార్పు తీసుకువచ్చింది. రోజూ మీటింగులంటూ కొత్తవారితో పరిచయాలు, తనస్థాయి ఉద్యోగులతో క్లబ్బులు, పబ్బుల్లో పాల్గొంటూ ఉండడం, అర్ధరాత్రి దాకా ఇల్లు చేరకపోవడం ప్రశాంత్‌కు మనస్తాపం కలిగించింది. ప్రతి చిన్న విషయానికీ సూటిపోటి మాటలతో నిందించడం, పాప సంగతి అసలు చూసుకోకపోవడం ప్రశాంత్‌కు మానసిక క్షోభ కలిగించింది. చివరికి తాను ఆశిస్తున్నట్లు మారకపోతే విడాకులిస్తానని బెదిరించింది.
అనడమే కాదు అన్నంత పనీ చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు పిటిషన్ వేసింది. కోర్టు నుండి నోటీసు అందుకున్న ప్రశాంత్ పాప, సుశీలతో కోర్టుకు హాజరయ్యారు. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి దమయంతి తన సీట్లో కూర్చుంది. ఎదురుగా ప్రశాంత్, శాంతి కూర్చున్నారు. దూరంగా సుశీల దగ్గర పాప బొమ్మతో ఆడుతోంది.
దమయంతి తన ముందున్న విడాకుల పిటిషన్, అందుకు సంబంధించిన పత్రాలను చూస్తూ ‘‘మీది పెద్దలు కుదిర్చిన వివాహం. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఔనా?’’ అంటూ ప్రశ్నించింది.
శాంతి, ప్రశాంత్‌లు ఒక్క గొంతుతో ‘‘ఔను’’ అన్నారు.
‘‘ఇరు కుటుంబాల్లో మీ పట్ల ఆదరణలో లోపం ఉన్నట్లు మీరెక్కడా ప్రస్తావించలేదు. బిడ్డ పుట్టిన తరువాత కూడా ఆమె పెంపకం విషయంలో పొరపొచ్చాలు ఉన్న సూచనలు లేవు’’ దమయంతి ఇద్దరి ముఖాల్లోకి చూస్తూ అంది.
వౌనమే న్యాయమూర్తి సందేహాలకు సమాధానం. న్యాయమూర్తి ఎదుట వారు ఒకరిపై ఒకరు నిందలు మోపలేదు. వాదులాడుకోలేదు. అది గమనించిన దమయంతి ‘‘మీ దంపతుల మధ్య ఈర్ష్యాద్వేషాలున్నట్లు లేదు. ఒకరి పట్ల మరొకరికి అభిమానం కూడా చెరగలేదని అనుకుంటున్నాను. ఏదో ఒక సందర్భంలో, క్షణాకావేశంలో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నాను’’ అంది.
శాంతి ఆత్మన్యూనతాభావంతో ముఖం దించుకుంది.
‘‘మన వివాహ వ్యవస్థ ఎంతో ధర్మ సమ్మతమైనది. పెద్దల ఆశీస్సులతో, ఏడడుగుల అనుబంధంతో, మంగళసూత్ర బంధనంతో నూరేళ్ల పంటగా పవిత్రమైన బంధం. మన సంప్రదాయంలో అసమ్మతికి చోటుందేమో కాని విడాకులు అనే మాటకు తావులేదు. ఉమ్మడి కుటుంబాలు నిర్వీర్యం కావడంతో మంచి మార్గాన నడిపించే పెద్దలు కరవయ్యారు. నేటి యువత స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటూ మితిమీరడంతో సమాజం కల్మషమయింది’’ దమయంతి వివాహ వ్యవస్థ గురించి చెప్పింది.
‘విడాకులు’ పాశ్చాత్య సంప్రదాయం. ఆ దుష్ట సాంప్రదాయం మన దేశంలోకి దిగుమతి అయింది. ఆడది విడాకులు పొందితే సమాజం హీనంగా చూస్తుంది. నడిబజారుకు ఈడుస్తుంది. మృగాళ్ల మధ్య బతకడం ఊహకందనిది. మగాడికి మరో స్ర్తి భార్యగా దొరకొచ్చు. ఆ పరిస్థితి ఆడదానికి లేదు. ఒకవేళ ఉన్నా అవసరం తీరేంత వరకే. ఇందుకు మీ పరిస్థితి భిన్నంగా ఉంది. మీ మధ్య ఒక అభం శుభం తెలియని పాప ఉంది. భార్యాభర్తల అనురాగంతో పెరగాల్సిన బిడ్డ అనాథగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయం మీరు ఆలోచించాలి’’ అని విడాకుల గురించి విడమరిచి చెప్పింది దమయంతి.
‘‘మరొక్క మాట. కోర్టులు చెప్పే తీర్పులు శాశ్వత పరిష్కారం కావు. మీరు పరిస్థితులను అవగాహన చేసుకుని మీకు మీరే ఈ స్థితికి దిగజారడానికి కారణాలు అనే్వషించాలి. ఇందులో గెలుపోటములు అంటూ లేవు. అయినా పిల్లల మాట బ్రహ్మవాక్కు అంటారు. ఈ విషయంలో సరైన తీర్పునివ్వగలిగేది మీరుభయుల పంట పాపనే’’ అంటూ దమయంతి పాపను పిలిచింది. సుశీల పాపను తీసుకుని వచ్చి దమయంతికి అందించింది.
దమయంతి పాపను చూస్తూ ‘‘ ఏం పాపా నీకెవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా?’’ అంటూ శాంతి, ప్రశాంత్‌ల ముందుంచింది.
పాప గాబరా పడింది. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ సుశీల ఒడిలో చేరింది.
‘‘చూశారు కదా తీర్పు! క్షణికావేశాలు వదిలి అహంకారాన్ని దూరం చేసుకుని ఎవరికి వారు అంతర్మథనం చేసుకుని ఒక నిర్ణయానికి రండి. ఒక సంవత్సరం పాటు గడువిస్తున్నా. అప్పటికీ మీమీ పట్టుదలలు వీడకపోతే విడాకులు మంజూరు చేయడానికి కోర్టు వారికి అభ్యంతరం ఉండదు’’ అంటూ దమయంతి వెళ్లిపోయింది.
ఏడాది కాదు, చాలా ఏళ్లు గడిచినా శాంతి, ప్రశాంత్‌లు కోర్టు గడప తొక్కలేదు.

- ఎ. సీతారామారావు,
లక్కపందిరి వీధి,
విజయనగరం-535002.
ఫోన్ : 08922 237122.

తొందరపాటు

రాజారాం ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఇంజనీరుగా పని చేస్తున్నాడు. వయసు రిటైర్మెంట్‌కి దగ్గరలో వుంది. చేతివాటం ఎక్కువేనని చెప్పుకుంటారు. ఈ మధ్యనే కొత్తగా కొత్త ఇంటికి గృహప్రవేశం చేసి, అక్కడే నివాసముంటున్నాడు.
కాంట్రాక్టరు కామయ్య పెద్దవాడు, చక్కగా పనులు చేసి తను మిగుల్చుకుని తన కిందివారికి, పై ఆఫీసర్లకి కూడా కూడబెడ్తుంటాడు. అందువల్ల అతనంటే అందరికీ గౌరవంతో పాటు భక్తి కూడా వున్నాయి. తనతో పాటు పనులు చేసే మరో చిన్న కాంట్రాక్టర్ రాఘవని వెంట తిప్పుకుంటాడు. తన దగ్గర పనిచేసి, తను స్వంతంగా చిన్న కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు. తమకి పోటీ అని ఇద్దరిలో ఏ ఒక్కరూ అనుకోలేదు. అందుకే ఇద్దరూ స్నేహంగానే ఉంటారు. కామయ్య ఎప్పుడు కొటేషన్లు వేసినా రాఘవతో డమీని వేయిస్తుంటాడు. వారి వ్యాపారానికి అది సహజమే కూడా.
రాజారాం కొత్తగా ఇల్లు కట్టుకుని, గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం సమయానికి కామయ్య విదేశాలు వెళ్లడం వల్ల ఆ ఫంక్షన్‌కి హాజరు కాలేకపోయాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన మూడో రోజునే రాజారాం ఇంటికి రెండు తులాల బంగారు వస్తువుని తీసుకుని, రాఘవని వెంటపెట్టుకుని వెళ్లాడు. రాజారాం గృహప్రవేశానికి రాఘవ హాజరయి బహుమతి ఇచ్చి వచ్చాడు అప్పటికే, అందుకని ప్రస్తుతం కేవలం పండ్ల బుట్ట ఒకటి తీసుకున్నాడు. ఇద్దరూ రాజారాం ఇంటి బెల్ కొట్టగానే పనివాడు తలుపు తీసి, వారిని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి అయ్యగారికి చెప్పడానికి వెళ్లాడు. ఇద్దరూ కొత్త ఇంటిని, కూర్చున్న దగ్గర్నించే చూసి రాజారాం అభిరుచికి తగినట్టుగానే వుందని అనుకోగానే, రాఘవ బయటి గేటు మాత్రం ఇంటికి దిష్టి బొమ్మలా వుందనే కామెంట్ చేశాడు. అతన్ని కామయ్య వారిద్దామనుకునేంతలో అయ్యగారు పూజ ముగించుకుని, చిరునవ్వు ముఖం నిండా పులుపుకుని అక్కడికి వచ్చారు.
కామయ్య, రాఘవ నమస్కరించి ఆయనని పలకరించారు. తను గృహప్రవేశానికి రాలేకపోయిన కారణం చెప్పాడు కామయ్య, పనివాడు తెచ్చిచ్చిన టీ తాగి, తాను తెచ్చిన బహుమతిని అందజేశాడు కామయ్య. ‘‘మీరు ఆ ఫంక్షన్‌కి రాలేదు కదా ఇంకా బహుమతి ఎందుకు తెచ్చారు?’’ అంటూ మొహమాట పడుతున్నట్లు నటించి, బహుమతిని అందుకున్నాడు. కొంతసేపు ఆమాటా ఈ మాటా మాట్లాడుకున్నాక, బహుమతి ఖరీదుని అంచనా వేసుకున్న రాజారాం, ఇద్దరికీ తన ఇల్లంతా దగ్గరుండి తిప్పి చూపించాడు. ఆయన చెప్పిన ప్రతి దానికి బాగుందనీ, చాలా బాగుందనీ మాత్రమే సమాధానాలిస్తు వస్తున్నాడు కామయ్య. కొన్ని చోట్ల రాఘవ తన నాలుకని అదుపులో పెట్టుకోలేక ఒకటీ అరా ఎక్కువ మాట్లాడుతున్నాడు. చివరికి ఇంటి బయటికి వచ్చి గేటు దగ్గరికి వచ్చేసరికి, ఈ గేటు ఇలా ఉండకుండా అలా వుంటే చాలా బాగుండేదని ఉచిత సలహా పడేశాడు రాఘవ. తన అభిరుచిని అభిశంసించడమే కాకండా, చాలా చిన్న బహుమతి ఇచ్చినందుకు మరింత చిన్నబుచ్చినట్లనిపించిన రాజారాంకి రాఘవ మాటలు కొంచెం కినుక కలిగించాయి.
వచ్చిన పని పూర్తి అయింది కనుక, ఇద్దరూ రాజారాం వద్ద సెలవు తీసుకుని వెళ్లేటప్పుడు.... రాజారాం రాఘవని పిలిచి, తను కూడా గేటు విషయంలో అసంతృప్తిగా వున్నట్లుగా అని మీరు చెప్పినట్లుగా గేటు డిజైన్ చేయించి మార్చిపెట్టమని సగం ఆజ్ఞాపూర్వకంగా కోరాడు రాఘవని.
బయటికి వచ్చాక ఓ వారం రోజుల్లో ఆ గేటు తయారు చేయించి అక్కడ బిగించే ఏర్పాటు చేసుకోమని రాఘవకి, కామయ్య సలహా ఇచ్చి, ‘‘పెద్దవాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు నాలుక పూర్తి అదుపులో ఉంచుకోనందుకు నీకు ఇదే శిక్ష. గుణపాఠమూనూ’’ అన్నాడు.
యాభై వేలకు ‘టెండరు’ పడిందని అవాక్కయ్యాడు రాఘవ.

- కె.వి.సుబ్రహ్మణ్యం, 22-205, గణేష్ కాలనీ, శ్రీనివాసనగర్,
సింహాచలం (పోస్టు), విశాఖపట్నం-530 029, చరవాణి : 9440110483.

పుస్తక సమీక్ష

రసరమ్య కవిత్వం - పూలపిట్ట!

నీ జ్ఞాపకాల ఉలితో చెక్కుతున్నా, మరో తాజ్‌మహల్ని, పెదవి పరుగులు పెడుతోంది, నీ చెంత చేరాలని, నా గుండె గులాబీ సిగ్గు పడుతోంది. నీ తలపులు గుర్తొచ్చి, నాచెక్కిళ్లపై నీదంతక్షితాలు - ఘాటు ప్రేమకు సాక్ష్యాలు, తొలిముద్దు అమృతమే. తొలకరి జల్లులా, తనువంతా తడిపావు - నీ చూపుల మేఘాలతో, పరువాలకి పరమార్థం తెల్సింది, నీ చేతుల వాటిని స్పృశించాక, అంటూ ప్రళయ కవిత్వం శృంగార భావ సమ్మిళిత పరిమళాల గుబాళింపు పాఠకుల్ని గిలిగింతలు పెడుతుంది. పాఠక జంటలకు జుర్రుకున్నంత మురిపాల మధువులు ముద్దుల మాటలు ముచ్చట గొలుపుతాయి.
ఇక ప్రేయసి పలుకులు వినిన ప్రియుడు తన భావాలనిలా అంటాడు.
నీ కన్నులతో దోబూచులాడుతున్నాయి, నా కొంటికలలు, నీ పెదవి అంచున జారే నవ్వులూ నా రూపమే నిలవాలని నా ఆశ, నీ మూతి విరుపులు నా మదిలో కోహినూర్ వజ్రాల మెరుపులే, పాలరాతి శిల్పానికి అసూయ - నీనునుపు తనకు లేదని, హొయలు పోయే చినుకులు - నీ మేనిఒంపుల్ని తడిమివచ్చాయని -
కవయిత్రి సోమిశెట్టి స్వర్ణలత ప్రథమ కావ్యంలోనే చేయి తిరిగిన అనుభవశాలినిగా అగుపిస్తారు. అమ్మగురించి - అమ్మకు విశ్రాంతి లేదు - నేను ఎక్కిదిగే ఎత్తుపల్లాల్లో నన్ను కాపాడుతూ,
భోజనం చేశావా? అమ్మా! పెన్షన్ చేతికొచ్చేరోజు కదా, మరి విజయాలన్నీ నా వశమే - అమ్మతో వుంటే - అన్న మాటలు అమ్మపై అభిమానాన్ని ఆవిష్కరిస్తాయి.
కాలం గురించిన కవిత్వం - కాల చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నా నిన్ను కలిసిన క్షణాల్ని స్పర్శించాలని, కాలం ఉత్తుంగ తరంగమై ఎగిసి పడుతోంది- నీ భావం నన్ను తాకేవేళ, కాలమూ నీ పక్షమే - నీతోనే, నాపయనమంటూ వెళ్తుంది.
భావాల దొంతరలిలా - భావాల పొదుగుని పితుకుతూనే ఉంటా - నా కలం ఊపిరి ఆగేవరకు, భావజాలం బరువు ఎక్కువవుతోంది - అక్షరమై ప్రసవించకపోతే, మునివేళ్లది ఎప్పుడూ ముందడుగే - చెక్కిలి వీణపై రాగాలు పలికించడానికి.
ఆశల అక్షరాలిలా - అక్షర ఖడ్గాలు సిద్ధంగా ఉండాలి - అన్యాయాల్ని ఎదిరించడంలో నాలుగు నవ్వుల్ని కొసకురావూ - తిమిరానికి తినిపిద్దాం. చితికిన జ్ఞాపకాలెన్నో - జీవంలేని నవ్వుల్లో. మసకమసకగా కన్పడే మాతృభూమి - లోహవిహంగమెక్కగానే.
ఊహల అక్షరాలిలా గిలిగింతలు పెడతాయి. చుక్కలు సిగ్గుపడుతున్నాయి. మన చూపుల రాపిడికి. పరువాల కలశం నిండుతోంది. - నీ ఊహల జలంతోనే, మేనికీ మెరుపులే - నీ జ్ఞాపకాల కోనేటిలో తానమాడితే.
కదిలే కాలమే నామనసు - భావాల ఊట ఊరుతున్నంతవరకు, ఆమె ఆకాంక్ష ఇలా - అక్షరాలు యజ్ఞం చేపట్టాయ్ - నిరక్షరాశ్యుల కళ్లలో వెలుగులు నింపాలని, ముగ్గురు పేర్వడిన కవులు ఈ కావ్యానికి ముందు మాటల ముత్యాల్ని అద్దారు. ఇలా ఈమె కవిత్వం ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది. తీయని మధువుల్లో విందు చేయిస్తుంది. ఈమెని అభినందిస్తూ సమాజ వికాసానికి మరిన్ని కావ్యాల నందించాలని కోరుకుందాం.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : సెల్ : 9293327394.

మనోగీతికలు

జలం
పంచభూతాలలో ఒకటైన జలం
మానవులకు దైవ సమానం
జీవరాశికంతటికీ జీవనాధారం జలం
పైరుకు బలం జలం
రైతుకు జీవం జలం
కరవును తరమికొడుతూ
విద్యుత్తుకు బాసటగా నిలిచేది జలం
పరిశ్రమలను నడిపేది జలం
ప్రతివారికీ బతుకునిచ్చేది జలం
మోడు చిగురించాలంటే అవసరం జలం
జనుల దాహార్తి తీరాలంటే కావాలి జలం
జలం అందితేనే జీవులకు బలం
అందుకే జలవినియోగంలో
మనమంతా పాటించాలి పొదుపు
ఇంకుడు గుంతలు తవ్వి
వర్షం నీటిని ఒడిసి పట్టి
జలాన్ని సంరక్షించుకుందాం
మన బతుకులను పండించుకుందాం
చెరువులను కాపాడుకుని
భవితను బంగారుమయం చేసుకుందాం
భూగర్భ జలాలను పెంచుకుని
మునుముందుకు సాగుదాం
గలగల పారే సెలయేళ్లు,
ఒద్దిగ్గా ఉండే తటాకాలు
జన సమూహాల చుట్టూ
హారాలై కనువిందు చేయాలి
మానవుల అవసరాలు తీర్చాలి
అప్పుడే పుడమి సస్యశ్యామలం అవుతుంది
మానవాళి సుభిక్షంగా మనగలుగుతుంది
అందుకే జలానికి అంతా హారతి
అప్పుడే భూమి భారతికి చేకూరుతుంది చేవ
జనులందరికీ అందుతుంది జవం జీవం

- చెన్నా లక్ష్మణరావు,
పాచిపెంట పోస్టు,
విజయనగరం జిల్లా.
సెల్ : 8985914107.

స్వప్నసుందరి
నీ ముగ్ధ మనోహర రూపం
అనుక్షణం నన్ను అల్లరి పెడుతోంది
కంటికి నిద్ర, కడుపుకి ఆకలి, నోటికి రుచి
ఏవీ తెలియకుండా నీ ధ్యాసలోనే గడిచిపోతుంది
నీ సుందర రూపం దీపంలా మదిలో
వెలిగిపోతుంటే సూర్యకాంతి కూడా
నీ ముందు వెలవెలబోతుంది
పకపకా నీ నవ్వు వినిపిస్తుంటే
ఆరవిచ్చిన పూవులు కూడా చిన్నబోతున్నాయి
తీయని నీ పలుకులు వినిపిస్తుంటే
చిలకలు అసూయతో ఎగిరిపోతున్నాయి
నీ నడకను చూసి హంసలు
ఈర్ష్యపడుతున్నాయి
రంభ, ఊర్వశి, మేనకలు
ఎదురొచ్చి ఆహ్వానించినా
నీ చూపు వారి వైపు మరలటమే లేదు
ఇన్ని ప్రత్యేకతలున్న ఓ సుందరీ
నువ్వు కనిపిస్తున్న ప్రతిసారీ
నన్ను నేను మరచిపోతుంటాను
కలల్లోకి జారిపోతుంటాను
అక్కడా నీ రూపమే కనిపించి
మది గదిని పులకింపజేస్తోంది!

- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస-532185.
శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9550443449.

బాధ్యత
బందీ అయింది!
కాల ప్రవాహం
కొందరి జీవితాలతో ఆడుకుంటుంది
మనస్సుపై గాయాలు చేసి
మానసిక వికలాంగులుగా తయారు చేసి...
ఉన్నా... ఒక వేళ బ్రతికి ఉన్నా
పూర్వజన్మ పాపాలనుకుని
పశ్చాత్తాప పడుతూ
ఉత్తములుగా మారి జీవించాలనుకున్నా
అవే దెబ్బలు, అవే గాయాలు!
మారని ఈసడింపులు, ఎదురయ్యే అవమానాలు
తన తప్పు లేదని తెలుసుకున్నా
వీడని ఆటుపోట్లు!
బతుకులో కొంత సమయం కేటాయించి
లేదా దినచర్య అయ్యాక
రాత్రి విశ్రాంతి సమయంలో
ఒంటరిగా నిశ్శబ్ద సంగీత ఝురిలో
లోతుగా తొంగి చూస్తే-
అటువైపుగా... పరిశోధన చేస్తే
అర్థమవుతుంది
ఎక్కడో, ఎవరో ‘బాధ్యత’ను బంధించారని!
ఆ దేశభక్తిని ఆ మానవతను
కాలితో తనే్నశారని!!
అందుకే-
రోడ్లపై తాగుబోతుల వీరంగం
విద్య కోసం పట్టణాలకొచ్చి,
వ్యసనాలకు బానిసై-
గొలుసులు తెంపుకొనిపోవడాలు...
ప్రపంచాన్ని పట్టించుకోకుండా
విరాగిలా మారి కాలం గడిపే జీవులు
వీటికి తల్లిదండ్రులు, స్నేహితులు,
సహచరుల బాధ్యత లేదంటారా...
పెంపక లోపం కాదంటారా?
తమ గురుతర బాధ్యత మరువలేదంటారా?

-కృష్ణ
9493802010

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- ఎ. సీతారామారావు