విశాఖపట్నం

శిథిలపత్రం! ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చక్రపాణిగారు నమస్కారమండీ’’ అంటూ పట్ట్భా వచ్చి ఆయన ముందు కూర్చున్నాడు.
చక్రపాణి చిరు మందహాసంతో పట్ట్భాని చూశారు. పట్ట్భా అందరికీ తలలో నాలుకలాంటివాడు. ఆ హోమ్‌లో అడ్మినిస్ట్రేషన్, ఆఫీసు పనంతా తనే చూసుకుంటుంటాడు.
చక్రపాణిగారిని ఆ హోమ్‌లో కొన్నాళ్లుగా చూస్తున్నాడు. అతన్ని ఎప్పటి నుండో ఒక మాట అడగాలని అనుకుంటున్నాడు. ఇవాళ ఎలాగైనా అడగాలని, ఆ మాట ఈ మాట కలుపుతూ కొంత చనువు తీసుకుని సంశయాత్మకంగానే అడిగాడు.
‘‘చక్రపాణిగారు ఈ హోమ్‌లో ఇంత గార్డెన్ ఉంది. పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ వాకింగులకి వెళుతూ అందరూ ఎంతో హాయిగా ఉత్సాహంగా ఉంటుంటారు కదా. మరి మీరెందుకు సార్ ఏకాంతాన్ని కోరుకుంటూ వౌనంగా గడిపేస్తుంటారు? మనసు విప్పి చెప్పుకుంటే కదా భారం తగ్గుతుంది’’
‘‘నేను కష్టాలు పడ్డవాడిని. ఎవరికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు’’
‘‘సార్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఏక్సిడెంట్స్. తప్పవు వాటి గురించే తలచుకుంటూ బతుకు బండిని ఈసురోమని లాగితే జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరింత బాధిస్తుంటాయి. చెప్పండి ఎందుకు ఒంటరితనాన్ని కోరుకుంటూ ఈ ఓల్డేజ్ హోమ్‌లో చేరారు?’’ అడిగాడు పట్ట్భా.
దానికి చిన్నగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టారు చక్రపాణిగారు.
‘‘అప్పట్లో నేను జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్టారు ఉద్యోగం చేస్తుండేవాడిని. నెమ్మదితనం, మంచితనం, అందం అన్నీ కలబోసిన గృహిణి నా భార్య నాకు ఇద్దరు కొడుకులని ఇచ్చింది. నేను హెడ్‌మాస్టారిగా పదోన్నతి పొందాను. పిల్లల్ని బాగా చదివించాను. పెద్దాడికి మంచి ఉద్యోగం వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాడు. వాడు ఒంటరిగా ఉంటున్నాడు అవస్థ పడుతున్నాడని నా భార్య బాధపడేది. మంచి సంబంధం చూసి వాడి పెళ్లి చేశాం. రెండవవాడు బాగా చదువుకున్నాడు. తెలివైన వాడు కానీ అన్నయ్యకు వచ్చిన లాంటి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వచ్చే ఉద్యోగాలన్నీ వదులుకునేవాడ. నా మాట వినేవాడు కాదు. ఎందులోనో ఒక దానిలో చేరితేనే కదా అనుభవం వచ్చేది. ఈ మధ్య ఏ మంచి ఉద్యోగానికైనా రెండు మూడేళ్ల అనుభవం అడుగుతున్నారు కదా అని చెప్పి చూశాను. వాడు నా మాట వినలేదు. అన్నయ్య పట్ల తీసుకున్న శ్రద్ధ నా పట్ల మీరు తీసుకోలేదని, తాను దురదృష్టవంతుడిని అని బాధ పడేవాడు. నా భార్య నాతో మాట్లాడుతూ చిన్నవాడు ఉత్సాహంగా ఉండడంలేదని అనేది. ఎవరి కాళ్లయినా పట్టుకుని వాడికి మంచి ఉద్యోగం వేయించమని అడిగేది. తెలిసిన వాళ్లందరినీ అడుగుతూనే ఉన్నాను. ఇంతలో నా భార్యకి జబ్బు చేసింది. డాక్టర్లు మందులు, టెస్టులు రాశారు. అన్నీ చేసి వైద్యం మొదలుపెట్టాం. అయినా ఆమె అనారోగ్యం తగ్గలేదు. పెద్దవాడికి ఫోన్ చేస్తే భార్యతో పాటు వచ్చాడు. ఫలితం లేకపోయింది. నా భార్య దివంగుతురాలైంది. నా భార్యకి నేను సరైన వైద్యం చేయించకపోవడం వల్లే ఆమె చనిపోయిందని నా పెద్దకొడుకు ఆరోపించాడు. అతని మాటలకి చిన్నకొడుకు కూడా వంత పాడాడు. అన్నదమ్ములు నాపై వేసిన నిందని భరించలేకపోయాను. అంతా నన్ను ఒంటరిని చేశారు. దీంతో నాకో ఆలోచన వచ్చింది. నిజానికి ఇటువంటి వయసులోనే ఆడకి మగ మగకి ఆడ అవసరం ఉంటుంది. కనుక నేను మళ్లీ నాకు ఈడూజోడూ అయిన స్ర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. తెలిసిన వారికి ఈ సంగతి చెప్పాను. దానికి వారు నాకో సలహా ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే ఎవరైనా పేద మహిళని చేసుకోవాలని, ఆమెకి జీవితం ఇచ్చిన వారు కావాలని అన్నారు. ఆ మధ్య ఒకాయన భర్త పోయిన వితంతువు ఒకావిడ ఉందని చెప్పాడు. ఈ విషయం పెద్దాడికి చెప్పాను. అతను అమ్మలాంటి స్ర్తి అయితే ఫర్వాలేదని, అయినా తాను ఇక ఇక్కడికి రానని చెప్పేశాడు. రెండవ వాడు మాత్రం నాకు ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యే వరకు ఆగండి అన్నాడు. నా భార్య స్థానంలో శ్యామల అనే మహిళ అడుగు పెట్టింది. నాకు సేవలు చేస్తోంది. చిన్నవాడు అమ్మ స్థానంలో ఆవిడని చూసి మసలలేకపోయాడు. ఒకరోజు ఇంటర్వ్యూకి చెన్నై వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైనా రాలేదు. ట్రైన్ ఏక్సిడెంట్‌లో చనిపోయాడని పిడుగు లాంటి వార్త వచ్చింది. నేను షాక్ తిన్నాను. తనకి ఉద్యోగం వచ్చి, పెళ్లి అయ్యేంత వరకు ఆగమన్న వాడి దీనమైన ముఖమే నాకు కనిపించింది. నా వయసును కూడా మరిచిపోయి చేయకూడని పని చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. నేను కసాయివాడిని. నా మనసు రోదిస్తోంది. కానీ ఆ ఏడుపు పైకి రావడంలేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే మీ దగ్గరకి రానని పెద్దవాడు చెప్పి వెళ్లిపోయాడు. చిన్నవాడు నా సుఖానికి అడ్డు లేకుండా తప్పుకుని పోయాడు. భగవంతుడా నేను దోషిని, నా మనసు నాకు కోర్టు. నాకు నేనే జడ్జిని. నా శిక్షను నేనే వేసుకుంటాను. అడ్డు చెప్పకు దేవా అనుకున్నాను. శ్యామలకు చెప్పాను నా గురించి ఆలోచించవద్దని. నీ జీవితంలో నా పాత్ర ఒక పీడకల అని. నువ్వింకా నలభయ్యో పడిలో ఉన్నావు. ఎవరైనా విశాఖ హృదయం ఉన్నవాడు నిన్ను నిన్నుగా కోరుకుంటే పెండ్లి చేసుకో సుఖపడు. ఈ ఇల్లు నీకే రాసిస్తాను. నా పెన్షన్ సొమ్ములో కొంత నీ అకౌంటులో పడే ఏర్పాటు చేస్తాను అని చెప్పాను’’ అని ఆగారు చక్రపాణిగారు.
పట్ట్భా వింటున్నాడు.
‘‘అలా పొరపాటు నిర్ణయం తీసుకుని అయిన వాళ్లకి కాని వాడిని అయిన నేను ఇక వారికి ముఖం చూపించలేకపోయాను. అందుకే నలుగురిలోకి రాలేక ఎవరినీ కలవడానికి కూడా ముఖం చెల్లక ఇలా ఒంటరిగా శిథిలపత్రంలా కాలం గడిపేస్తున్నాను’’
చక్రపాణిగారు చెప్పింది విని పట్ట్భా దీర్ఘంగా నిట్టూర్చాడు.
చక్రపాణిగారు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు తనకు చివరకు మిగిలింది అదే కదా అన్నట్లు.

- పుష్ప గుర్రాల,
విజయనగరం. సెల్ : 9949040924.

పుస్తక సమీక్ష

కళింగాంధ్ర జానపద ముఖచిత్రం

జనపదం నుండి వచ్చిందే జానపదం. దీనికి మూలాలు పల్లెజీవన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, వేషభాషలు, యాసలు, మాండలికాలు వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రాంతరీత్యా భౌగోళిక విభజనలోంచి పలు అంశాల వారీగా పాటలు, గేయాలు, జానపద కళలు ఊపిరి పోసుకున్నాయి. ఇలాంటి సందర్భంలోంచి పుట్టుకొచ్చిందే ఈ కళింగాంధ్ర జానపదగేయాలు అనే పల్లెపాటల పుస్తకం. దీని రచయిత బద్రి కూర్మారావు. గతంలో ఉత్తరాంధ్ర జానపద కళలు పేరుతో ఇప్పటికే ఒక పుస్తకాన్ని ప్రచురించి ఉన్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తిపరంగా జానపద సాహిత్య పరిశోధనకూ, పరిశీలనకూ, సేకరణకూ తన కళాజీవితాన్ని ధారబోసిన రసజ్ఞుడైన సాహితీ పిపాసి బద్రి కూర్మారావు. అనేక కష్టనష్టాలకు, శ్రమకు ఓర్చి, శక్తికి మించిన పట్టుదలతో ఈ సాహసానికి ఒడిగట్టారు. ఈ కళింగాంధ్ర జానపద గేయాలలో అనేక బాణీలకు, రీతులకు, యాసలకు సంబంధించిన పాటల సేకరణ జరిగింది. ఆటపాటలతో కూడిన నృత్యాలు, సామెతలు జానపద కళలలో ఒక భాగమే. ఇలాంటి చారిత్రక సందర్భంలోంచి ఏర్చికూర్చిన ఈ పద సంపదను ఒకచోట పదిలపరిచి వ్యాప్తి చెందించడమే దీని ప్రత్యేకత. ఇటువంటి అక్షర యజ్ఞానికి తనవంతు తోడ్పాటును అందించి, కళాత్మక విలువలకు పట్టం కట్టిన కూర్మారావు ఎంతైనా అభినందనీయుడు.
ఈ కళింగాంధ్ర జానపద సాహిత్యంలో అనేక రకాల పాటలు, గేయాలు, తత్వాలు, బాణీలు, వీరగాధలు, జాతరలు, కథలు ముడిపడి ఉన్నాయి. శ్రమ సౌందర్యంలోంచి అలుపెరగని కష్టజీవుల ఉచ్ఛ్వాసనిశ్వాశాల గుండెచప్పుళ్లు అక్షర జలపాతాలుగా ప్రవహించి శ్రోతలను, పఠితలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ తపనలోంచి ప్రాణం పోసుకున్న వాటిలో పిల్లల పాటలతోపాటు రామాయణం, భారతం, భాగవతం పాటలు మనల్ని రసకందాయంలో ముంచెత్తుతున్నాయి. ఇంకా స్ర్తిల, పెళ్లి, అమ్మవారి, తులసమ్మ, పొలం, గైరమ్మ, సంక్రాంతి, సరస శృంగార, చెక్క్భజన, సింహాద్రి అప్పన్న, తిరుపతి వెంకన్న, ఉద్దానం, జముకు, గిరిజన, సవర,వలస, మంగళహారతుల, శ్రామిక పాటలు ఉర్రూతలూగించి ఉద్వేగభరితానికి గురిచేస్తాయి. కాలానుగుణమైన నడకతో, శైలితో, సరళత్వంతో, సూటిదనంతో సొగసైన తెలుగుతనపు నిగారింపుని, నిర్మలత్వాన్ని, నిజాయితీని, నిబద్ధతని అక్షరీకరించడంలో అందెవేసినతనం కనిపిస్తుంది. పలుసంస్కృతుల వారసత్వ మేళవింపు గుభాళిస్తుంది. సున్నితత్వం, వ్యంగ్యం, భక్తి పారవశ్యత, సంప్రదాయక తీరుతెన్నులు, పల్లె స్వచ్ఛదనం, ఇతిహాసాల గొప్పదనం, ప్రకృతి రమణీయత, వీరధీర లక్షణాలు, తాత్విక భావనలు, ఆధ్యాత్మిక స్తుతి,వ్యవహారిక మనుగడ రహస్యాలు, సరసత్వం, కోమలత్వం, రైతు, కులవృత్తుల ప్రస్తావన, సాంఘిక ఆచార వ్యవహారాల రీతులు, కుటుంబ స్థితిగతుల పరిస్థితులు- వరుసలు, భావుకత లాంటి అంశాలు అంతర్లీనంగా బొమ్మకడతాయి. వీటి మూలాల లోతులను తడమాలంటే, ఒక్కసారి ఆ పదవరసల విన్యాసాల పరవళ్లను రుచి చూడాల్సిందే!
చెప్పుకో చెప్పుకో - చెప్పుదెబ్బలు కాసుకో
మామిడాకు తెచ్చుకో - మంతరించుకో
చిక్కుడాకు తెచ్చి - చిత్తగించుకో అని పిల్లలు దెబ్బలాడుకునే సమయంలో అమ్మకు ఫిర్యాదు చేసేటప్పుడు పాడుకునే బాలగేయమిది. వ్యంగ్యధోరణి హాస్యపూర్వకంగా ధ్వనిస్తుంది ఇందులో. కనుమరుగవుతున్న బాల సాహిత్యాన్ని తిరిగి నిలబెట్టే సంస్కృతిలో భాగమిది. మంచి ప్రయత్నానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవాలి.
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే భాగవతం పాటలు గొప్పతనాన్ని ఇనుమడింపజేసే తపన దీనిలో కనిపిస్తుంది.
రేపల్లెవాడలో చెంచీత / గోపమ్మ నీవాడేవోయ్ భామ/ కృష్ణమ్మ జన్మించె నందనా / నల్లనల్లని వాడు నందాన / చిలిపికన్నులవాడు నందాన / పసిడి పలుకులు తండ్రినందాన అని పాడుకుంటారు. నరసింహస్వామి చెంచులక్ష్మిని పెళ్లాడే సందర్భంలో చెంచులు బృందాలుగా ఏర్పడి ఆలపించే పాట ఇది.కృష్ణుడు చెంచుభామగా పాడుకుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని ప్రతిఫలించే గీతమిది.
స్ర్తిల పాటల్లో లాలిపాటలకు ప్రత్యేక స్థానముంది. దీని స్థాయిని అర్థవిపులంగా తెలియజేసే పాట ఇది.
జో అచ్చుతానంద జోజో ముకుందా / లాలి పరమానందా రామగోవింద / తొలుత బ్రహ్మండంబు - తొట్టెగా వేసి / నాలుగూ వేదములు - గొలుసులమరించి / బలువైన ఫణిరాజు - పాన్ముల మరించీ అంటూ పాడుకోవడంలో ఉన్న ఔన్నత్యం సనాతన సంప్రదాయానికి ఒక మచ్చుతునకగా భావించాలి.
పెళ్లిపాటల విషయానికొస్తే వధూవరులు పీని దిగిన తర్వాత దిష్టితీసి హారతి పళ్లెంతో పాడేపాట ఒకటుంది.
లక్ష్మి కళ్యాణా వైభాగ్యము
సీతా కళ్యాణా సౌభాగ్యమూ
అది రక్షకరాణీ అమ్మా శార్వాణీ అంటూ అసంపూర్ణంగా మిగిలిపోయిన గీతమిది. హిందూ సంప్రదానికి కుండగుర్తుగా నిలిచిపోతుంది.
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ / చిత్రమై తోచునమ్మా గౌరమ్మ/ పాలించి ఏలుకొమ్మా నిరతముగా / బంగారు ముద్దుగుమ్మా గౌరమ్మ వంటి గైరమ్మ పాటలు చెరువు గట్టువద్ద పాడతారు. నందెన్న సంబరాలుగా ఇవన్నీ స్ర్తిలు పాడుకునే పాటలుగా గుర్తింపు పొందాయి.
పాటల్ని తత్వాలుగా వినిపించే మరొక సంప్రదాయముంది. యిల్లు యిల్లనియేవు! యిల్లు నాదని యేవు/ నీయిల్లు యెక్కడే చిలుకా / ఊరికి ఉత్తరాన! సమాధి పురములో వంటి తత్వాల్లోని జీవన తాత్వికత పరాకాష్ఠకి చేరుకుంటుంది. మోక్షప్రాప్తికోసం పరమాత్మని ఆశ్రయించాలని ఇవి చాటిచెబుతాయి. కాలజ్ఞానం పే పేరుతో పోతులూరి వీరబ్రహ్మంగారి తత్వాలు జగద్విదితమయ్యాయి.
వీరచరిత్రల్లో భాగంగా వీరగాధలు అనేకం వినుతికెక్కాయి. రాజ్యానికి దేవుడు / భూలోక చంద్రుడు/ బుద్ధిమంతుడును/ స్వామి అంశం గల పుత్రుడు/ పేరుగల పెద్దిరాజు / కొడుకు కాటమరాజ అంటూ కాటమరాజు కథను కళ్లకు కట్టిస్తాయి. మన్యం, బొబ్బిలి గాథలతో - పాటు యాదవుల వీరగాథలు రూపుకడతాయి.
విజయనగరం పైడితల్లమ్మకి చెందిన జముకులపాట బహుళవ్యాప్తి పొందింది.
పైడమ్మా రాజుగారి చెల్లెలివి / నాలుగ్గబురుజులకోట / కోట గోడలపైన / కొలువైయున్నావు అని స్తుతిస్తూ పైడమ్మ చరిత్ర కథను విప్పి చెప్పడంలో ప్రధానపాత్ర వహించింది.
జానపద వాజ్మయంలో మందులోడు పాటకి ప్రత్యేక స్థానముంది.
మందులోడా ఓరి మాయలోడ - మామరారా గోపిచిన్నవాడా అంటూ చెవికోసుకునే గొప్ప గొప్ప పాటలు జానపద సంపదగా కొనసాగుతూ వస్తోంది.
ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు కవి వంగపండు ప్రసాదరావు రాసిన పాట సిక్కోలు ఉద్యమాన్ని ఒక్క ఊపు ఊపింది.
ఏం పిల్లడో/ఎల్దామొస్తవా/ ఏం పిల్లో/ఎల్దామొస్తావా/శ్రీకాకుళం ఆసీమ కొండకు అంటూ యాసకు ప్రాణం పోసి విప్లవ పోరాటానికి ఊపిరిలూదింది.
సుబ్బారావు పాణిగ్రాహి జముకుల పాట ఎందర్నో ఉత్తేజుతుల్ని చేసింది.
కమ్యూనిష్టులం / మేము కష్టజీవులం/అవునన్నా కాదన్నా/ అదే నిష్టులం అంటూ కవితామయం చేసిన ఘనత ఈ కవిది. ఉత్తరాంధ్ర జానపద బాణీలు సినీగీతాలలో పరిమళించి పతాక స్థాయికి చేరకున్నాయి. ‘అత్తర్ సాయిబో రారా/అందాల మామయ్యో నువ్వేరారా’ అంటూ ఉర్రూతలూగించింది. ‘అంతన్నడు ఇంతన్నడూ గంగరాజు / ఇద్దరికీ ఈడన్నాడు గంగరాజు’లాంటి వ్యంగ్య విరుపులు కొసమెరుపులతో ప్రతిధ్వనించాయి. ‘నన్ను కొట్టకురో తిట్టకురో మామ సుబ్బులు మామ/నా మీద ప్రేమ తగ్గెనురో మామ సుబ్బులు మామ’ వంటి జానపద రీతి ఆబాలగోపాలాన్ని అలరించి అక్కున చేర్చుకుంది. ‘రాను రానంటూనే చిన్నదో చిన్నదో/రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది’ అనే పల్లవి తెలుగు పెదవులపై పలకని నోరే లేదు. ‘గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా/గాజువాకే పిల్లా మాది గాజులోళ్లమే పిల్లా మేము’ అంటూ ఎగిరెగిరి మీద పడే నృత్యాల సందర్భాలు కోకొల్లలు. ఒరియా జానపద బాణీలో సాగిన ‘రంగోబోతిరే రంగొబోతి/ ఏ రంగొబోతి రంగొబోతి/కోనా కోలోత’ గీతం ఒక్క కుదుపు కుదిపిందనే చెప్పాలి. శ్రామిక పాటల్లో భాగంగా ‘అప్పారావు బాతులప్పారావు /అందగాడు మందుల చిన్నోడు/బాతుల చిన్నోడు’ అనే బాతులప్పారావు పాట పల్లవాసులందరికీ బాగా సుపరిచితమే. మామ మరదలు పిల్ల మధ్య సాగిన వారాలతో పాట సహజ శైలిలో దూసుకుపోతుంది. ‘ ఆదివారం నేనొస్తాను పిల్ల/అద్దం పైన తెస్తను పిల్ల/ ఆదివారం నీవు రాకుర మామ/ అద్దంపైన తేకుర మామ’ అంటూ సహజత్వానికి దగ్గరగా కొంటెకోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇలా లెక్కకు మించిన జానపద గీతాలు ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తూ ప్రజల నాల్కలపై శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ గీతాల వెనుక తొంగిచూసే సహజ సౌందర్యంతో పాటు, మార్ధవంతో లాక్కెళ్లిపోయే అంతర్లయ జంట ప్రవాహాలుగా కొనసాగి చెరగని ముద్రను వేసుకున్నాయి. ఈ బహుముఖ పార్శ్యాన్ని వివిధ కళారూపాల్లో, నృత్యరీలతో జనరంజకంగా అందించడంలో పలువురి ప్రతిభామూర్తుల నిరంతర కృషి, తపన ఆదర్శప్రాయంగా తోస్తుంది. ఈ స్ఫూర్తిని అందించిన లబ్ధిప్రతిష్టులలో బిరుదురాజు రామరాజు, నేదునూరి గంగాధరం, ఆర్.వి. ఎస్. సుందరం, జయధీర్ తిరుమలరావు, ఇంకా కళ్లకు కట్టని అజ్ఞాత సృజనకారులు విశేష ప్రతఙబ కనబరిచి భావితరాలకు మార్గదర్శకంగా నిలిచారు. ఈ కోవకి చెందిన జానపద గీతానే్వషకుడే బద్రి కూర్మారావు. లోతైన పరిశీలనతో తులనాత్మక అధ్యయనం చేసి పుస్తక రూపంలో పాఠకప్రియులకి కానుకగా అందించారు. ఈ ప్రజా కళల్ని తమ గళాలతో ఆలపిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్న అపురూప గాయక కళాకారులు అసంక్యాకంగా ఉన్నారు. యాంత్రిక జీవితంలో అలసిపోయిన సంగీతప్రియులకి ఈ గీతాల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సాంస్కృతిక విలువల్ని కాపాడుకుంటూ వస్తున్న అక్షరయోధుడు బద్రి కూర్మారావు కృషిని అభినందించాల్సిందే.

- మానాపురం రాజా చంద్రశేఖర్
సెల్: 9440593910.

మినీకథ

ప్రేమతో...
‘‘ఏమండీ ఇవాళ సాయంత్రం అబ్బాయినీ, కోడల్నీ అలాగే మనవడినీ చూడ్డానికి వెళతానన్నారు కదండీ’’ అన్న భార్య మాటలకి వెంటనే తయారై స్టీల్‌ప్లాంట్‌కి బయలుదేరాడు రామానుజం.
టిఫిన్లు అవీ అయిన తర్వాత తండ్రీకొడుకులిద్దరూ కూర్చుని మాట్లాడుకోసాగారు.
‘‘రిటైర్ అయిన తర్వాత ఎలా కాలక్షేపం అవుతుంది నాన్నగారు?’’ అడిగాడు దిలీప్ తండ్రిని.
‘‘నువ్వు కొనిచ్చిన కంప్యూటర్ ఉందిగా. దాంతో నాకస్సలు టైమ్ ఎలా గడుస్తుందో తెలియడంలేదు. చాలా బాగుందిరా’’ అన్నాడు.
సరిగ్గా అప్పుడే దిలీప్ కంప్యూటర్‌లో నుండి ‘టైం టు మీట్ వరుణ్’ అంటూ వినిపించసాగింది. వెంటనే దిలీప్ లేచి వెళ్లి మెసేజీని ఆపేశాడు.
‘‘చూశారుగా నాన్నగారు మీ కంప్యూటర్‌లో కూడా ఇలాగే సెట్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఏయే పనులు చెయ్యాలో ముందుగానే ఆలోచించుకుని కంప్యూటర్‌లో సెట్ చేసుకుంటే సరిగ్గా ఆ సమయానికి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎలా సెట్ చెయ్యాలో నేర్పుతాను రండి’’ అన్నాడు దిలీప్ తండ్రితో.
‘‘వద్దురా దిలీప్ ఎంత కరెక్టుగా జ్ఞాపకం చేసినా అది ఒక కంప్యూటరే కదా! అందులో నుండి వచ్చేది మెకానికల్ వాయిసే కదా. కానీ టైముకి మీ అమ్మ కూడా ‘ఏవండీ సాయంత్రం మనవడిని చూడ్డానికి వెళతానన్నారు కదా’ అంటూ ప్రేమగా చెబుతుంది. ఈ ప్రేమనురాగాలు కంప్యూటర్‌లో రావు కదా!’’ అన్నాడు.
‘‘సరిగ్గా చెప్పారు మామయ్య’’ అంది అప్పుడే అక్కడికి వచ్చిన రామానుజం కోడలు నవ్వుతూ.

- వసంతకుమార్ సూరిశెట్టి, నెల్లిమర్ల-535217.
విజయనగరం జిల్లా. సెల్ : 8297191810.

మనోగీతికలు

విముక్తి కోసం ఎదురుచూపు
సిరిమల్లె పువ్వులాంటి నవ్వుతో
అపరంజి బొమ్మలాంటి అమ్మాయి
నా మదిని దోచే
ఆ మనోహర రూపం
నా మనోఫలకంపై
చెరగని ముద్ర వేసింది
ఆమె చూపులు నాలో ఆశలు రేపాయి
అందమంటే ఏమిటో
అందమైన వాళ్లెవరో
ఉత్సుకత పెరిగింది
ఆ ఆలోచనా స్రవంతిలో
అదొక రంగుల ప్రపంచం
రకరకాల రామచిలుకలు
మమూరి నాట్యాలు
కోయిల పాటలు
ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
అన్ని రంగుల సమ్మేళనమే ఈ ప్రకృతి
పువ్వుల లోకంలో
మనసును కట్టి పడేసే
సుందర కుసుమాలు ఎనె్నన్నో
ముద్దమందరాలు గులాబీలు
మల్లె జాజి సంపెంగలు
జడను చేరేవి కొన్ని
గుడిని చేరేవి కొన్ని
ప్రకృతిలో అన్నింటినీ దర్శించా
కాని అందాల్ని
నిర్వచించలేకపోయా
తర్కిస్తే అప్పుడు అర్థమైంది
సృష్టిలో అన్నీ అందమైనవేనని
మనిషికి ఉండాల్సింది
అందమైన మనస్సని!

- పట్రాయుడు కాశీవిశ్వనాథం,
ధర్మవరం.
సెల్ : 9494524445.

గజల్
కలల కొలనులో కలువలన్నింటినీ కోసేవాడిని పట్టుకో
మేకులు కొట్టి దారులన్నింటినీ మూసేవాడిని పట్టుకో
వెలుగు లేక వెలతన్నీ మూటలై వీధిని పడి ఉన్నా
కూడు గూడు ఇవ్వక కోతలు కోసేవాడిని పట్టుకో
దేహ రహస్యం వీధిని బడితే ఏమైనా ఉందా
ఇంటి గుట్టు పొరుగింటి వాడికి మోసే వాడిని పట్టుకో
తరతరాలకు సరిపడి ఉన్నా దాహం తీరకపోతే
దొంగలాగ ఈ దేశ ప్రజలను దోచే వాడిని పట్టుకో
నమ్మిన వానికి మనసునర్పించు
మనసును, మనిషిని
ముక్కలు ముక్కలుగా చేసేవారిని పట్టుకో!

- కిలపర్తి దాలినాయుడు,
సాలూరు,
సెల్ : 9491763261.

రక్తదానం!
రక్తదానం మహాదానం
దశదానాల కన్నా
రక్తదానం మిన్న
రక్తదానం ముక్తిదాయకం
దానం చేస్తే రక్తం
నిలుస్తుంది ఆపన్నుల ప్రాణం
రక్తదానం చెయ్యండి
ప్రాణదాతలు కండి
రక్తదానం దాతకు చేస్తుంది మేలు
చైతన్యవంతమయి
అపోహలు విడనాడు
రక్తదాతలకు కావాలి ప్రోత్సాహం
మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి
చేయండి రక్తదానం
సర్వ జనుల సుఖం కోసం
అంతా చేయాలి రక్తదానం
సర్వేజనా సుఖినోభవంతు!

- చెన్నా లక్ష్మణరావు, పాచిపెంట,
విజయనగరం జిల్లా.
సెల్ : 8985914107.

తెలుగు సుధ
తేనెలొలుకు భాష తియ్యనైన తెలుగు భాష
తెలుగువారి భాష తెలుగు భాష
మానవీయ తెలుగు మది నిండా వెలుగు
జగతి జనుల వెలుగు మహిలోన మన తెలుగు
తెలుగు వనములోన మొలిచింది తేనెపట్టు
తాగి వె(మె)లుగు వారె తెలుగువారు
మధురమైన పలుకు మది నిండుగా పలుకు
ఆర్ధ్రతున్న పలుకు అమ్మ పలుకు
పరభాషను రసపోషణ పచ్చిపాలన
మీగడ వెతుకు తీరుగనుండు
ఉగ్గుతోడన వచ్చు అమ్మ భాషను విడచి
చేయవలదు
ఎంచి చూదుమన్న ఎన్ని భాషలున్న
అమ్మ భాషకన్న లేదిలను మరి మిన్న
తెలుగు గీతం పాడు తెలుగు నాట్యం ఆడు
తెలుగు సాహితీ సుధను
తెలుగు వారికి పంచు
తెలుగు భాషకు దీప్తి తెలుగు వ్యాప్తికి శక్తి
తెలుగు ప్రభలకు దిక్కు మన మాతృమూర్తి!

- మండా శ్రీ్ధర్, శ్రీకాకుళం.
సెల్ : 9493309030.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- పుష్ప గుర్రాల