పశ్చిమగోదావరి

ఉరుకులు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన అధికార్లు
ఆకివీడు, డిసెంబర్ 22: భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 25వ తేదీన అయిభీమవరం రానున్న సందర్భంగా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అయిభీమవరం రహదారి నిర్మాణాన్ని హడావుడిగా ప్రారంభించారు. అలాగే ఆదర్శ కానె్వంట్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో మూడు హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. మంగళవారం రాష్టప్రతి పర్యటన ప్రాంతాలను ఇంటిలిజెన్సీ డిఐజి ఎవిఎస్ రామకృష్ణ, జిల్లాకలెక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అయిభీమవరంలోని వేదపాఠశాల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో కంచికామకోటి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ ధ్యానమందిరం, సాయిబాబా ఆలయం, గోశాల, యజ్ఞశాల, పుష్కరిణీ, బహిరంగ సభ ఏర్పాటుచేసే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రూట్ మ్యాప్‌లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎస్‌పిజి కంట్రోల్, జిల్లా యంత్రాంగం అధీనంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గంట పర్యటనలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వేదపాఠశాల ప్రారంభోత్సవం అనంతరం ఈ ప్రాంగణంలో దేవాలయాలు పరిశీలించి, బహిరంగ సభకు రాష్టప్రతి హాజరవుతారని తెలిపారు. వారి వెంట ఇంటిలిజెన్స్ ఎస్పీ ఆర్ అమ్మిరెడ్డి, సహాయ సంచాలకులు జెఎల్‌ఎన్ మిశ్రా, నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్, డిఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, డిఎఫ్‌ఒ బి వీరభద్రరావు, సిఐలు రమేష్, రజనీకుమార్, ఆకివీడు, ఉండి ఎస్సైలు కడియాల అశోక్‌కుమార్, రవివర్మ, ఎంపిడిఒ శ్రీనాథ్ నాయిని, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ, ఎలక్ట్రికల్ ఎస్‌ఇ సిహెచ్ సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.

రాష్టప్రతి పర్యటనలో పాల్గొననున్న సిఎం
ఏలూరు, డిసెంబర్ 22: జిల్లాలో జరిగే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారు. 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుని, అక్కడి నుండి కారులో అయి భీమవరంలో జరిగే టిటిడి వేద పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్టప్రతితో కలిసి పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు భీమవరం నుండి హెలికాప్టర్‌లో గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. రాష్టప్రతితో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు.

అయిభీమవరంలో విస్తృత తనిఖీలు
ఆకివీడు, డిసెంబర్ 22: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటనలో భాగంగా అయిభీమవరం గ్రామంలో నిఘా బృందాలు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టాయి. గ్రామంలోని రహదారులు, డ్రెయినేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలోకి వచ్చే వారి వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఇప్పటికే అయిభీమవరం గ్రామానికి పోలీసులు బృందాలు చేరుకున్నాయి. ఎస్‌పిజి బృందాలు గురువారం నుంచి ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటాయని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా వేదపాఠశాల ప్రాంతానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. పరిసరాలను శుభ్రం చేయడంతోపాటు మరోసారి వేదపాఠశాలకు రంగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ వేదాలు బతుకుతెరువుకోసం కాదని, లోక కల్యాణార్ధమన్నారు. దేశం సుసంపన్నం కోసం, సంస్కృతి, సాంప్రదాయాలకు వేదాలు అద్దంపడతాయన్నారు. ఈ పాఠశాలకు స్థలం ఇచ్చిన దాతల దాతృత్వాన్ని మరువలేమన్నారు.

ఆక్వా అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేయాలి
మత్స్యశాఖ అధికార్లకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 22: జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి జిల్లాస్థాయి ఆక్వా అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మత్స్యశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం 55వ జిల్లాస్థాయి చేపల చెరువుల అనుమతుల కమిటీ సమావేశానికి కలెక్టరు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం చేపల చెరువులకు అనుమతులు కోసం విలువైన సమయాన్ని వృధా చేసే బదులు ఒక క్రమపద్దతిలో చేపల చెరువుల అనుమతులకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆక్వా జోన్స్ ఏర్పాటు చేసి రైతులతో కమిటీని ఏర్పాటుచేసి చేపల చెరువులకు అనుమతిలిచ్చే ప్రక్రియ కొనసాగించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. మత్స్యశాఖాధికారులు ఇకపై జిల్లాలో మత్స్య సంపద ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేపల పెంపక రైతులకు విస్తృత స్థాయిలో సేవలు అందించే వైపు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. జిల్లాలో మత్స్య సంపద పెంపుదలకు ఎన్నో అవకాశాలున్నాయని, పక్క రైతులకు ఇబ్బంది లేకుండా చట్ట పరిధిలో చేపల పెంపకం జరగాలని అధికోత్పత్తి సాధించడానికి పటిష్టమైన ప్రణాళిక అమలు చేయాలని ఆ దిశగా మత్స్యశాఖ సిబ్బంది, అధికారుల ఆలోచనా ధోరణి ఉండాలని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో స్వల్ప కాలంలో అధిక దిగుబడి సాధించే మేలు జాతి చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సామాన్య రైతుకు కూడా న్యాయం జరిగేలా చేపల పెంపకం ఉండాలని కలెక్టరు చెప్పారు. మత్స్యకారులకు ప్రభుత్వపరంగా అందించాల్సిన ఉపకరణాలు, ఇతర సాధనాలు సమకూర్చాలని ముఖ్యంగా హైబ్రీడ్ సీడ్‌ను బాదంపూడి ఫిష్ యాషరీస్ డెవలప్‌మెంట్ చేసి రైతులకు అందించాలని ఆయన కోరారు. జిల్లాలో జిల్లాస్థాయి ఆక్వా అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి వివిధ శాఖల మధ్య సమన్వయంతో నీటి వనరులలో మత్స్య సంపద అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం ఏడు వేల 800 కోట్ల గ్రాస్ వాల్యూ యాడెడ్ (జివి ఏ)ను 11 వేల కోట్లకు పెంచాలని ఇందుకోసం గోదావరి కాల్వలు, ఇతర నీటి వనరులను సద్వినియోగం చేసుకుని మత్స్యసంపద పెంపుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వైరస్ వలన ఆర్ధికంగా దెబ్బతింటున్న మత్స్య రైతులలో మనోధైర్యాన్ని కల్పించి చేపలకు కలిగే రోగాలను నివారించి నష్టాలను తగ్గించేందుకు మత్స్య శాఖాధికారులు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని చెప్పారు. జిల్లాలో మత్స్యపరిశ్రమపై ఆధారపడి జీవించే వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ డిడి లాల్ అహ్మద్, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, భూగర్భజల శాఖ డిడి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

200 అడ్డుకట్టలు వేసి నీరిస్తాం
పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి
ఉండి, డిసెంబర్ 22: రబీ సాగుకు పశ్చిమడెల్టా పరిధిలో 200 అడ్డుకట్టలు వేసి రబీ సాగుకు రైతులకు పూర్తిగా నీరందిస్తామని పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు, జలవనరుల శాఖ ఇఇ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో నీటి సమస్యపై ఆకివీడు డిసి ఛైర్మన్ తోట వెంకటేశ్వరరావు, ఉండి డిసి ఛైర్మన్ తోట ఫణిబాబులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ బుధవారం నుండి సీలేరు నుండి నీరు అదనంగా రావటంతో, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు. దీంతో పాటు ప్రతి డ్రెయిన్‌పైన అడ్డకట్టలు వేసి నీటిని కాల్వల ద్వారా పంపి ఒక్క రైతుకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ చివరన అధిక వర్షాల వల్ల రైతు ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల రబీ జాప్యం జరిగి నీటి సమస్య ఎదురైందన్నారు. ఇఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కనీసం డిసెంబర్ నెలాఖరులోగా నాట్లు పూర్తిచేసుకోవాలన్నారు. రైతులు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.
ఆధునికీకరణ పనులు కొనసాగుతాయి
డెల్టాలో గతంలో మధ్యలో నిలిచిపోయిన ఆధునికీకరణ పనులు కొనసాగుతాయని ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. జనవరి నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామని, ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న వేసవిలో పంట కాల్వలపైన కూడా ఆధునీకరణ పనులు జరుగుతాయన్నారు. డ్రెయిన్లపై నిర్మాణం జరిగిన అప్రోచ్‌ల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని ఇఇ శ్రీనివాసరావు చెప్పారు.

ఉత్పత్తి నిలివేశాం
*మరో రెండు నెలలు ముడిసరుకు కొరత
*నష్టాలతో రెండు నెలలు జీతాలివ్వలేదు
*మరో రెండు నెలలు ఇవ్వలేం
*బయో ఇథనాల్ ఫ్యాక్టరీ డిజిఎం మనోహర్
తాళ్లపూడి, డిసెంబర్ 22: అన్నదేవరపేటలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నందున ఉత్పత్తిని నిలిపివేసినట్టు ఫ్యాక్టరీ డిజిఎం మనోహర్ తెలిపారు. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్న ఫ్యాక్టరీ వర్కర్ల ఆరోపణలపై స్పందించిన డిజిఎం మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఒకపక్క ముడిసరకు కొరత, మరోపక్క తయారైన ఇథనాల్‌కు ధర లభించక మొత్తం మీద ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందన్నారు. అయినప్పటికీ యాజమాన్యం కార్మికులకు జీతాలు సక్రమంగానే చెల్లిస్తూ వచ్చిందని చెప్పారు. కాగా గత రెండు నెలలు మాత్రమే జీతాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదేశాల మేరకు మరో రెండు నెలల వరకు, ముడిసరకు లభించే వరకు ఫ్యాక్టరీ నడిపే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. సుమారు రూ.40 కోట్ల టర్నోవర్ ఉన్న బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో 200 మంది పనిచేస్తుండగా వారి జీతభత్యాలకు ప్రతినెలా రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. 2013లోనే సిక్ యూనిట్‌గా ఉండగా కొత్త యాజమాన్యం సంజయ్ సింగ్ ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారన్నారు. మరో రెండు నెలల వరకు కార్మికులకు జీతాలు ఇవ్వలేమని తెలిపారు. ఇలావుండగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఫ్యాక్టరీ వర్కర్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

నిధులు మంజూరుకు సిఎంకు వినతి
సానుకూలంగా స్పందించారు:ఎమ్మెల్యే బండారు
నరసాపురం, డిసెంబర్ 22: నియోజకవర్గంలో రహదారులు, తుపాను రక్షిత భవనాల అభివృద్ధికి ఎన్‌సిఆర్‌ఎంపి నిధులు రూ.45.80 కోట్లు మంజూరు చేయాలని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సిఎం చంద్రబాబునాయుడుని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సిఎం కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఈ ప్రతిపాదనలు అందించారు. నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి రూ.29.70 కోట్లు, తుపాను రక్షిత భవనాల అభివృద్ధికి రూ.16.10 కోట్లు వ్యయం కాగలదన్నారు. దీనిపై సిఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మాధవనాయుడు తెలిపారు.

పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పంచాయతీ కార్యదర్శులకు డిపిఒ హెచ్చరిక
ఏలూరు, డిసెంబర్ 22: పంచాయతీ పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి జి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గ్రామ పంచాయితీ కార్యదర్శుల సమావేశంలో పన్నుల వసూళ్ల తీరు, మీ-కోసం కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారంపై చేపడుతున్న చర్యలుపై ఆమె సమీక్షించారు. గ్రామ పంచాయతీలు ఆర్ధికంగా బలోపేతం కావాలంటే పన్నుల వసూలు తీరు నూరుశాతం జరగాలని ఎక్కడైతే సక్రమంగా పన్నులు వసూలు చేస్తారో అక్కడ ప్రగతి సాధ్యపడుతుందని చెప్పారు. గత ఏడాది పంచాయతీలలో ఇళ్ల పన్నులు, నీటి పన్ను, ఇతర పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులు రాబోయే నెలరోజుల్లో బకాయిలను నూరుశాతం వసూలు చేయాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ పన్నుల వసూళ్ల తీరుపై వారం వారం సమీక్ష నిర్వహిస్తున్న దృష్ట్యా కార్యదర్శులు నిర్లక్ష్యాన్ని విడనాడి వసూలు ప్రగతిని పెంచాలన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా ప్రజలు జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళుతున్నారని, వాటిని ముందుగానే గుర్తించి పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పంచాయతీ ఆస్తుల పరిరక్షణపై శ్రద్ధ వహించాలని, అన్యాక్రాంతం అయితే సంబంధిత కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇవో(పి ఆర్ అండ్ ఆర్‌డి)లు కె భీమేష్, వై అపర్ణ, ఎస్‌వి సుందరి, ఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పునరావాస గ్రామానికి చేగొండపల్లి నిర్వాసితులు
పోలవరం, డిసెంబర్ 22: పోలవరం ప్రోజెక్టు ముంపు గ్రామం చేగొండపల్లి నిర్వాసితులను కుంజవరం గ్రామ సమీపాన ఏర్పాటుచేసిన పునరావాస గ్రామానికి తరలిస్తున్నామని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. హౌసింగ్ పిడి వి శ్రీనివాసరావు, ఆర్డీవో ఎస్ లవన్నలతో కలిసి మంగళవారం చేగొండపల్లి, రామయ్యపేట పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ చేగొండపల్లి నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రానికి 75 కుటుంబాలను తరలించినట్టు తెలిపారు. మిగిలిన కుటుంబాలను శనివారం నాటికి తరలిస్తామన్నారు. పునరావాస కేంద్రానికి తరలివచ్చే కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నట్టు జెసి తెలిపారు. అన్ని పునరావాస కేంద్రాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు రహదారులు, డ్రెయినేజీలు, మంచినీటి వసతి వంటి వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. నిర్వాసితులు అధికారులకు సహకరించి పునరావాస గ్రామాలకు తరలివెళుతున్నారన్నారు. పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో మొదటి విడత ఖాళీ చేయవలసిన ఏడు గ్రామాల్లో ఇప్పటి వరకూ నాలుగు గ్రామాలు పునరావాస గ్రామాలకు తరలివెళ్లాయన్నారు. సింగన్నపల్లి, రామయ్యపేట, పైడిపాక నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. అనంతరం జెసి సుజల అతిథి గృహంలో చేగొండపల్లి నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లిన కుటుంబాలకు ఆర్‌ఆర్ ప్యాకేజీలో మిగిలిన రాయితీలు చెల్లిస్తున్నామని, వాటితోపాటు చెట్ల నష్టపరిహారం, 18 ఏళ్లు నిండిన యువతులకు ప్యాకేజీ చెల్లిస్తున్నామని జెసి కోటేశ్వరరావు తెలిపారు.