విజయనగరం

బంద్ ప్రశాతం, విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల పిలుపుమేరకు జిల్లా బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ విఫలం చేసేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు, ఆంక్షలు విధించారు. ముందుజాగ్రత్త పేరిట జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే వైకాపా, సిపిఐ, సిపిఎం నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ర్యాలీలు, ధర్నాల సందర్భంగా కూడా పలువురు నాయకులను అరెస్టు చేశారు. బంద్‌లో భాగంగా తెల్లవారుజామున విజయనగరం, సాలూరు, పార్వతీపురం, శృంగవరపుకోట బస్ డిపోల ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వైకాపా నాయకులు రాస్తారోకోల ద్వారా బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేయడంతో బస్సుల రాకపోకలు ఆటంకాలు లేకుండా కొనసాగాయి. బంద్‌తోపాటు రెండవ శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కారణంగా బస్ స్టేషన్లలో పెద్దగా రద్దీ లేకుండా పోయింది. బంద్ సందర్భంగా జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. బంద్ కారణంగా ఎటిఎంలలో డబ్బు నిలువ చేసే పరిస్థితి లేకపోవడంతో ఉన్న డబ్బు అయిపోవడంతో ఖాతాదారులు డబ్బులు తీసుకునేందుకు అవస్తలుపడ్డారు. బంద్ కారణంగా సినిమాహాళ్లల్లో ఉదయం ఆటలు రద్దు చేశారు. జిల్లా కేంద్రంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రైల్వేస్టేషన్, వెంకటలక్ష్మి, ఎన్‌సిఎస్, కన్యకాపరమేశ్వరి కోవెల జంక్షన్ మీదుగా గంట స్థంభం వరకు కొనసాగింది. అనంతరం గంట స్థంభం వద్ద కార్యకర్తలు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు విషయంలో (మిగతా 2వ పేజీలో)
బంద్ ప్రశాంతం, విజయవంతం
అధికారం కోల్పోతామనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సమస్యను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలతో కాలం వెళ్లదీస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. ర్యాలీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, నడిపెన శ్రీను, అప్పారావు, కనకల ప్రసాద్, బంగారునాయుడు, త్రినాథ్, సీతారామ్మూర్తి, కృష్ణవేణి, పద్మావతి, రత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అక్కడ నుంచి పంపించే ప్రయత్నంలో వాగ్వివాదం జరగడంతో పార్టీ నాయకులు అప్పలనాయుడు, ఆశపువేణు మరో 25 మందిని పోలీసులు అరెస్టుచేసి వ్యక్తిగత పూచికత్తులపై విడుదల చేశారు. ఇదిలా ఉండగా వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కాళ్ల గౌరీ శంకర్, అవనాపు విజయ్ తదితరుల ఆధ్వర్యంలో గంటస్థంభం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రకాష్, మన్మధకుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పిలకాదేవి, గంటా చినతల్లి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శివాణి, చంద్రవౌళి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో
కాగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన పేరిట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీ కోట, మూడులాంతర్లు, గంటస్థంభం, ఎన్‌సిఎస్, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్ మీదుగా ఎత్తుబ్రిడ్జి వద్దకు చేరుకుంది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మాట్లాడుతు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి మోడీ ఇప్పుడు మోసం చేయడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్యాకేజీతో సరిపెట్టుకుందామనే వైఖరిని ప్రదర్శించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని అన్నారు. పార్టీ నాయకులు గోవిందరావు, శ్రీనివాస్, పైడిరాజు, సూరి అప్పారావు, సుంకరి సతీష్ పాల్గొన్నారు.
ఆర్టీసి కాంప్లెక్స్ ముందు కమ్యూనిస్టుల బైఠాయింపు
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఆర్టీసి కాంప్లెక్స్ ముందు బైఠాయింపు జరిపారు. కాంప్లెక్స్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. వైకాపాకు చెందిన కొందరు నాయకులు బైఠాయింపుకు మద్దతుగా కొద్దిసేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బైఠాయింపు కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, శంకరరావు, టి.వి.రమణ, సిపిఐ నాయకులు బుగత అశోక్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్లలో
నెల్లిమర్ల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రతిపక్షం, వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్ నెల్లిమర్లలో విజయవంతంగా జరిగింది. పార్టీ నాయకులు జూట్‌మిల్లును బంద్ చేయించారు. అనంతరం మొయిన్ జంక్షన్‌లో రాస్తారోకో జరిపారు. వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం దారుణమని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తే నాయకులు వాటాలు పంచుకుంటారని ఆరోపించారు. చంద్రబాబు కేసులకు భయపడి హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దించడానికే కేంద్రం హోదా కల్పించడంలేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమాక్రసీ పార్టీలు పాల్గొన్నాయి. ఆందోళన చేపట్టిన నాయకులు రామారావు, సాంబశివరాజు, శ్రీరాములనాయుడు, వెంకటరమణ, ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
గుర్లలో
గుర్ల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం వహించినందుకు నిరసనగా శనివారం గుర్లలో నిరసనలు మిన్నంటాయి. వైసిపి నాయకులు, కార్యకర్తలు విజయనగరం-పాలకొండ రహదారిని నిర్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఎస్సై తిరుపతిరావు, గుర్ల పోలీసులు బంద్ విరమించాలని కోరినా వినకపోవడంతో నాఫెడ్ డైరెక్టర్ సూర్యనారాయణరాజు, మాజీ ఎంపిపి శీర అప్పలనాయుడు, ఎంపిటిసి మధు, సర్పంచ్ తిరుపతిరావు తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
గంట్యాడలో
గంట్యాడ: రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అన్న డిమాండ్‌తో మండల వైకాపా, సిపిఎం నాయకులు శనివారం కొటారుబిల్లి జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తారోకో జరిపి వాహనాల రాకపోకలను స్తంభింజచేశారు. వ్యాపార దుకాణాలను మూసివేయించారు. వీరికి మద్దతుగా ప్రైవేటు పాఠశాలలను సంబంధిత యాజమాన్యం స్వచ్ఛందంగా మూసివేశారు. ధర్నాకు నాయకత్వం వహించిన వైకాపా మండల కన్వీనర్ వర్రి నర్సింహమూర్తి మాట్లాడుతు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నిర్వహించిన బంద్‌కు అన్ని వర్గాలు సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర రూపం దాలుస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు జైహింద్ కుమార్, ముత్యాలనాయుడు, నారాయణమూర్తి, సత్యారావు, సిపిఎం నాయకులు రవికుమార్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
గరివిడిలో
గరివిడి: రాష్ట్రానికి ప్రత్యేక సాధించడంలో విఫలమైన టిడిపి ప్రభుత్వం వైఫల్యానికి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో దగా చేస్తున్న తీరుకు నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సినిమాహాలు జంక్షన్ నుండి రైల్వే వంతెన మీదుగా పాతగరివిడి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన 50 మందిని, సిఐటియుకు చెందిన 14 మందిని అరెస్టు చేశారు. మాజీ ఎంపిపి కొణిస కృష్ణమనాయుడు, మాజీ ఆర్‌ఇసిఎస్ చైర్మన్ వెంకటరమణ, మాజీ వైస్ ఎంపిపి రాంబాబు, మాజీ ఎఎంసి చైర్మన్ విశే్వశ్వరరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విజయనగరం(టౌన్)లో...
విజయనగరం(టౌన్): రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. వామపక్షాలు ఇచ్చిన బందు పిలుపులో భాగంగా శనివారం ఉదయం పట్టణంలోని ఎంఆర్ అటానమస్ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి పాలకులు తెలుగు ప్రజలను మరోసారి మోసగించారని ఆరోపించారు. నినాదాలు చేస్తున్న విద్యార్ధినాయకులు రామ్మోహన్, లక్ష్మణ్ తదితరులను వన్ టౌన్, టూటౌన్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

స్వచ్ఛగ్రామాల పరిశీలనకు
సత్తెనపల్లికి జిల్లా బృందం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 10: సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా రూపుదిద్దుకున్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను పరిశీలించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం శనివారం ఇక్కడినుంచి బయలుదేరింది. 25మంది గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖకు చెందిన 15మంది మండలస్థాయి అధికారులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బస్సులో సత్తెనపల్లికి తరలింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ వివేక్‌యాదవ్ జెండా ఊపి ప్రతినిధి బృందానికి వీడ్కోలు పలికారు. ఈ బృందానికి ఆర్‌డబ్ల్యుఎస్ విభాగానికి చెందిన చీపురుపల్లి డిఇ వెంకటరావు నాయకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఉదయం గుంటూరుకు చేరుకుంటున్న ఈ బృందం మొదట స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో సమావేశమై సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంది. అనంతరం నియోజకవర్గంలో మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ఎంపికైన గ్రామాలను సందర్శిస్తుంది.
రోడ్డు ప్రమాదంలో
ట్రాఫిక్ హెచ్‌సి మృతి
బాడంగి, సెప్టెంబర్ 10: మండలం కోడూరు వేలంగిణి మాత ఉత్సవాల బందోబస్తుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో బొబ్బిలి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.గంగరాజు (52) శనివారం మృతిచెందారని ఎస్‌ఐ శ్రీ్ధర్ తెలిపారు. పిన్నవలస, కోడూరుకు మధ్యన ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా బాడంగి నుంచి కోడూరువైపు వెళుతున్న ఆటో ఢీకొనడంతో కాళుకు తీవ్రమైన గాయం అయింది. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రమాదం షాకువలన ఆయన అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒఎస్‌డి వెంకటచినప్పలనాయుడు, డిఎస్పి సౌమ్యలత, సిఐ గోవిందరావులు హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలను అందించడంతోపాటు కుటుంబ సభ్యులను ఆదుకుంటామని భార్య, పిల్లలకు హామీ ఇచ్చారు. విధులు చక్కగా నిర్వహించే గంగరాజు మృతిచెందడం తమను కలిచివేసిందని వారు తెలిపారు. పోస్టుమార్టం, శవపంచనామా నిర్వహించి గంగరాజు స్వగ్రామమైన సాలూరు మండలం పణుకువలసకు మృతదేహానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరుపుతామన్నారు.
బి.డి.జి-4: పరామర్శిస్తున్న పోలీసు సిబ్బంది

ప్రజా సాధికార సర్వే 15లోగా పూర్తి చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 10: జిల్లాలో చేపట్టిన ప్రజాసాధికార సర్వేను 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ తహశీలార్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సర్వే నిర్వహణలో విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బంది సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్రప్రభుత్వం ప్రజాసాధికార సర్వేను కీలకంగా భావిస్తోందని, సమీక్షల సందర్భంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి సర్వే సమాచారాన్ని కోరుతున్నారని, జిల్లాలో నిర్ణీత వ్యవధిలో సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకే క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే జరపాలని, నిర్ణీత గడువులో 100శాతం సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వే సందర్భంగా సాంకేతిక సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే సరిచేస్తారని తెలిపారు. రోజువారీగా ఎంతమంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు, ఏ మేరకు సర్వే జరుగుతుంది తదితర వివరాలను తహశీల్దార్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, సకాలంలో సర్వే పూర్తి చేయించే బాధ్యత తహశీల్దార్లదేనని అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

త్వరితగతిన మరుగుదొడ్లు నిర్మించాలి
50 గ్రామాలను మలవిసర్జన ప్రాంతాలుగా మార్చాలి
లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టాలి
సమీక్ష సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 10: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సమకూర్చడంతోపాటు మేస్ర్తిలను, పనివారిని మండల స్థాయిలో గుర్తించి పనులు అప్పగించడం ద్వారా లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాటికి నిర్ణీత లక్ష్యం మేరకు 50 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓడిఎఫ్ పనులపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 4.44లక్షల నివాస గృహాలు ఉండగా మరుగుదొడ్లు ఉన్న ఇళ్లు 67 వేలు మాత్రమే ఉన్నాయని అధికారుల సర్వేలో తేలిందని, మిగత 3.77 లక్షల ఇళ్లకు మరుగుదొడ్లు లేని విషయాన్ని వివరిస్తూ గ్రామీణ ప్రజలు తమ ఇళ్ల వద్ద మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెన్నపల్లెలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై అక్కడి అధికార యంత్రాంగం చొరవతీసుకుని లక్ష్యాన్ని సాధించిన విధానాలను ఇక్కడ అమలు జరిపేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఓడిఎఫ్ పనులను పర్యవేక్షించేందుకు నియమితులైన ప్రత్యేక అధికారులు ప్రతి మంగళ, బుధవారాలు గ్రామాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి ఓడిఎఫ్ పనులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని గ్రామసభలు, చర్చావేదికలు నిర్వహించడం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసిన కుటుంబాలకు వెంటవెంటనే బిల్లులు చెల్లిచాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాలను పూర్తిచేసేందుకు వచ్చే మూడు వారాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాపరిషత్ సిఇఓ రాజకుమారి మాట్లాడుతు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతికుంటుంబానికి 15వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని, దీనికోసం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల వద్ద 1.05 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి, ఆర్‌డబ్ల్యుఎస్ సూపరింటిండెంట్ ఇంజనీరు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసవ సమయంలో శిశువు మృతి
* వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల నిరసన

వేపాడ, సెప్టెంబర్ 10: మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన సింహాద్రి రమ శుక్రవారం రాత్రి ఎస్.కోట పిహెచ్‌ఎన్‌సిలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణం వేపాడ పిహెచ్‌సి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాలింత బంధువులు మృత శిశువుతో శనివారం వేపాడ పిహెచ్‌సి ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తొలిసారి ప్రసవానికి కన్నవారి ఇంటికి వచ్చిన ఆమెను ప్రసవ నొప్పులు రావడంతో శుక్రవారం ఉదయం వేపాడ పిహెచ్‌సిలో చేర్పించారు. మధ్యాహ్నం వైద్యాధికారి వస్తారని నార్మల్ డెలివిరీకి అవకాశాలు ఉన్నాయని సిబ్బంది సూచించారు. రాత్రి ఏడు గంటలు అయినా వైద్యాధికారి రాకపోవడంతో ఎస్.కోట పిహెచ్‌సికి తరలించాలంటూ గర్భిణి బంధువులు ఒత్తిడి చేశారు. ఈ మేరకు 108వాహనంలో రాత్రి 9.30 గంటలకు ఎస్.కోట తరలించారు. అక్కడ రమను వైద్యులు పరిశీలించి మృత శిశువును బయటకు తీశారు. మరో గంట ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. దీంతో తన బిడ్డ మరణానికి వేపాడ పిహెచ్‌సి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాలింత భర్త అప్పలరాజు ఆక్రోసంతో ఊగిపోయాడు. శనివారం ఉదయం మృత శిశువుతో వచ్చి వేపాడ పిహెచ్‌సి ముందు ధర్నాకు దిగారు. వేపాడ, వల్లంపూడి గ్రామస్థులతోపాటు సిఐటియు జిల్లా నాయకుడు జగన్, రైతు సంఘం రాష్ట్ర నేత అచ్చారావు, వైసిపి నాయకులు సత్యనారాయణ, వల్లంపూడి సర్పంచ్ తాతారావు వీరికి మద్దతు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లంపూడి ఎస్సై కృష్ణమూర్తి, ఎల్.కోట ఎస్సై నరేష్, ఎస్.కోట ఎస్సై రవికుమార్ బందోబస్తు నిర్వహించారు.
జిల్లా అధికారుల దర్యాప్తు
పరిస్థితిని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి వి రాఘవరావు, జామి పిహెచ్‌సి వైద్యాధికారి వెంకటరావు, సెలవులో ఉన్న వేపాడ పిహెచ్‌సి వైద్యాధికారి వీరభద్రరావు సంఘటనా స్థలానికి మధ్యాహ్నం చేరుకున్నారు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మృత శిశువును పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు వైద్యాధికారి ప్రకటించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబానికి పది లక్షలు పరిహారం చెల్లించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ నిరసనకారులు బైఠాయించారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
మరుగుదొడ్లు లేని ఇల్లు ఉండకూడదు
సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 10: పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ జి నాగరాజు ఆదేశించారు. తన చాంబర్‌లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందున పట్టణంలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నాలుగువేజ, రాష్ట్రప్రభుత్వం 11వేల రూపాయలను రాయితీతో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకునే వారిపై ఎటువంటి ఆర్థికభారం పడకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి 3321 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అర్హులను గుర్తించేందుకు దరఖాస్తుల పరిశీలన కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు పిఎస్‌వివి ప్రసాద్, ఎస్.మత్స్యరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మోజీ పాల్గొన్నారు.