విజయనగరం

బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 29: జిల్లాలో వసతి గృహాల పనితీరు అధ్వాన్నంగా ఉండటం పట్ల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి మృణాళిని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె వసతిగృహ సంక్షేమాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఏ వసతి గృహంలో తనిఖీకి వెళ్లిన అక్కడ నాణ్యత డొల్లతనం తేటతెల్లమవుతుందన్నారు. వసతి గృహ విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత వసతిగృహ సంక్షేమాధికారులపై ఉందన్నారు. వసతిగృహాలకు సరఫరా చేస్తున్న సరకుల శాంపిల్స్ పరిశీలిస్తున్నారా? అని ప్రశ్నించగా తామేమి శాంపిల్స్ తీయడం లేదని వారు బదులిచ్చారు. జిల్లాలో వసతిగృహ సలహా కమిటీలు పర్యవేక్షించినా దాఖలాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందన్నారు. సలహా కమిటీలు పర్యవేక్షణ ఉంటే అధికారులు సక్రమంగా తమ విధులు నిర్వహించేవారన్నారు. వసతిగృహాలలో నాణ్యత కొరవడటంపై విద్యార్థుల నుంచి, పత్రికలలోను వార్తలు వచ్చినా అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదని దుయ్యబట్టారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పత్రికలలో ఎక్కడైనా వసతిగృహ పనితీరుపై వ్యతిరేక వార్తలు వచ్చిన అధికారులు అక్కడ సందర్శించి వాస్తవం ఏమిటో తెలుసుకొని తనకు నివేదికను అందజేయాలన్నారు.మార్కెట్లోని చైనా గుడ్లు వచ్చాయ్.. వాటిని వసతి గృహాల్లో ఉపయోగించరాదని మంత్రి మృణాళిని స్పష్టం చేశారు. ఈ గుడ్లు ఎంత కాలమైన నిల్వ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వసతిగృహాలకు గుడ్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీలను ఆమె ప్రశ్నించారు.
సమాచారం లేకపోతే ఎలా?
జిల్లాలో అంగన్వాడీలలో ఎలాంటి పోషకాహారం సరఫరా చేస్తున్నారో తనిఖీ చేశారా అని మంత్రి మృణాళిని ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్‌ను ప్రశ్నించగా తాను పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపరిచానన్నారు. ఆ నివేదికను చూపమని అడగ్గా ఆయన తెల్లమొహం వేశారు. అలాగే సాంఘీక సంక్షేమశాఖ డిడి విశ్వమోహన్‌రెడ్డిని ప్రశ్నించగా ఆయన తడబడుతూ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు ఏ ఏజెన్సీపైన చర్య తీసుకున్నారా అని అడగ్గా ఎవ్వరూ నోరుమెదపలేదు. దీనిపై కలెక్టర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతా నోటిమాటలేనా? పద్ధతి మార్చుకోరా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని వసతిగృహాల్లో కూడా ఇదే దుస్థితి ఉందని మంత్రి మృణాళిని అన్నారు. ఇక నుంచి వసతిగృహాలను తనిఖీ చేసి నాణ్యతలోపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను హెచ్చరించారు.
అధికారులు స్థానికంగా ఉండాలి
వసతిగృహ సంక్షేమాధికారులు ఆయా కేంద్రాల్లోనే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ యాదవ్ స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా ఎవరెవరు ఎక్కడ నివాసం ఉంటున్నదీ తనకు నివేదికను అందజేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ లఠ్కర్, ఎజెసి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గీత తదితరులు పాల్గొన్నారు.
సన్నాహాలు
కొత్తవలస, అక్టోబర్ 29: మండలంలోని జిందాల్ కర్మాగారాన్ని తెరిచేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కార్మిక వర్గాలకు యాజమాన్యాలకు మధ్య ఉన్న సమస్యలు కొంతమేర కొలిక్కి వచ్చాయని కార్మికులు తెలిపారు. రెండు కార్మిక సంఘాలు పనిచేసేందుకు ఇష్ట పూర్వకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోనస్ పెంచితే సమష్టిగా పనిచేస్తామని మరో కార్మిక సంఘం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ వర్కర్స్ షిప్ట్ డ్యూటీలకు హాజరవుతున్నారు. ఏడాదిపాటు మూసివేయడంతో మెంట్‌నెన్స్‌చేయాలని యాజమాన్యం భావించి కంపెనీ కార్మికులను రప్పించి పనులు చేపట్టింది. కార్తీక మాసంలో కంపెనీని తెరుస్తారని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 1.50 పైసలు, విద్యుత్ రాయితీ కర్మాగారాలకు విడుదల చేసింది. కంపెనీ తెరిస్తే రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నారు.

అపోహలు వీడితే ఆనందం
* నాలుగు జంటలకు కౌన్సిలింగ్
విజయనగరం(టౌన్), అక్టోబర్ 29 : అపోహలు విడనాడితే కాపురంలో ఎటువంటి కలతలు ఉండవని ఫ్యామిలి కౌన్సిలింగ్ కేంద్రం సైకాలజిస్టు ఎన్‌వి ఎస్ సూర్యనారాయణ హితవుపలికారు. శనివారం పట్టణంలోని పద్మావతినగర్‌లోని మహిళాపోలీసు స్టేషన్‌లో నాలుగు జంటలకు కౌనె్సలింగ్ నిర్వహించారు. డిఎస్పీ కుమారస్వామి ఆధ్వర్యంలో జంటలకు కుటుంబ వ్యవస్థ, కాపురం సజావుగా సాగేందుకు కావలిన అంశాలపై హితబోధ చేశారు. అపోహలు దంపతుల మధ్య రాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చక్కగా జీవితం సాగు తుందని చెప్పారు. వివాహేతర సంబంధాలు కూడదని స్పష్టంచేసారు. మనస్పర్థలు లేకుండా ముందుకు సాగాలని, అపోహలతో కాపురం అగాధంలోకి నెట్టబడుతుందని అన్నారు. భార్యాభర్తల మధ్య కలతలకు తావు ఉండరాదని సూచించారు. సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. చిన్నచిన్న సమస్యలు రాకుండా అవగాహనతో మెలగాలని ఆయన ఉద్బోధించారు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే సామరస్యంగా పరిష్కరించుకుంటే వివాదాలు తలెత్తవని చెప్పారు. భార్యభర్తల మధ్య అన్యోన్యత అవసరమని ఆ వాతావరణం సృష్టించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మహిళా సైకాలజిస్టు గొటేటి హిమబిందు, సామాజిక కార్యకర్త రజని పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 29: పరిసరాల పరిశుభ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ రీజనల్‌డైరెక్టర్ ఆశాజ్యోతి తెలిపారు. దీనిపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు పెద్దఎత్తున ప్రచారం చేయాలని కోరారు. దోమలపై దండయాత్రలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల వరకు మున్సిపల్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ దోమల వల్ల పలురకాల రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షం నీరు నిల్వ లేకుండా చూడాలని, కొబ్బరి బొండాలు, రబ్బరుటైర్లు, ఇతర పాత్రలలో వర్షం నీరు లేకుండా తగిన జాగ్రత్తలు వహించాలని తెలిపారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలువలలో పేరుకుపోయిన పూడిక, రోడ్లపై చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌మేనేజర్ ఆనందరావు, మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్, పర్యావరణ ఇంజనీర్ సంతోషికుమారి పాల్గొన్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడితే సహించం
మంత్రి మృణాళిక హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, అక్టోబర్ 29: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ సక్రమంగా అందేలా చూడాలని, కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం సరకులు కొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో వసతిగృహ సంక్షేమాధికారులతో సమీక్ష అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందిపప్పు, మినపగుళ్లు, వేరుశనగ, ఆయిల్ వంటి వాటికి హోల్‌సేల్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా వసతి గృహలకు అనుమతిస్తున్నామన్నారు. అంత ఎక్కువ మొత్తం వెచ్చించినా వసతిగృహ సంక్షేమాధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహాలకు సరఫరా చేస్తున్న వేరుశనగ పప్పులో నాణ్యత ఉండటం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఫంగస్ చేరిన వేరుశనగ తింటే లివర్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే వసతిగృహాల్లో ఉల్లి, బంగాళాదుంపలు వంటివి నీటిలో శుభ్రం చేయకుండా వంటలు చేస్తున్నట్టు తనకు తెలిసిందన్నారు. ఇకనైనా పరిశుభ్రంగా వంటలు చేసే విధంగా సంక్షేమాధికారులు వాటిని పర్యవేక్షించాలన్నారు. వసతిగృహ విద్యార్థులకు ఎనీమియా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ సక్రంగా అందుతుందో లేదో ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జెసి లఠ్కర్, జెసి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సంగీతంతో మానసిక ప్రశాంతత
విజయనగరం(పూల్‌బాగ్), అక్టోబర్ 29: సంగీతం నేర్చుకునే విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని జడ్పీ సిఇఓ రాజకుమారి అన్నారు. శనివారం లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో శ్రీవారి స్వచ్ఛంద సేవాసంస్థ, ఘంటసాల స్మారక కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో 12గంటల నిర్విరామ అన్నమయ్య కీర్తనల ఆలాపన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండి సంగీతం నేర్చుకోవాలనే తపన విద్యార్థుల్లో ఉండాలని అన్నారు. సంస్కృత కళాశాల పూర్వ ప్రాచార్యులు మానాప్రగడ శేషశాయి మాట్లాడుతూ విజయనగరం రాజులు సంగీత, సంస్కృత కళాశాలలను నెలకొల్పారని అన్నారు. ఘంటసాల స్మారక కళాపీఠం అధ్యక్షుడు పివినరసింహరాజు మాట్లాడుతూ తన కీర్తనల ద్వారా వేంకటేశ్వరుని ప్రసన్నుని చేసుకున్న పరమ భక్తుడు అన్నమయ్య అని అన్నారు. అన్నమయ్య తన కీర్తనల ద్వారా లోకంలో భక్తిని పెంపొందించాడని పేర్కొన్నారు. 12గంటల నిర్విరామ అన్నమయ్య సంకీర్తనా వైభవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
శ్రీవారి స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపకుడు భీష్మారావు సంగీత పర్యవేక్షణలో లావణ్య రూప, జయంతి, సుమవర్ష, అరుణకుమారిలతో పాటు ఔత్సాహిక గాయనీగాయకులు అన్నమయ్యకీర్తనలు వినసొంపుగా ఆలపించారు.గణపతి స్తుతితో అన్నమయ్యకీర్తనల ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించి హరి అవతారమితడే, కొండలలో నెలకొన్న వంటి కీర్తనలతో పాటు పలు అన్నమయ్య కీర్తనలు గానం చేసారు. ఈసందర్భంగా జడ్పీ సి ఇవోరాజకుమారిని,మానాప్రగడ శేషశాయిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. రాత్రి జరిగిన సభాకార్యక్రమంలో‘అన్నమయ్య సంకీర్తన శత కుసుమావళి’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో కళాపీఠం కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు, మేకాకాశీవిశే్వశ్వరుడు, గ్రంధివిష్ణు, సుబ్బరాజు తదితరులుపాల్గొన్నారు.
పార్కుల అభివృద్ధికి ప్రణాళిక
* మున్సిపల్ కమిషనర్ నాగరాజు
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 29: పట్టణంలో పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. పార్కుల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరింగ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ జోనల్‌మేనేజర్ టి.దాస్‌తో శనివారం చర్చించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో చాలా పార్కులు వినియోగంలో లేవని అన్నారు. అన్నిపార్కులను వినియోగంలోకి తెచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్నిపార్కుల చుట్టూ కంచె నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అకౌంట్స్ అధికారి ఆర్‌ఎస్‌ఆర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ కౌంటర్ల ప్రైవేటీకరణ తగదు
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 29: రాష్ట్రంలో ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటు సంస్ధకు అప్పగించడం సరైన పద్ధతి కాదని ఆర్టీసీ ఎన్‌ఎన్‌యు జోనల్ అధ్యక్షుడు బిఎస్ రాములు అన్నారు. కనీసం గుర్తింపుయూనియన్‌తో సంప్రదించకుండా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని చెప్పారు. శనివారం ఇక్కడ ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ యాజమాన్యం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే సంస్థ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటుందని చెప్పారు. ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి మరింత గండి పడే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. రాష్టస్థ్రాయిలో ఆర్టీసీకి స్టాప్‌వేర్‌ను అందజేసేవారే టిక్కెట్ కొనుగోలుదారుడిగా రావడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదేవిధంగా బస్‌పాసుల జారీ ప్రక్రియను ప్రైవేటు సంస్ధలకు అప్పగించడం వల్ల కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని తెలిపారు. ప్రైవేటు బస్సులకు, ఆర్టీసీకి అభీబస్ యాజమాన్యమే స్టాప్‌వేర్‌ను సమకూర్చుతున్నందున ప్రైవేటువారు ఇచ్చే కమిషన్, టిక్కెట్ల రేట్ల విషయంలో ఉన్న తేడాల వల్ల సంస్థకు నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా సంస్థకు వచ్చే కీలక ఆదాయ వనరులలో ఒకటైన ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లను బయట వ్యక్తులకు అప్పగించడం సరైన పద్ధతి కాదని, దీనివల్ల ఆర్టీసీకి అన్ని విధాలా నష్టదాయకమని తెలిపారు.
అందువల్ల టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లను ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
==========
ఫొటో:29విజెడ్-9
రైటప్: జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణికి వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

సిపిఎస్ రద్దుకు ప్రభుత్వానికి నివేదించాలి
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 29: ఉద్యోగుల భవిత్యానికి విఘాతం కలిగించే కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వానికి నివేదించాలని పిఆర్‌టియు నాయకులు బంకపల్లి శివప్రసాద్, టిఆర్‌కె శర్మ కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణికి శనివారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 2004వ సంవత్సరం నుంచి కేంద్రప్రభుత్వం సిపిఎస్‌ను అమలులోకి తెచ్చిందని, ఈ విధానాన్ని రాష్ట్రప్రభుత్వం కూడా అమలు చేస్తుందని తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు పెన్షన్ విధానాన్ని కోల్పోతారని చెప్పారు. దీనిపై స్పందించిన స్వాతిరాణి మాట్లాడుతూ సిపిఎస్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ప్రత్యేకంగా తీసుకువెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్వనిర్వహణాధికారి గనియా రాజకుమారి, పిఆర్‌టియు నాయకులు ఆర్.రామకృష్ణ, కె.సత్యారావు, కె.సూరిబాబు, రాము, రమేష్, భాస్కర్‌త తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి
* ఎఎస్పీ ఎవి రమణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, అక్టోబర్ 29: బాధితులకు న్యాయం జరగాలంటే అధికారులకు చట్టాలపై అవగాహన ఉండాలని ఎఎస్పీ ఎవి రమణ అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీసు కానె్ఫరెన్స్ హాల్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్’పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టంలో అనేక మార్పులు వచ్చాయని వీటిపై అవగాహన ఉన్నప్పుడే బాధితులకు న్యాయం చేయగలమన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవరావు, ఎపిపి రఘురాం మాట్లాడుతూ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్‌లో బాధితుల హక్కులు, సాక్షుల గురించి వివరించారు. జస్టీస్ పుల్లయ్య కమిషన్ చేసిన సిఫార్సుల గురించి, సవరణల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఎస్పీలు ట్రినాద్, గురుమూర్తి, ఎఎస్ చక్రవర్తి, ఎల్.రాజేశ్వరరావు, కె.కుమారస్వామి, సిఐలు శోభనబాబు, దుర్గాప్రసాద్, లక్ష్మణరావు, రమణమూర్తి,జి.సంజీవరావు, నర్సింహరావు, లీలారావు, ఎస్సైలు పాల్గొన్నారు.
ప్రజాధనానికి
గండిపడినా పట్టించుకోరేం?
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 29: శృంగవరపుకోట పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అవినీతి భాగోతం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా కార్యదర్శి కె.దయానంద్ అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపులకు 1500 నుంచి 2000 వేల రూపాయల వరకు అద్దె చెల్లిస్తూ పదివేల నుంచి 15వేల రూపాయలకు ఇతరులకు అద్దెకు ఇస్తున్నారని తెలిపారు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనానికి గండిపడుతుందని, అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్‌ఆద్మీపార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటాయించిన షాపులను తక్షణమే రద్దు చేసి బహిరంగ వేలం ద్వారా షాపులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్కడ జరుగుతున్న అవినీతి భాగోతంపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతోపాటు కేటాయించిన షాపులను బహిరంగ వేలం వేయాలని వచ్చేనెల ఐదవ తేదీన ఎస్.కోటలో ప్రజా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ పూసపాటి ప్రతాప్‌వర్మ, సిటీ కన్వీనర్ శీర స్వామినాయుడు, కో-కన్వీనర్ ఎంబి అప్పారావుదొర, మహిళా కన్వీనర్ రత్నకుమారి, యూత్ కన్వీనర్ రొబ్బ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.