విజయనగరం

15 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 3: జిల్లాలో ఖరీఫ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కానె్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాలు ధాన్యం మొదటి రకం రూ.1510, సాధారణ రకం రూ.1470 మద్ధతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం ఎక్కువ ఉత్పత్తి ఉన్న చోట ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. డిఆర్‌డిఎ, ఐటిడిఎ, మార్కెటింగ్, సహకార శాఖలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, తూనిక యంత్రాలతోపాటు రైతులకు అన్ని వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు సంచులను సరఫరా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు తరలించేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజరు మిల్లులకు ట్యాగింగ్ సాంకేతికత ఆధారంగా చర్యలు చేపట్టాలన్నారు. సేకరించిన ధాన్యం, మిల్లుల ద్వారా వచ్చిన బియ్యం నిల్వ చేయడానికి గొడౌన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులకు మద్ధతు ధర అమలు జరుగుతున్నదీ లేనిది పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, గోవిందరావు, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటరావు, డిఎస్‌ఒ శాంతికుమారి పాల్గొన్నారు.
తేనెటీగల దాడిలో
15మందికి గాయాలు
బొండపల్లి, నవంబర్ 3: మండలంలోని బొండపల్లి పంచాయతీ శివారు గ్రామం గెద్దపేటలో గురువారం తేనెటీగల దాడిలో 15మందికి గాయాలయ్యాయి. నాగుల చవితి సందర్భంగా గ్రామానికి చెందిన కొందరు పుట్టలో పాలు వేసే సమయంలో ముందు మహిళలు పుట్టను శుభ్రం చేశారు. అనంతరం దూపదీప నైవేధ్యాలు పెట్టారు. ఈ సమయంలో గాలివేయడంతో సాంబ్రాణి దూపం పొగ ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న చెట్టులో తేనెటీగల పట్టు ఒక్కసారిగా కదిలి పూజలు చేస్తున్న భక్తులపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. అయినా తేనెటీగలు వెంబడించడంతో పలువురికి గాయాలు కాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ తేనెటీగల దాడిలో పైల జానకి, పైల మాధవనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా పైల ఈశ్వరరావు, పైల లక్ష్మణరావు, పైల రాంబాబు, పద్మ కు గాయాలయ్యాయి.

రిజర్వేషన్ కౌంటర్లు ప్రైవేటు సంస్థకు అప్పగింత
* ఆర్టీసీ కార్మిక సంఘాల వ్యతిరేకత
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 3: ఆర్థిక వనరుల సమీకరణ కోసం అనే్వషణ సాగిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం తాజాగా బస్‌స్టేషన్‌లలో ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్యాసింజర్ సిస్టమ్ (ఓపిఆర్‌ఎస్) కేంద్రాలను ప్రైవేటు సంస్ధకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేటు ఆన్‌లైన్ రిజర్వేషన్ ఏజెన్సీ అభి బస్‌కు కాంట్రాక్ట్ పద్ధతిలో ఐదేళ్లపాటు రిజర్వేషన్ కేంద్రాలను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 బస్‌స్టాండ్‌లలో రిజర్వేషన్ కౌంటర్లను అప్పగించేందుకు ఒప్పందం చేసుకుంది. దీనిలో విజయనగరం బస్‌స్టాండ్‌లో రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. ఇంటర్‌నెట్ ఛార్జీలను మినహాయిస్తూ అన్ని రకాల ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించేందుకు అభి బస్‌కు అనుమతి ఇచ్చింది. దీనికోసం ఎసి బస్సులకు ఏడుశాతం, నాన్ ఎసి బస్సులకు ఐదుశాతం కమిషన్ చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఒపిఆర్‌ఎస్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని ఆర్టీసీ గుర్తింపుకార్మిక సంఘం ఎన్‌ఎంయు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటు సంస్థకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని ఎన్‌ఎంయు విజయనగరం జోనల్ అధ్యక్షుడు బిఎస్ రాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సంస్థ కోట్లాది రూపాయల నష్టాలతో నడుస్తోందని, ఇలాంటి తరుణంలో రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంవల్ల సంస్థ ఆదాయానికి మరింత గండిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపుకార్మిక సంఘంతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సంస్థకు స్టాప్‌వేర్‌ను అందజేసేవారే టిక్కెట్ కొనుగోలుదారుడిగా రావడంవల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఇదే మాదిరిగా బస్‌పాస్‌ల జారీ ప్రక్రియను ప్రైవేటువారికి ఇవ్వడం వల్ల కోట్లాది రూపాయల నష్టం జరిగిందన్నారు. అందువల్ల రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతీ ఆదివారం పంచారామల దర్శిని బస్సులు
* డిపోమేనేజర్ పద్మావతి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 3: కార్తీకమాసంలో పంచారామాల దర్శనం కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేశామని స్ధానిక ఆర్టీసీ డిపోమేనేజర్ కె.పద్మావతి తెలిపారు. పంచారామల దర్శిని బస్సులు ప్రతీ ఆదివారం విజయనగరం బస్‌స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. ఈనెల 6,13,20,27 తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశామన్నారు. గురువారం ఇక్కడ బస్‌స్టేషన్‌లో పంచారామాల దర్శిని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపోమేనేజర్ పద్మావతి మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బస్‌స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సులు తిరిగి మంగళవారం ఉదయానికి చేరుకుంటాయని తెలిపారు. పంచారామాల దర్శినిలో అమరావతి, పాలకొల్లు, బీమవరం, ద్రాక్షారామం, సామర్లకోటలో శివక్షేత్రాలను దర్శించుకోవచ్చునని చెప్పారు. బస్సులను పూర్తిగా బుక్ చేసుకుంటే సూలర్‌లగ్జరీ బస్సులకు 75,600 రూపాయలు, అల్ట్రాడీలక్స్ బస్సులకు 53,200 రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 55,200 రూపాయలు, తెలుగువెలుగు బస్సులకు 50,350 రూపాయలు వసూలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శర్మ పాల్గొన్నారు.

బహిరంగ మలవిసర్జన
పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
* మున్సిపల్ కమిషనర్ నాగరాజు
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 3: పట్టణాన్ని బహిరంగ మలవిసర్జన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. కంటోనె్మంట్‌లో బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నందున బహిరంగ మలవిసర్జన విరమించుకోవాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. అర్హులైనవారు వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. పట్టణంలో 90 బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించామని, ఇటీవల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం వల్ల 50శాతానికి తగ్గిందన్నారు. సామాజిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని, పాడైనవాటికి మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే తమకు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు.

ప్రత్యేక హోదా సాధనకై వైకాపా పోరాటం
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 3: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని వైకాపా అలుపెరగని పోరాటం చేస్తుందని వైకాపా పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్‌వివి రాజేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్సీ కోలగట్ల స్వగృహంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆశపువేణు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజిపైనే దృష్టి పెట్టిందని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పారు. సీనియర్ కౌన్సిలర్ రాజేశ్వరరావుమాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఈనెల ఆరవతేదీన విశాఖలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగుతుందన్నారు. ఈ సభలో ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలో అంశాలను తెలియజేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లు చాణుక్య, రంగా పాల్గొన్నారు.

మావోలు బంద్ ప్రభావంతో అప్రమత్తం
మక్కువ, నవంబర్ 3: మావొలు బంద్ ప్రకటించడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవల జరుగుతున్న హింసాత్మక చర్యలు దృష్టిలో పెట్టుకొని మావోలు అన్ని ప్రాంతాల్లో బంద్ ప్రకటించడంతో ఎస్‌ఐ వి.ప్రసాదరావు, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహనరావు ఆధ్వర్యంలో పోలీసు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఏజెన్సీ గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లో సాలూరు, దుగ్గేరు, బొబ్బిలి ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టి నిఘా పెంచారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పోలీసు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది జల్లెడపడుతున్నారు. దీంతో గిరిజన ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మావోలు బంద్ ప్రకటించడంతో ఎక్కడ ఎటువంటి విద్వంశకాండ జరగకుండా మావోల కదలికలపట్ల అప్రమత్తం చేశారు. మావోలు ఎటువంటి చర్యలకు పాల్పడినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఏఒబి పట్టుకోసం మావోయిస్టులు, పోలీసులు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.

పురపాలక పాఠశాలల విద్యార్థులకు ఉన్నత విద్య
* కో-ఆర్డినేటర్ రాజశేఖర్
బొబ్బిలి, నవంబర్ 3: చంద్రన్న ఉన్నత విద్యాదీపం పథకం ద్వారా పురపాలకసంఘ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐఐటి ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజశేఖర్ అన్నారు. పురపాలకసంఘంలో ఉన్న పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ అమలవుతున్న తీరుపై గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ శంకరరావు, చైర్‌పర్సన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో ఒకటి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వేల మంది ఉన్నారని, వీరిలో 1480 మంది విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల ద్వారా పాఠశాల సమయానికి గంట ముందు, పాఠశాల విడిచిపెట్టిన తరువాత గంట విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నట్టు తెలిపారు. చంద్రన్న ఉన్నత విద్యాదీపం పథకం ద్వారా ఈ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యలు అందిస్తున్నామన్నారు. అవసరాన్నిబట్టి ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివేందుకు కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీరోజూ వారానికి 4 పిరియడ్స్ లెక్కలు, రెండేసి పిరిడ్లు వంతున ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు క్లాసులు ఉంటాయన్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. ఈయనతోపాటు చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, కమిషనర్ శంకరరావు పాల్గొన్నారు.

స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరపాలి
* 5 నుంచి పెట్రోల్ బంకు నిర్వాహకుల నిరసన
* 3, 4 తేదీల్లో ఆయిల్ సంస్థల నుంచి కొనుగోళ్లు నిలిపివేత

విజయనగరం, నవంబర్ 3: పెట్రోల్ బంకు డీలర్లు స్టాకు ఉన్నంత వరకు అమ్మకాలు జరపాలని జెసి లఠ్కర్ బంకు నిర్వాహకులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్ల ఆదేశాల మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో బంకు నిర్వాహకులు ఆయిల్ సంస్థల నుంచి పెట్రోల్ కొనుగోళ్లు నిలిపివేస్తున్న విషయం విధితమే. ఈ నెల 5న నిరసన కార్యక్రమం చేపడుతున్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జిల్లా పెట్రోల్ బంకు డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5 నుంచి పెట్రోల్ బంకులు 24 గంటలు పనిచేయవని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ శెలవు దినాలు వర్తింపజేయాలని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జెసికి వివరించారు. ఈ సమావేశంలో డిఎస్‌ఒ శాంతికుమారి, ఎఎస్‌ఒ నాగేశ్వరరావు, పెట్రోల్ బంకు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.