విజయనగరం

రేపటి నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 1: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు తెరిచేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. శనివారం నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. డిఆర్‌డిఎ ద్వారా గత ఏడాది 126 కేంద్రాలు తెరవగా, ఈ ఏడాది 134 కేంద్రాలు తెరవడానికి చర్యలు తీసుకున్నట్టు డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు చెప్పారు. వీటిలో మైదాన ప్రాంతాల్లో 98 కేంద్రాలు, ఐటిడిఎ పరిధిలో 36 కేంద్రాలు కలిపి మొత్తం 134 కేంద్రాలు తెరవనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే పిఎసిఎస్‌ల ద్వారా గత ఏడాది 46 కేంద్రాలకు అనుమతులు రాగా, 43 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిపారు. ఈ ఏడాది 76 కేంద్రాలు తెరిచేందుకు అనుమతులు ఇమ్మని కోరుతున్నారు. వాస్తవానికి పిఎసిఎస్‌లు ధాన్యం కొనుగోళ్లు జరిపిన తరువాత ఆర్థికంగా లాభసాటిగా మారాయి. దీంతో పిఎసిఎస్‌లకు ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరోపక్క ఎస్‌హెచ్‌జిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలద్వారా ఆయా సంఘాలు బలోపేతమయ్యేందుకు డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా డిఆర్‌డిఎ, డిసిఎంఎస్, ఐటిడిఎల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 1,19,069 హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 1,19,207 హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ఖరీఫ్‌లో దిగుబడి 5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగలదని అంచనా వేస్తున్నారు. దీంతో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మృణాళిని ఇటీవల అధికారులను ఆదేశించారు. కాగా, గొడౌన్ల కొరత ఉండటంతో పక్క జిల్లాల నుంచి కూడా గొడౌన్లను రిజర్వు చేసుకోమని మిల్లర్లకు సూచించిన విషయం విధితమే. కొనుగోలు కేంద్రాలు తెరవడంతో రైతులు ఇక నేరుగా ఆయా కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ధాన్యం ఎవరూ కొనుగోలు చేయరాదని ఆదేశించారు. సాధారణంగా ఇప్పటివరకు దళారీలు ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని సాకుతో రైతులకు తక్కువ ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఈసారి రైతులు అలా మోసపోకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ చెబుతున్నారు. దళారులు తక్కువ ధరకు ధాన్యం కొంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యంలో 17 శాతానికి మించి తేమ ఉండకూడదు. అంతకు మించి 22 శాతం వరకు తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేస్తారు. 17-22 శాతం మధ్యలో ఒక్కో శాతానికి కిలో ధాన్యం ధరను నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-ఎ ధాన్యం క్వింటాలుకు రూ.1510, 75 కిలోల బస్తాకు రూ.1132.50 వంతున చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.1470, 75 కిలోల బస్తాకు రూ.1102.50 చొప్పున చెల్లిస్తారు. ఈ ధరల కన్నా తక్కువకు ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రతిసారి ధాన్యం మిల్లర్లపై నియంత్రణ కొరవడుతోంది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి సరైన లెక్కలు చూపడం లేదు. దీనిని అధికారులు కూడా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఈసారి దీనిని అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు ఇచ్చేటప్పుడు వాటి వివరాలను తప్పనిసరిగా ఎ-రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రైవేటుగా మిల్లర్లు కొనుగోలు చేసిన వాటి వివరాలను బి-రిజిస్టర్‌లో నమోదు చేయాలి. గతంలో వీటిని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అక్రమాలు చోటుచేసుకునేవి.
ఇదిలా ఉండగా రవాణా ఛార్జీల సమస్య తలనొప్పిగా మారింది. రైతు కల్లం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తే దానికి నేరుగా రవాణా ఛార్జీలు చెల్లించేలా ఏర్పాటుచేశారు. కొనుగోలు కేంద్రం సూచనల మేరకు కల్లం నుంచి మిల్లరు ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేస్తే ఆ ఛార్జీలను మిల్లర్లకు చెల్లించేలా ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు మాత్రం ధాన్యం నమూనాలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి పరిశీలించుకోవాలి.
కాగా, మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ కింద రూ.50కోట్లు చెల్లిస్తామని, తమకు రూ.250 కోట్లు ధాన్యం సేకరించేందుకు అవకాశం కల్పించమని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే రైతు నుంచి ధాన్యం సేకరించిన రెండు రోజుల్లోగా రైతు బ్యాంకు ఖాతాలకు ఆయా మొత్తాలను జమ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచుకోవడంతో రైతులకు ఊరట కలగనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.