విజయనగరం

క్రిస్మస్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), డిసెంబర్ 24: యేసు క్రీస్తు జననమొందిన రోజును క్రిస్మస్‌గా వ్యవహరిస్తారు. క్రీస్తు జననానికి ముందు నక్షత్రం కనిపించడం వల్ల క్రైస్తవులు నక్షత్రం గుర్తును అతి పవిత్రంగా చూస్తారు. పట్టణంలోని చర్చిలన్నీ క్రిస్మస్ వేడుకలకు సమాయత్తమవుతున్నాయి. చర్చిలను స్టార్స్‌తోను, విద్యుత్ బల్బులుతోను శోభాయమానంగా అలంకరించారు. క్రైస్తవులు తమ ఇళ్లపై స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చి, కంటోనె్మంట్‌లోని ఆర్‌సిఎం చర్చి, లూథరన్ చర్చి, బాప్టిస్టు చర్చిలు క్రిస్మస్ ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు జన్మదినాన్ని కులమతాలకు అతీతంగా విజయనగర పట్టణంలో జరుపుకోవడం విశేషం. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ రోజు కోసం క్రైస్తవులు ఎదురు చూస్తుంటారు.

విద్యార్థులకు కొత్త ఏడాదిలోనైనా...
ఏకరూప దుస్తులు అందేనా?
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 24: జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, కెజిబివి పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభంలో సరఫరా చేయాల్సిన ఏకరూప దుస్తులు నేటి వరకు సరఫరా చేయలేదు. జూన్ నెలలో సరఫరా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని సరఫరా చేయలేకపోయింది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఏడాదిలోనైనా ఈ దుస్తులు అందుతాయో, లేదోనన్న అనుమానాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు మరో మూడు నెలలు మాత్రమే పనిచేస్తాయి. అనంతరం వార్షిక పరీక్షలతో విద్యా సంవత్సరం ముగియనుంది. ఏకరూప దుస్తుల సరఫరాలో ఇంత జాప్యం జరుగుతున్న అధికారులు నోరు మెదపడం లేదు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, కెజిబివి పాఠశాలల్లో ఒకటొ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న బాలురు 77954 మంది, బాలికలు 85552 మంది ఉన్నారు. మొత్తం జిల్లాలో 163506 మంది ఉన్నారు. ఒక్కొ విద్యార్థికి రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు సరఫరా చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుస్తులను సరఫరా చేసే బాధ్యతను ఆప్కోకు అప్పగించినట్టు సమాచారం. కాగా, జిల్లాలో దాదాపు ఏడు నెలలు దాటుతున్న నేటి వరకు అందకపోవడం గమనార్హం. ఏక రూపు దుస్తులకు సంబంధించి జిల్లాలో ఒక్కొ విద్యార్థికి రెండు జతలు చొప్పున సరఫరా చేసేందుకు ఆప్కోకు బాధ్యతలు అప్పగించారు. దుస్తుల సరఫరాలో జాప్యంపై సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా త్వరలోనే దుస్తులను సరఫరా చేస్తామని చెప్పారు. దీనిపై ఆప్కో అధికారులతో మాట్లాడామన్నారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
* ఎమ్మెల్యే మీసాల గీత
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 24: వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటపుడు అప్రమత్తంగా ఉంటే మోసపోకుండా ఉంటారని స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు న్యాయస్థానాలు, వినియోగదారుల ఫోరం ఉన్నాయన్నారు. అందువల్ల వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు మోసపోకుండా ఉండటం వారి బాధ్యతగా గుర్తెరగాలన్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేస్తున్నారని వీటి విషయంలో నాణ్యత, గ్యారంటి తదితర వాటిని పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం 1986లో అమల్లోకి వచ్చిందన్నారు. ఆ చట్ట ప్రకారం వినియోగదారులు మోసాలకు గురైతే చట్ట పరిధిలో రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. మందులు తదితర వస్తువులను కొనుగోలు చేసేటపుడు వాటి గడువు తేదీ కూడా చూసుకొని వాటిని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన వస్తువులలో లోపాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. నష్టపరిహారం కోసం జిల్లా స్థాయిలో రూ.20 లక్షలు, రాష్ట్ర స్థాయిలో రూ.కోటి, జాతీయ స్థాయిలో కోటి రూపాయలు పైబడి మొత్తాలకు నష్టపరిహారాల కోసం అభ్యర్థించవచ్చన్నారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 3731 కేసులు నమోదు కాగా, అందులో 3661 కేసులు పరిష్కరించారని తెలిపారు. మరో 70 కేసులు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది జిల్లాలో 87 కేసులు నమోదుకాగా, 23 కేసులు పరిష్కరించారని తెలిపారు.
విజేతలకు బహుమతులు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ వారు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. డిఇఒ చేతుల మీదుగా వీరికి బహుమతులను అందజేశారు. వకృత్వంలో శే్వత ప్రథమ స్థానం సాధించింది. వ్యాసరచనలో ఎస్.్భరతి ద్వితీయ స్థానం, కుసుమ జిల్లా స్థాయిలోతృతీయ స్థానం సాధించారు.

ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
* మంత్రి మృణాళిని
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 24: ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి మృణాళిని అన్నారు. శనివారం ఆమె జెడ్పిలో స్వాస్థ విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యథిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. అందులో భాగంగానే చంద్రన్న సంచార వైద్యసేవలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15వేలు మంజూరు, ఎన్టీఆర్ బేబి కిట్స్, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆరోగ్యపరమైన కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యాధులకు చికిత్స అందించడంతోపాటు వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శనివారం డ్రై డేగా పాటించాలన్నారు. వేడి నీళ్లు తాగాలన్నారు. స్వచ్ఛ భారత్ పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఎజెసి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేడు పిహెచ్‌సిల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ పద్మజ, డిసిహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉషశ్రీ, ఎంఆర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ భరణికృష్ణ, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, డిపిఒ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ట్రెజరీలలో 300
ఉద్యోగాల భర్తీ
నెల్లిమర్ల, డిసెంబర్ 24: రాష్ట్రంలో గల ట్రెజరీ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 300 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ శాఖ జెడి శివప్రసాద్ వెల్లడించారు. శనివారం ఆయన నెల్లిమర్ల ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిఐఎస్‌బి ఖాతాలో 40వేల నగదు ఉండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 జూనియర్ అకౌంట్లు, ఏడు అకౌంట్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో ఉన్న పోస్టులు భర్తీకి జూన్ 2017కి నియామకాలు చేపడతామన్నారు. బొబ్బిలి, పార్వతీపురంలో ఉప ఖజానాల కార్యాలయాల నిర్మాణానికి 35లక్షల వంతున నిధులు మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గజపతినగరం, భోగాపురం ఉప ఖజానా కార్యాలయాలను ఐదు లక్షల రూపాయల నిధులతో మరమ్మతులు చేపడతామన్నారు. 2014 సంవత్సరం నుంచే అన్ని శాఖలలో ఈ-పేమెంట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో పెద్ద నోట్లు రద్దు ప్రభావం ట్రజరీ శాఖకు లేదన్నారు. ఎస్‌టిఓ గిరిజ పాల్గొన్నారు.
మొండెంఖల్‌లో ఏసిబి సోదాలు
కురుపాం, డిసెంబర్ 24: మండలంలోని మొండెంఖల్ గ్రామంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం ఏసిబి సిఐ కె సతీష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పద్మనాభ పాత్రో ఇంట్లో సోదాలు జరిపారు. ఈయన కుమారుడు సుభాష్‌చంద్రపాత్రో విశాఖలో ఆర్‌అండ్‌బి ఇఇగా పనిచేస్తున్నారు. ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలనేపధ్యంలో ఏసిబి అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. దీంట్లో భాగంగా సుభాష్‌చంద్రపాత్రో స్వగ్రామం మొండెంఖల్‌లో కూడా ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈదాడుల్లో ఏమి లభ్యమయ్యిందీ అధికారులు వెల్లడించలేదు. ఏసిబి దాడులు ఈ ప్రాంతంలో కలకలం సృష్టించాయి.
జిల్లాలో నేనే నెంబర్-1

* ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

వేపాడ, డిసెంబర్ 24: ఎమ్మెల్యేల పనితీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపించిన సర్వేలో జిల్లాలో మళ్లీ తానే నెంబర్-1గా నిలిచానని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం వేపాడలో నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ఏడాది జరిపి సర్వేలో కూడా తానే నెంబర్-1గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది జరిపిన సర్వేలో 100కి 93 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు శుక్రవారం విజయవాడలో జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి శుభాకాంక్షలు తెలియజేశారని ఆమె అన్నారు. ఎమ్మెల్యేలకు మంచిపేరు రావాలంటే ఎంపిపి జడ్పీటిసిలతోపాటు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుల సహాయ సహకారాలు అవసరమని అన్నారు. ఆ విధంగా నియోజకవర్గంలో టిడిపి నేతలు కార్యకర్తలు పనిచేసినందుకు తాను ప్రథమ స్థానంలో నిలిచానని అన్నారు. ఈ స్ఫూర్తితో మరింతగా ప్రజాసేవలో తరిస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో ప్రతిపాదనలు జరిగేలా చూస్తానని ఆమె ప్రకటించారు.

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి
* జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు
గజపతినగరం, డిసెంబర్ 24: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ డిల్లీరావు అన్నారు. శనివారం మండలంలోని దావాలపేట గ్రామ పంచాయితీలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మండలంలోని దావాలపేట గ్రామాన్ని మోడల్ డిజిటలైజేషన్ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసారని అన్నారు. ఇప్పటికే ఈ గ్రామాన్ని ఓడిఎఫ్ గ్రామంగా గుర్తించడంతో వంద శాతం మరుగుదొడ్లను గ్రామాలలో నిర్మించడం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయితీలో 182 కుటుంబాలు ఉండగా 286 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, 70 బ్యాంకు ఖాతాలు మినహా అన్ని ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు చెప్పారు. గ్రామంలో చదువుకున్నవారికి స్మార్ట్ఫున్లు ఉన్న వారికి నగదు రహిత ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. రూపే, ఎటిఎం కార్డులు ఉన్న వారు అవి మనుగడ లేని వాటిని గుర్తించి మనుగడలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. గ్రామంలో అన్ని కార్యక్రమాలు డిజిటలైజేషన్ చేసి నగదురహితంగా అన్ని కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న చంద్రన్న సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త ఇందిరాదేవి, ఎంపిడి ఓ కృష్ణవేణమ్మ, ఎపిఎం కె. శేషగిరిరావు, ఇఓపిఆర్‌డి డి.జనార్థనరావు, గ్రామ సర్పంచ్ రెడ్డి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి

* మంత్రి మృణాళిని

గుర్ల, డిసెంబర్ 24: గ్రామాల అభివృద్ధే థ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. శనివారం ఆమె తెట్టంగి పిఎసిఎస్ ఆధ్వర్యంలో జరిగిన లాభాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పిఎసిఎస్ అధ్యక్షులు తిరుమలరాజు వెంకటనారాయణరాజు(రవిబాబు) అధ్యక్షతవహించారు. మంత్రి మృణాళిని చేతుల మీదుగా మీసేవ కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సహకార సంఘం పరిధిలో సంఘం సభ్యులకు లాభాలు పంచడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రెండు జిల్లాలో తెట్టంగి సొసైటీ లాభాలలో ముందుండడం ఈ ప్రాంత రైతులు అదృష్టవంతులన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తోందని అన్నారు. అలాగే రుణ మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన కార్డులను రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. దీని వలన పంట పొలాల్లో కావలసిన ఎరువులను తగ్గించుకోవడం, పెట్టుబడులు తగ్గి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని అన్నారు. ప్రతి గ్రామాన్ని స్మార్టు విలేజ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ సొసైటీ సంఘం సభ్యులకు 10లక్షల రూపాయలకు లాభాలు పంచడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. తోటపల్లి నీటిని మండలంలోని గడిగెడ్డకు అందించడం జరిగిందని అన్నారు. దీంతో రిజర్వాయరు సామర్థ్యాన్ని పెంచేందుకు ఆమె కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాఫెడ్ డైరెక్టర్ కెవి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ సొసైటీని అభివృద్ధికి సంఘం సభ్యులు, పాలక మండలి సభ్యులు, అధికారులంతా కృషి చేయాలని అన్నారు. సమిష్టిగా పనిచేస్తే లాభాలు సాధింవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యురాలు తిరుమలరాజు పద్మిణి, జిల్లా దేశం పార్టీ ఉపాధ్యాయక్షులు వెన్ని సన్యాసినాయుడు, మండల విప్ సన్యాసినాయుడు, నాబార్డు డిడి ఎం శ్రీనివాస్, డిసిసిబి జనార్థనరావు తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విధానాలవల్లే పరిశ్రప్రభుత్వ విధానాలవల్లే పరిశ్రమల మూత
* సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
బొబ్బిలి, డిసెంబర్ 24: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు మూతపడటంతోపాటు వ్యవసాయరంగం సంక్షోభంలో పడుతుందని, దీంతో కార్మికులు, రైతులకు ఉపాధి లేక వలసబాట పడుతున్నారని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వివరించారు. ఇరాన్ బాధితులకు సంబంధించి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం శనివారం సిటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వలన పరిశ్రమలను మూసివేస్తున్నారన్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న రాల్కో, ఫెర్రో ఎల్లాయిస్, జ్యూట్‌మిల్లులు మూసివేయడంతో కార్మికులు పై దేశాలకు వలసలు వెళుతున్నారన్నారు. పరిశ్రమల యజమానులకు కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఇరాన్ బాధితులను రక్షించడంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సి.పి.ఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి వేణు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.మల మూత

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే మీసాల గీత
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 24: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వధ్యేయమని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. పట్టణంలో అలకానందకాలనీలో టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోస్టాండ్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఆయా పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందాలన్నారు. ముఖ్యంగా చంద్రన్న బీమా పథకం ద్వారా బీమా సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఇందులో ఈ పథకంలో ప్రతి ఒక్కరూ చేరాలని కోరారు. తెలుగుదేశంపార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అలకానందకాలనీ, గోకపేట, బొబ్బాదిపేట తదితర ప్రాంతాల ప్రజానీకానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొర్నాన రాజ్యలక్ష్మి టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నరసింగరావు, తెలుగుదేశం నాయకులు చిట్టిబాబు, రాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర
గజపతినగరం, డిసెంబర్ 24: సమాజాభివృద్ధిలో యువకులు కీలకపాత్ర వహించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.వి.గోపాలరాజు కోరారు. శనివారం ఇక్కడ గాయిత్రి డిగ్రీ కళాశాలలో యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పెద్ద నోట్లు రద్దు వలన సామాన్య ప్రజల కష్టాలు తాత్కాలికమేనని శాశ్వత ప్రయోజనానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విద్యార్థులు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంపొందించుకుని గ్రామాలలో విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. అదే విధంగా పల్లెలన్నీ ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి యువతరం ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మరుగుదొడ్లు నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పుడే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని స్థాపించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. బిజెపి జిల్లా నాయకులు బూడి మన్మధరావు, మండల నాయకులు కె.ఎ.ఎస్.ఎస్. గుప్త, గ్రంథాలయ సంఘం మండల నాయకులు శీర వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవలో విప్లవాత్మక మార్పులు
*మంత్రి కిమిడి మృణాళిని
మెరకముడిదాం, డిసెంబర్ 24: ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాముడు వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. శనివారం మండవలంలో గల గర్భాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1.18 కోట్ల రూపాయల అంచానా వ్యయంతో నిర్మించనున్న అదనపు భవన నార్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లీ బిడ్డ కిట్ కింద తక్షణమే 1000 రూపాయలు అందజేస్తామన్నారు. అలాగే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా ఇంటికి చేర్చుతామన్నారు. ఉచిత డయాలసిస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎన్‌టిఆర్ వైద్య సేవను విస్తరించామన్నారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరు తాగుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిందిగా సూచించారు. తొలినాల్లలో కేన్సర్‌ను గుర్తించేందుకు 35 ఏల్లు దాటిన స్ర్తిలకు ప్రత్యేక పరీక్షలు జరిపేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా చేయాల్సిందిగా, తమ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్యాంక్‌ను ఎర్పాటు చేయాల్సిందిగా ఎంపిపి తాడ్డి సన్యాసినాయుడు మంత్రిని కోరారు. ఈ సమావేశంలో జల్లా వైద్య అధికారి ఎ శారధ , మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఎఎంసి అధ్యక్షుడు సీతారామరాజు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.