విజయనగరం

స్వదేశానికి చేరుకున్న ఇరాన్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జనవరి 16: స్వదేశం నుంచి కడుపుచేతపట్టుకుని వలస కూలీలుగా మారి విదేశాలైన ఇరాన్ వెళ్లి అక్కడ ప్రతికుల వాతావరణలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కూలీలకు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈమేరకు ఇరాన్ నుంచి స్వగ్రామాలకు వచ్చిన బాధితులు సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. తమకు జరిగిన కష్టనష్టాలను చెప్పుకుంటూ కన్నీటిపర్యాంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన అచ్యుతరావు, తిరుపతిరావు, చెల్లారపువలస గ్రామానికి చెందిన భాస్కరరావు, ఇందిరమ్మ కాలనీకి చెందిన వై.శ్రీను, భాస్కరరావు, పిరిడికి చెందిన వేణుగోపాలరావు, సిహెచ్. సింహాచలంతోపాటు మరికొంతమంది జీవనోపాధి కోసం జూన్ 21న విదేశాలకు బయలుదేరారు. ఈ మేరకు భువనేశ్వర్‌కు చెందిన జయరాజ్ ఈ వలస కూలీలను జట్టుగా చేసి పై దేశాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చునని, అధికంగా కూలి డబ్బులు ఇస్తారని ఆశ చూపించడంతో వీరు ఈ ప్రాంతం నుంచి బయలుదేరారు. కాగా 23న ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ నుంచి ఇరాన్ తీసుకువెళ్లాడు. ఇరాన్‌లో కె.పి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో చేర్పించాడు. వీరికి నెలకు 20 నుంచి 40వేల రూపాయలు ఇచ్చేవారని దీంతో తాము అక్కడ పనిచేసినట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ఎం.డి. అజయ్‌అగర్వాల్ తమకు సంబంధించిన పాసుపోర్టులను తీసుకోవడంతో తాము రాలేని పరిస్థితి నెలకొందన్నారు. నవంబర్ నెలలో ఆ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో పరిశ్రమలను మూసివేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి తమకు ఆహారం,నీరు, ఇతర అవసరాలకు డబ్బులు పరిశ్రమల యాజమాన్య అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సెల్ రీచార్జ్‌కు డబ్బులు లేని పరిస్థితిలో తాము పలు ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు, తమ గోడును బాహ్యప్రపంచానికి తెలియజేసిన పత్రికల ద్వారా తెలుసుకున్న పాలకులు తమను విడిపించేందుకు ప్రత్నించినట్లు తెలిపారు. దీంతో జనవరి 9న తాము విదేశాల నుంచి విడుదలై బయలుదేరి 14న ఇళ్లకు చేరి కుటుంబ సభ్యులతో ఆనందోత్సహాల మధ్య గడిపినట్లు తెలిపారు. దీంతో బాధితులకు సంబంధించిన కుటుంబీలకు ఊపిరిపీల్చుకున్నారు.

‘గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

విజయనగరం, జనవరి 16: జిల్లాలో వివిధ పథకాల కింద చేపడుతున్న గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎన్‌టిఆర్ గ్రామీణ, పట్టణ గృహాలు ఎన్టీఆర్ ప్రత్యేక గృహనిర్మాణం, హుదూద్ గృహాలు, ఐఎవై తదితర పథకాల ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి సత్వరమే వాటిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి గృహాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు వారం రోజుల్లోగా అందజేయాలన్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాల పనులు వేగవంతానికి డిఇలు, ఎఇలకు లక్ష్యాలను నిర్ధేశించాలని పిడి రమణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. ఎన్‌టిఆర్ ప్రత్యేక హౌసింగ్ కింద హుదూద్ తుపాను బాధితులకు మంజూరైన గృహ నిర్మాణ పనులను మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన 9118 గృహాలలో 4954 నెలకోల్పారని మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 6641 గృహాలు మంజూరు చేయగా 1581 నెలకోల్పారని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి జిల్లాకు ఐఎవై పథకం కింద 4163 గృహాలు మంజూరుకాగా 3854 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన 309 గృహాలు సత్వరం పూర్తి చేయాలన్నారు. మంజూరైన గృహాలను త్వరగా నిర్మించకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ గృహ నిర్మాణ పథకం కింద హుదూద్ తుపాను బాధితులకు ఇంకా 1368 గృహాల నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలన్నారు. గృహనిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, భూ సమస్యలు ఉంటే వాటిని సంబంధిత తహశీల్దార్లు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ పిడి రమణమూర్తి, హౌసింగ్ డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.

నేడు చా.సో 102వ జయంతి
* వినోదినికి చాసో స్ఫూర్తి
సాహితీ పురస్కారం

విజయనగరం, జనవరి 16: కధా రచనలో గురజాడ వారసత్వ ప్రతినిధిగా వాసికెక్కిన వారు చాగంటి సోమయాజులు (చా.సో). ఆయన కథలు నిడివిలో చిన్నవిగా ఉన్న ప్రజాభిమానం పొందడంలో మిన్నగా ఉండేవి. ఆయన కథలకు సాహిత్యాభిమానులు పెద్దపీట వేసి ఆదరించారు. ఆయన పూర్వీకులు మహాపండితులు. సంస్కృతం, ఉర్ధూ, అరబ్బీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యులు. చాసో 1915 జనవరి 17న శ్రీకాకుళంలో జర్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం శ్రీకాకుళంలోనే సాగింది. విజయనగరం మహరాజ కళాశాలలో కాలేజీ విద్యను అభ్యసించారు. ఈ దశలోనే ఆయనకు రోణంకి అప్పలస్వామితో పరిచయం ఏర్పడింది. అదే ఆయను రచనా రంగానికి చేరువ చేసింది. షెల్లీ, వర్డ్సువర్త్‌లతోపాటు భారత కోకిల సరోజినినాయుడు రచనల ప్రభావం ఆయనపై పడింది. మార్క్సిజం ప్రభావం ఆయన ప్రాపంచిన దృక్పధాన్ని మార్చివేసింది. మహోన్నత కథా రచయితగా చాసోను తీర్చిదిద్దింది. చిన్నపల్లివీధిలో చాసో స్వగృహం అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఆటపట్టుగా నిలిచింది. 1930-40 మధ్య కాలంలో తెలుగు కవిత్యోద్యమానికి కవాటాలు తెరచింది. శ్రీరంగం నారాయణబాబు చాసో ఇంటి పక్కనే నివసిచేవారు. దాదాపు 24 గంటలు ఆయన చాసో ఇంటిలోనే గడిపేవారు. చాసో, రోణంకి నారాయణబాబు భగత్‌సింగ్ ఆశయాలపట్ల ఆకర్షితులై సోషలిస్టు భావాలను పెంపొందించుకున్నారు. హేతువాదాన్ని, భౌతిక దృక్పథాన్ని పెంపొందించుకొని ప్రజలు అన్యాయాలను ఎదుర్కొవాలని తన కథలలో చెప్పారు.
శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, రోణంకి, ఆరుద్రలకు వసతిగృహ అధ్యయన కేంద్రం శిక్షణ శిబిరంగా విరాజిల్లింది. సాహిత్యంలో ఉప్పెనలాంటి విప్లవాత్మక భావాలకు ఊపిరిపోసింది. ఆ తరువాత సాహిత్య ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణబాబు, రుధిర జ్యోతి, చాసో కథలు ఆవిర్భవించాయి. చాసో నాలుగు దశాబ్ధాలపాటు 50కి పైగా కథలు రాశారు. ఆయన కథలు దృశ్య సాక్ష్యాత్కారాలు. సన్నివేశాలలో సహజత్వం, పాత్రోచిత సంభాషణలో పటుత్వం చాసోకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన కధలో మద్యతరగతుల మనస్తత్వం గోచరిస్తుంది. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఎదురీదలేని పాత్రల ప్రవర్తనల్లోని వైవిద్య దృక్పథం పాటకుల గుండెలను కదిలిస్తుంది. మెరుపులాంటి ముగింపులోనే చాసో కథల చాతుర్యం దాగి ఉంది. పరిమితమైన జీవిత పరిధులు దాటి తనకంటే పై అంతస్తులకు చేరుకోవడమే వీరి కథల ప్రధాన లక్ష్యం. ‘గుడిసె దీర్ఘరోగి’ కథ మధ్యతరగతి మనుష్యులలో దాగి ఉండే సౌందర్యధారణకు మచ్చుతునక. నడిమంత్రపు సిరి పట్టిన మధ్య తరగతి కుటుంబీకుల మనస్తత్వాన్ని ‘వణులవారి’ కథలో చక్కగా వ్యక్తం చేశారు. చాసో పేరు వినకగానే కుక్కలకటే హీనంగా బతికే ‘కుక్కుటేశ్వరరావు’ కథ ఎవరికైనా జ్ఞప్తికి వస్తుంది. ‘లేడి కరుణాకరం, ఏలూరు వెళ్లాలి’, ఎందుకు పారేస్తారు నాన్న, బండపాటు, ఎంపు, జంక్షన్‌లో బడ్డీ, దుమ్మలగుండె, బొమ్మలపెళ్లి.. ఇలా ప్రతి కథ చాసో ప్రతిభకు సామాజిక చైతన్యానికి సారథ్యం వహిస్తాయి. 1949 నుంచి అభ్యుదయ రచయితల సంఘానికి ఆన ఉత్తేజాన్ని అందించారు. చాసో కథల్లో మెత్తని కత్తులు మెరుపులు మెరిపిస్తాయి. ప్రతి కథను ఆన కొలతల ప్రకారం రాస్తారు. జీవితం నుచి ఎన్నుకున్న ఇతి వృత్తాలకు ఆయన తాత్విక దృక్పథాన్ని కల్పిస్తారు. సన్నివేశ నిర్మాణ సంవిధానంలో చాసో చైహూ, తుర్గనీస్ వంటి రష్యన్ రచయితల ఫరిణతిని చాసో ఆకలింపు చేసుకున్నారన్న సోమసుందరం మాటలు అక్షర సత్యాలు. చాసో ముద్ర చెరిగిపోదని ఆరుద్ర అన్నారు. చాసో ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు, సత్కారాలు పొందారు. నిమగ్నత, నిజాయితీ, నిరాడంబరత, మానవత్వం, చాసో ఆయుధాలు అవే కథా రచనలో ఆయన అభ్యున్నతికి సోపానాలు. సాహిత్య రంగంలో చాసో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఏటా ఆయన జయంతిన ఆయన కుమార్తె చాగంటి తులసి ఉన్నత స్థాయిలో నిర్వహిస్తొంది. ఆయన అభ్యుదయ భావాలకు అంకితమైన రచయితలకు చాసో సాహితీ పురస్కారాన్ని అందజేస్తోంది.

ఈ ఏడాది 17న వేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఎం వినోదినికి చా.సో స్ఫూర్తి పురస్కారాన్ని అందజేయనున్నారు. గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని విశిష్ట అతిధుల చేతుల మీదుగా అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. 1995 నుంచి ప్రారంభమైన చాసో స్ఫూర్తి పురస్కారం ఇప్పటి వరకు 21 మంది అందుకున్నారు. వారిలో ఎం.రామోమోహనరావు, ఆరుద్ర, పి.సత్యవతి, గంటేడ గౌరునాయుడు, బోయ జంగయ్య, కెఎన్‌వై పతంజలి, చిలుకూరి దేవపుత్ర, ముడిగంటి సుజాతరెడ్డి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కె.వరలక్ష్మి, వి.ప్రతిమ, ఎం.ఖాదిర్‌బాబు, జాజులర గౌరి, ఎస్.సలీం, ఎస్‌వి.రామిరెడ్డి, కె.పద్మ, శశిశ్రీ, ఎఎన్ జగన్నాధ శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్, చింతకింది శ్రీనివాసరావు, కె.వి.రమణారావు ఉన్నారు.
భవన నిర్మాణానికి రూ.11 లక్షల విరాళం
చాసో పేరుమీద ఇప్పటికే గురజాడ గ్రంథాలయంలో సాహితీ సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక ఎసి హాలు నిర్మాణానికి ఆయన కుమార్తె చాగంటి తులసి రూ.11 లక్షలు విరాళం అందజేశారు. ఆ హాలులోనే చాసో పురస్కారాన్ని అందజేయనున్నారు.

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు అంతంతమాత్రం
విజయనగరం(టౌన్), జనవరి 16: సంక్రాంతి పండుగ కావడంతో మీకోసం గ్రీవెన్స్‌కు అరకొకరగా వినతులు అందాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే మీకోసం గ్రీవెన్స్‌కు వందల సంఖ్యలో సమస్యలు, ఫిర్యాదులు, వ్యక్తిగత అంశాలపై అర్జీలు అందుతాయి. అయితే సోమవారం ముక్కనుమ పండుగ కావడంతో అర్జీదారుల తాకిడి అంతగా లేదు. ఒకరు ఇద్దరు వారి సమస్యలు తెలిపేందుకు కలెక్టరు కార్యాలయానికి రాగా మరికొందరు భూసమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్ వివేక్ యాదవ్, ఎజెసి నాగేశ్వరరావు, డి ఆర్వో జితేంద్రలు అర్జీలు స్వీకరించారు.
భోగాపురం మండలం సుందరపేట గ్రామం పరిధిలో 16 వ నెంబర్ జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోని వ్యవసాయ భూమి ఉందని అందులో 14 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డులు రెవెన్యూలో ఎకరాలలో కాకుండా గజాల లెక్కలో నమోదు అయి ఉన్నాయని వాటిని సరిచేసి ఎకరాల కిందకు రికార్డుల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ గుండాల మన్మధరావు కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందచేసారు.
పల్లం భూమిలో విజరామరాజు చెరువునుండి వచ్చే నీటితో పంటలు పండించు కుంటున్నామని, అయితే తమ భూములు ఉన్న రెవెన్యూలో కొంత మేర భూమి ఎకరాలలో ఉండగా వాటి మధ్యలో ఉన్న ఈ 14 ఎకరాల భూమి గజముల కొలతలో ఉండటం వలన అనేక సమస్యలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ల ఫీజు విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయని వాటివలన చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా 2015-16 సంవత్సరంలో వివధ పథకాల కింద మంజూరు అయిన స్కీముల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ఎపి రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బుద్దరాజు రాంబాబు ఫిర్యాదు చేసారు. ఉద్యాన పంటల విస్తీర్ణంకింద జిల్లాలో 20 పేక్ హౌస్‌లు మంజూరు చేసారని, ఇందులో గంట్యాడ మండలంలో రెండు మంజూరు అయ్యాయని అర్హులకు వాటిని మంజూరు చేయకుండా అవకతవకలు చోటుచేసుకున్నాయని వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు.
బొబ్బిలి మండలం అంటిపేట గ్రామానికి చెందిన పార్వతి అనే ఆమె తనకు 12 ఎకరాల భూమి ఉందని అయితే తనకు తెలియకుండా తన భర్త రెండవ భార్య సంతానం ఆభూమిని వారిపేరుమీద రాయించుకున్నారని తగు న్యాయం చేయాలని మీకోసం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.రేషన్ కార్డులు, ఇతర సమస్యలపై వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బస్సులు ఎక్కువ...ఆదాయం తక్కువ
* ఆర్టీసీ అధికారుల మనోవేదన

విజయనగరం (్ఫర్టు),జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా సమృద్ధిగా ఆదాయం సంపాదించుకోవచ్చునని ఆశించిన ఆర్టీసీ అధికారులకు నిరాశే మిగింది. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయనగరం రీజియన్ నుంచి ప్రతీరోజూ ప్రత్యేక బస్సులను నడిపినప్పటికీ రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాన్ని దాటకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ముక్కనుమ సందర్భంగా సోమవారం స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావించారు. అయితే ఆశించినంతగా ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో మధనపడుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో ప్రత్యేక బస్సులను నడపడం ద్వారా ఈనెల 13వతేదీన కోటి 9లక్షలు, 14వతేదీన 74లక్షలు, 15వతేదీన 70 లక్షల రూపాయల ఆదాయం రాగా, సోమవారం కోటి రూపాయలకు పైబడి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. విజయనగరం రీజియన్‌లో ప్రతిరోజూ రెగ్యులర్‌గా తిరిగే బస్సుల ద్వారా 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అయితే సంక్రాంతి రోజులలో ప్రతీరోజూ కోటి 25 లక్షల రూపాయలకు పైబడి ఆదాయం సంపాదించుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. అయితే అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. విజయగరం, శ్రీకాకుళం డిపోల నుంచి హైదారాబాద్‌కు ప్రత్యేక బస్సులను నడిపినప్పటికీ ఆశించిన మేరకు ఆదాయం రాలేదు. హైదారాబాద్ నుంచి విజయనగరం వచ్చేందుకు ప్రతి ట్రిప్పునకు 50వేల రూపాయల మేరకు ఆదాయం రాగా, విజయనగరం నుంచి హైదారాబాద్ వెళ్లేబస్సులకు 20వేల రూపాయలకు మించి ఆదాయం లేదు. దీనివల్ల కొంతమేరకు ప్రయాణికులకు ప్రయోజనం ఉన్నప్పటికీ ఆర్టీసీకి ఒరిగిందేమి కనిపించడంలేదు. అదేవిధంగా విజయనగరం, ఎస్.కోట, సాలూరు,పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోల నుంచి విశాఖపట్టణానికి రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సులను కూడా నడిపారు. అలాగే అనకాపల్లి, కొత్తవలస తదితర ప్రాంతాలకు బస్సులను నడిపినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. ఇదేస్థాయిలో ప్రైవేటు వాహనాలు కూడా ఎక్కువగానే తిరిగాయి. ఏదిఏమైనప్పటికీ ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్టీసీ అధికారులు నిరాశలో ఉన్నారు. ఈనెల 20వతేదీ వరకు పండుగ హడావిడి ఉన్నందున రానున్న నాలుగురోజులలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

సోలార్ విద్యుత్ అలవాటు చేసుకోవాలి: కలెక్టర్

విజయనగరం, జనవరి 16: ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగానికి అలవాటుపడాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో రూ.22 లక్షలతో నిర్మించిన సోలార్ ప్యానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌కు ప్రతి నెల రూ.1.02 లక్షల విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. సోలార్ వినియోగం వల్ల రూ.27వేలు ఆదా అవుతుందని వివరించారు.
ఈ ప్యానల్ నుంచి నెలవారీ ఉత్పత్తి అయ్యే విద్యుత్ 30 కిలోవాట్‌గా ఉందన్నారు. ఒక్కో ప్యానల్ 240 వాట్ల కెపాసిటీ కలిగిన 125 ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కలెక్టరేట్‌కు సరిపోతుందన్నారు. కలెక్టరేట్‌లో మిగిలిన కార్యాలయాలకు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం మరో యూనిట్‌ను సమావేశ మందిరంపై భాగంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లులో సోలా వినియోగం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ చిరంజీవిరావు మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందినద నువాన్ గ్రీన్ ప్రైవేటు లిమిటెడ్ సహకారంతో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్యానల్ గ్యారంటీ ఐదేళ్లుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలొ జెసి నాగేశ్వరరావు, డిఆర్వో జితేందర్, డిఇ మూర్తి, ఎడిఇ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలియజేస్తే చర్యలు: ఎస్పీ

విజయనగరం, జనవరి 16: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు అంతంత మాత్రమే వచ్చాయి. సంక్రాంతి పండుగ కావడంతో ఫిర్యాదుదారులు ఎవరూ పెద్ద సంఖ్యలో రాలేదు. ఎస్‌కోటకు చెందిన ఫిర్యాదుదారుడు వచ్చి తనకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని తనను ఓ వ్యక్తి మోసం చేశాడని తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్పీ తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
మరుగుదొడ్ల నిర్మాణ పనులు
వేగవంతం చేయాలి

విజయనగరం, జనవరి 16: జిల్లాలో అన్ని గ్రామాలను ఒడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మండల అధికారులతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఒడిఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో జితేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.