విజయనగరం

ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 23: జిల్లాలోని కొమరాడ మండలం కూనేరులో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై కేంద్ర దర్యాప్తు బృందం సోమవారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటనలో 41 మంది నిండు ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్న విషయం విధితమే. దీనిపై వ్యవస్థలోని నిర్లక్ష్యమా? విద్రోహమా? అనే కోణంలో వివిధ దర్యాప్తు బృందాలు తమ పరిశోధనను మొదలుపెట్టాయి. కేంద్ర దర్యాప్తు బృందానికి బిశ్వాస్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బృందం పట్టాలు విరిగిపోయిన వాటి కొలతలు, ఎంత దూరంలో రైలు ఆగింది? తదితర అంశాలపై వివరాలను సేకరించాయి. పట్టాలపై ముక్కలైన పట్టా కమ్ము తదితర వాటిని సేకరించారు. అలాగే పట్టా విరగడం వల్ల రైలు కమ్ములు ఎంత దూరం వెడల్పు పెరిగింది తదితర వాటిపై కొలతలు తీసుకున్నారు. అనంతరం అక్కడ రికార్డులు పరిశీలించి కేబిన్ మేన్ నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. హిరాఖండ్‌కు ముందర గూడ్స్ రైలు వెళ్లినపుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని కూడా అంచనా వేస్తున్నారు. హిరాఖండ్ రైలు పట్టాలు తప్పడానికి ముందర చక్రాల నుంచి మంటలు కన్పించాయని కేబిన్‌మేన్ చెప్పాడు.
ఆ తరువాత కొద్ది సెకన్లలోనే ఢమాల్ ఢమాల్ మంటూ పెద్దగా శబ్ధం వచ్చిందని సంఘటన గురించి వివరించాడు. దీనిపై స్టేషన్ మాస్టారుకు సమాచారం అందించేలోపల పెనుప్రమాదం జరిగిందని తెలిపాడు. సిఐడి విభాగం నుంచి ఆ శాఖ డిజి అమిత్‌గార్గ్, అడిషనల్ డిజి ద్వారకా తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఏదేని కుట్ర వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని కొట్టి పారేయలేమని ఆయన విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ దర్యాప్తులో ప్రత్యక్ష సాక్ష్యులను కూడా విచారించనున్నట్టు తెలిపారు.

సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం

మక్కువ, జనవరి 23: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీశంబర పోలమాంబను కనులారా తిలకించేందుకు భక్తులంతా ఎదురు చూస్తున్నారు. అమ్మవారి దీవెనలను పొందేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3గంటలకు సిరిమానోత్సవాన్ని ప్రారంభమయ్యేలా ఆలయ కమిటీసభ్యులు, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జన్ని పేకాపు రామారావు సిరిమానును అధిరోహించనున్నట్లు తెలిపారు. సిరిమాను పురవీదుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి తోపులాటలు జరగకుండా 900మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 290 ఆర్టీసి బస్సులను నడుపుతున్నామన్నారు. వైద్యం, రెవెన్యూశాఖాధికారులు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవాదాయశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 4లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక దర్శనానికి 25 రూపాయలు, శ్రీఘ్రదర్శనానికి 10, ఉచిత దర్శనం క్యూలైన్లును ఏర్పాటు చేశారు. అలాగే సిరిమానును శంబర గ్రామానికి చెందిన తీళ్లశ్రీరామునాయుడు తోటలో సుమారు 40అడుగుల సిరిమానును తీసుకువచ్చారు. సిరిమానోత్సవానికి ఏర్పాటు చేసిన రధాన్ని ఆర్.అండ్.బి. జె.ఇ. సోమవారం పరిశీలించారు. శంబర గ్రామానికి 5 మార్గాల ద్వారా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. బొబ్బిలి-శంబర నుంచి వచ్చే వాహనాలకు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద, సాలూరు నుంచి వచ్చేవాహనాలకు వనంగుడి వద్దను ఏర్పాటు చేశారు.

కూనేరు రైలు ఘటన ప్రమాదంలో
మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షల అందజేత

సాలూరు, జనవరి 23: కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన అమ్మన్న కుటుంబానికి సోమవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ విజయకుమారి చేతుల మీదుగా 2లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈస్ట్‌కోస్టు రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎస్.హోరా ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్ విజయకుమారి మృతురాలి కోడలు అరుణకు 2లక్షల రూపాయలు నగదు అందజేశారు. మిగిలిన మొత్తం రాష్ట్రప్రభుత్వం తరుపున మంజూరవుతుందన్నారు. అమ్మన్నమ్మ మృతితో ఆమె కుటుంబం తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఆమెను పట్టణ ప్రముఖులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి. ఏ. ఏ.పి.ఓ. కృష్ణ, పట్టణ దేశం పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు, కౌన్సిలర్లు సింహాచలం, సింగారపు సీత, అప్పయ్యమ్మలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో
అవకతవకలు జరిగితే
చర్యలు తప్పవు
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలులో అవతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జనార్థన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం బ్యాంకు సమావేశ మందిరంలో సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 47 సహకార సంఘాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రైతుల నుంచి ఇంతవరకు లక్షా 20వేల టన్ను ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే ఇంతవరకు 175 కోట్ల రూపాయల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా బిల్లుల చెల్లింపులలో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం డివిజన్ సహకార శాఖ అధికారి దన్నాన నారాయణరావుమాట్లాడుతూ దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అందువల్ల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శికసూత్రాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘాల ముఖ్య కార్వనిర్వహణాధికారులకు ధాన్యం నాణ్యత, కొనుగోలు తదితర అంశాలపై జిల్లా పౌరసరఫరాల అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం డివిజన్ సహకారశాఖ అధికారి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను కలుసుకున్న వైకాపా నేతలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 23: హిరాఖండ్ రైలు ప్రమాద ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు సోమవారం ఇక్కడ ఆర్ అండ్ బిలో కలుసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాసు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు బొత్స అప్పలనర్సయ్య, డాక్టర్ సురేష్‌బాబులతో పాటు నేతలు కడుబండి శ్రీనివాసరావు, అవనాపు విజయ్, విక్రమ్, ఆశపు వేణు, మజ్జి శ్రీనివాసరావు, వేచలపు చిన రాములునాయుడు, మూకల కస్తూరి, జైహింద్, మజ్జి త్రినాద్, నడిపేన శ్రీను తదితరులు కలుసుకున్నారు.

దేశం గర్వించదగ్గ నాయకులు నేతాజీ, ఎన్టీఆర్‌లు
వేపాడ, జనవరి 23: స్వాతంత్రం సమూపార్జనలో పోరాటపటిమ గల నేతాజీ సుభాష్ చంద్రబోస్, పార్టీ పెట్టిన ఆనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి అంతర్జాతీంగా తెలుగు వాడి కీర్తిపతాకాన్ని ఎగురవేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావులు దేశం గర్వించదగ్గమహనీయులని రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య ముర్రుముత్యాలు నాయుడు అన్నారు. మండలంలోని వేపాడలో స్వాతంత్య్ర సమర యోధుడు షేక్ ఖాదర్ మొహిద్దీన్ కుటుంబ సభ్యులు సమకూర్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, నందమూరి తారకరామారావుల విగ్రహాలను విశాఖ డెయిరీ ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ నేతాజీ ఏర్పాటు చేసిన భారతసైన్యంలో పనిచేసిన అదృష్టం, ఘనత ఖాదర్‌మొహిద్దీన్ దక్కడం విశేషం అని అన్నారు. ఒక్క రూపాయి చందాకూడా అడగకుండా స్వంత ఖర్చులతో ఈ విగ్రహాలను నెలకొల్పడం నాటి విలువలకు అద్దంపడుతోందని అన్నారు. గాంధీజీ చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో ఇంగ్లాండు, ఇండియాలలో ఐసి ఎస్ పరీక్షలో నాల్గవ ర్యాంగకు సాధించినప్పటికీ తన దైన శైలిలో స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ కొన్ని విశ్వవ్యాప్తంగా ఎగురవేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తనకు ఉన్న అనుభవాలను నెమరవేసుకుంటూ 1993లో తాను తానా అధ్యక్షుడుగా ఉన్నప్పడు ఆయనను అమెరికాకు తీసుకెళ్లిన అదృష్టం తనకు దక్కడం మహా భాగ్యంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహదాత ఖాదర్‌మొహిద్ధీన్‌కు జాపిక అందజేసి దుశ్శాలువా కప్పి సన్మానించారు.

అగ్రిగోల్డ్‌బాధితుల రిలే నిరాహారదీక్ష
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు జాప్యం చేస్తున్నందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ నిరసనదీక్షలు ఈనెల 27వ తేదీవరకు జరుగుతాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుమాట్లాడుతూ అగ్రిగోల్డ్ కస్టమర్లకు చెల్లించవలసిన చెల్లింపుల కంటే కంపెనీ ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ ధర్యాప్తు సంస్థ చెప్పిన మేరకు ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కస్టమర్లకు అసలు, వడ్డీతో సహా చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 1000 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులను వేలం వేయాలన్నారు. ఈ వేలానికి ప్రభుత్వం, అప్పు ఇచ్చిన బ్యాంకులు పూర్తిగా బాధ్యత వహించాలన్నారు.

ప్రత్యేక అధికారి పాలనలో పాలవలస గ్రామం
* సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య ఐక్యత లోపమే కారణం
* నిలిచిపోయిన అభివృద్ధి పనులు
* చొరవ తీసుకున్న మంత్రి మృణాళిని

గుర్ల, జనవరి 23: మండలంలో పాలవలస గ్రామంలో ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లిపోయింది. గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడి చందంగా గ్రామం వెనుకబడింది. సర్పంచ్, వార్డు మెంబర్ల మధ్య గత మూడు సంవత్సరాలుగా వివాదం తలెత్తడంతో అభివృద్ధి నిలిచిపోయింది. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు కోటి రూపాయలు నిధులు గ్రామానికి మంజూరైనప్పటికీ నేటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వీధిలైట్లు, శానిటేషన్, పంచాయితీ భవనం, అంగన్వాడీ భవనం, సామాజిక భవనం, సిసి రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులకు ఈ నిధులు మంజూరు అయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో పలుమార్లు గ్రామ సభలు పెట్టి నచ్చజెప్పారు. అయినా ఫలితం లేకపోయింది. జనవరిలో జరిగిన గ్రామ సభలో మంత్రి కిమిడి మృణిళిని దృష్టికి గ్రామ ప్రజలు ఆమెకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్‌కు పాలవలస గ్రామ విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దీనికి స్పందించిన కలెక్టర్ సోమవారం మండల కార్యాలయానికి ప్రత్యేక అధికారిపాలన చేయాలని ఉత్తర్వులు అందించారని ఎంపి డి ఓ రవికుమార్ తెలిపారు. దీంతో గ్రామ సర్పంచ్ తాడ్డి సత్యవతి ఆధ్వర్యంలో డి ఎల్ పి ఓ మోహనరావు పర్యవేక్షణలో పాలవలసను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గ్రామంలో అత్యవసర పనులతోపాటు అభివృద్ధి పనులన్నీ జరిగేలా చూడాలని చెప్పారు. దీంతో పాలవలస గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశిద్దామని ఎంపిటిసిలు, జడ్పీటిసీలు హర్షం వ్యక్తం చేశారు.