విజయనగరం

టిడిపిలో లుకలుకలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 5: జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అధిష్టానానికి తలనొప్పి కలిగిస్తున్నాయి. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఉండవల్లి నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో విభేదాలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం.
ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, చిరంజీవులుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. నియోజకవర్గాల్లో నేతలు సమన్వయంతో కలసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా విభేదాలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. ఇటీవల కాలంలో వివిధ నియోజకవర్గాల్లో నేతలు తమను కలుపుకొని వెళ్లడం లేదని, లబ్ధిదారుల ఎంపికలో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. టిడిపి సభ్యులు అంతా ఒక కుటుంబం మాదిరిగా కలసి పనిచేయాలే తప్ప ఎవరికి వారు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లాలోని టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నమాట బహిరంగ రహస్యమే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అలా వ్యవహరిస్తే ఊరుకోనని పేర్కొన్నపట్టు సమాచారం. విజయనగరం నియోజకవర్గంలో పరిశీలిస్తే.. ఇక్కడ ఎమ్మెల్యే గీతకు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అలాగే ఎస్.కోట నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే లలితకుమారి, శోభా హైమవతి మధ్య స్పర్థలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఇక పార్వతీపురం నియోజకవర్గంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కు, ఎమ్మెల్యే చిరంజీవులకు మధ్య విభేదాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, వివిధ మండలాల నేతలను కలుపుకొని పోవాలని సూచించినట్టు తెలిసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌ను గెలిపించండి: కేంద్రమంత్రి అశోక్

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 5: రానున్న ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి, టిడిపి పొత్తుతో బరిలో దిగిన అభ్యర్థి పివిఎన్ మాధవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ నాయుడు ఫంక్షన్ హాల్లో పిఆర్‌టిఎయు నేత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ వివిధ రంగాల అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందన్నారు. మరోపక్క అవినీతి నిర్మూలన, పారదర్శకతను సాధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు ఎయిర్‌పోర్టులను వినియోగంలోకి తీసుకువస్తున్నామన్నారు. గత 70 ఏళ్లలో ఎంత సాధించామో, బిజెపి అధికారంలోకి వచ్చాక అంత అభివృద్ధి చేయగలుగుతున్నామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయడం వల్ల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు.
బడ్జెట్‌పై అవగాహన లేదా?
రాష్ట్రం మొత్తం బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లు కాగా, అందులో రూ.1.15 లక్షల కోట్లు నిరుద్యోగ భృతి కింద చెల్లించాలని ప్రతిపక్షనేత జగన్ పేర్కొనడం అతని అవగాహన రాహిత్యానికి ఉదాహరణ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. దొంగలకు ఓట్లు వేస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో ఊహించాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఐదేళ్లలో ఎప్పుడైనా అమలు చేసే వీలుందన్నారు.
వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగభృతి చెల్లించేందుకు కేటాయింపులు జరిపినట్టు లీకైందన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు కలిపి గ్రామాల్లో వేలాది కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ఏడాది 5వేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేసినట్టు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతోపాటు ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రం భరించడం అభినందించదగ్గ విషయమన్నారు.
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తదితరులు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్, ఎమ్మెల్యే మీసాల గీత, చిరంజీవులు, వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, బిజెపి నేత బి.శివప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బిజెపి - టిడిపిలకు బుద్ధిచెప్పండి’
విజయనగరం(టౌన్), మార్చి 5: ఉత్తరాంధ్రను తీవ్రంగా నిర్లక్ష్యంచేసిన బిజెపి- టిడిపిలకు గుణపాఠం వచ్చేలా పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాసా పిలుపునిచ్చారు. ఆదివారం పిడి ఎఫ్ అభ్యర్ధి అజశర్మకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు కార్యాలయంనుండి పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలోలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు మరిచి ఇపుడు తగదునమ్మా అంటూ ఓటరులు ముందుకు వచ్చిన వారి అభ్యర్ధికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి అమలు చేస్తామని, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని,రైల్వేజోన్ ఏర్పాటు సహా అనేక వాగ్ధానాలు గుప్పించి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. టిడిపి- బిజెపిల పాలనలో ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని ఆయన ఆరోపించారు. ఈనేపధ్యంలో ఈనెల 9న జరిగే ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరులు ప్రజాసంఘాలు బలపరిచిన పిడి ఎఫ్ అభ్యర్ధి అజశర్మకు మొదటి ప్రాధాన్యతా ఓటు ఇవ్వాలని కోరారు. ఈర్యాలీలో సిపి ఐ జిల్లా డిప్యూటీ ప్రధానకార్యదర్శి బుగతసూరిబాబు, ఎ ఐ టియుసి నాయకులు రంగరాజు, ఆల్తిచినమారయ్య, సి ఐటియు డివిజన్ కార్యదర్శి రెడ్డిశంకరరావు, యుటి ఎఫ్ రాష్ట్ర నాయకులు రాము, గౌరవాధ్యక్షుడు అల్లూరి శివవర్మ, శేషగిరి, ప్రజాసంఘాల నాయకులు సురేష్, జీవా, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన కనకమహాలక్ష్మి అమ్మవారి యాత్ర
చీపురుపల్లి, మార్చి 5: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యాత్ర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ అమ్మవారి యాత్ర ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో భాగంగా కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చక బృందం ఆదివారం తెల్లవారు జాము నుంచి సంబరాలు నిర్వహించారు.
సోమవారం కుంకుమపూజలు, మంగళవారం అసిరితల్లి కోట దుర్గ పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, మాజీ విప్ గెద్ద బాబూరావు,జడ్పీటిసి మీసాల వరహాల నాయుడు, వైకాపా రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు, ఇప్పిల అనంత్, బి. శ్రీనివాసనాయుడు తదితరుల అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ యాత్ర సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను
అసెంబ్లీలో ప్రస్తావించాలి

* ఎమ్మెల్యే గీతకు ఉద్యోగుల వినతి
విజయనగరం (్ఫర్టు), మార్చి 5: కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావుకోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీసాల గీతకు ఆదివారం ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుమాట్లాడుతూ సిపిఎస్ వల్ల ఉద్యోగుల భవితవ్యానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. దీనివల్ల ఉద్యోగులకు ఎన్నో నష్టాలు ఉన్నాయని, సిపిఎస్ విధానంలో పెట్టుబడి పెడుతున్న సొమ్ముకు పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టంలో ఎటువంటి గ్యారంటీ లేదన్నారు. 2014 సంవత్సరానికి పూర్వం చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మంజూరు చేసిన కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వ రికవరీలతో ఆందోళనకు గురవుతూ చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, హర్యానా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గ్యారంటీ మన రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు లేకపోవడం దారుణమని చెప్పారు. అందువల్ల సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యవర్గసభ్యులు త్రినాధ్, సువ్వాన బాలకృష్ణ, శొంఠ్యాన భాస్కరరావు, కంది ఈశ్వర్, విజయనగరం మండల కమిటీ అధ్యక్షుడు కెఎ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎపిఆర్జేసి, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 5: జిల్లాలో ఎపిఆర్జేసి, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మోడల్ స్కూల్‌కు సంబంధించి జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 19 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు 3714 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 214 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఎపిఆర్జేసి పరీక్షకు సంబంధించి జిల్లాలో విజయనగరంలో 8 కేంద్రాలు, పార్వతీపురంలో 5 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 3032 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2904 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి అరుణకుమారి తెలిపారు.
పన్నులు వసూళ్లలో కనిపించని ప్రగతి
విజయనగరం (్ఫర్టు), మార్చి 5: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ రెవెన్యూ విభాగానికి భ్రష్టుపట్టింది. కొత్త భవనాలకు పన్నులు వేయడానికి మామ్మూళ్లు వసూలు చేస్తున్న ఉద్యోగులు ఆస్తిపన్ను వసూలు చేయడంలో మాత్రం తగిన శ్రద్ద చూపడంలేదు. ఈ కారణంగా కోట్లాది రూపాయల ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ వారిలో ఏమాత్రం చలనం కనిపించడంలేదు. ఆర్ధిక సంవత్సరం గడువు కేవలం 25 రోజులు మాత్రమే ఉండగా , ఇంతవరకు 41శాతం పన్నులు వసూలు చేశారు. ఆస్తిపన్ను, నీటిపన్నుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు. ఆస్తిపన్ను మదింపునకు సంబంధించి మున్సిపల్ రెవెన్యూ విభాగం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే లేదని అసెస్‌మెంట్‌దారులు వాపోతున్నారు. పట్టణంలో 25వేల మంది ఆస్తిపన్ను బకాయిదారులకు రెడ్‌నోటీసులను జారీ చేయాలని నిర్ణయించినా, సగం మందికి కూడా అందించలేదు. రోజువారీ పన్నుల వసూళ్ల లక్ష్యాలను నెరవేర్చడంలో ఘోరవైఫల్యం చెందిన మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న అసెస్‌మెంట్‌దారులను గుర్తించడంలో కూడా విఫలమవుతున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో 51,328 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. పాతబకాయిలతో కలిపి 32.47 కోట్ల రూపాయల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 7 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూలు కావాల్సి ఉండగా , ఐదు కోట్ల రూపాయల మేరకు బకాయిలు కోర్టు కేసులలో ఉన్నాయి. మరికొన్ని వసూలు కాని బకాయిలుగా నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 27.18 కోట్ల రూపాయల పన్నులను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇంతవరకు 11.27 కోట్ల రూపాయల పన్నులను మాత్రమే వసూలు చేశారు. జిల్లాలో మిగతా మున్సిపాలిటీలతో చూస్తే విజయనగరం మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో అట్టడుగు స్థాయిలో ఉంది. కేవలం 41 శాతం మాత్రమే పన్నుల వసూలు జరిగింది. పన్నుల వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపాలిటీలో అన్ని విభాగాల ఉద్యోగులతో కలిసి 18 ప్రత్యేక బృందాలను నియమించినా ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు. ప్రధానంగా మున్సిపల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్లు కలెక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడం, మున్సిపల్ రెవెన్యూ అధికారి పట్టించుకోకపోవడం, అసిస్టెంట్ కమిషనర్ దృష్టి సారించకపోవడం వల్ల పన్నుల వసూళ్లలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదు. పన్నుల వసూళ్లు మందకొడిగా జరుగుతున్నాయని, వేగవంతం చేయాలని ఒకవైపుమున్సిపల్ రీజనల్‌డైరెక్టర్ ఆశాజ్యోతి ఆదేశాలు జారీ చేసినా, మరోవైపు మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఛార్జి మెమోలు జారీ చేసినా వారిలో ఏమాత్రం చలనం కనిపించడంలేదు.