విజయనగరం

కొలిక్కి వచ్చిన వర్శిటీల స్ధల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 16: జిల్లాలో సెంచూరియన్ వర్శిటీ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. తాత్కాలికంగా సెంచూరియన్ వర్శిటీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ వర్శిటీని జిల్లాలోని బొండపల్లి-నెల్లిమర్ల మండలాల మధ్య ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. బొండపల్లి మండలం అంబటివలస శివారు ప్రాంతమైన రోళ్లవాక ప్రాంతంలో సెంచూరియన్ వర్శిటీకి సంబంధించి 31 ఎకరాలు ఉండగా, దానికి ఆనుకొని ఉన్న నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామంలో ప్రభుత్వం ఎపిఐఐసి ద్వారా 80 ఎకరాలు సేకరించింది. త్వరలోనే ఈ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలం సిద్ధం చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ తెలిపారు.
ఇప్పటి వరకు అగ్రికల్చర్ బిఎస్సీ కోర్సులో చేరదలచిన వారు ఎక్కువగా ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతంలో చేరుతున్నారు. ఉత్తరాంధ్ర వాసులకు ఈ ప్రాంతం సమీపంలో ఉండటంతో అక్కడకు వెళ్తున్నారు. అదే జిల్లాలో ఈ యూనివర్శిటీ ఏర్పాటైతే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే సెంచూరియన్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు పలుమార్లు ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
కొత్తవలసలోని రెల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా 526 ఎకరాలు స్థల సేకరణ చేశారు. వీటిలో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానికులకు వేరొక చోట నివాసం కల్పించడానికి జెసి శ్రీకేష్ లఠ్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిలు బాధితులతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కోల్పోయిన స్థలానికి సరిపడా స్థలాన్ని మరోచోట ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విధంగా గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా స్థల సేకరణ సమస్య కొలిక్కి వచ్చింది.

ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా

విజయనగరం (్ఫర్టు), మే 16: పట్టణంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు ఆదేశించారు. మంచినీటి సరఫరాపై మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఎస్.మత్స్యరాజుతో మంగళవారం తన ఛాంబర్‌లో చర్చించారు. ముషిడిపల్లి వాటర్‌వర్క్స్ ప్రధాన పైపులైన్ దెబ్బతినడం వల్ల ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు మంచినీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టిన తర్వాత మంచినీటి సరఫరాపై మున్సిపల్‌కమిషనర్ నాగరాజు ఆరా తీశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఇంజనీర్ మత్స్యరాజు మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డులకు మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. పైపులైన్ ప్రాంతాలకు, మురికివాడలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇందుకు పది ట్యాంకర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని ట్యాంకర్లను తీసుకుంటామని అన్నారు. ముషిడిపల్లి, రామతీర్థం, నెల్లిమర్ల వాటర్‌వర్క్స్ నుంచి ప్రతీరోజూ 17 ఎంఎల్‌డి మంచినీరు సరఫరా జరుగుతోందన్నారు. ముఖ్యంగా మురికివాడలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మంచినీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, దీనిలో భాగంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని మత్స్యరాజు తెలిపారు. ముషిడిపల్లి వాటర్‌వర్క్స్ ప్రధాన పైపులైన్‌కు మరమ్మతులు పూర్తి కావడంతో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తొలగినట్లేనని చెప్పారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు?

విజయనగరం, మే 16: పట్టణంలో ప్రభుత్వ ఆధీనంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలన్న యోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. కలెక్టరేట్‌కు సమీపంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటంతో అక్కడ నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచనలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉన్నారు. ప్రభుత్వ రంగంలోనే పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ వాహనాలతోపాటు ప్రైవేటు వినియోగదారులు ఉపయోగించుకునే వీలుంది. ఇటీవల పోలీసు శాఖ చింతలవలస బెటాలియన్ వద్ద ఓ బంకును ఏర్పాటు చేసింది. దీనివల్ల అక్కడ స్థానికులు, పోలీసు వాహనాలకు ఉపయోగించుకుంటున్నారు. పట్టణంలో కూడా ప్రభుత్వ ఆధీనంలో బంకు ఏర్పాటు చేస్తే కల్తీలేని పెట్రోలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బంకు యజమానులు పెట్రోల్ కల్తీలకు పాల్పడటం వల్ల వాహనాల ఇంజన్లు తరచు మరమ్మతులకు గురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. పెట్రోల్ బంకులపై కూడా తరచు దాడులు నిర్వహించకపోవడం వల్ల వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో బంకు ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో వివిధ పెట్రోల్ బంకుల్లో కల్తీలు, మీటరు రీడింగ్ తప్పులుగా చూపడం తదితర కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వినియోగదారులు ఏ విధంగా నష్టపోతున్నదీ పత్రికల్లో వచ్చిన విషయం విధితమే. ఇటీవల గుంటూరులో ఓ పెట్రోల్ బంకు యజమాని ఏకంగా రీడింగ్ తెలిపే మదర్ బోర్డును మార్చేసి తక్కువ పెట్రోల్‌కు ఎక్కువ రీడింగ్ వచ్చే విధంగా మదర్ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు నష్టపోయారు. చివరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారి తనిఖీలలో 10 లీటర్ల పెట్రోల్ తీసుకుంటే 2 లీటర్లు పెట్రోలు గల్లంతు కావడాన్ని కనుగొన్నారు. ఈ విధంగా తనిఖీలు చేయడం వల్ల అది బహిర్గతమైంది.