విజయనగరం

జిఎస్‌టికి ఎగనామం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 12: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టి అమల్లోకి వచ్చాక వస్తువుల ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ సరకుల ధరలు మాత్రం తగ్గలేదు. ఒకపక్క వ్యాపారులు జిఎస్‌టి పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏ సరకుపై ఎంత జిఎస్‌టి వసూలు చేయాలనే విషయమై అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు స్పష్టమైన అవగాహన లేకపోవడంతో ఏ శ్లాబు విధించాలన్న అంశంపై గందరగోళంలో ఉన్నారు. మరికొంత మంది వ్యాపారులు పెద్ద శ్లాబు విధిస్తే పోలే అన్న చందంగా ఏకంగా సరకులపై 14 శాతం, 18 శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. దీనిపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడం, బోర్డులు ప్రదర్శించకపోవడం తదితర కారణాల వల్ల వ్యాపారులు చెప్పినంత మొత్తం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాపారులు ఎక్కడైనా ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారా? అన్నదీ క్షేత్ర స్ధాయిలో పరిశీలించే బృందాలు లేవు. పెనాల్టీ కూడా విధించకపోవడంతో వ్యాపారులు జిఎస్‌టి పేరుతో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బంగారం వర్తకులు కూడా వస్తువులను విక్రయిస్తే వాటికి బిల్లులు చెల్లించడం లేదు. పెద్ద షాపింగ్ మాల్‌లో మినహా చిన్న చిన్న బంగారం దుఖాణాలలో కూడా లక్షల్లో టర్నోవర్ జరుగుతున్నప్పటికీ వాటికి దేనికి లెక్కలు లేనే లేవు. తామంతా చిన్న వ్యాపారులమని బయటకు చెబుతూ జిఎస్‌టికి ఎగనామం పెడుతున్నారు. అయితే వినియోగదారుల నుంచి మాత్రం జిఎస్‌టి పేరుతో డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
కాగా, ఇప్పటి వరకు జిఎస్‌టి పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 18వేల మంది వ్యాపారులు మాత్రమే చేరారు. ఇంకను మరో ఐదు వేల మంది వ్యాపారులు తాము జిఎస్‌టి పరిధిలోకి వెళ్లాలా? వద్దా అని ఊగిసలాటలో ఉన్నారు. గతంలో వ్యాట్ అమల్లో ఉండేటపుడు ఏటా టర్నోవర్ రూ.7.5 లక్షల వరకు ఉండేది. నేడు జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తరువాత ఏటా టర్నోవర్ రూ.20లక్షల వరకు పరిమితి పెంచడంతో జిఎస్‌టి తమకు వర్తించదని చెబుతున్నారు. దీంతో అనేక మంది వ్యాపారులు తాము జిఎస్‌టి పరిధిలో లేమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలకు సరకులను విక్రయిస్తే వారు రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉన్నవారైనా తప్పనిసరిగా జిఎస్‌టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.
ఇదిలా ఉండగా మరోపక్క వ్యాపారులు ప్రతి సరకుపై జిఎస్‌టి ఎంత విధించాలన్నదీ తెలియక కొంత మంది ఏకంగా 18శాతం పన్ను విధిస్తున్నట్టు సమాచారం. అలాగే కిరాణా సరకులకు సంబంధించి బియ్యం మామూలుగా విక్రయిస్తే దానికి జిఎస్‌టి వర్తించదు. అదే బ్రాండెడ్ బియ్యం ప్యాకెట్లతో విక్రయిస్తే దానిపై 5 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉంది. రడీమేడ్ దుస్తులకు రూ.1000లోపు కొనుగోలు చేస్తే దానిపై 5 శాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది. అలాగే రూ.1000 దాటితే వాటిపై 12 శాతం పన్ను వసూలు చేయాల్సి ఉండగా, కొంతమంది వ్యాపారులు ఏకంగా వినియోగదారులపై 14శాతం పన్ను విధిస్తున్నారు. ఈ విధంగా జిఎస్‌టిపై ఎంత పన్ను వేయాల్సి ఉందన్న విషయమై అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో జిఎస్‌టి కింద పన్ను వసూలు చేస్తున్నట్టు బోగాట్టా. దీనిపై కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీహరిశంకర్ వద్ద ప్రస్తావించగా దీనిపై వ్యాపారులకు కమర్షియల్ టాక్స్ సిబ్బంది అవగాహన కల్పించారని, తమకు సిబ్బంది తక్కువగా ఉండటంతో తాము అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ వినియోగదారులకు ఏ వస్తువుపై ఎంత జిఎస్‌టి విధించాల్సి ఉందన్న విషయమై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది.