విజయనగరం

మరో 15 ఇసుక రీచ్‌లకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 22: జిల్లాలో కొత్తగా మరో 15 ఇసుక రీచ్‌లకు అనుమతిఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ లఠ్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో భాగంగా కొత్తగా రీచ్‌లను అనుమతించారు. ఇప్పటికే జిల్లాలో 49 రీచ్‌లు ఉండగా వీటితో కలిపి 64 రీచ్‌లు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్‌టిఆర్ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణాలు పెద్దయెత్తున చేపట్టేందుకు, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు జెసి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ హోదాలో గ్రామీణ నీటిసరఫరా, భూగర్భజలశాఖ, జలవనరులశాఖ, గనులశాఖ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జెసి చెప్పారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని ఏయే నదుల నుంచి ఏయే గ్రామాల్లో ఎంత పరిమాణంలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు తాము అనుమతించినది గనులశాఖ ఎడి ఎస్‌కెవి సత్యనారాయణ వివరించారు. నాగావళి, గోస్తనీ, వేగావతి, సువర్ణముఖీ, పారన్నవలస గెడ్డల్లో ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఈ అనుమతులు ఇచ్చినట్టు గనులశాఖ ఎడి తెలిపారు. నాగావళిలో జియ్యమ్మవలస మండలం నిమ్మలపాడు వద్ద ఒక రీచ్‌కు 5 వేలు క్యూబిక్ మీటర్లు తవ్వకానికి అనుమతించారు. అలాగే సాలూరు మండలం పారన్నవలస గెడ్డలో రెండు రీచ్‌లకు బిట్-1లో 2వేలు క్యూబిక్ మీటర్లు, బిట్-2 నుంచి వెయ్యి క్యూబిక్ మీటర్లు ఇసుక తీసేందుకు అనుమతించారు. బొబ్బిలి మండలం కారాడ, పెంట గ్రామాల మధ్య వేగావతి నుంచి ఇసుక తవ్వి తీసేందుకు అనుమతి మంజూరు చేశారు. జామి మండలం జామి, విజినిగిరి గ్రామాల వద్ద గోస్తనీలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతించారు. జామిలో 5వేలు క్యూబిక్ మీటర్లు, విజినిగిరిలో 1500 క్యూబిక్‌మీటర్ల్ల మేరకు అనుమతించారు. సీతానగరం మండలం పెద్ద బోగిల, లక్ష్మిపురం, చిన బోగిల గ్రామాల వద్ద సువర్ణముఖీలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించారు. పెద్ద బోగిలలో 14వేలు క్యూబిక్ మీటర్లు, లక్ష్మిపురంలో 20వేల క్యూబిక్ మీటర్లు, చినబోగిలలో 12వేలు క్యూబిక్ మీటర్లకు అనుమతించారు. రామభద్రాపురం మండలంలో వేగావతి నుంచి ఇసుక పొందడానికి అనుమతించారు. పారాది, రొంపిలి, కొట్టక్కి గ్రామాల్లో వేగావతి నుంచి ఇసుక పొందేందుకు అనుమతించారు. పారాది బిట్‌లో 7663, రొంపిలిలో 4259, కొట్టక్కి బిట్-2లో 1942, బిట్-3లో 1526, బిట్-4లో 4205 క్యూబిక్ మీటర్లు మేరకు ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతి మంజూరు చేసినట్టు గనులశాఖ ఎడి సత్యనారాయణ వివరించారు.

భీమసింగి సగర్స్ అప్పులను రద్దు చేయాలి
* కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు డిమాండ్
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 22: భీమసింగి సుగర్స్ యాజమాన్యం వివిధ ప్రభుత్వ సంస్థలకు బకాయిపడిన 40 కోట్ల రూపాయల అప్పులను తక్షణమే రద్దు చేయాలని భీమసింగి విజయరామగజపతి సహకార చక్కెర కర్మాగారం స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వి.కృష్ణంరాజు డిమాండ్ చేశారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన చక్కెర ఫ్యాక్టరీకి అప్పులు మరింత భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అప్పులను రద్దు చేయాలని కోరారు. ఆదివారం ఇక్కడ అమర్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల సహకార చక్కెర ఫ్యాక్టరీలు తేరుకోలేని నష్టాల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. ఆదుకోవల్సిన ప్రభుత్వాలు చోద్యం చూడటంతో రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఫ్యాక్టరీ పరిధిలో చెరకు పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఫ్యాక్టరీ కెపాసిటీ మేరకు చెరకు క్రషింగ్ జరగడం లేదని అన్నారు. చెరకు పంట రైతులకు గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది రైతులు ఈ పంటను పండించేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. వ్యవసాయ మదుపులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రైతులు ఈ పంటను పండించేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని చెరకు పంటకు అనుసంధానం చేయాలని, చెరకు పంట కోతకు వచ్చే సమయంలో ఉపాధి హామీ ద్వారా కూలీ పనులు చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈవిధంగా చేయకపోతే చెరకు పంట భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మీసాల కృష్ణారావు, ఆల్తి చినమారయ్య పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
* గనుల శాఖా మంత్రి సుజయ్‌కృష్ణ
బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు కోరారు. మండలం కాశిందొరవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్న వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు, కాలువలతోపాటు పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. రక్షిత మంచినీటి పథకాలను కూడా మంజూరుచేసి పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామన్నారు. ఈ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజాప్రతినిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలకు సంబంధించిన సమావేశాలను ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధాన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కంచరగెడ్డ రిజర్వాయర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈసమావేశంలో మండల టిడిపి అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు, సర్పంచ్ కె దాడమ్మతోపాటు దేశంపార్టీ నాయకులు వి.వెంకటరమణ, సూర్యారావు, కేశవ, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

కిలో వంకాయలు రూ.80లు
పార్వతీపురం (రూరల్), అక్టోబర్ 22: పార్వతీపురం మార్కెట్‌లో కిలో వంకాయల ధర రూ.80 లు పలికాయి. సోమవారం నాగుల చవితికి వంకాయలు, జునుగులు తప్పనిసరిగా వినియోగించే ఆనవాయితీ ఉండడంతో, అందరూ వంకాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో వంకాయలకు డిమాండ్ పెరిగింది. ఇదే పనిగా వ్యాపారులు వంకాయల ధరలు రెట్టింపు అయ్యాయని వినియోగదారులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 నుండి 30లు ధర పలికిన వంకాయలు ఆదివారం నాటికి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మార్కెట్‌కి తగినట్లుగా వంకాయలు రాకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

రూ. 100 కోట్లతో పట్టణ అభివృద్ధికి ప్రతిపాదనలు
* ఎమ్మెల్యే మీసాల గీత
విజయగరం (్ఫర్టు), అక్టోబర్ 22: పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో భాగంగా 21,23 వార్డులో ఆదివారం పర్యటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి దివగంత ముఖ్యంత్రి ఎన్‌టి రామారావువిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాలతోపాటు అన్ని వార్డులలోనూ 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతుంటే ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని టిడిపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత విజయవంతంగా అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథరావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, నాయకులు పసగాడ రామకృష్ణ, తోలాపి మోహనరావు పాల్గొన్నారు.

కళాశాలల బాట

విజయనగరం, అక్టోబర్ 22: రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాలల బాట అనే కార్యక్రమం చేపట్టారు. ఇటీవల చైతన్య, నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యా సంస్థలు ఆందోళన చేపట్టిన విషయం విధితమే. దీనికి సంబంధించి పోస్టర్‌ను ఆదివారం టిడిపి జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు విడుదల చేశారు. ఆదివారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు జిల్లాలోని అన్ని కార్పొరేట్ కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.చైతన్యబాబు, కమిటీ నాయకులు పి.కిషోర్, భానుప్రకాష్, హరి బాలకృష్ణ, కుమార్ పాల్గొన్నారు.

త్వరలో ‘అన్న క్యాంటిన్లు’ ప్రారంభం

విజయనగరం, అక్టోబర్ 22: జిల్లా కేంద్రంలో త్వరలో రెండు ‘అన్న క్యాంటిన్ల’ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్న విషయం విధితమే. ప్రభుత్వమే అవసరమైన వౌలిక వసతులను సమకూర్చి వాటి నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట మీ-సేవ కేంద్రం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఒకటి, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్కడ అమ్మ క్యాంటిన్లను ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కేవలం రూ.5 టిఫిన్, రూ.10 భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగానే రాష్ట్రంలో కూడా అన్న క్యాంటిన్లను ఏర్పాటుచేసి అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నారు. తద్వారా ప్రజల మన్ననలు పొందేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే విజయవాడలో అన్న క్యాంటిన్లను ప్రారంభించారు. మిగిలిన చోట్ల దశల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. అన్న క్యాంటిన్లతో దినసరి కూలీలకు నాణ్యమైన ఆహారం అందగలదని ఆశిద్దాం.

లోక్‌సభ పరిధిలో ‘నడక’
* పిటిసి ప్రిన్సిపాల్ రాజశిఖామణి

విజయనగరం, అక్టోబర్ 22: త్వరలో విజయనగరం లోక్‌సభ పరిధిలో ‘వాక్ అండ్ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ రాజశిఖామణి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్‌లో కూడా తాము పాలుపంచుకుంటామని అన్నారు. జిల్లా కేంద్రంలో వచ్చేనెల 5, 12, 19, 26 తేదీల్లో స్వచ్ఛ్భారత్‌కు తమవంతు శ్రమదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. పోలీసు శిక్షణ కళాశాలలో దాదాపు 620 మంది ట్రైనీలు ఉన్నారని, వీరందరితో శ్రమదానం చేపడతామన్నారు. కలెక్టరేట్, జిల్లా కేంద్ర ఆసుపత్రి, పోలీసు స్టేషన్లు, మున్సిపల్ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో శ్రమదానం చేపడతామని వివరించారు. తద్వారా పట్టణంలో కొంతమేరకైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది కాలంలో పలుమార్లు లాంగ్ రన్, లాంగ్ వాక్ కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు గత ఏడాది నవంబర్‌లో బెటాలియన్ వరకు పోలీసు అధికారులతో 20 కిలోమీటర్ల నడక, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజపులోవ వరకు 24 కిలోమీటర్లు ఎక్సైజ్ మహిళా కానిస్టేబుళ్లతో నడక కార్యక్రమం నిర్వహించామన్నారు. గతనెలలో విజయనగరం నుంచి విశాఖలోని తేనే్నటి పార్కు వరకు నడక నిర్వహించినట్టు గుర్తు చేశారు. వచ్చేనెల 22వతేదీ వరకు విజయనగరం నుంచి తాటిపూడి రిజర్వాయరు వరకు నడక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలి
* లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ

విజయనగరం, అక్టోబర్ 22: యువత రాజకీయాలను పట్టించుకోకపోతే పెను ప్రమాదం ఉందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఆదివారం పట్టణంలోని 24వార్డుకు చెందిన యువత లోక్‌సత్తాలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సురాజ్య ఉద్యమం ద్వారా రాజకీయాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం, దేశంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవన్నారు. ఉత్తరాంధ్రలో 3 లక్షల మంది నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళా సత్తా జిల్లా అధ్యక్షురాలు ఇనగంటి అనంతలక్ష్మి మాట్లాడుతూ అవినీతి పరిపాలనను యువత అడ్డుకోవాలన్నారు. పరిపాలనలో దోపిడీని యువత ప్రశ్నించాలన్నారు. లేనిచో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మణరావు, అనీల్, పెంటబాబు ఉన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్నారావు, రాజారావు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే ఇంటింటికి టిడిపి ప్రచారం
* ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు
గజపతినగరం, అక్టోబర్ 22: సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించడానికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని పురిటిపెంట, బూడిపేట, దావాలపేట, భూదేవిపేట, బంగారమ్మపేట, పాతబగ్గాం గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురిటిపెంటలో ఇంతవరకు మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఇంకా మిగిలిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు నాళంవారి భూములకు పట్టాలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్యాస్ సిలిండర్ ధరను 400 నుండి 650 రూపాయలకు పెంచడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు సమస్యలను ఏకరవు పెట్టారు.
అంతకుముందు ఎమ్మెల్యే నాయుడుకు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. మందుగుండు సామగ్రి కాలుస్తూ బ్యాండు మేళాలతో ఊరేగింపుగా సభాస్థలికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటిసి మక్కువ శ్రీధర్, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావిశ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, ఎంపిటిసిలు గొర్లె ఆదినారాయణ, వైకుంఠం మైథిలి ప్రియాంక, కర్రి శ్రీదేవి, టిడిపి నాయకులు బుద్ధరాజు రాంజీ, మెట్ల శ్రీనివాసరావు, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.

బాలింతల వేదన
* పసికందుల ఆవేదన! * రోజుకో చోట తుప్పల్లో పసికందులు

విజయనగరం, అక్టోబర్ 22:ఇటీవల జిల్లాలో ప్రేగు తెంచుకొని పుట్టిన పసికందులను నడిరోడ్లపైన, తుప్పల్లోనూ విడిచిపెట్టడం పలువురిని కలచివేస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ ముక్కుపచ్చలారని పసికందులను విడిచిపెట్టే తల్లుల పాశవిక హృదయాలను క్షమించరానిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఈ తరహా సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నేడు ఎంతో మంది మహిళలు తమకు పిల్లలు ప్రసాదించమని దేవుళ్లకు మొక్కుతూ, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగా, మరోపక్క తమ కడుపున పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు వద్దంటూ రోడ్డుపై విడిచిపెట్టడం శోచనీయం. గత మూడు రోజులుగా రోజుకో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పట్టణంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. నాలుగు నెలల క్రితం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక గర్భం దాల్చి పసికందును పారేసిన విషయం మరువక ముందరే రెండు రోజుల క్రితం హుకుంపేటలో బాలింత ఓ పసికందును రోడ్డుపై పడేసింది. దీంతో ఆ శిశువు మృతి చెందాడు. తాజాగా ఎస్‌కోటలోని గౌరీపురంలో మగ శిశువును తుప్పల్లో పడేశారు. ఈ విధంగా వరుసగా జిల్లాలో ఏదొక చోట పసికందులను రోడ్డుపై పారేయడం బాధాకరం. ఇప్పటికైనా బాలింతలు ప్రేగు తెంచుకొని పుట్టిన పిల్లలను పెంచలేకపోతే చైల్డ్‌లైన్, ఇతర స్వచ్చంద సంస్థలకు అప్పగించే అవకాశం ఉంది. అంతేగాని పుట్టిన బిడ్డలను అమానుషంగా తుప్పల్లోనూ, కాలువల పక్కన, చెత్త కుండీలలో పారేయవద్దని పలువురు కోరుతున్నారు.

ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం
* ఇయు జోనల్ కార్యదర్శి భానుమూర్తి
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 22: ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు పెద్దయెత్తున పోరాటం చేస్తామని ఎంప్లారుూస్ యూనియన్ (ఇయు) జోనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి అన్నారు. విలువైన ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ప్రజల సహకారంతో దీనిని అడ్డుకునేందుకు పెద్దయెత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ ఇయు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్రిభజన తర్వాత ఆర్టీసీకి రావాల్సిన 14 ఉమ్మడి ఆస్తుల జాబితా నుంచి 1500 కోట్ల రూపాయల వాటాను తీసుకురావడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాటా కింద 58:42 ప్రాతిపదికన ఆస్తులు రావాల్సి ఉందని, ఈ ఆస్తులను రాబట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోగా, ఉన్న ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. విజయవాడ గవర్నర్‌పేట ఒకటి, రెండు డిపోలకు చెందిన స్థలాన్ని పట్టణ సుందీకరణ పేరుతో బలవంతంగా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. యూనియన్ రీజనల్ అధ్యక్షుడు జి.రవికాంత్ మాట్లాడుతూ గన్నవరం వద్ద ఆర్టీసీకి చెందిన 28 ఎకరాల భూమిని ఇటీవల ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని తెలిపారు. విలువైన ఆర్టీసీ ఆస్తులపై కన్ను వేయడం ప్రభుత్వానికి తగదని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్టవ్య్రాప్తి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్‌రావు, బిఆర్ కుమార్, కెఎన్ స్వామి పాల్గొన్నారు.