విజయనగరం

దువ్వాంలో దళితతేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, ఫిబ్రవరి 22: మండలంలో దువ్వాం గ్రామంలో గురువారం జరిగిన తెలుగుదేశం- దళిత తేజం కార్యక్రమం భాగంగా స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ కిమిడి మృణాళికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, ఎంపిపి పైల సింహాచలం, మాజీ ఎంపిపి బలరామ్ తదితరులు దళితవాడలను సందర్శించారు. అంతకుముందు తోండ్రంగి గ్రామంలో ఎమ్మెల్యే తదితరులు దళితులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాలలోను దళితులు రాణించాలని, వారి అభ్యున్నోతి కోసం ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తోండ్రంగి-దువ్వాం గ్రామాలలో దళితులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ సి ఎస్ వైస్ చైర్మన్ సురేష్, దువ్వాం సర్పంచ్ పిన్నింటి అప్పారావు, ఎంపిటిసి పద్మ తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు ప్రశాంతంగా టెట్
కొత్తవలస, ఫిబ్రవరి 22: మండలంలో వి.వి.పురం వద్ద గల కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం జరిగిన పరీక్షలలో 150 మంది విద్యార్థులకు గాను 145మంది హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆర్.కె. నర్సింహరాజు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలలో 150మందికి 143 మంది హాజరయ్యారని చెప్పారు. పరీక్షలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి కళాశాలను సందర్శించారు. పరీక్షలు నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కళాశాలయాజమాన్యం ఏర్పాటుచేసిన సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత బస్సులు ఏర్పాటు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంలో కళాశాల యాజమాన్యంపై ఆమె సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో వియ్యంపేట జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
కొత్తవలస, ఫిబ్రవరి 22: కొత్తవలస మండలంలోని గనిశెట్టి పాలెం గ్రామంలో గల ఈశ్వమర్మ పేరంటాలు తల్లి తీర్థమహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు జామి సూరిబాబు, ఈశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొంటాయని సూరిబాబు తెలిపారు. ఈపోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 15వేలు, ద్వితీయ బహుమతి 10వేలు, తృతీయ బహుమతి 7,500, నాల్గవ బహుమతి 5,000 అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ పోటీలకు అందరు ఆహ్మానితులనే, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఉపాధి వేతనాలు పెంచేందుకు సమిష్టి కృషి
* బొండపల్లి సర్వసభ్య సమావేశం
బొండపల్లి,్ఫబ్రవరి 22: ఉపాధి వేతనాలు పెంచేందుకు అందరం సమిష్టి కృషితో పనిచేయాలని జడ్పీటిసి బండారుబాలాజీ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపిపి పిరిడి ఎల్లమ్మ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీటిసి బాలాజీ మాట్లాడుతూ మండలంలో ఉపాధి వేతనాలు సరాసరి 108రూపాయులుగా ఉందని వీటిని 190రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ వేతనదారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎంపిడి ఒ ఎం.ప్రకాశరావు మాట్లాడుతూ రానున్న వేసివి దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి పంచాయతీలో అదనపు మోటారును అందుబాటులో ఉంచాలని సర్పంచ్‌లకు స్పష్టం చేశారు. జలసిరి బోరుబావులకు ధరఖాస్తుచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రవీంద్ర కోరారు. రబీపంట తొలిసారి సాగుచేస్తున్నందున పంటకు అవసరమైన నీటిని అందించాలని గొల్లుపాలెం సర్పంచ్ పల్లెరామునాయుడు కోరారు. గ్రామాలలో వీధి దీపాలు రాత్రింభవళ్లు వెలిగితే తమదృష్టికి తీసుకురావాలని ట్రాన్స్‌కో ఎఇ కాశీబాబు కోరారు. ఉపాధి పనిలో చెరువుల్లో పూడిక తీతలేకాకుండా కాలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బి.రాజేరు ఎంపిటిపి పాశల సీతారామ్ కోరారు. తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల పట్ల సిబ్బంది గౌరవం ఇవ్వడం లేదని ఒంపల్లి సర్పంచ్ ఇల్లాపు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ విషయమై బిఎల్‌ఒలు కనీసం సమాచారం ఇవ్వడంలేదని కృష్ణ ఆరోపించారు. ఒంపల్లి బి ఎల్ ఒగా పనిచేస్తున్న విసిఒ ఓరాజకీయపార్టీకి కొమ్ముకాస్తున్నారని సర్పంచ్ కృష్ణ ఆరోపించారు. ఆయకట్టు విస్తీర్ణం 50 ఎకరాలు దాటిన చెరువులకు మాత్రమే నీరు-చెట్టు పథకానికి వర్తిసుందని ఎంపిడి ఒ ప్రకాశరావు సభ్యులకు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా చెరువుల జాబితాను ఇరిగేషన్ అధికారులకు అందించాలని కోరారు. సమావేశంలో తహశీల్దార్ బాపిరాజు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మందుబాబుల వీరంగం
గజపతినగరం, ఫిబ్రవరి 22: గజపతినగరం ఆర్టీసీ బస్సు స్టాండ్‌కు కూతవేటు దూరంలో మద్యం షాపును ఏర్పాటు చేయడంలో మందుబాబుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. మందుబాబులు ప్రతి రోజు ఉదయం 10గంటలకే మద్యం సేవించి కాంప్లెక్స్ పరిసరాలకు వచ్చి పడిపోయి వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ఆర్టీసీ కంట్రోలర్ ఎ.జగదీష్‌తోపాటు సిబ్బంది మందుబాబులను అరికట్టలేక కాంప్లెక్స్ ఆవరణలోకి రానీయలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఉదయం నుండి సాయంత్రం వరకు నాలుగు మండలాల నుండి విద్యార్థులు పట్టణానికి చదువు నిమిత్తం వస్తూ పోతుంటారు. మందుబాబులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి చొరబడి మద్యం సేవించి వీరంగం సృష్టించడంతో అటుప్రయాణీకులు, ఇటు విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంప్లెక్స్ ఆవరణలోకి మందుబాబులు చొరబడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంపద కేంద్రాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
గజపతినగరం, ఫిబ్రవరి 22: చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో మండలంలోని వివిధ గ్రామాల గ్రామ ప్రత్యేక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరినాటికి కేంద్రాల నిర్మాణాలను పూర్తిచేయాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై గ్రామాలలో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 25లోగా అన్ని మండల తహశీల్దార్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి అవగాహన ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. అందుకోసం ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మాణాలు వేగవంతం చేసి ఫిబ్రవరి 28నాటికి పూర్తిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడి ఒ ఈశ్వరరావు, తహశీల్దార్ శేషగిరిరావు, ఎం ఇ ఒ విమలమ్మ, ఇ ఒ పి ఆర్‌డి జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.

ఐక్యపోరాటంతోనే కేంద్రంపై ఒత్తిడి: సీపీఐ
చీపురుపల్లి, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమిస్తేనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. చీపురుపల్లి విచ్చేసిన ఆయన స్థానిక విలేఖరులతో గురువారం మాట్లాడారు. ప్రత్యేక హోదా, రైల్వేజోను ఏర్పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని పార్టీలు వారి జెండాలను పక్కనపెట్టి ఉద్యమాలు చేస్తేనే విభజన హామీలను పొందగలమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు తమ పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట చీపురుపల్లి మూడురోడ్ల సంక్షన్ వద్ద నిర్వహించిన బస్సుయాత్ర సందర్భంగా మోడి దిష్టిబొమ్మ దగ్దం చేసిన నేరానికి పోలీసులు 47 మందిపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. తెలుగుదేశం పార్టీ మెతకవైఖరితోనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత అన్ని రాజకీయపార్టీలపై ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం బడ్టెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదాకోసం ఉద్యమించకపోతే రాష్టభ్రవిష్యత్ అగమ్యగోచరమని తెలిపారు. బేషజాలకు పోకుండా అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. తమ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఆయనతోపాటు జిల్లా పార్టీ నాయకులు కార్యదర్శులు ఒమ్మి రమణ, బుగత అశోక్, సంయుక్త కార్యదర్శి అలమండ ఆనందరావు, ఆల్తి అప్పలనాయుడులు ఉన్నారు.

వైభవంగా దుర్గామాతా సహస్రఘటాభిషేకం
చీపురుపల్లి, ఫిబ్రవరి 22:పట్టణంలోని కస్పావీధిలో కొలువై పూజలందుకుంటున్న శ్రీదుర్గాపరమేశ్వరీ అమ్మవారికి రెండురోజులుగా నిర్వహిస్తున్న సహస్రఘట్ట్భాషేకం ఘనంగా ముగిసింది. దేవాలయం నిర్వాహకుల ఆధ్వర్యంలో గత రెండురోజులగా నిర్వహించిన అమ్మవారి సహస్రఘట్ట్భాషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. రెండోరోజైన గురువారం అమ్మవారికి వేకువ జామున నుంచే అర్చనలు ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ఆలయశిఖరంపైన గల కళశానికి జెడ్పీటీసి మీసాల వరహాలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పలు వీధులో తిరువీధి నిర్వహించిన తర్వాత సహస్రఘట్ట్భాషేకాన్ని వైభవంగా నిర్వహించారు. విశేష హోమాలు, పూర్ణాహుతి, మహాదాశీర్వచనాలు నిర్వహించిన తర్వాత భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. తిరువీధులో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఆయల కమిటీ ప్రతినిధి ఎస్ వి జి శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు.

పెరిగిన అమ్మవారి జాతర ఆదాయం
చీపురుపల్లి, ఫిబ్రవరి 22: శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఆదాయం గత రెండు ఏళ్ల కంటే ఈ ఏడాది అధికంగా ఆదాయం చేకూరింది. అమ్మవారి జాతర అనంతరం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హుండీలు, టిక్కెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ వివరాలను దేవస్థానం అధికారులు వెల్లడించారు. 2015-16లో నిర్వహించిన జాతర సందర్భంగా రూ.13.12లక్షలు రాగా తర్వాత ఏడాదిలో సుమారు రెండున్నర లక్షల ఆదాయం తగ్గి రూ.11.54లక్షలు వచ్చింది. ఈ ఏడాది మాత్రం అందుకుభిన్నంగా మూడున్నర లక్షల వరకు ఆదాయం పెరిగి సుమారు రూ.14.91లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు మూడురోజుల పాటు అమ్మవారి జాతర నిర్వహణలో ఇంత ఎక్కువ ఆదాయం రావడం ఇదే ప్రధమమని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆదాయం అంతా కేవలం భక్తులకు నిర్వహించిన ప్రత్యేక, విశిష్ట దర్శనం టిక్కెట్లు, కేశఖండన, మొక్కుబడులు, హుండీల ద్వారా వచ్చినవేనని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
ఐటిడిఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడి
పార్వతీపురం, ఫిబ్రవరి 22: గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 3వతరగతి నుండి 6వరకు బేసిక్ లెవెల్స్‌పై దృష్టి సారించే విధంగా ఉపాధ్యాయులకు దిశానిర్ధేశం చేస్తామని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో పట్టులేనపుడు విద్యాపునాదులు దృఢంగా ఉండేందుకు అవకాశం లేకపోతున్నట్టు తెలిపారు. అందువల్ల ఈవిషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు తెలిపారు. 10వ తరగతికి వచ్చేసరికి విద్యార్థుల్లో మంచిపట్టు సాధించే విధంగా విద్యాప్రణాళికలు రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా గిరిజనుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఎ ఎన్ ఎంలు స్థానిక సబ్‌సెంటర్లలో రోగులకు ఒపి చూడాలన్నారు. స్థానికంగా సబ్‌సెంటర్లలో కనీస సదుపాయాల కల్పనకు కూడా తాను ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఐటిడి ఎ పరిధిలోని చినమేరంగి, సాలూరు, భద్రగిరి, కురుపాంలలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఎన్ ఎస్ సిల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో ఎస్ ఎన్‌సిలలో త్రీబెడెడ్ సదుపాయం ఉండే విధంగా చూస్తామన్నారు. పార్వతీపురం ఐటిడి ఎ పరిధిలో 65వేల మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 23వేలు పూర్తయ్యాయన్నారు. ఇందులో పాచిపెంట మండలంలోని 7760 మరుగుదొడ్లకు గాను 5395 మరుగుదొడ్లు పూర్తిచేసి అధికశాతం లక్ష్యం నమోదు చేసుకున్నట్టు తెలిపారు. అలాగే సాలూరులో అతితక్కువగా అంటే 10434 మరుగుదొడ్లకు గాను కేలవం 2226 మరగుదొడ్లు మాత్రమే పూర్తిచేశారని తెలిపారు. అలాగే సబ్‌ప్లాన్ పరిధిలతోని మారుమూల గిరిజన గ్రామాల్లో 3800 ప్రీఫాబ్రికేటెడ్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడానికి లక్ష్యంగాకాగా ఇప్పటికే గుమ్మలక్ష్మీపురం మండలంలోని 1200 పూర్తిచేసినట్టు తెలిపారు.

ఇరిగేషన్ ఉద్యోగికి సర్వీసు నుండి తొలగింపు
పార్వతీపురం, ఫిబ్రవరి 22: పార్వతీపురం ఇరిగేషన్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గంజి లక్ష్మీనాయుడుకు సర్వీసునుండి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గంజి లక్ష్మీనాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టు ఇచ్చిన మూడేళ్ల జైలు శిక్ష తీర్పు తదితర కారణాల నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఈమేరకు లక్ష్మీనాయుడును సర్వీసునుండి తొలగించాలని సూచిస్తూ ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిసింది.