విజయనగరం

విభజన హామీలన్నింటిని నెరవేర్చుతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 22:రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతుందని, అందులో ఎలాంటి అనుమానానికి తావులేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఇక్కడ నాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ కేంద్రం సమాన ప్రాధాన్యతనిస్తుందన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ దోపిడీ వ్యవస్ధను చంద్రబాబునాయుడు నడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, పట్టిసీమ, పుష్కరాలు.. ఇలా ఒకటేమిటి అన్నింటా అవినీతి పేరుకుపోయిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రధాని మోదీ యువత, దళిత, మహిళా, రైతు సంక్షేమానికి చేసిన అభివృద్ధిపై కరపత్రాలు వేసి పంపిణీ చేయగలమని, చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి ఏమిటో కరపత్రాలు వేసి పంపిణీ చేయగలరా? అని ప్రశ్నించారు. 30 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద నిధులు ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.16500 కోట్లు తీసుకోకుండా వదిలిపెట్టారని ఆయన విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ హరిబాబు మాట్లాడుతూ నేడు దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడగా, ప్రధాని మోదీ అవినీతికి ఆస్కారం లేకుండా గత నాలుగేళ్లుగా ఏ ఒక్క ఆరోపణ లేకుండా పాలనసాగిస్తున్నారని గుర్తు చేశారు. పేదలకు బీమా పథకాలు, ముద్ర రుణాలు, 2021 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు 600 హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని విమర్శించారు. నిరుద్యోగ భృతిని ఎన్నికల భృతి మాదిరిగా ఇపుడు ప్రవేశపెట్టారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు రగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒసీలను బీసీలుగా మారుస్తామని, బీసీ ‘డి’ని బీసీ ‘ఎ’లో చేర్చుతామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి అస్తవ్యస్తమైందన్నారు. ఇందుకు తూతుక పిట్ట కధను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, ఎర్రచందనం, మరుగుదొడ్లలో అవినీతి ఇలా అన్నింటా అవినీతి పేరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో సమూలంగా రాజకీయాలు మార్చడానికి బీజేపీ ముందుకు వస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాదికారి పాకలపాటి సన్యాసిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ పార్టీలో ఉన్నారని, ఎస్‌కోటలో తక్కువ ఓట్లతో ఓటమి పాలైన ఇందుకూరి రఘురాజు పార్టీలో ఉండటం పార్టీకి బలమన్నారు. డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహనరావు పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. ఇక ఉత్తరాంధ్ర రైల్వే జోన్ గురించి ప్రధాని మోదీని ఒప్పించి సాధించి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్వతీపురంనకు చెందిన డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, పివివి గోపాలరాజు, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, ఎస్సీ మోర్చా నాయకులు సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, నరేంద్ర బాబు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నిమ్మక జయరాజ్, ఎవిఆర్ చౌదరి, సురేంద్ర, ఇందుకూరి రఘురాజు, జిల్లా ప్రచార కన్వీనర్ కుసుమంచి సుబ్బారావు, రామ్‌జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, శంభర లక్ష్మినరసింహం, పట్టణ అధ్యక్షుడు సత్తిరెడ్డి అచ్చిరెడ్డి, పాకా ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు.

అటకెక్కిన పార్కుల అభివృద్ధి రోడ్డెక్కిన అపరిశుభ్రత
* చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
* కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
విజయనగరం (్ఫర్టు), జూన్ 22: పట్టణంలో పార్కులను అభివృద్ధి చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ జారీ చేసిన ఆదేశాలు మున్సిపాలిటీలో అమలు కావడంలేదు. కలెక్టర్ ఆదేశాలను కనీస పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం మే 22వతేదీన పట్టణంలో కలెక్టర్ డాక్టర్ జనహర్‌లాల్ సుడిగాలి పర్యటన చేశారు. పార్కులను, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన ఆయన పార్కుల అభివృద్ధి,నిర్వహణకు, పారిశుధ్యపనుల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక,వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిద్దిదాలని కలెక్టర్ చెప్పారు. అయితే కలెక్టర్ ఆదేశాలు అమలు కావడంలేదు. పట్టణంలో పార్కుల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించినా ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయడంలేదు. ఫలితంగా పార్కులన్నీ అత్యంతదారుణంగా తయారయ్యాయి. పట్టణం నడిబొడ్డులో మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రకాశం పార్కు చెరువును తలపించేలా ఉంది. ఇక్కడ పందులు స్వైరవిహారం చేస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పార్కు నిర్వహణ, అభివృద్ధిపై అధికారులు కనె్నత్తి చూడటంలేదు. పట్టణంలో 143 పార్కులు ఉండగా కేవలం 32 పార్కులకు మాత్రమే నోడల్ అధికారులను నియమించారు. నోడల్ అధికారులు పర్యవేక్షించకపోవడంతో పార్కులన్నీ పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. రెండునెలలో పూడికతీత పనులను పూర్తి చేయాలని ఆదేశించినా ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం వల్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ ఆదేశాలను అమలు చేసి పార్కులు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

24 నుంచి ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యస్వామి మాలాధారణ
విజయనగరం (్ఫర్టు), జూన్ 22: పట్టణంలో పూల్‌భాగ్ సెంటర్ లక్ష్మీగణపతి కాలనీలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఈనెల 22వతేదీ నుంచి ఆఢి కృత్తిక మాల ప్రారంభిస్తామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, శ్రీ సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వసమస్యలతో బాధపడుతున్నవారికి మేలు చేసే ఈ మాల అందరూ ధరించవచ్చునని చెప్పారు. ఈనెల 24న మండలదీక్ష, వచ్చేనెల 15వతేదీన అర్థమండల దీక్ష, 26న ఏకాదశ దీక్ష ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆఢి కృత్తిక మాల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు దన్నాన రామమూర్తి, కోశాధికారి శర్మ, ఆలయ అర్చకులు శ్రీనువాస శర్మ, అగస్త్యశర్మ, ఆర్‌వి పంతులు, ఆలయ కమిటీసభ్యులు పైడిరాజు, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

సివిల్ సప్లయి హామాలీస్ ధర్నా
విజయనగరం (్ఫర్టు), జూన్ 22: పట్టణంలో దాసన్నపేటలో ఉన్న పౌర సరఫరాల జిల్లామేనేజర్ కార్యాలయం ఎదుట శుక్రవారం హామాలీస్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయి హామాలీస్ యూనియన్ కార్యదర్శి పి.కామేశ్వరరావుమాట్లాడుతూ హామాలీ కార్మికులకు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి కూలీరేట్లు, ఇతర సౌకర్యాలు కల్పించవలసి ఉన్నప్పటికీ ఇంతవరకూ పట్టించుకోలేదన్నారు. క్వింటాకు 15 నుంచి 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. క్వింటాకు ఇప్పుడు ఉన్న రేటుపై అయిదు రూపాయలు పెంచుతామని, స్వీపర్లకు అయిదువేల రూపాయలకు తక్కువ కాకుండా కనీస వేతనం ఇస్తామని ఆరునెలల క్రితం అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఎటువంటి పురోగతి లేదని చెప్పారు. ఈ మేరకు జిల్లా మేనేజర్ షర్మిళకు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలపై స్పందించిన ఆమె సమస్యల పరిష్కారానికి నెలరోజుల గడువుఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ముల్లు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కొత్తవలస, జూన్ 22: మండలంలో శుక్రవారం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. గనిశెట్టి పాలెం గ్రామంలో 40లక్షల రూపాయలతో రామాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదే విధంగా 15లక్షలతో సిసి రోడ్డుకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఎస్.కోట నియోజకవర్గం సిసి రోడ్లనిర్మాణంలో రాష్ట్రంలోనే ముందుందని తెలిపారు. గనిశెట్టిపాలెం ప్రజల కోరిక మేరకు రామాలయం నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలిపారు. అభివృద్ధిలోను, సంక్షేమ పథకాల అమలులోను రాష్ట్రంలో మనమే ముందున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కోళ్ళ శ్రీను, గనిశెట్టి పాలెం గ్రామ పెద్దలు ఈశ్వరరావు, జగ్గాన ప్రసాద్, జామిసూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలు తీర్చేందుకే సదస్సులు
* ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి
కొత్తవలస, జూన్ 22: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని చీడివలస గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. పలువురు రైతులకు పట్టాదారు పాస్-పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటిసి రమణమ్మ, కోళ్ళ శ్రీను, దుర్గా ఉమామహేష్,కనకల శివ,నక్కరాజు, చినరాము తదితరులు పాల్గొన్నారు.