విజయనగరం

ప్రధానమంత్రి అబద్దాలు చెప్పడం జాతికే అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, జూలై 21: భారత దేశానికి వన్నితెచ్చే ఉన్నత పదవిలో ఉన్న ప్రధాన మంత్రి స్థానంలో ఉండి అబద్దాలు ఆడడం జాతికే అవమానమని ప్రధాన మంత్రి మోడీని ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. శనివారం ఎల్.కోటలోని తన స్వగృహంలో ఎస్.కోట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో అనేక హమీలను ఇచ్చిందని నాటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ మద్దతుతెలిపిందని తీరా అధికారంలోకి వచ్చి విభజన చట్టంలోని 18 అంశాలకు సంబంధించిన నిధులు జారీచేసే అభివృద్ది కార్యక్రమాలుగానీ చేపట్టకుండా గడచిన నాలుగేళ్ళుగా ఆంధ్రప్రజలను మోసం చేసిందని ఎన్నికలకు ముందు మోడీ తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే సరైన న్యాయం చేస్తామని చెప్పి, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మరల పార్టీ పార్లమెంటు సాక్షిగానే అబద్దాలు చెప్పడం ప్రధానమంత్రి స్థాయి వంటి వ్యక్తికి ఇది తగదని ఆమె ఎద్దేవా చేశారు. నిన్నజరిగిన పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయడంలో విజయం సాధించారని, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినప్పటికీ ప్రజల విశ్వాసాన్ని గెలుపొందడంలో విజయం సాధించామని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రతి పార్టీ అధినేత జగన్, ఎంపీలు కేంద్రంతో కుమ్మక్కై అవిశ్వాసంలో పాల్గొనకుండా పై నుంచే డ్రామాలు ఆడారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని ఇటువంటి వారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇంకా అధోగతి పాలు అయిపోతుందని వైసీపీని దుయ్యబట్టారు. రానున్న కాలంలో ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం తమ వంతు పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. వచ్చే నెల నుంచి పది లక్షల మందికి ఉద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని, కొత్తవలస మండలంలో గిరిజన యూనివర్సిటీకి కేంద్రం నిధులు వెంటనే మంజూరుచేయాలని, లేని యడల ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని ఆమె అన్నారు. టీడీపీ బలోపేతానికి నియోజకవర్గంలో కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మల్లునాయుడు, అన్ని మండలాలకు చెందిన టీడీపీ మండలాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళ రాంప్రసాద్, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రంథాలయ జోనల్ పోటీల్లో ఎల్.కోట విద్యార్థుల ప్రతిభ
లక్కవరపుకోట, జూలై 19: గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటమణయ్య జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయిలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఎల్.కోట మండలానికి చెందిన విద్యార్థులు జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరచి కథారచన విభాగంలో సీనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం లీలావతి, జడ్పీహెచ్ పాఠశాల ఎల్.కోట, జూనియర్స్ విభాగంలో హేమంత్ ద్వితీయ స్థానం కథలు చెప్పడంలో షర్మిల ఎల్.కోట విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థినులు గెలుపొందారు. మూడు స్థాయిల్లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా పోటీల్లో ఉన్న విద్యార్థులతో పోటీ పడి బహుమతులు గెలుచుకుని ఎల్.కోట మండలానికి పేరు తీసుకువచ్చారని ఉపాద్యాయులు కాశీ విశ్వనాథం, గ్రంథాలయ అధికారి శ్రీధర్‌లు విద్యార్థులను అభినందించారు. వీరికి త్వరలోనే జిల్లాలో ప్రత్యేక సభ ఏర్పాటు చేసి బహుమతులు అందజేస్తారని గ్రంథాలయ అధికారి శ్రీధర్ అన్నారు.

మొక్కలే ప్రాణికోటికి జీవానాధారం
* ఎంపీపీ సువ్వాడ వనజాక్షి
నెల్లిమర్ల, జూలై 21: మొక్కలే ప్రాణికోటికి జీవనాధారమని ఎంపీపీ సువ్వావాడ వనజాక్షి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత సాధించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు విరివిగా నాటితే సకాలంలో వర్షాలు పడి పంటలు సృమద్దిగా పండుతాయని అన్నారు. ప్రభుత్వం వనం-మనం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడాన్ని ప్రణాళిక సిద్ధంచేశారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, మండల శాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు, ఎంపీడీవొ కె. అక్కారావు, నాయకులు గురాన అసిరినాయుడు, కోటపాటి తిరుపతిరావు, కర్రోతు రాజినాయుడులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో మిమ్స్ విద్యార్థిని ప్రతిభ
నెల్లిమర్ల, జూలై 21: రాష్టస్థ్రాయి అంతర్ వైద్య కళాశాలల క్విజ్ పోటీల్లో మిమ్స్ వైద్య కళాశాల విద్యార్థి ప్రతిభ కనబరిచారు. శనివారం క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన వైద్య విద్యార్థి ఆర్.వి. ఎస్. చరణ్ కుమార్‌ను ఫోరెన్‌సిక్ విభాగం అధిపతి జి. నారాయణరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం మెడికల్ కళాశాల ఆవిర్భావా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అంతర్ కళాశాల క్విజ్ పోటీల్లో చరణ్‌కుమార్ ప్రథమ స్థానం పొందారని చెప్పారు. చరణ్‌కుమార్‌ను మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు, డీన్ ఎ.వి.నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్‌లు అభినందించారు.

క్షేత్ర సహాయకులకు కనీస వేతనాలు ప్రకటించాలి

జామి, జూలై 21: మండలంలోని ఉపాధి క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు అందరు శనివారం ఎంపీడీవొ గొర్రిపాటి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర క్షేత్ర సహాయక సంఘం పిలుపుమేరకు ఈ నెల 23 నుంచి విధులను నిరవధికంగా బహిష్కరిస్తున్నామని తెలియజేశారు. క్షేత్ర సహాయకులకు కనీసవేతం 12వేల రూపాయలు చెల్లించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్షేత్ర సహాయకులను మిగిలిన ఉపాధి సిబ్బంది వలే నిర్థిష్టమైన వేతనదారులుగా గుర్తించాలి. అంతేకాకుండా క్షేత్ర సహాయకుల నియామకాలను జిల్లా కలెక్టర్ పరిధిలోకి తీసుకురావాలని తద్వారా గ్రామీణ అభివృద్ధిలో వారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు. క్షేత్ర సహాయకుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాష్ట్ర క్షేత్ర సహాయకుల యూనియన్ వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. తదితర అంశాలపై సాధనకోసం ఈ నిరవధిక విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
సమస్యల పరిష్కారానికే పల్లెకుపోదాం
బొండపల్లి, జూలై 21: సమస్యల పరిష్కారానికే పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీడీవొ ప్రకాశరావు అన్నారు. శనివారం మండలంలోని కొత్తూరు గ్రామంలో పల్లెకుపోదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు అందరు తమ గ్రామాలకు వస్తున్నందున ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. కార్యక్రమంలో యువొపీఆర్డీ రవికుమార్, ఉప తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంఇవొ సింహాచలం, వెలుగు ఏపీఎం పెంటంనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్షేత్ర సహాయకుల సమస్యలు పరిష్కరించాలి
బొండపల్లి, జూలై 21: మండలంలో ఉపాధి హామీపథకం క్షేత్ర సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని క్షేత్ర సహాయకులు శనివారం వినతి పత్రం ద్వారా ఎంపీడీవొ ప్రకాశరావును కోరారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు క్షేత్ర సహాయకులు ఈమేరకు వినతి పత్రాన్ని ఎంపీడీవొకు అందజేశారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ క్షేత్ర సహాయకుల వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కారం కానందున ఈ నెల 23 నుండి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతున్నామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి తమ ద్వారా సమస్యలు విన్నవిస్తున్నామని చెప్పారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గజపతినగరం,జూలై 21: వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి గ్రామంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారిణి ఆశాదేవి కోరారు. శనివారం మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని వీధులను, అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గ్రామంలో మురికినీటి కాలువలు పూర్తిగా గృహ నిర్మాణదారులు మట్టితో కప్పివేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీకి సంబంధించిన బావిలో మోటారును ఏర్పాటు చేసుకుని ఒక గ్రామస్తుడు ఇల్లు నిర్మిస్తుండగా విద్యుత్ కనెక్షన్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ భవనం చుట్టూఅపారిశుద్ధ్యంగా ఉందని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త గ్రామంలో లేకుండా వేరేచోట నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా నివాసం ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఇవొపీఆర్డీ జనార్థనరావు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఏ ఇ గంగాభవానీ, ఐసిడిఎస్ సిడిపివొ రమణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.