విజయనగరం

రూ.20కోట్లతో నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 5: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన చేయకుండా అందుబాటులో ఉన్న నీరు-చెట్టు నిధులతో జిల్లాలో నదుల అనుసంధానం, జంఝావతి ఎత్తిపోతల పనులు పూర్తిచేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో గురువారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు-ప్రగతి సదస్సులో జిల్లాలో చేపట్టిన జలసంరక్షణ పనులను సమీక్షించారు. ఆర్థికశాఖ అనుమతి కోసం ఎదురు చూడకుండా 20కోట్ల రూపాయలు నీరు-చెట్టు నిధులతో నాగావళి నది నీటిని జిల్లాలోని వెంగళరాయసాగరం, సువర్ణముఖి, వేగావతి, చంపావతి నదులకు అనుసంధానించి చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాలలోని ఆయకట్టు చివరి భూములకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందించాలని తెలిపారు. అదేవిధంగా జంఝావతి ప్రాజెక్టు కింద 39కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నీరు-చెట్టులో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంగళరాయసాగరం, పారాది, సీతానగరం, డెంకాడ ఆయకట్టు సంఘాల ప్రతినిధులు, తోటపల్లి కుడికాలువ ఆయకట్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసిన నీరు-చెట్టుతో సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని చెప్పారు. అయితే వెంగళరాయసాగరం నీటిని పారాది, సీతానగరం ఆనకట్టలకు అనుసంధానించాలని రైతు కృష్ణమూర్తి సూచించారు. షట్టర్లు లేక నీరు వృధాగాపోయి పారాది ఆనకట్ట దిగువన చివరి భూములకు నీరందని పరిస్థితిని పరిష్కరించాలని కోరారు. స్పందించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ రైతులు కోరిన విధంగా షట్టర్ల రిపేర్లు పూర్తిచేయాలని, అవసరమైతే కొత్తవాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంజినీర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా కాలువలపై తిరిగి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని హితవు పలికారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ, ఆర్థికశాఖ అనుమతించ లేదంటూ మీనమేషాలు లెక్కించకుండా సాగునీటి వనరులను సద్వినియోగం చేసే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టంచేసారు. ఉపాధి హామీ కూలీలు చేయలేని పనులకు మిషన్లు వినియోగించాలని సూచించారు. పాచిపెంట మండలంలో 31చెరువులు అభివృద్ధికి రైతులు ముందుకు వస్తుంటే ఎందుకు మోకాలు అడ్డుతున్నారని మైనర్ ఇరిగేషన్ ఇంజినీర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. చెరువుల అభివృద్ధికి నామినేషన్ పనుల కింద పదిలక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెబుతూ వృధా నీటిని సముద్రంలోకి పోనీయకుండా భూమిలోకి పంపాలని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడానికి అవసరమైన భూసేకరణను రైతులకు నచ్చజెప్పి పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్‌ను ఆదేశించారు. సదస్సులో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతు వ్యవసాయంతోపాటు వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా కుటుంబానికి కనీసం పదివేల రూపాయల ఆదాయం లభించేలా పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ గోదావరి, కృష్ణ నదులను అనుసంధానించిన రీతిలోనే జిల్లానుంచి వెళ్లే నదులను అనుసంధానించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లామంత్రి మృణాళిని మాట్లాడుతూ జూన్ మాసాంతానికి తోటపల్లి సాగునీరును రైతులకు పూర్తిస్థాయిలో అందిస్తామని అన్నారు. జిల్లాలో రెండులక్షల ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగంగా 70వేలు పూర్తిచేసామని చెప్పారు.