విజయనగరం

‘నీరు-చెట్టు’తో సాగునీటి కొరతకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (టౌన్), మే 5: నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా సాగునీటి కొరతను అధిగమించేందుకు పెద్దఎత్తున చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అధ్యక్షతన జరిగిన నీరు-ప్రగతి సదస్సులో ఆయకట్టు సంఘ అధ్యక్షులు, రైతులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల సభ్యులు, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాను పాలించిన రాజులు, పెద్దలు ముందుచూపుతో నీటి ప్రాధాన్యతను గుర్తించి 9183 చెరువులు, 162 గొలుసుకట్టు చెరువులు నిర్మించారని తెలిపారు. అయితే గతపాలకులు నీటి ప్రాధాన్యతను పట్టించుకోకపోవడంతో చెరువులు దెబ్బతిన్నాయని చెప్పారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల సంరక్షణకు ప్రాధాన్యత పెంచి నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. చెరువుల అభివృద్ధి,పూడికలు తొలగించడం, చెరువుల అనుసంధానం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ప్రోత్సహించడానికి నిధుల సమస్య లేదని ముందుకు వచ్చిన రైతులకు పనులు మంజూరు చేస్తామని చెప్పారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా నిధుల దుర్వినియోగం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తన భూమిలో సెంటు విస్తీర్ణంలో పంటసంజీవని నిర్మిస్తే ఉపాధి హామీ కింద నిధులు మంజూరు చేస్తామని అన్నారు. చెరువుల అనుసంధానానికి అవసరమైన సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ కూలీలతో జరగని చెరువుల అభివృద్ధిని యంత్రాలు వినియోగించి నిర్వహించాలని సూచించారు. జూన్ వరకు నీరు-చెట్టు పనులు చేపట్టడంద్వారా భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని అన్నారు. వ్యవసాయం ఒక్కటే కాకుండా రైతులు ఆర్టీకల్చర్, చేపల పెంపకం రంగాలలో దృష్టి సారించాలని చెప్పారు. పాడిపశువులకు చౌకగా దాణాగడ్డిని సబ్సిడీపై అందిస్తామని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని రైతులు నూతన ఒరవడితో వ్యవసాయ అనుబంధ రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా రిమోట్ కంట్రోల్ ఎనర్జీ సేవింగ్ విద్యుత్ మోటార్లను రైతులకు ఇస్తామని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు 50శాతం అదనంగా వేతనం, వడగాల్పులకు గురికాకుండా మజ్జిగ అందిస్తున్నామని చెప్పారు. గ్రామాలలో వ్యర్థాలను వినియోగించి రైతులకు ఆర్గానిక్ ఎరువులుగా అందిస్తామని చెప్పారు. జిల్లాలోని సాగునీటి వనరుల పరిస్థితులు, నీరు-చెట్టు కార్యక్రమం ప్రగతిని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కిమిడి మృణాళిని, పత్తిపాటి పుల్లారావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ ఎంఎం నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, జిల్లాకు చెందిన శాసనమండలి, శాసనసభ్యులు పాల్గొన్నారు.

నిర్ణీత ధరలకే కూరగాయల విక్రయాలు
విజయనగరం(టౌన్), మే 5: రైతు బజార్లలో వినియోగదారులకు కూరగాయలను నిర్ణీత ధరలకే విక్రయించాలని రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పల్లె రఘునాథరెడ్డి సూచించారు. గురువారం ఉదయం మంత్రుల బృందం జిల్లా ప్రజా ప్రతినిధులతో కలసి కంటోనె్మంటులోని ఆర్ అండ్ బి రైతు బజారును ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయల విక్రయ మహిళా రైతులతో మాట్లాడారు. తోటకూర, గోంగూర, ఆకుకూరలు పది రూపాయలకు ఎన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. వినియోగదారునికి ఆరు కట్టలు అమ్ముతున్నామని గెద్దవలసకు చెందిన మహిళ రైతు తెలిపింది. రైతు బజారులో విక్రయిస్తున్న వంకాయ, క్యాబేజి, మామిడి పండ్లను పరిశీలించారు. కూరగాయలు మీరు పండిస్తున్నారా లేక మార్కెట్‌లో కొని తీసుకువచ్చి విక్రయిస్తున్నారా అని ప్రశ్నించారు. పండించిన కూరగాయలు అమ్ముతున్నామని నెలివాడ, జొన్నాడ, అంబటివలస రైతులు మంత్రులకు తెలిపారు. కూరగాయలు కొంటున్న వినియోగదారులతో మంత్రులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు రైతు బజారులో కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయా అని ప్రశ్నించారు. తక్కువ ధరలకే రైతులు విక్రయిస్తున్నారని చెప్పారు. రైతుబజారుకు వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉందని, విస్తరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళ రైతులు మరుగుదొడ్లు సమస్య ఉందని మంజూరుచేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును కోరారు. మరుగుదొడ్లు మంజూరుచేస్తామని ఎమ్మెల్యే మీసాల గీత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కె ఎ నాయుడు, సుజయ్‌కృష్ణ రంగారావు, కోళ్ల లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథ్, మార్కెటింగ్ శాఖ ఎడి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

గజపతినగరానికి ఎల్‌ఇడి వెలుగులు
గజపతినగరం, మే 5: గజపతినగరం మేజరు పంచాయతీ పరిధిలోగల వీధిలైట్లకు పూర్తి స్థాయిలో ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధం చేశారు విజయనగరం ఎంపి, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నిధులు నుండి 50శాతం లైట్ల కొనుగోలుకు కేటాయించగా పంచాయితీ నిధులు నుండి 50శాతం కేటాయించి కొనుగోలు చేసామని తెలిపారు. 48వాల్ట్ లైట్లు 48, 24వాల్ట్ లైట్లు 200 ప్రస్తుతం కొనుగోలు చేసారు. ఈ లైట్లను రెండురోజులలో పంచాయతీ అధికారులు స్తంభాలకు ఏర్పాటు చేయనున్నారు. 48వాల్ట్ ఒక్కొక్కదానిని 4,716రూపాయలకు, 24వాల్ట్ లైటు ఒక్కొక్కటి 2,291రూపాయలకు కొనుగోలు చేశారు. ఈలైట్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలో ప్రతి నెల లైట్లు మార్చే అవకాశం ఉండకపోవడంతోపాటు పంచాయతీకి విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది.

బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు అంతరాయం
*వినియోగదారుల అవస్థలు
కొత్తవలస, మే 5: మండల కేంద్రంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గతవారం రోజులుగా నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోవడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మీ-సేవా కేంద్రాలు, ఇంటర్‌నెట్ సెంటర్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెట్ పనితీరుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వారికి అధికారులు అందుబాటులో లేరని సమాధానం రావడంతో వెనుతిరుగుచున్నారు. బిల్లులు చూస్తే వేలకువేలు సేవలు చూస్తేనిల్ అని విమర్శలు వస్తున్నాయి. టెక్నాలజీ యుగంలో ఉండి 4జి సేవలు అందుబాటులో ఉన్నా, బిఎస్‌ఎన్‌ఎల్ పనితీరు మెరుగు పరుచుకోలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షంతో ఆలస్యంగా ప్రారంభమైన సిఎం సభ
నెల్లిమర్ల, మే 5: నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా డెంకాడ మండలం సింగవరం గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన సిఎం సభ 4.30గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సిఎం సభావేదిక వద్ద ఏర్పాటుచేసిన టెంట్లు కుప్పకూలీపోయింది. దీంతో ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన సభ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభమైంది. వర్షానికి కుప్పకూలిన టెంటలను సరిచేయడానికి అధికారులు నానా అవస్తలు పడ్డారు. సి ఎం సభకు జనాలను తరలించే బస్సులు తెల్లవారుఝామునే ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. సిఎం సభ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవుతుందని నాయకులు సమాచారం అందించారు. దీంతో నియోజవర్గంలో నాలుగు మండలాల నుంచి సిఎం సభకు వచ్చే కార్యకర్తలు, నాయకులు ఆయా గ్రామాలలో ఉదయం 11గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో అధికారులు ఏర్పాటుచేసిన పలహారాన్ని స్వీకరించి సిఎం సభకు చేరుకున్నారు.

ప్రభుత్వ శాఖల స్టాల్స్ పరిశీలన
విజయనగరం (టౌన్), మే 5: నీరు-చెట్టు సమీక్షా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం విజయనగరం చేరుకున్నారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో రైతులతో సాగునీటి జలాల సద్వినియోగం, పంట సంజీవని, ఇంకుడు గుంతలు నిర్మాణం వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణలో వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటుచేసారు. నీరు-చెట్టు అంశాలు, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, మేలు రకం ఉద్యాన పంటల ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. డెంకాడ మండలంలోని చెరువులు, గ్రామాల ఆయకట్టు నమూనా ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు. ప్రకృతి ఎరువులు, ఆర్గానిక్ ఎరువుల ప్రయోజనాలను ముఖ్యమంత్రికి డ్వాక్రా మహిళలు తెలియజేసారు. చంద్రబాబునాయుడుకు వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌లోని విశేషాలను ఆయా అధికారులు వివరించారు. వ్యవసాయశాఖ, జలవనరుల శాఖ, భూగర్భ జలశాఖ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, డ్వామా, సూక్ష్మ నీటిపారుదల శాఖ, ఉద్యాన శాఖ, అటవీశాఖ, పశుసంవర్థక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరాశాఖలు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ స్టాల్స్‌ను ఏ ర్పాటు చేసారు.

విద్యుత్ కోతలతో ప్రజలు విలవిల!
దత్తిరాజేరు, మే 5: మండలంలోని గత వారం రోజులుగా వేళాపాళాలేని విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.ముఖ్యంగా మహిళలు అవస్థలు చెప్పనలవికాదు. పలు గ్రామాలలోవీధులలోవీధి లైట్లు వెలుగుతుండగా ఇళ్లల్లో కరెంటు పోయే పరిస్థితి ఉంది. సంబంధిత సిబ్బందిని విద్యుత్ విషయమై ప్రశ్నించగా లైన్‌ఫాల్ట్ అని చెబుతున్నారు. ఉదయం నాలుగు గంటల సమయంలోను, రాత్రివేళలల్లో విద్యుత్ కోతలు విధించడంతో మహిళలు, తాగునీరు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే రాత్రి సమయాలలో విద్యుత్ కోతలవలన మహిళలు వంట పనులు చేసుకోలేకపోతున్నారు. అలాగే వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. అధికారులు స్పందించి ఉదయం, రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తేసుకోవాలని కోరుతున్నారు.

ఆకట్టుకున్న ‘ ఇంకుడుగుంతల’నాటిక
విజయనగరం(పూల్‌బాగ్),మే5: మండలంలోని ద్వారపూడిలోని ఎంపియుపి పాఠశాల ఆవరణలోతెలుగుభాషాసేవాసంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇంకుడు గుంతలు వీధినాటిక ఆకట్టుకుంది. నీటి ప్రాధాన్యత ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలను ఈనాటికలో స్పష్టంగాచెప్పారు. ఇంకుడు గుంతలను ప్రతి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రామానాయుడు రచించి దర్శకత్వం వహించిన ఈ నాటికలో చిన్నారులు పాత్రోచితమైన నటనను ప్రదర్శించారు.

పిడుగుపాటుకు అగ్నిప్రమాదం
గుమ్మలక్ష్మిపురం, మే 5: మండలంలోని కొండవాడ పంచాయతీ కురాసింగి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 23 ఇళ్లు పాక్షికంగాను, రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదే విధంగా గ్రామంలో ఉన్న 20 పశువుల శాలలు కూడా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనలో గ్రామంలోని గిరిజన రైతులకు చెందిన 37 మేకలు, 24 గొర్రెలు, 200 నాటుకోళ్లు, 12 ఎడ్లు పూర్తిగా అగ్నిప్రమాదానికి ఆహుతయ్యాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి భారీగా వీచిన ఈదురుగాలులతో పాటు అగ్గి పిడుగు ఊరి చివరన ఉన్న బిడ్డిక తెలింగు అనే గిరిజన రైతుశాలలో పడిందని, ఈదురుగాలుల వల్ల పశువుల శాలలోని గడ్డి తగలబడి గ్రామంలోకి చొరబడిందని, భారీగా వీచిన ఈదురు గాలుల వల్ల మంటలను అదుపు చేయలేక చంటిబిడ్డలను ఎత్తుకొని కొండలవైపు పరుగులు తీశామని చెప్పారు. వ గ్రామానికి చెందిన మెండంగి బోడయ్య, సూరన్నలకు చెందిన ఇళ్లు పూర్తిగా అగ్నిప్రమాదానికి దగ్ధమయ్యాయి. అదే విధంగా ఈ అగ్నిప్రమాదం వల్ల తాము నిల్వ చేసుకొని ఉంచిన ధాన్యం, జీడిపిక్కలు, బియ్యం పూర్తిగా కాలిబూడిదయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కప్పరమ్మ, మజ్జిగౌరి మహిళా సంఘ సభ్యులు బ్యాంకులో చెల్లించేందుకుగానూ ఉంచిన 94 వేల రూపాయల నగదు పూర్తిగా కాలిబూడిదైందని మహిళా సంఘ సభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ డిఎస్.శాస్ర్తీ సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్తినష్టం 13 లక్షల 40 వేల రూపాయలుగా నమోదు చేశారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఎంపిపి తాడంగి సాయమ్మ, జెడ్పీటిసి భాస్కరరావులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఐటిడిఎ ద్వారా తగిన నష్టపరిహారం అందేలా తగు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.