విజయనగరం

నవరత్నాలతో నవశకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, అక్టోబర్ 14: నవత్నాలతోనే నవశకం ప్రారంభం అవుతుందని వైసీపీ అధినేత వై. ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఆదివారం గజపతినగరం నియోజవర్గంలోని దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి జంక్షన్ నుండి స్టేషన్ బూర్జివలస వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మెంటాడ మండలం కుంటినవలస, దత్తిరాజేరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను జగన్‌కు వివరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆనందమయంగా ఉండాలన్న ధ్యేయంతో నవరత్నాల పధకాలు రూపొందించానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తమకు అవకాశమిస్తే ఒక నవశకానికి శ్రీకారం చుడతామని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం పధకాలు ద్వారా వారిని ఆనందింప చేయడం ఖాయమని చెప్పారు. టీడీపీ వచ్చాక పనులు లేక వలసలు వెళ్లాల్శి వస్తుందని కొంతమంది, తాము వైసీపీకి చెందిన వారమని పింఛన్లు మంజూరు చేయలేదని మరికొంతమంది ఇలా పలువురు తమ సమస్యలను జగన్‌కు వెల్లడించారు. చంద్రబాబు ఉన్నంత కాలం నిరుపేదలకు మేలు జరగదని ఈ దుష్ట ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర జాతీయ రహదారి మీదుగా జరగడంతో బస్సుల్లోని ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బందితోపాటు పలువురు జగన్‌తో కరచాలనానికి పోటీ పడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య, మాజీ జడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ రౌతు రాజేశ్వరి, మండల పార్టీ కన్వీనర్లు కడుబండి రమేష్‌నాయుడు, బూడి వెంకటరావు, వైసీపీ నాయకులు కనకల సుబ్రహ్మణ్యం, మండల సురేష్, మాజీ జడ్పీటీసీ గారతవుడు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు సన్నద్ధం కావాలి

విజయనగరం, అక్టోబర్ 14: ఎన్నికలు సమీపిస్తున్నందున వాటిని ఎదుర్కొనేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు పిలుపునిచ్చారు. ఆదివారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సేవా మిత్రులు, బూత్ కన్వీనర్లు సిద్ధంగా ఉండాలన్నారు. సేవా మిత్రలు, బూత్ కన్వీనర్లకు అవగాహన కల్పించేందుకు పదేసి వార్డులతో ఒక సమావేశం నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈ దఫా ఎన్నికలకు కొత్తగా మరో 26 పోలింగ్ బూత్‌లు చేర్చారని తెలిపారు. అందువల్ల ఏయే బూత్‌లకు కన్వీనర్లు ఉన్నారో ముందుగా నిర్ధారించుకోవాలన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ విజయానికి అందరు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఎక్కడైనా అవగాహన రాజకీయాలు చేస్తే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో చిన్న తప్పిదం వల్ల మంచినీటి సమస్య తలెత్తిందని అన్నారు. దానిని ఎంపీ అశోక్‌గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు వార్డుకు రెండు బోర్లు చొప్పున గుర్తించి మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. తాగునీటి సమస్యను రాజకీయం చేయాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో వందల కొట్ల రూపాయల మేరకు పనులు జరుగుతున్నాయని వాటితోపాటు ఇళ్లు, పింఛన్లు, ఇతర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యకర్తలు వచ్చినా వారికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంకను పట్టణానికి మరో 4500 ఇళ్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. 35వార్డుకు చెందిన పైడిరాజు అనే కార్యకర్త మాట్లాడుతూ పుత్సల వీధిలో రూ.2 కోట్లతో రోడ్డు నిర్మాణం చేయడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొద్దుల నర్సింగరావు, ఎఎంసి చైర్మన్ సైలాడ త్రినాద్, జెడ్పీటీసీ తుంపల్లి రమణ, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీ మోహన్, సీనియర్ నాయకులు విజ్జపు ప్రసాద్, మన్యాల కృష్ణ, పార్టీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటీసీలు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన ప్రభుత్వం టీడీపీదే!
* ఇంటర్నేషనల్ ఇండియా సర్వే వెల్లడి

విజయనగరం, అక్టోబర్ 14: ఇటీవల ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన సర్వేలో అవినీతి రహిత ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వానికి గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే మీసాల గీత చెప్పారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వాలలో మూడో స్ధానం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా, అత్యధిక అవినీతి రాష్ట్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బీజేపీ అవినీతిని ప్రోత్సహిస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇదొక చెంపపెట్టు అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో అవినీతిని పారద్రోలి స్వచ్ఛమైన పార్టీలకు పట్టం కడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షంతో రైతులకు ఊరట

జామి, అక్టోబర్ 14: మండల కేంద్రమైన జామిలో ఆదివారం సాయంత్రం ఎట్టకేలకు వర్షం కురిసింది. దీంతో మండలానికి చెందిన రైతాంగానికి ఆశలు చిగురించాయి. సుమారు రెండు నెలలుగా కానరాని వర్షంతో పొలాల్లో బీటలు వారీ వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి ఆందోళన చెందుతున్న రైతులకు ఆదివారం కురిసింది వర్షంతో కొంత ఊరట కలిగింది.

గొర్లిఫేటను పీడిస్తున్న పారిశుద్ధ్య సమస్య

గరివిడి, అక్టోబర్ 14: మండలంలోని కొండశంభాం పంచాయతీ మధుర గ్రామమైన గొర్లిపేటలో పారిశుద్ధ్య సమస్య పీడిస్తున్నది. ప్రధానంగా గ్రామ పాఠశాల పరిసరాల్లో మురికికూపంగా నీరు నిల్వ ఉండడంతో పాఠశాలకు విద్యార్థులు, ఉపాద్యాయులు వెళ్ళేందుకు కూడా రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని పొడవుగా గొయ్యిలా తవ్వి వదిలివేయడంతో మురికికూపంగా మారింది. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాద్యాయులు పలువురు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా తాగునీటి పథకానికి వేసిన కుళాయి కూడా అదే ప్రదేశంలో ఉండడం వలన నీరు కలుషితమై పలు రోగాల భారీన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

హెక్టార్‌కు 60వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి

జియ్యమ్మవలస, అక్టోబర్ 14: ఇటీవల ఏర్పడిన తిత్లీ తుఫాన్ కారణంగా మండలంలో గల సింగనాపురం, చింతలబెలగాం, పరజపాడు గ్రామాల్లో నష్టపోయిన అరటి పంటను ఆదివారం బిజెపీ జిల్లా అధ్యక్షులు పెద్దింటి జగన్మోహనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వలన రైతులకు అపారనష్టం జరిగిందని, ఈ విధంగా జరగడం చాలా విచాకరమన్నారు. హెక్టార్ అరటిపంటకు 60వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా జియ్యమ్మవలస మండలంలో 4వేల ఎకరాల అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని, వెంటనే అధికారులు రెవెన్యూ, ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి తగు నివేదికలను ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో హెక్టార్‌కు 25వేల రూపాయలను అందజేశారని, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పడు అందిస్తే రైతులు నష్టపోతారన్నారు. పరిహారాన్ని పెంచి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం నాగూరు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో గల గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో అరటి పంటతోపాటు మొక్కజొన్న, పత్తి, చెరకు పంటలు పూర్తిగా తుఫాన్ తాకిడికి పాడయ్యాయన్నారు. ముఖ్యంగా వరి పంట పూర్తిగా నాశనమైందన్నారు. దీంతోరైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. బిజెపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు ద్వారపురెడ్డి రామ్మోహనరావు మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూరు వైకుంఠరావు, మండల పార్టీ అధ్యక్షులు కెంగువ వెంకటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన పంటల నివేదికలను అందించాలి

జియ్యమ్మవలస, అక్టోబర్ 14: తిత్లీ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలైన చెరకు, పత్తి, మొక్కజొన్న, రాగులు, వరి, తదితర వాటిని పరిశీలించి తగు నివేదికలను వెంటనే అందజేయాలని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ జె లీలావతి కోరారు. ఆదివారం మండలంలో గల గెడ్డసింగిపురం పంచాయతీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. నివేదికలు అందిన వెంటనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి తగు నివేదికలు తయారుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అవినాస్, వ్యవసాయ విస్తరణాధికారులు శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

చెరకు రైతుకు మిగులుతోంది చేదే...
* పూర్తికాని గత ఏడాది చెల్లింపులు

సీతానగరం, అక్టోబర్ 14: సమాజానికి చెరకు పండించి తీపిని అందిస్తున్న చెరకు రైతుకు చేదే మిగులుతూ వస్తుంది. ఈమేరకు మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ సుగర్ ప్యాక్టరీని నమ్ముకుని చెరకును సరఫరా చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2017-18 క్రషింగ్‌కు సంబంధించి 12కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నప్పటికీ ఇప్పటికీ యాజమాన్యం చెల్లించకపోవడం శోచనీయం. రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయడంలో విఫలం కావడంతో స్పందించిన ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులో సదరు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను జారీచేసింది. ఇందులో భాగంగా మొదటి, రెండు విడతల నోటీసులను జారీచేసిన అధికారులు 2కోట్ల రూపాయల మొలాసిస్ అమ్మకాలు జరిపి రైతులకు చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే అప్పులు చేసి ఆరుగాలాలు కష్టించి పండించిన రైతన్నకు సక్రమంగా బిల్లులు రాకపోవడంతో ఈప్రాంతంలో చెరకు పంట భవిష్యత్‌లో ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. ఇంకా మిగిలిన 10కోట్ల రూపాయల బకాయిలను ఆర్‌ఆర్ యాక్ట్‌లో ఎప్పటికీ పూర్తవుతుందోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 2018-19 క్రషింగ్ సీజన్ కూడా సమీపిస్తుండటంతో లక్షలాది ఎకరాల్లో పలు మండలాల్లో చెరకు పంటను రైతులు సిద్ధం చేశారు. గత ఏడాది బకాయిలనే పూర్తిచేయకపోతే ఈ ఏడాది ఎన్‌సీఎస్‌కు ఎలా చెరకు తరలించాలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ఈ సమస్య తలెత్తడానికి ఎన్‌సీఎస్ ఆర్థిక ఇబ్బందులు ఒక కారణమైతే దేశీయంగా చక్కెర ధరలు పడిపోవడంతో సుగర్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వాల సహకారం కొరవడటం మరో కారణంగా చెప్పుకోవచ్చు.
సుగర్ ఫ్యాక్టరీల సమస్యల వలన ఉద్యోగులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి సమస్యలను కూడా పరిష్కరించాలని కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.