విజయనగరం

గ్రంథాలయ వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 18: ప్రతీ ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువత సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. విజ్ఞానానికి విరామకాల సద్వినియోగానికి విశేష జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు మానవజీవితంలో విడరాని సంబంధం కలిగి ఉంటున్నాయి. ఆధునిక యుగంలో సౌకర్యాలెన్ని పెరిగినా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలే ప్రధాన ఆధారంగా ఉంటున్నాయి. జిల్లాలో 41 శాఖా గ్రంధాలయాలు, మూడు గ్రామీణ గ్రంధాలయాలు ఉన్నాయి. పట్టణంలో ఉన్న గురజాడ జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆధీనంలో ఇవి పనిచేస్తున్నాయి.
వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పబ్లిక్ సర్వీసు కమిషన్, సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు సంబంధించినవి, ఎన్‌డిఎ, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, రైల్వే సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన పుస్తకాలతోపాటు సాహిత్యం, సంస్కృతం, నవలలు, భక్తి, విద్య, ఆరోగ్యం, చరిత్ర తదితర రకాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఇంటర్, డిగ్రీ పుస్తకాలు, ప్రతీరోజు వచ్చే వివిధ దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలు కూడా గ్రంధాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు పిల్లలు, పెద్దలకు అవసరమైన కధలు, నవలు, చరిత్రలకు సంబంధించిన పుస్తకాలున్నాయి.
3చిరిగిపోయిన చొక్కా అయిన తొడుక్కో... కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో2 అనేది మేధావులు చెప్పిన మాట. పుస్తకాలన్నీ కొని చదవటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పుస్తకాలు కొని చదవలేని వారికి ఈ గ్రంధాలయాలు ఎంతో దోహదకారిగా ఉన్నాయి. ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైతం అవసరమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. విద్యావంతులు, మేధావులు తమ తీరిక సమయాన్ని వృథా చేయకుండా గ్రంధాలయాల్లోని పుస్తకాల అధ్యయనం ద్వారా తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. గతంలో విద్యావంతులైన నిరుద్యోగులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండేవి కావు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠకుల డిమాండ్ మేరకు ఎంసెట్, ఇంజనీరింగ్ నుంచి గ్రూపు వన్, సివిల్స్ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ప్రస్తుతం గ్రంధాలయాల్లో లభ్యమవుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో గ్రంధాలయాల సేవలు వినియోగించుకుంటున్నారు.

సభ్యత్వం పొందడం ఎలా?
వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి విజ్ఞానాన్ని అందించే గ్రంధాలయాల్లో సభ్యులుగా చేరడానికి కేవలం 150 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లిస్తే చాలు. తమకు అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదువుకోవచ్చు. ఖరీదైన పుస్తకాలు కావాలంటే అందుకు అధనంగా డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా పుస్తకాలను తీసుకెళ్లి తిరిగి ఇవ్వడానికి 15 రోజులు గడువు ఉంటుంది. గడువు ముగిశాక ఇచ్చే పుస్తకాలపై ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రోజులు తరువాత తమకు పుస్తకాలు అవసరం లేదని చెబితే సభ్యత్వ రుసుము కింద చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చే సదుపాయం ఉంది.

వారోత్సవాలు...
ఈ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల విద్యార్ధులకు వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గ్రంధాలయాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. గతంలో సభ్యులెవరైన ఇంటికి తీసుకెళ్లిన పుస్తకాలను గడువు తేదీ ముగిశాక కూడా ఇవ్వకుండా ఉంటే ఈ వారోత్సవాల సమయంలో ఆ పుస్తకాలను తెచ్చిచ్చే వారి నుంచి ఎలాంటి ఆలస్య రుసుము తీసుకోరు.

కానరాని సౌకర్యాలు....

ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి చదువరుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తగినంత ఫర్నీచర్ లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే కూర్చొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న గది కూడా చాలకపోవడంతో వరండాలోనే పోటీ పరీక్షలకు పట్టుదలతో చదువుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో ఉన్న గ్రంథాలయాల్లో కొన్ని సొంత భవనాల్లో నడుస్తుండగా, మరికొన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. గ్రంథాలయాల్లో వేళ్లమీద లెక్కించదగినవి తప్ప మిగితా అన్నింటికి నిధుల కొరత తీవ్రంగా ఉంది. పుస్తకాలుంటే భవనాలు లేక, భవనాలు ఉంటే సిబ్బంది లేక ఎన్నో చోట్ల కూర్చునేందుకు సరిపడా కుర్చీలు చాలక పాఠకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ సంవత్సరం గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా రకరకాల వాగ్థానాలు ఇవ్వోడమే తప్ప ఆ తరువాత అమలుకు నోచుకొనివి ఎన్నో ఉన్నాయి. గ్రంథాలయాల అభివృద్ధికి ఎన్నో పథకాలున్నా అవగాహనా లోపంతో ఉపయోగించుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజారామ్మోహనరాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు పధకాలు ప్రవేశపెట్టింది. గ్రంథాలయాలకు పుస్తకాలు, ఫర్నీచరు, భవనాల నిర్మాణం తదితర అంశాలలో గ్రాంట్లు మంజూరు చేస్తొంది. సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహణకు తోడ్పడుతుంది. అరుదైన గ్రంథాలయాల రక్షణకు తోడ్పడుతుంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో అయితే ఉచితంగానే పుస్తకాలను అందజేస్తుందన్న విషయం పలు గ్రంథాలయాలకు తెలియను కూడా తెలియదు. ఇలాంటి సంస్థలను ఉపయోగించుకుంటే కొంత వరకు లాభం పొందవచ్చు. ప్రతీ ఏటా నిర్వహించే గ్రంథాలయాల వారోత్సవాలు కేవలం సెమినార్లు, సమావేశాలు, వివిధ పోటీ పరీక్షల నిర్వాహణకే పరిమితమవుతున్నాయి తప్ప కార్యాచరణ ప్రణాళిక ఉండటం లేదు.
గ్రంథాలయాల సేవలు వినియోగించుకోవాలి
సమాజంలో ప్రతీ పౌరునికి గ్రంధాలయ సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. శాఖా, గ్రామీణ, గ్రంథాలయాలతోపాటు కొత్తగా ఇటీవల కొన్ని గ్రామాల్లో పుస్తక నిక్షేప కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయాలు పాఠకునికి అందుబాటులో ఉంటేనే సమాజం, పరిసరాల విజ్ఞానం గురించి విపులంగా తెలుసుకోవచ్చు. పుస్తక పఠనం ద్వారా ప్రతీ మనిషి సత్ప్రవర్తన పొందగలడు. గ్రంథాలయాలు గొప్ప వరం లాంటివి. వాటి సేవలను విద్యావంతులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి.

అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. తద్వారా విద్యార్థులు, యువకులు వాటిని వినియోగించకొని మరింత విజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రంథాలయాలు అందుబాటులో లేకపోవడం వల్ల కేవలం పాఠశాలలోని పుస్తకాలుతోనే కుస్తీ పడుతున్నారు. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొనైన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి.

ప్రజల సహకారం కావాలి
నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వం అందించే తోడ్పాటుతోపాటు ప్రజల సహాయ సహకారాలు ఉండాలి. విద్యా వంతులైన యువకులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేస్తే ఎలాంటి అభివృద్ధినైనా సాధించగలము. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలి.
- శ్రీసూర్యనారాయణమూర్తి
కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత పోటీ పరీక్షల ఉపయోగార్థం పెద్ద ఎత్తున పుస్తకాలను కొనుగోలు చేశాము. మరోపక్క గ్రంథాలయాలకు పక్కా భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నాను. సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడం, వౌలిక సదుపాయాలు పెంపొందించడంపై దృష్టి సారించాను. అలాగే పంచాయతీల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు వసూలు గురించి కూడా గట్టిగా కృషి చేస్తున్నాను.
- బొద్దుల నరసింగరావు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్