విజయనగరం

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 13: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో గురువారం సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి మహోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే భక్తులు తలంటిస్నానం ఆచరించి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు రాంబాబు వేదమంత్రాలతో పూజలు జరిపారు. అదే విధంగా గజపతినగరం బజారుజంక్షన్‌లో గల సీతారామ శ్రీకల్యాణ వేంకటేశ్వర అయ్యప్పస్వామి దేవాలయములు ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు పి.వి.యస్.కామేశ్వరశర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులతోనే క్షీరాభిషేకం, పంచమృతాభిషేకాలు జరిపారు. అదే విధంగా పురిటిపెంట గ్రామం పరిధిలో గల సంతతోట ఆవరణ సమీపంలో గల సుబ్రహ్మణ్యస్వామివారికి ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం
పాచిపెంట, డిసెంబర్ 13: మండలంలోని పారమ్మకొండపై శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పారమ్మకొండ ట్రస్టుబోర్డు ఛైర్మన్ బొన్నాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కళ్యాణాన్ని కడురమ్యంగా నిర్వహించారు. సతీష్‌శర్మ, కోటి వేదమంత్రాల నడుమ గౌరీశంకర్ దంపతుల చేతుల మీదుగా స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈమహోత్సవానికి స్థానిక భక్తులతోపాటు సాలూరు పట్టణం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సనాతనధర్మపరిషత్ వారు తమవంతు సహాయ సహకారాలు అందించారు.
కార్యక్రమంలో సనాతన ధర్మపరిషత్ వ్యవస్థాపకులు పంచముఖేశ్వరశర్మ పాల్గొన్నారు.
పారదర్శకంగా ప్రభుత్వ పధకాలు అమలు
గజపతినగరం, డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నదని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి రామకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని పురిటిపెంట గ్రామం పరిధిలో గల మామిడిబంద కాలనీలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిస్వార్ధంతో పక్షపాతం లేకుండా శాశ్వత పధకాలు అమలు చేస్తున్నదని అన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను విడుదల చేస్తున్నారని తెలిపారు. ఫించన్లు, బియ్యం, ఉజ్వల గ్యాస్ పధకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. అదే విధంగా స్వచ్చతామిషన్ ద్వారా పంచాయతీలకు పలు సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. ప్రజలు వాస్తవాలు గమనించి బీజేపీ బలోపేతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏడుకొండలు, ఎంఎస్‌ఎన్ రాజు, గెద్ద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చెంత నాగబంధం
గజపతినగరం, డిసెంబర్ 13: గజపతినగరం బజారుజంక్షన్‌లో గల సీతారామ శ్రీకల్యాణ వేంకటేశ్వర అయ్యప్పస్వామి దేవాలయాల ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఉపాధ్యాయుడు గేదెల సీతారామమూర్తి, నాగవెంకట మాధవి దంపతులు గురువారం నాగబంధం విగ్రహాన్ని బహుకరించారు. స్వామివారి షష్ఠి పురస్కరించుకొని ఈ దంపతులు సమర్పించిన నాగబంధానికి భక్తుల చేత క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు పీసాపాటి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పి.వి.యస్. కామేశ్వరశర్మ వేదమంత్రాలతో పూజలు చేశారు. కమిటీ సభ్యులు మెట్ల శ్రీనివాసరావుతదితరులు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించారు.

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరిదేవి
బొండపల్లి, డిసెంబర్ 13: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారు గురువారం మార్గశిర మొదటి లక్ష్మివారం తోపాటు సుభ్రమణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దూసి శ్రీధర్‌శర్మ మాట్లాడుతూ హేమంత బుతువులో వచ్చే మొదటి నెల ఇదేనని, దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమాసం ప్రకారం మార్గశిరం అని చంద్రుడు మన:కారకుడు అన్నారు. ఈ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవని, మానసికస్ధితి సరైన మార్గంలో ఉండదని అందుకని చంద్రుడు అనుకూలించేకాలంలో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటిమీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుందని, రాజరాజేశ్వరిదేవి అమ్మవారి ఇష్టగ్రహం చంద్రుడని ఈ మాసంలో అమ్మవారిని ప్రతి లక్ష్మివారం క్రమం తప్పకుండా దర్శించుకొంటే నవగ్రహాల ప్రభావం ఆ వ్యక్తిపై అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ఎస్సీ ఎస్టీల విద్యుత్ రాయితీ సర్వే వేగవంతం చేయాలి
గజపతినగరం, డిసెంబర్ 13: ఎస్సీ ఎస్టీ విద్యుత్ రాయితీ వినియోగదారుల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా విద్యుత్ సీనియర్ అకౌంట్స్ అధికారి వెంకటరాజు అన్నారు. గురువారం స్ధానిక విద్యుత్ సబ్‌ష్టేసన్ ఆవరణలో గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి మండలాలలోని విద్యుత్‌శాఖ ఎఇలు, సబ్ ఇంజనీర్లు, లైనుమేన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌పై వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలు 125యూనిట్లు వరకు వాడితే వందయూనిట్లు ఉచితంగా కాగా మిగిలిన 25యూనిట్లుకు బిల్లు చెల్లించాలని అన్నారు. అదే విధంగా 125యూనిట్లు దాటిన ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు రాయితీ సౌకర్యం ఉండదని వివరించారు. ఈ విషయాలపై గ్రామాలలో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ వినియోగదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. వినియోగదారుడి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, సర్వీస్‌నెంబర్లను లైన్‌మేన్లు సేకరించాలని ఆదేశించారు. ఈ సర్వేను త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అకౌంట్స్ అధికారి జగన్నాధరెడ్డి, అసిస్టెంట్ అకౌంట్ అధికారి భారతి, గజపతినగరం ఎడి ఇ వి.రఘు, గజపతినగరం ఎ ఇ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామదర్శిని ద్వారా సమస్యల పరిష్కారం
బొండపల్లి, డిసెంబర్ 13: గ్రామదర్శిని ద్వారా సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావు అన్నారు. గురువారం మండలంలోని చినతామరాపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. తొలుత గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను అధికార బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల బృందం ప్రజల దగ్గరకు వచ్చినందున సమస్యలను నేరుగా చెప్పేందుకు అవకాశం గ్రామదర్శిని కల్పించిందన్నారు. సామాజిక సమస్యలను అధికారులకు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడివొ ఎం.ప్రకాశరావు, ఇవొ పి ఆర్‌డి రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి కూనిబిల్లి సింహాచలం, పి ఆర్ జె ఇ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

డప్పు కళాకారుల ధర్నా విజయవంతం చేయాలి
గజపతినగరం, డిసెంబర్ 13: ఏపీ డప్పు కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 31న కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించనున్న ధర్నాలో పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాకోటి రాములు కోరారు. గురువారం ఇక్కడ కార్యక్రమాలకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కోసం జారీ చేసిన జీవోలో నెంబర్ 193 జారీ చేసిన నాటినుంచి కళాకారులకు మూడువేల రూపాయల ఫించన్ ఇవ్వాలన్నారు. అలాగే పించనుదారులు వయస్సు 55 సంవత్సరాలనుంచి 45 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈనెల 17న జిల్లావ్యాప్తంగా అన్ని ఎంపిడివొ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే విధంగా 18నుంచి 26వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. 31న ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పులతో మహాప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు.
ప్రమాదవశాత్తు మరణించిన డప్పు కళాకారులకు ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టా తవుడు, గజపతినగరం, బొబ్బిలి మండలాల అధ్యక్షులు తంటిపాక రాము, బొచ్చల దాసు తదితరులు పాల్గొన్నారు.

మహిళా రక్షక్ కమిటీపై అవగాహన ర్యాలీ
గజపతినగరం, డిసెంబర్ 13: మహిళా రక్షక్ కమిటీపై అవగాహన ర్యాలీ గురువారం గజపతినగరంలో ప్రొబిషనరీ ఎస్‌ఐ కె.రాజేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బాలికలతో కళాశాల నుంచి బయలుదేరి ప్రధాన వీధులలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు ఎటువంటి ఇబ్బందులకు గురైనా పోలీస్‌స్టేషన్లకు రాకుండా కమిటీ కో ఆర్డినేటర్‌కు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా మహిళా చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని కోరారు. మహిళా రక్షక్ కో ఆర్డినేటర్ ఎన్.హరిత మాట్లాడుతూ బొబ్బిలి ఏఎస్పీ గౌతమిషాలి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు చైతన్యవంతులై చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బి.సింహప్రసాద్, జాతీయ సేవా పధకం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ ఎస్.వి.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యా ఆరోగ్యం ప్రోత్సాహమే మా లక్ష్యం
గజపతినగరం, డిసెంబర్ 13: విద్యా ఆరోగ్యానికి తమ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని, ఢిల్లీకి చెందిన ఐఎఫ్‌సిఐ సంస్థ చైర్మన్ ఇమంది శంకరరావు అన్నారు. గురువారం మెంటాడ మండలం ఆండ్ర జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఆండ్ర, కూనేరు గ్రామానికి చెందిన విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, కంచాలు,వాటర్ బాటిల్స్ తదితర వస్తువులతో కలిగిన కిట్లను అందజేశారు. అదే విధంగా హైస్కూల్‌కు 40 బెంచీలు, మల్లేడవలస పాఠశాలకు నాలుగు బెంచీలు, 25 కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 రాష్ట్రాలలో తమ సంస్థ ద్వారా పలు సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అట్టడుగున ఉన్న పేద విద్యార్థులకు విద్యా, క్రీడలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటి వరకు తమ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తున్నదని అన్నారు. ఐదేళ్ళగా అర్థాంతరంగా నిలిచిపోయిన పాఠశాలల అదనపు గదులు పూర్తిచేయడానికి నిధులు ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ గురించి తెలియకపోవడంతో ప్రతి విద్యార్థి కంప్యూటర్ నేర్చుకోవడానికి నాలుగు కంప్యూటర్లు అందజేస్తున్నామని తెలిపారు. మంగళగిరి,విశాఖపట్నం, భువనేశ్వర్‌లలో అక్షయపాత్రలో భాగంగా మూడు వాహనాలు అందించామని తెలిపారు. జిల్లాలోని సాలూరు లోని లెప్రసీ సంస్థకు సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశామని అన్నారు. కొత్తవలసలో 180 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించామని తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు బెనర్జీ, అవినాష్ కుమార్, జగదీష్, మండల విద్యాశాఖాధికారి పరమేశ్వరరావు, ఎంపీటీసీ పడాల విజయ, మాజీ సర్పంచ్ కుంచుతిరుపతి, నీటి సంఘం అధ్యక్షుడు పడాల గంగునాయుడు, యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు మండల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.