విజయనగరం

అక్రమ రవాణా అరికట్టేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: రాష్ట్రప్రభుత్వం తాజాగా అమలుచేస్తున్న ఉచిత ఇసుక సరఫరా అధికారులకు తలనొప్పిగా మారింది. గృహావసరాల పేరిట వివిధ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి అక్రమంగా అమ్మకాలు చేపట్టడం యధావిధిగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ తరలింపు, రవాణా అరికట్టడం కిందిస్థాయి అధికారులకు, సిబ్బందికి శక్తికి మించిన వ్యవహారంగా మారింది. ప్రతి ఇసుక రీచ్ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికార పార్టీ నాయకులు పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించటం, అక్రమాలను అరికట్టడం ఇబ్బందికరమనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. మొదట జిల్లాలో సుమారు 20ఇసుక రీచుల నుంచి ఇసుక సరఫరా మొదలయింది. ఆ తరువాత దశల వారీగా ప్రస్తుతం వీటిసంఖ్య 50కి చేరుకుంది. తాజాగా సాలూరు పరిధిలోని వేగావతి నది, శృంగవరపుకోట, జామి మండలాల పరిధిలోని గోస్తనీ నది, గజపతినగరం, బొండపల్లి, నెల్లిమర్ల, గరివిడి మండలాల పరిధిలోని చంపావతి నదుల పరీవాహక గ్రామాల పరిధిలో మరో 15 ఇసుక రీచులను గుర్తించి ఇసుక తీసుకువెళ్లేందుకు జిల్లా యంత్రాంగం అనుమతులు మంజూరు చేసింది. మొదట్లో ఇసుక రీచ్‌ల బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించినా, పెత్తనం మాత్రం స్థానిక నేతలదే కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు కొనసాగింది. జిల్లానుంచి విశాఖకు విచ్చలవిడిగా ఇసుక రవాణా జరగటంతో స్థానిక అవసరాలు తీరక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క ఇసుక కొరత కారణంగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. రాష్టవ్య్రాప్తంగా ఈ సమస్య తలెత్తటంతో ఇసుక సరఫరాతో వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వానికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయని గమనించి తాజాగా ఉచితంగా ఇసుకను తరలించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జిల్లావ్యాప్తంగా వివిధ రీచుల నుంచి ఉచిత ఇసుక తరలింపు మొదలవగా, అక్రమ రవాణా కూడా అదే తరహాలో కొనసాగుతోంది. గజపతినగరం, శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ రీచుల నుంచి ప్రతిరోజు కొందరు ఇసుక వ్యాపారులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక తరలింపు కొనసాగిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఒక ఉన్నతాధికారి గజపతినగరం పరిధిలో ఇసుక తరలింపు వ్యవహారాన్ని ప్రత్యక్షంగా గమనించి ఆ ప్రాంత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయటం గమనిస్తే ఇసుక తరలింపులో జరగుతున్న అక్రమాలు స్పష్టం అవుతున్నాయి. ఉచిత ఇసుక అమలులో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు జారీ చేయని కారణంగా తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని కిందిస్థాయి అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. ఇసుక రీచుల వద్ద బినామీ పేర్లతో వ్యక్తిగత అవసరాల పేరిట ఇసుక తీసుకుంటున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు జిల్లాలోని పలుప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేస్తున్న సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందు ప్రయత్నిస్తున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా విషయంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చేతులు ఎత్తివేయవలసిన పరిస్థితి నెలకొంది.
65 రీచ్‌లలో ఉచితంగా ఇసుక
గంట్యాడ: ఇసుక రీచ్‌ల వద్ద దళారీలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 65 రీచ్‌లలో ఉచితంగా ఇసుక తీసుకవెళ్లవచ్చని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. ఆదివారం గంట్యాడ వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ అవసరం మేరకు ఇసుకను తీసుకువెళ్లాలని అన్నారు. ఇసుకను డంపింగ్ చేయడం, అమ్మడం నేరమని ఆవిధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక కావాలనుకుంటే రీచ్‌ల్లో సొంత లేదా అద్దె ట్రాక్టర్లను తీసుకు వెళ్లే వ్యక్తులను లేబర్‌ను కూడా తీసుకువెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని చెప్పారు. భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా ఇసుక సేకరించాలని సూచించారు. బ్రిడ్జీలు, తాగునీటి వనరుల వద్ద ఎట్టి పరిస్థితిల్లో ఇసుకను సేకరించరాదని చెప్పారు.

నేటి నుండి టెన్త్ పరీక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం మార్చి 20: జిల్లాలో సోమవారం నుంచి పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది పదవతరగతి పరీక్షలకు 30,075మంది రెగ్యులర్ విద్యార్ధులు, 1171మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారు. తెలుగు మీడియంలో 18,894మంది, ఇంగ్లీషు మీడియంలో 11,181 మంది పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు. రెగ్యులర్ విద్యార్ధులకు 133, ప్రైవేటు విద్యార్థులకు 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెగ్యులర్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు తొమ్మిది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు నియమించారు. వీరికితోడు రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల సహకారంతో మాల్‌ప్రాక్టిస్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు సోమవారం నుండి ఏప్రిల్ ఏడవ తేదీవరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు వారి హాల్ టికెట్లతో నిర్ణీత సమయానికి గంటముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల సమయంలో ఆయా పరీక్షా కేంద్రాల సమీపంలో 144సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశాలు జారీచేసారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయటంతోపాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాలలోకి స్కూల్ యూనిఫాంతో రావద్దని పరీక్షల నిర్వహణ అధికారులు స్పష్టం చేసారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని హాజరుకావచ్చని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సమీప పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలివెళ్లేందుకు ఆర్టీసి ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది.

ఆల్ ద బెస్ట్!
గంట్యాడ, మార్చి 20: పరీక్షలపై సహజంగా ఉన్న భయాన్ని విద్యార్థులు విడిచిపెట్టి పరీక్షలు రాస్తే విజయం సాధించడం తథ్యమని కలెక్టర్ ఎం ఎం నాయక్ అన్నారు. కలెక్టర్ దత్తత తీసుకున్న గంట్యాడలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నందన వసతి గృహంలోని విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లను కలెక్టర్ అందజేసారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి పబ్లిక్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు చదువులో ముందంజలో ఉన్నందున ర్యాంకులను కూడా అదే స్థాయిలో సాధించగలరన్న ధీమా వ్యక్తం చేసారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంక్షేమ వసతి గృహం గోడలపై నాయకుల చిత్రాలు,స్లోగనులు రాయిస్తామని చెప్పారు. వసతి గృహంలో వౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామని, మొక్కలు నాటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ డిడి రత్నం, వసతి గృహం సంక్షేమాధికారి ఈశ్వరరావు పాల్గొన్నారు.

కానరాని ప్రగతి

విజయనగరం (్ఫర్టు), మార్చి 20: పట్టణంలో ఆస్తిపన్ను, నీటిపన్ను మొండిబకాయిల వసూళ్లపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించినా, పన్నుల వసూళ్లలో ఆశించిన మేరకు ప్రగతి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం గడువుమరో పదిరోజులు మాత్రమే ఉన్నప్పటికీ పన్నుల వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 49,411 అసెసెంట్‌దారుల నుంచి 2465.58 లక్షల రూపాయల పన్నులను వసూలు చేయవలసి ఉండగా, ఇంతవరకు 10.50 కోట్ల రూపాయలను వసూలు చేశారు. 11నెలల పాటు నిద్రమత్తులో ఉన్న మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులు ఇప్పుడు పన్నుల వసూళ్ల కోసం హడావిడి చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రతీ ఏటా మార్చినెలలో పన్ను చెల్లింపులో వడ్డీ మినహాయింపుజరుగుతూ ఉండేది. గత రెండేళ్ల నుంచి వడ్డీ మాఫీ జరగకపోవడంతో పన్నుల చెల్లింపునకు చాలామంది ఆసక్తి చూపడంలేదు. మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు మందకొడిగా సాగడంపై మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎన్ని జప్తులు చేశారు..ఎన్నిషాపులకు తాళాలు వేశారంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్‌పై మండిపడ్డారు. ఇంతవరకు 42శాతం పన్నుల వసూళ్ల జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మిగతా మున్సిపాలిటీలతో పోల్చితే వియనగరం మున్సిపాలిటీలో ఇంతవరకు చాలా తక్కువ శాతం పన్నుల వసూలు జరిగింది. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను నియమించినా, ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు. జిల్లాలో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలలో అన్ని విభాగాల అధికారులు పన్నుల వసూళ్ల కోసం పూర్తిస్థాయిలో సహకరిస్తే విజయనగరం మున్సిపాలిటీలో అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు ఒత్తిడి మేరకు పన్నులను వసూలు చేసేందుకు టౌన్ ప్లానింగ్. మున్సిపల్ ఇంజనీరింగ్, మెప్మా, సాధారణ పరిపాలనావిభాగం, ప్రజారోగ్యశాఖ అధికారులు వెళ్లినా పూర్తిస్థాయిలో సహకరించడంలేదు. మున్సిపాలిటీలో ఇంతవరకు 3492.3లక్షల రూపాయల పన్నులను వసూలు చేయవలసి ఉండగా, ఇందులో 1546.96ల రూపాయల మొండిబకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి 1026.72 లక్షల రూపాయల ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోగా ఇంతవరకు నయాపైసా వసూలు కాలేదు. ఈ బకాయిల వసూళ్లు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. కోర్టు కేసులకు సంబంధించి 302.88 లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. డబుల్ అసెస్‌మెంట్లు, రోడ్డు విస్తరణలో కోల్పోయిన భవనాలకు సంబంధించి 86 లక్షల రూపాయల బకాయిలు సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోలేదు. మున్సిపల్ రెవెన్యూ విభాగం బిల్లుకలెక్టర్ల నిర్లక్ష్యవైఖరి వల్లే ప్రతీ పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్ష చేయవలసిన అధికారులు మిగతా కార్యక్రమాలలో నిమగ్నం కావడంతో పన్నుల వసూళ్లపై తగిన శ్రద్ధ చూపలేకపోతున్నారు.
వేసవిలో చల్లచల్లగా..

విజయనగరం(టౌన్), మార్చి 20: వేసవిలో కూల్ డ్రింక్‌లకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. చల్లటి పానీయాలకు, పళ్లరసాలకు, షర్బత్‌లు, కూల్ డ్రింక్‌లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. రహదార్లప్రక్కన తోపుడు బళ్లపై విరివిగా దొరికే సామాన్యుల పానీయం షర్బత్, నిమ్మ, సుగంధి, ద్రాక్ష వంటి రకాల షర్బత్‌లకు డిమాండ్ ఏర్పడింది. బత్తాయి, కమలాపండ్ల రసాలు, చెరకు రసాలు కూడా వేసవి ఉపశమనానికి చల్లటి పానీయాలు. అయితే వీటిని తీసుకునే ముందు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండవేడిమికి శరీరంలో ఉండే లవణాలు చెమట రూపంలో బయటకు వస్తాయని దీంతో ఉప్పు కలిసిన నిమ్మరసాలు , పళ్ల రసాలు ఆరోగ్యానికి మేలని వారు చెబుతున్నారు. మరోవైపు వేసవి దాహార్తిని తీర్చుకునేందుకు బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ షర్బత్‌లు, పళ్లరసాల కోసం రోజుకు రూ.20ల వరకు వెచ్చిస్తున్నారు. ఇక మజ్జిగ, లస్సీలకుకూడా మంచి గిరాకీ పెరిగింది. మార్చిలోనే ఎండలు మాడ్చేస్తుంటే , రానున్న మండుటెండల్లో పరిస్ధితి ఏమిటో ఊహించనవసరం లేదు.

ప్రసన్నకుమారికి కేంద్రమంత్రి అశోక్ అభినందన
గజపతినగరం, మార్చి 20 : సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైన బిజెపి ఎంపిటిసి సభ్యురాలు నగర ప్రసన్నకుమారిని సోమవారం కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అభినందించారు. లక్నోలో జరిగిన జాతీయ స్థాయిలో 5కె రన్‌లో ద్వితీయ స్థానం సంపాదించిన ప్రసన్న కుమారిని అశోక్ గజపతిరాజుకు పరిచయం చేయగా మరిన్ని విజయాలు సాధించాలని అశోక్ ఆకాంక్షించినట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివివి గోపాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా గజపతినగరం రైల్వేస్టేషన్‌లో నాగావళి ఎక్స్‌ప్రెస్ హాల్ట్ గురించి అశోక్ దృష్టికి తీసుకు వెళ్లామని, అలాగే ఈ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై నివేదిక రూపంలో త్వరలో అందజేస్తామని చెప్పారు. విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఆదర్శ గ్రామం ద్వారపూడిలో పర్యటించి సూచనలు తెలపాలని కేంద్రమంత్రి కోరారని అన్నారు. కార్యక్రమంలో రాష్టక్రమిటీ సభ్యుడు బూడి మన్మధరావు, బిజెపి నాయకులు కందుల గుప్త, చందు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అమ్మవారి మారుజాతర
* భక్తులకు భారీ అన్నసమారాధన
చీపురుపల్లి, మార్చి 20: చీపురుపల్లి పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి మారుజాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారికి కోళ్లు, పొట్లేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటిసి మీసాల వరహాలనాయుడు, మండల దేశం పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మారు జాతర సందర్భంగా వివిధ గ్రామాల భక్తులతోపాటు పట్టణంలోని పలు కుటుంబాలు ప్రభలు కట్టి వారి ఇళ్లనుండి అమ్మవారి గుడివరకు భారీ ఊరేగింపుగా వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారి ఘటోత్సవం, ప్రభ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో గవిడి సురేష్, నాగరాజు, చంద్రశేఖర్, సూరిబాబు, శివ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి
అన్ని వర్గాలు కృషిచేయాలి
* యుజెఎఫ్ పిలుపు
చీపురుపల్లి, మార్చి 20: ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు కృషి చేయాలని యుజెఎఫ్ అధ్యక్షుడు కె.వర్మ అన్నారు. యుజెఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 114 మండలాల యాత్ర ఆదివారం చీపురుపల్లి చేరింది. ఆదివారం స్థానిక మండల సమావేశ భవనంలోయుజెఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాని అన్నారు. కేంద్రంలో రాష్టన్రాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం పట్టుబట్టాలని అన్నారు. కేంద్రం మెడలు వంచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషిచేయాలని, ఉత్తరాంధ్రలో అసంపూర్తిగా ఉన్న నదులు, రిజర్వాయర్లను తక్షణం పూర్తిచేయాలని అన్నారు. పారిశ్రామికంగా, వైద్య, విద్యారంగాల్లో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మీసాల వరహాలనాయుడు, లోక్‌సత్తా నాయకుడు రెడ్డి లక్ష్మనాయుడు, రౌతు కామునాయుడు, వాసవి రమణరాజు, అనంతం వలిరెడ్డి శ్రీను, మీసాల అప్పలనాయుడు, రౌతు రాము, ఇజ్జిరోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ

విజయనగరం (్ఫర్టు), మార్చి 20: జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఫలితంగా లక్షలాది రూపాయల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. అయినప్పటికీ అటు పాలకులలోగాని, ఇటు అధికారులలోగాని ఏమాత్రం చలనం కనిపించడంలేదు. మున్సిపాలిటీ పరిధిలో ఏడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉండగా, ఇందులో 278 షాపులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీనెల 8,37,871 రూపాయల అద్దె వస్తోంది. ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇస్తే మరో ఐదు లక్షల రూపాయల మేరకు అద్దె వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా ఎవరూ ప్రయత్నాలు చేయడం లేదు. పాత ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో 14 షాపులు, రెండవ అంతస్తులో కొన్నిషాపులు ఖాళీగా ఉండగా, మరికొన్ని షాపుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. కొత్త ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా మొదటి అంతస్తులో షాపులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ షాపులను అద్దెకు ఇవ్వకపోవడం వల్ల సంవత్సరాల తరబడి మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. దీనికితోడు కొత్త, పాత ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఈ పాషింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణపై తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్ రొంగలి రామారావుతీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈనెల 9వతేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. అయినప్పటికీ సంబంధిత విభాగం అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లలో కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల అద్దెకు దిగేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. పాత ఐడిఎఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్‌లో అధికశాతం షాపులు ఖాళీగా ఉండటంతో తాగుబోతులకు నిలయంగా మారింది. ఇక్కడ ఎన్నిషాపులు ఉన్నాయి. ఎంతమంది అద్దె చెల్లిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకుంది. కనీసం మంత్లీ డిమాండ్ రిజిస్ట్రర్ (ఎండిఆర్)ను కూడా నిర్వహించడం లేదు.
అదేవిధంగా షాపుల నుంచి ప్రతీనెల అద్దె వసూలు చేయడంలేదు. పట్టణం నడిబొడ్డులో ఉన్న విపణికల్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న షాపులను వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను పలువురు కోరుతున్నారు.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
విజయనగరం (్ఫర్టు), మార్చి 20: జిల్లాలో పదవ తరగతి కామన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. ఇందుకు పల్లెవెలుగుబస్సులను సిద్ధం చేశామని చెప్పారు. విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం డిపోల పరిధిలో ఉన్న కొన్ని పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని డిపోమేనేజర్లను ఆదేశించామని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆదివారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ రహదారులలో తిరిగే పల్లెవెలుగు బస్సులను విద్యార్థులకు అవసరమైన చోట నిలపాలని, విద్యార్థుల ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. బస్సుపాసులు ఉన్న విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు పాసుతోపాటు హాల్‌టిక్కెట్‌ను చూపిస్తే ఉచితంగా తీసుకువెళతామని చెప్పారు. రెగ్యులర్‌గా తిరిగే పల్లెవెలుగు సర్వీసులతోపాటు విద్యార్థుల కోసం ఎస్.కోట, విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి సమైక్య పోరాటం

గజపతినగరం, మార్చి 20: సమస్యల పరిష్కారానికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సమైక్యంగా ఉద్యమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం గజపతినగరం మార్కెట్ కమిటీ ఆవరణలో జిల్లా స్థాయి మధ్యాహ్న భోజన పథకం మహాసభలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. మురళీధరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భోజన పథకం నిర్వాహకులకు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు. భోజన పథకం నిర్వహణలో రాజకీయాల ప్రమేయం పెరిగిపోతున్నందుకు ఆందోళన వ్యక్తం చేసారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో నిర్వాహకులకు ఐదు నుండి 20 వేల రూపాయల వరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తుండగా మన రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లించడం శోచనీయమన్నారు. వామ పక్ష పార్టీల ఉద్యమం కారణంగా కేంద్రంలోని యుపి ఎ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఒక్కొక్క విద్యార్థి భోజనానికి తొలుత 1.25 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 4.80 రూపాయలు అందజేస్తున్నదని, తమ సంఘం 15రూపాయల వంతున చెల్లించాలని కోరుతున్నదని తెలిపారు. ఎ ఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. కృష్ణంరాజు మాట్లాడుతూ భోజన పథకం నిర్వాహకులను కార్మికులుగా ప్రభుత్వాలు గుర్తించి భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. . ఎ ఐ టి యుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల పోషకాహారానికి సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు మాట్లాడుతూ భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు ఎ ఐ టియు సి పతాకాన్ని భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పైల జయలక్ష్మి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి కాళ్ల కృష్ణ, సభ్యులు పెంకి లక్ష్మి, ఉంగరాల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.