విజయనగరం

కాపుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 16: కాపు(తెలగా)ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లా పరిషత్ అతిథిగృహంలో శనివారం సాయంత్రం జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంట్యాకుల శంకరరావు ఆధ్యర్యంలో హోంమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో కాపు భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, కాపులకు రుణాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులైన కాపు యువకులకు ఉన్నత విద్య చదువుకునేందుకు అన్ని అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలగ సంక్షేమ సంఘం నాయకులు అల్లు చాణుక్య, రమణమూర్తి, ఎస్‌పి రాజు, ఎల్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఆసుపత్రిలో మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 16: ఆకస్మిక పర్యటనలతో జిల్లా మంత్రి మృణాళిని అధికారులను హడలెత్తిస్తూదూసుకెళుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం ఏవిధంగా అమలవుతున్నది ఆమె ఆకస్మిక తనిఖీల్లో వెల్లడవుతోంది. కస్పా హైస్కూల్‌లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉపాధ్యాయులు చుక్కలు చూపించిన మంత్రి తాజాగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ప్రభుత్వ వైద్య సేవల తీరును ఆమె తనిఖీచేశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని దాదాపు రెండు గంటలసేపు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. స్వతహాగా వైద్య వృత్తికి చెందిన ఆమె రోగులకు అందుతున్న ప్రభుత్వ వైద్యసేవలపై వార్డులన్నీ తిరిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు రోగులకు ఏవిధంగా అందుతున్నదీ పరిశీలించారు. చిన్నపిల్లల వార్డు, గర్భిణుల వార్డు, రక్తనిధి కేంద్రం, శస్తచ్రికిత్సల విభాగం, అత్యవసర చికిత్సల విభాగాలను నిశితంగా పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి ఆసుపత్రికి ఎంతమంది వైద్యులు హాజరైందీ వివరాలు తెలపాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఉషశ్రీని ప్రశ్నించారు. హాజరు పట్టీ తీసుకురావాలని ఆదేశించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోజువారీ విధులకు 30 మంది వైద్యులు హాజరు కావలసి ఉండగా శనివారం కేవలం ఐదుగురు వైద్యులు మాత్రమే నిర్ణీత సమయానికి హాజరై అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరుగుతున్నదని ఆమె ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగారు. మీరు రోజూ కొంత సమయం దీనిపై దృష్టిపెట్టాల్సి ఉంటుందని ఆదేశించారు. వైద్యుల హాజరువిషయంలో మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం ఆమె హాజరుపట్టీ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి జిల్లా కేంద్ర ఆసుపత్రిని కార్పొరేట్ తరహా ఆసుపత్రి స్థాయికి అభివృద్ధి చేసిందని చెప్పారు. ఆధునిక వైద్య పరికరాలు, వసతులు అన్నీ పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సమకూర్చామని అన్నారు. పేదల కోసం నెలకొల్పిన ఈ ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో రాకపోతే ఏవిధంగా పేదలకు వైద్య సేవలు అందుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు సమయపాలన పాటించినపుడే మెరుగైన సేవలు అందించగలమని గుర్తించాలని జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులను మందలించారు. ఆకస్మిక తనిఖీల ద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని తన ఉద్దేశ్యమని చెప్పారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యసేవల తీరుపట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఆమె జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకునే రహదారి దుస్థితిని చూశారు. ఈ రహదారిని అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో ఏజెసి నాగేశ్వరరావు, జిల్లా కేంద్ర ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ ఉషశ్రీ, సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, వైద్యులు సత్య శ్రీనివాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సర్వశిక్ష అభియాన్ పాఠశాలలకు
ట్యాబ్‌లు మంజూరు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 16: జిల్లాలోని సర్వశిక్ష అభియాన్ పథకం పరిధిలో పనిచేస్తున్న 505 పాఠశాలలు ట్యాబ్‌లు మంజూరయ్యాయి. శనివారం కలెక్టర్ ఎం ఎం నాయక్ తన ఛాంబర్‌లో వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఈట్యాబ్‌లు అందజేశారు. 33 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు, 236 ప్రాథమికోన్నత పాఠశాలలకు, మరో 236 ఆదర్శ ప్రాఠశాలలకు ఈ ట్యాబ్‌లు మంజూరయ్యాయి. 30 జిబి కెపాసిటితో కూడిన ఈట్యాబ్‌ను 3జి సిమ్‌తో కలిపి అందజేశారు. ట్యాబ్‌ల ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, హాజరైన విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పంపించవలసి ఉంటుంది. రోజువారీ ప్రణాళికలను కూడా విద్యాశాఖ అధికారులకు ట్యాబ్ ద్వారా సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ నాయక్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్‌లను సక్రమంగా ఉపయోగించుకుని పాఠశాలల పనితీరుపై ఎప్పటికప్పుడు అధికారులకు నివేదికలు పంపించాలని తెలిపారు. ట్యాబ్‌ల వినియోగంపై ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు వర్క్‌షాప్ త్వరలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు శాతం పెరిగిన కనీస వేతనాలు
జిల్లాలోని పరిశ్రమలలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనాలను నాలుగు శాతానికి పెంచితూ కనీస వేతనాల కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్ ఎంఎం నాయక్ అధ్యక్షతన కనీస వేతనాల కమిటీ సమావేశం శనివారం కలెక్టర్ చాంబర్‌లో జరిగింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సూచీని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాల పెరుగుదలను సంబంధిత అధికారులు 3.33శాతం పెంచుతూ ప్రతిపాదనలు ఇవ్వగా జిల్లా కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ సూచన మేరకు ఈ పెంపును నాలుగు శాతంగా ఆమోదిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో విశాఖ, విజయనగరం నీటిపారుదల శాఖ ఎస్‌ఇలు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, జిల్లా ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలపై పార్టీ ప్రముఖులు స్పందించడం లేదు
* టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో నేతల ఆందోళన
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 16: ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సందర్భంలో టిడిపి నాయకులు, ముఖ్య కార్యకర్తలు సరైన రీతిలో స్పందించకపోవడంపై తెలుగు దేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమావేశం జిల్లా టిడిపి అధ్యక్షుడు జగదీష్ అధ్యక్షతన శనివారం అశోక్ బంగ్లాలో జరిగింది. గత కొన్ని రోజులుగా వైకాపా నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన తప్పుడు విమర్శలు చేస్తుంటే నియోజకవర్గ స్థాయి నాయకులు స్పందించకపోవడాన్ని సమావేశంలో పలువురు నాయకులు ప్రస్తావించారు. ప్రతిపక్షాల విమర్శలపై నోరుమెదపకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ ముఖ్య నాయకులకు సూచించాలని సమావేశం నిర్ణయించింది. పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ పరిధిలోని బోడికొండ గ్రానైట్ తవ్వకాలకు 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావిస్తూ గ్రానైట్ తవ్వకాలపై టిడిపి ప్రభుత్వాన్ని కొందరు నాయకులు తప్పు పడుతున్నారని, వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచడంతోపాటు అక్రమ గ్రానైట్ తవ్వకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గనులశాఖ కమిషనర్‌ను కోరాలని సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గించకుండా ఎరువుల అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల గైర్హాజరు, మందుల కొరత తదితర సమస్యలపై వస్తున్న ఫిర్యాదులపై చర్చించిన సమన్వయ కమిటీ సమావేశం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు ఈ సీజన్‌లో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవటంతోపాటు జంఝావతి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 39కోట్ల రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రికి సమావేశం కృతజ్ఞత తెలిపింది. సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని, ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, చిరంజీవులు, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఆర్‌పి భంజ్‌దేవ్, వెంకటనాయుడు, తెంటు లక్ష్మునాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు.
జ్వర పీడితులకు తక్షణ వైద్యసేవలు
* జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారద

గంట్యాడ, జూలై 16: ప్రస్తుత సీజన్‌లో మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీచేయడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం శారద తెలిపారు. గంట్యాడ పిహెచ్‌సి కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని పలు విభాగాల గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రత్యేకించి గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతంలోని 20 పిహెచ్‌సిలలో 35 ఆరోగ్య కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మలేరియా రోగులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు 21 మంది ఎఎన్‌ఎంలు, 30 మంది హెల్త్ వర్కర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించామన్నారు. జిల్లాలో ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు ల్యాబ్ టెక్నిషియన్లు, ఐదు స్ట్ఫా నర్సులు, ఐదు ఫార్మసిస్టు పోస్టులు భర్తీ చేశామన్నారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి హాస్టల్‌కు ఒక ఆరోగ్య కార్యకర్తకు బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలోని 12 కమ్యూనిటీ హెల్త్ సెంట్రల్‌లో ఎస్‌పిహెచ్‌ఓ వ్యవస్థ రద్దయిందని క్లస్టర్ కార్యాలయాల్లోని అన్ని రకాల సామగ్రిని ఎపివిఇబికు తరలించామని చెప్పారు. ఇప్పటి వరకు ఎస్‌పిహెచ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించిన వైద్యులు డెప్యూటీ సివిల్ సర్జన్‌లుగా వైద్య సేవలు అందిస్తారని అన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లక్ష్యాల సాధనకు డిపిఎల్ శిబిరాలు త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. వైద్యాధికారి పద్మజ పాల్గొన్నారు.
శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష
విజయనగరం(టౌన్), జూలై 16: శాంతిభద్రతలు అమలు అవుతున్న తీరును రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం సమీక్షించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో కేసుల పురోగతిని సమీక్షించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టాలని అన్నారు. శాంతిభద్రతలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆయన పోలీసు పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు. అంతకు ముందు సాయుధ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ లేళ్ల కాళిదాసు, ఓఎస్‌డి అప్పలనాయుడు, అదనపు ఎస్పీ రమణ, పార్వతీపురం ఎ ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు
హోంమంత్రిని కలసిన
జిల్లా మంత్రి, అధికారులు
రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో జిల్లా టిడిపి నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జడ్పీ అతిథి గృహంలో హోం మంత్రిని సహచర మంత్రి, జిల్లా మంత్రి అయిన మృణాళిని, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, ఎస్పీ లేళ్ల కాళిదాసు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్యేలు లలితకుమారి, చిరంజీవులు, జెసి శ్రీకేష్ లఠ్కర్, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ మంత్రిని కలుసుకున్న వారిలో ఉన్నారు.

క్రీడామైదానాల అభివృద్ధికి నిధులు
* షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు ప్రారంభించిన ఎమ్మెల్సీ జగదీష్
విజయనగరం(టౌన్), జూలై 16: జిల్లాలో క్రీడామైదానాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వెల్లిడించారు. శనివారం పట్టణంలోని క్రీడాప్రాథికార సంస్థ ఇండోర్ స్టేడియంలో మూడు రోజలు జరిగే వివిధ కేటగిరీల షటిల్ పోటీలుద్వారా జట్ల ఎంపికను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులు ఎదుర్కొంటున్న వౌలిక సదుపాయాల కొరతను నివారించేందుకు అసోసియేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు దృష్టికి సమస్యలను తీసుకెళ్లామని స్పందించిన ఆయన రెండు గ్రీన్ ఫీల్డు క్రీడామైదానాలు, రెండు క్రీడాప్రాంగణాలకు మరమ్మతులు చేసేందుకు ఒక్కో దానికి రెండున్నర కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గజపతినగరం, పార్వతీపురంలో గ్రీన్ ఫీల్డు మైదానాలు, ఎస్‌కోట, విజయనగరంలో పాత మైదానాలను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని వివరించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఆనందలక్ష్మి మాట్లాడుతూ త్వరలోనే విజ్జిస్టేడియంను అన్ని రకాలుగా అంతర్జాతీయ సౌకర్యాలతో తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. క్రీడలను అన్ని విధాలుగా అభివృద్ధిచేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషిచేస్తున్నదని డాక్టర్ విఎస్ ప్రసాద్ తెలిపారు. తొలిరోజు అండర్ -19 విభాగంలో జట్ల ఎంపికల పోటీలు జరిగాయి. ఈకార్యక్రమంలో అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కుసుమబచ్చన్, వెటరన్ క్రీడాకారుడు శాస్ర్తీ, శ్రీరాములు, బోని అప్పారావుతదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్‌కు రూ.184కోట్ల రుణాలు
* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఇఓ నారాయణరావు
గజపతినగరం, జూలై 16: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సహకార సంఘాల ద్వారా 184కోట్ల రూపాయలు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు పంపిణీ చేయడానికి నిర్ణయించామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నారాయణరావు తెలిపారు. శనివారం స్థానిక సెంట్రల్ బ్యాంకు బ్రాంచ్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్‌లో దీర్ఘకాలిక రుణాల కింద 40కోట్లు, స్వల్పకాలిక రుణాల కింద ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద రెండో విడతగా తమ శాఖలకు 11లక్షల 58వేల రూపాయలు మంజూరయ్యాయని రుణ ఉపశమన బాండ్లు అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. జిల్లాలో గల 94 సహకార సంఘాల్లో 85 సంఘాలు వ్యాపారం చేస్తున్నాయని, వీటికి 10 నుండి 30 లక్షల రూపాయల వరకు బ్యాంకు గ్యారంటీ ఇస్తామని తెలిపారు. మార్క్‌ఫెడ్ నుండి ఎరువులు తెచ్చి వ్యాపారం చేసిన అనంతరం బకాయిలు చెల్లిస్తారని తెలిపారు. కెల్ల, అన్నమరాజుపేట సంఘాలలో మాత్రమే బంగారంపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. రావివలస, రాచకిండాం సొసైటీలలో జరిగిన అవినీతికి సంబంధించి ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెముడు సొసైటీలో 93లక్షల రూపాయలు అవినీతి జరిగినందున సంబంధిత సొసైటీ అధ్యక్షుడు సూపర్‌వైజర్లను అరెస్టు చేశామని తెలిపారు. ఈసంఘం పాలక వర్గాన్ని రద్దు చేసినందున త్వరలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధికారులు జానకి, రామారావు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
విజయనగరం(టౌన్), జూలై 16: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రక్షణ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్స్ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. శనివారం పోలీసు పెరెడ్ మైదానంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆర్టీసీ కానిస్టేబుల్స్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో రాజీ పడరాదన్నారు. ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలో ముందు నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పోలీసు ట్రైనింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ సత్తిరాజు, పోలీసు అధికారులు, ఆర్టీసీ స్ట్ఫా ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ వరలక్ష్మి పాల్గొన్నారు.