విజయనగరం

వంద గ్రామాల్లో... బహిరంగ మలవిసర్జన నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 23: సంపూర్ణ బహిరంగ మలవిసర్జన గ్రామాలుగా మార్చే కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో స్వచ్ఛ్భారత్, గ్రామీణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన నిర్మూలన అంశాలపై కలెక్టర్ నాయక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15నాటికి 25 గ్రామాలు, గాంధీ జయంతినాటికి వంద గ్రామాలను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన నిర్మూలన గ్రామాలుగా ప్రకటించాలనే లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు, గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో బహిరంగ మలవిసర్జనపై ప్రజలకు అవగాహన కల్పించి అడ్డంకులను అధిగమించాలని తెలిపారు. నిర్మాణం పూర్తిచేసుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లకు జియోట్యాగింగ్ నిర్వహించి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. బిల్లులు చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లాపరిషత్ సిఇఓ రాయకుమారి, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్‌ఇ రమణారావు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా దక్కకుండా
బిజెపి కుట్ర
* జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆరోపించారు. శనివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆదిరాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా విషయంలో పోటీపడి ప్రకటనలు చేసిన భారతీయ జనతాపార్టీ నాయకత్వం ఇపుడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని దాటవేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. గతంలో రెండుసార్లు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేటు బిల్లును బిజెపి ప్రభుత్వం అడ్డుకుందని, తాజాగా ఆప్ ఎంపి వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని బిల్లు చర్చకు రాకుండా చూసిందని విమర్శించారు. ప్రైవేటు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా చట్టంగా మార్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు వైఖరి రాష్ట్ర ప్రజలను మోసగించడమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే బిజెపి అడ్డుపడడం, ఈప్రయత్నాలకు టిడిపి పరోక్షంగా మద్దతు తెలపడం శోచనీయమని చెప్పారు. బిజెపి, టిడిపిఎన్ని కుట్రలు చేసినా ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేటు బిల్లు పార్లమెంటులో చర్చకు రావడం తప్పదన్నారు. అన్ని పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్, పైడిరాజు, అప్పారావు, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి సహకరించాలి
* మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ
విజయనగరం (్ఫర్టు), జూలై 23: పట్టణంలో అంబటి సత్రం జంక్షన్ నుంచి కొత్తపేటకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి భవనాలను కోల్పోతున్న యజమానులు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కోరారు. ఈ రహదారిలో 199 భవనాలకు నష్టం వాటిల్లుతుందని మున్సిపల్ యంత్రాంగం గుర్తించిందని తెలిపారు. నిబంధనలకు లోబడి భవనాలను కోల్పోయే యజమానులకు తగిన న్యాయం చేస్తామని, ఇందుకు డబుల్ ట్రాన్స్‌పర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టిడిఆర్) ఇస్తామని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో శనివారం భవన యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 66 అడుగుల మేరకు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించామని, ఆ మేరకు మార్కింగ్ కూడా చేశామని తెలిపారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణం, జనాభాను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ జి నాగరాజు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి శోభన్‌బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి హరిదాసు తదితరులు పాల్గొన్నారు.
సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయాలి
* పోలీసు సిబ్బందికి ఎఎస్పీ సూచన
విజయనగరం(టౌన్), జూలై 23: పోలీసు సిబ్బంది ప్రజలతో మమేకమై అంకిత భావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఎఎస్పీ ఎవి రమణ తెలిపారు. శనివారం పోలీసు శిక్షణా కళాశాలలో నిర్వహిస్తున్న పరివర్తన కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి సేవాథృక్పథం-నైతిక విలువల ఆవశ్యకత అనే అంశంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా పెంచుకోవాలని స్పష్టం చేశారు. సేవాదృక్పథంతో పనిచేస్తూ నీతి-నిజాయితీలతో పనిచేయాలని చెప్పారు. అనైతిక చర్యలకు పాల్పడితే కలిగే పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో సిబ్బందికి హితబోధ చేశారు. సమాజంలోని ప్రజల పట్ల బాధ్యతగా మెలగి లంచాలకి తావులేకుండా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. చట్టంపై అవగాహన పెంచుకుని సమర్థవంతంగా పనిచేస్తూనే వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబంపై శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెట్టుకునే వ్యవహార శైలిని అలవర్చుకోవాలని తెలిపారు.
ఎస్సీ యువత చదువుపై శ్రద్ధ చూపాలి
* ఎస్సీ కార్పొరేషన్ ఎండి విజయకుమార్

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: షెడ్యూల్ కులాల యువతీ, యువకులు చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల ఆర్థిక సహకారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ సూచించారు. చదువుతోనే మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం లభిస్తుందని చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువస్ఫూర్తి సమ్మేళనం కార్యక్రమంలో విజయకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ యువత కేవలం సొంత ప్రయోజనాలకే పరిమితం అవకుండా జాతి ప్రయోజనాలకోసం కృషి చేయాలని అన్నారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. వివిధ పథకాల కింద యూనిట్లు మంజూరు చేసి తాత్కాలిక ఉపాధి కల్పించడం కాకుండా శాశ్వత ఉపాధి కల్పన ద్వారా ఎస్సీ కుటుంబాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఎస్సీ యువత తాము చదువుకోవడంతోపాటు మరికొందరు ఎస్సీ విద్యార్థి, విద్యార్థులకు విద్యాబోధన జరిపేలా ప్రయత్నించాలని అన్నారు. మేధాశక్తితో ఆర్థికంగా, సామాజికంగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలను యువత ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కాలేబ్, అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
55 కేంద్రాల్లో...
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

* జిల్లా వృత్తివిద్యా శాఖ అధికారి అప్పారావు
గజపతినగరం, జూలై 23: ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో జిల్లా వ్యాప్తంగా 55కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా వృత్తివిద్యా శాఖ అధికారి బి అప్పారావు చెప్పారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిఇవిఓ అప్పారావు పరిశీలించి అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది వంద కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ప్రశ్నా పత్రాలను విజయనగరంలో కొత్తగా నిర్మించిన జూనియర్ కళాశాలలో దిద్దనున్నట్లు చెప్పారు. ఇప్పటికే జూనియర్ కళాశాలకు 2.40కోట్లతో భవనాలు నిర్మించామని, మరికొన్ని అదనపు గదులు నిర్మాణానికి రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉచితంగా 35వేల పాఠ్యపుస్తకాలు ఇప్పటి వరకు పంపిణీ చేశామని చెప్పారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతంత కల్పించేందుకు వారంలో మూడు రోజులుపాటు యోగా, మెడిటేషన్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచడంతోపాటు విద్యార్థులు పరీక్షలపై అధ్యాపకులు దృష్టిపెట్టాలని సూచించారు. అధ్యాపకులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెవిబి విఠల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలు సంరక్షించాలి
* కమిషనర్ అచ్చింనాయుడు
నెల్లిమర్ల, జూలై 23: నగర పంచాయితీ కార్యాలయంలో ఐదువేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ అచ్చింనాయుడు అన్నారు. వేప, కాము, ఉసిరి, పూలజాతి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు అందజేశామని వెల్లడించారు. డ్వాక్రా సంఘాల సభ్యులు, గృహాల వద్ద మొక్కలు నాటేవారు మొక్కలకోసం నగర పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడలని కోరారు. అడవుల శాతం తగ్గడం వలన వాతావరణంలో మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టి కారకాలుగా మారుతున్నాయన్నారు. నగర పంచాయతీ నాటే మొక్కలు సంరక్షణ కోసం నెట్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.
చెత్తసేకరణకు రిక్షాలు ఏర్పాటు
నెల్లిమర్ల నగర పంచాయితీలో చెత్త సేకరించడానికి బళ్లు ఏర్పాటు చేశామని కమిషనర్ అచ్చింనాయుడు చెప్పారు. మూడు లక్షల రూపాయల వ్యయంతో ఈ తోపుడు బళ్లు కొనుగోలు చేశామని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. నగర పంచాయతీ వాసులు తడి, పొడి చెత్తను వేరుచేసి తోపుడుబళ్లకు అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. రహదారులపై ఎక్కడబడితే అక్కడ చెత్తవేయరాదని అన్నారు. నగర పంచాయితీ నిర్ధేశించిన స్థలాల్లో చెత్తవేయాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని కోరారు. నగర పంచాయతీ వాసులకు సమస్యలు ఉంటే డయల్ యువర్ కమిషనర్‌కు తెలియజేయాలని కోరారు.
బిజెపి రాజకీయం చేసింది... టిడిపి ప్రేక్షకపాత్ర వహించింది
* ప్రత్యేక హోదా బిల్లుపై సిపిఐ నేత అశోక్ విమర్శ
విజయనగరం (్ఫర్టు), జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బిల్లును చర్చకు రానీయకుండా, కనీసం ఓటింగ్ జరగనీయకుండా బిజెపి రాజకీయం చేసిందని, మిత్రపక్షమైన టిడిపి ప్రేక్షకపాత్ర వహించిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు. పార్లమెంటులో ఈ రెండు పార్టీలు అనుసరించిన వైఖరికి నిరసనగా శనివారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్టవ్రిభజన సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షంగా వ్యవహరించిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని డిమాండ్ చేసిందని, ఇప్పుడు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రైవేటుబిల్లును ప్రవేశపెడితే కనీసం ఓటింగ్ జరగకుండా సభలో సంబంధం లేని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గార్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రులు కనీసం నోరు మెదపకపోవడం దారుణమని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరి ఏమిటో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంలోకి కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, విభజన చట్టంలో అంశాలను అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.రమణమ్మ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజుదొర, సిపిఐ పట్టణ నాయకులు ఎస్.రంగరాజు, జగన్నాధం, పొందూరు రమణ, షేక్ ఇబ్రహీమ్, మహిళా సమాఖ్య నాయకులు జయలక్ష్మి, పెంకి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌సి వసతి గృహంలో పాము కలకలం
మెరకముడిదాం, జూలై 23: మండలంలో గల గర్భాం బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి పాము కలకలం రేపింది. విద్యార్థులు వరండాలో కూర్చిన చదువుకుంటున్న సమయంలో వంటగదిలో నుండి కట్ల పాము విద్యార్థ్ధుల వైపు వచ్చింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. దీనిని గమనించిన సంక్షేమ అధికారి సింహాచలం, కుక్ నాగభూషనరావు ఆ పామును కర్రతో కొట్టి చంపారు. దీంతో విద్యార్థ్ధులు ఊపిరి పీల్చుకున్నారు.
పిడుగుపాటుతో...
గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు
బొండపల్లి, జూలై 23: మండలంలోని బొండపల్లి పంచాయితీ శివారు గ్రామం గొల్లలపేట గ్రామంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం సాయంత్రం పొలంలో గొర్రెలను కాస్తుండగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షం పడుతున్న సమయంలో చంద్రయ్యపై పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను వైద్య చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: కోళ్ల
శృంగవరపుకోట, జూలై 23: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు. శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 29న మండలంలోని నాలుగువేల మొక్కలు నాటుతామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి బ్రహ్మాజీ, ఎంపిడిఓ మన్మథరావు, ఎపిఓ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
* ఎస్సీ కార్పొరేషన్ ఎండి విజయకుమార్

విజయనగరం(టౌన్), జూలై 23: తరతరాలుగా అవగాహన లేక పేదరికంలో మగ్గుతున్న దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రైవేటు హోటల్‌లో శనివారం సాయంత్రం దళిత సంఘాలతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి అభివృద్ధి పథకం, ప్రధాన మంత్రి ముద్రాయోజన, యువతకు నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా దళితుల ఆర్థిక వికాశానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే అక్షరాస్యత పెంచుకుని అవగాహనతో ముందుకు రావాలని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కోటిరూపాయల వరకు 35శాతం సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దళారులను నమ్మవద్దని, అర్హులకే పథకాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజెసి నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ జిఎం కాలేబ్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఇడిలు రాజు, మహలక్ష్మి, ఆదిత్యలక్ష్మి, దళిత సంఘాల నాయకులు బసవ సూర్య నారాయణ, లోగిస రామకృష్ణ, సింహాచలం, బుంగ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.