విజయనగరం

అటు ఆరోపణలు... ఇటు విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 6: ఒకవైపు అధికారులు తన వినడం లేదని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆరోపణలు చేయడం, మరోవైపు అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని పాలకవర్గసభ్యులు విమర్శలు చేయడంతో మున్సిపాలిటీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమ మాట వినడంలేదని, సక్రమంగా పనిచేయడంలేదని అధికారంలో ఉన్న నాయకులు ఆరోపణలు చేయడంతో అధికారులు అంతర్మథనంలో పడ్డారు. రెండేళ్ల నుంచి ఇవే ఆరోపణలు, విమర్శలు చేయడంతో వారు మనోవేదన చెందుతున్నారు. అధికారులు మారినా ఆరోపణలు, విమర్శలు చేయడం మానడంలేదు. గతంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆర్ సోమన్నారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడు, మున్సిపల్ ఇంజనీర్ ఎం బాబు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎ లక్ష్మణరావు, వి రాజేశ్వరరావుపై కూడా ఇవే ఆరోపణలు, విమర్శలు చేశారు. వారంతా బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న తమపై కూడా అలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడంతో ఏమిచేయాలో తెలియక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారులు, పాలకవర్గసభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం, చైర్మన్‌తో కొంతమంది పాలకవర గసభ్యులకు మధ్య నెలకున్న విబేధాలు పట్టణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్‌లో జరుగుతున్న పరిణామాలను పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ రెండునెలల క్రితమే కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ వ్యవహారశైలిపై కేంద్రమంత్రి అశోక్‌కు టిడిపి సీనియర్ నాయకుడు, 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నేతృత్వంలో కొద్దిరోజుల క్రితం కొంతమంది పాలకవర్గసభ్యులు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఈనెల నాలుగవ తేదీన అశోక్‌బంగ్లాలో మున్సిపల్ చైర్మన్, పాలకవర్గసభ్యుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ఎమ్మెల్యే మీసాల గీత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పట్టణంలో అభివృద్ధి పనులు జరగడంలేదని, అధికారులు సక్రమంగా పనిచేయడంలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ ఒంటెత్తు పోకడలు అవలంభిస్తున్నారని పలువురు పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. అధికారులు తన మాట వినడంలేదని చైర్మన్ రామకృష్ణ ఆవేదన చెందుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తమను టార్గెట్ చేస్తూ ఇటు చైర్మన్, అటు పాలకవర్గసభ్యులు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గ సభ్యులు విబేధాలతో రోడ్డెక్కడం, అధికారులతో సమన్వయం లేకపోవడం వల్ల మున్సిపాలిటీలో పరిపాలన పూర్తిగా దిగజారిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు పనితీరు ఏమాత్రం బాగోలేదని చైర్మన్‌తోపాటు కొంతమంది పట్టణ టిడిపి నాయకులు పదిరోజుల క్రితం విజయనగరం వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కమిషనర్‌పై ఇన్‌ఛార్జి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా చీవాట్లు కూడా పెట్టినట్లు తెలిసింది. అప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్ నాగరాజు మనస్థాపంతో ఉంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
----------------

విత్తన తయారీ కేంద్రాన్ని
పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
వేపాడ, ఆగస్టు 6: మండలంలోని గుడివాడ గ్రామంలో ఏర్పాటుచేసిన విత్తన తయారీ కేంద్రాన్ని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సూర్య త్రినాథరావు శనివారం పరిశీలించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ, రైతు మిత్ర గ్రూపు సభ్యులు ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని పరిశీలించిన అసిస్టెంట్ రిజిస్టార్ మాట్లాడుతూ 2013లో ప్రభుత్వం 90 శాతం రాయితీపై 4లక్షల 60వేల 684రూపాయల ఖర్చుతో దీనిని మంజూరు చేసిందన్నారు. ఇందులో పది శాతం నిధులు రైతు మిత్ర గ్రూపు సభ్యులు భరించాల్సి ఉందన్నారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, గంట్యాడ, గుర్ల మండలాలో ఉన్న యూనిట్లను పరిశీలించగా అవన్నీ మూలకు చేరాయని చెప్పారు. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో ఏర్పాటుచేసిన కేంద్రం మాత్రం వినియోగంలో ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సభ్యులు, రైతులను కేంద్రం ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తగిన నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తామన్నారు. వ్యవసాయ అధికారిణి శిరీష, ఎఇఓ అక్కునాయుడు, రైతు మిత్ర సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు* చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి శ్యాంకుమార్

గరివిడి, ఆగస్టు 6: ర్యాగింగ్‌పేరుతో వికృతచేష్టలకు పాల్పడిన విద్యార్థులపై చట్టపరైమన చర్యలు తీసుకుంటామని చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి శ్యాంకుమార్ అన్నారు. శనివారం స్థానిక అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసి ఆనందించే వికృతచేష్టలకు కఠినమైన చట్టాలు ఉన్నాయని, వాటి జోలికి వెళ్లి విద్యార్థులు తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన చట్టంపై అవగాహన కల్పించారు. చీపురుపల్లి సి ఐ రాఘవులు, కళాశాల ప్రిన్సిపాల్ వై. శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ బి.శంకరప్రసాద్, డైరెక్టర్ రాజేంద్ర, కళాశాల పరిపాలనాధికారి అనిల్ తదితరులు మాట్లాడారు. ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి అధ్యాపక బృందంతో కమిటీలను వేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవగాహన కల్పించడం నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ర్యాగింగ్ రహిత కళాశాలగా తీర్చిదిద్దడాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నెలాఖరుకు స్ప్రేయింగ్ పూర్తి
* జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవికుమార్‌రెడ్డి వెల్లడి
పార్వతీపురం, ఆగస్టు 6: దోమల నివారణకు చేపడుతున్న ఎబేట్ స్ప్రేయింగ్ ఈనెలాఖరునాటికి పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎంఎం రవికుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన పార్వతీపురంలోని జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి రౌండ్ పూర్తియిందని, రెండవ రౌండ్ కూడా జూలై 15నుండి 30లోగా పూర్తిచేయాల్సి ఉండగా గుమ్మలక్ష్మీపురం మండలం మినహా అన్ని మండలాల్లో పూర్తిచేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈనెలాఖరులో ఈమండలంలో కూడా పూర్తిచేస్తామన్నారు. జిల్లాలో 1120 గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికి 702 గ్రామాల్లో పూర్తిచేశామన్నారు. అలాగే సబ్‌ప్లాన్ పరిధిలోని 8 మండలాల్లో 982 గ్రామాలకు గాను 630 గ్రామాల్లో ఇప్పటికే స్ప్రేయింగ్ పూర్తిచేశామన్నారు. ఈగ్రామాలతో పాటు జిల్లాలో 38వసతి గృహాల్లో కూడా దోమలనివారణకు స్ప్రేయింగ్ చేశామని, ఇందులోభాగంగా 25గిరిజన గ్రామాల్లో చేశామన్నారు. మలేరియాకు సంబంధించి ఆయన వివరిస్తూ గత ఏడాదికంటే ఈ ఏడాది 50శాతం తగ్గిందన్నారు. గత ఏడాది జనవరి నుండి జూలై వరకు 2300 పాజిటివ్ కేసులు రాగా ఈ ఏడాది కేవలం 1463మాత్రమే వచ్చాయన్నారు. అలాగే డెంగూకు సంబంధించి 168రక్తపూతలు సేకరించగా ఈ ఏడాది తొమ్మిది కేసులు నమోదయ్యాయని ఇందులో భాగంగామైదాన ప్రాంతాల్లో ఏడు, గిరిజన ప్రాంతాల్లో రెండు నమోదయ్యాయన్నారు.చికెన్‌గున్యా రక్తపూతలు 48సేకరించగా ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ఫైలేరియా 25వేల రక్తపూతలు సేకరించగా ఒక్కటి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. ఐ ఆర్ ఎస్, ఏంటి లార్వా స్పోకల్ స్ప్రేయింగ్ వంటివి చర్యలు ద్వారా దోమల నివారణకు చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆశావర్కర్లు, వలంటీర్లు వద్ద మలేరియాకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచామన్నారు. ఫైలేరియా నివారణకు సంబంధించి మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాదికి సంబంధించి ఈనెల 10న జరగాల్సి ఉండగా పుష్కరాల నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఐఇసి మెటీరియల్, మందులు సిద్ధంగా ఉంచామన్నారు.

ఒకే మంచంపై నలుగురికి వైద్య సేవలు
గజపతినగరం, ఆగస్టు 6: ఒకే మంచంపైన నలుగురు విద్యార్థులకు వైద్యసేవలు అందించాల్సిన దుస్థితి గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఇటీవల అంటువ్యాధులు, జ్వరాలు తీవ్రత పెరగడంతోపాటు ఆసుపత్రిలో కొంత భాగాన్ని కొత్త్భవనం నిర్మాణానికి పడగొట్టడంతో రోగుల సంఖ్యకు సరిపడా పడకలు లేవు. దీంతో వరండాలో బెడ్‌లు వేయడంతో అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆండ్ర ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభించడంతో రోగాలు తాకిడి ఎక్కువైంది. శనివారం ఆండ్ర ఆశ్రమ పాఠశాలకు చెందిన లక్ష్మణరావు, కోటయ్య, శ్యామ్, గణేష్ జ్వరాల బారిన పడడంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వార్డెన్ వచ్చి జాయిన్ చేసి వెళ్లిపోవడంతో విద్యార్థుల గురించి పట్టించుకునే నాథుడు కరవయ్యారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో నలుగురు విద్యార్థులకు కలిపి ఒకే మంచంపైన ఉంచి చికిత్స చేస్తున్నారు.