విజయనగరం

ఆనందగజపతిరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 16: మాజీమంత్రి, మాన్సాస్ మాజీ చైర్మన్ దివంగత ఆనంద గజపతిరాజు విగ్రహాన్ని ఆయన సోదరుడు, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మంగళవారం ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రేమసమాజం సంస్థ కార్యాలయ ఆవరణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గతంలో మాన్సాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపి దివంగత పి.వి.జి.రాజు ప్రేమసమాజం సంస్థ ఏర్పాటుకోసం 24 ఎకరాల భూమిని దానంగా ఇచ్చా రు. గజపతుల ధాతృత్వాన్ని విజయనగరం ప్రజలు చిరకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేమసమాజంలో ఆనందగజపతిరాజు విగ్రహాన్ని ఏర్పాటుచేశామని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బి.ఎస్.ఆర్.మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమసమాజంతో తనకున్న అనుబంధాన్ని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలో యోగా నేర్చుకునేందుకు ప్రేమసమాజానికి వచ్చేవాడినని తెలిపారు. అనాథలు, వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్న ప్రేమసమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రేమ సమాజం కార్యాలయంలో సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు తన ఎంపి నియోజకవర్గ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అశోక్‌గజపతిరాజు సతీమణి సునీల గజపతి, ఆనందగజపతిరాజు కూతురు ఊర్మిళ గజపతి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, మాజీ ఎంపి శంకరరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, ప్రేమసమాజం ఉపాధ్యక్షులు భాస్కరరావు, బలివాడ అప్పారావు, వెంకటప్రసాద్, కార్యదర్శి పెద్దింటి అప్పారావు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి చదురుగుడి ప్రాంగణంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మండపారాధనలను జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ చండీహోమం నిర్వహించారు. ప్రతినెల మూడవ మంగళవారం రోజున చండీహోమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని వేదపండితులు శంభర శంకరం తెలిపారు. చండీహోమాన్ని చేయడం వల్ల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖప్రధమైన జీవితాలను గడుపుతారని చెప్పారు. పదిమంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు చండీహోమాన్ని తిలకించారు.

పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మంగళవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేకువ జామున పంచామృతాభిషేకం అమ్మవారికి ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీచక్రార్చన పూజలు, స్వర్ణ పుష్పాలతో అర్చనలు జరిపారు. అమ్మవారికి సీతాఫలాలను నైవేధ్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మంగళవారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వెనుక ఉన్న బాలాలయంలోని చెక్క ప్రతిమలకు భక్తులు తమ స్వహస్తాలతో పసుపుకుంకుమలను రాసి పూజలు జరిపారు. ఆలయ అర్చకులు ఏడిది వెంకటరమణ, దూసి కృష్ణమూర్తి, మూలా పాపారావు పూజాదికాలు నిర్వహించారు.

వృక్ష సంపద వల్లే పర్యావరణ పరిరక్షణ
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: వృక్ష సంపద అధికంగా ఉన్నప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో మంగళవారం జొన్నగుడ్డి పురపాలక ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నా టే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను నరికివేస్తుండడం తో చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. అందువల్ల వర్షాలు కురుస్తున్నా వాతావరణంలో వేడిమి తగ్గడం లేదని, మొక్కలు నాటడంతోనే మన పని పూర్తికాదని, వాటిని సంరక్షించవల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. భవిష్యత్ త రాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలంటే మొ క్కలను విరివిగా నాటాలన్నారు. పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సభ్యులు 30 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హె రిటేజ్ గ్రూపు సభ్యుల కోరిక మేరకు పాఠశాలలో మున్సిపల్ కుళాయిని ఏర్పాటు చేయడానికి చైర్మన్ రామకృష్ణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్యవేణి, హెరిటేజ్ గ్రూపు సభ్యులు సూర్యలక్ష్మి, మంజుల, హరి, ప్రభాకర్ పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 16: కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులను నడపడంతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఒకవైపుపుష్కరాలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. విజయనగరం డిపో మీదుగా ప్రతీరోజూ వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కృష్ణా పుష్కరాలకు విజయనగరం రీజియన్ పరిధిలో అన్ని డిపోల నుంచి 100 బస్సులను కేటాయించడం వల్ల ప్రధాన రహదారులలో తిరిగే బస్సులను రద్దు చేశారు. ఫలితంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన రహదారులలో రెగ్యులర్‌గా తిరిగే బస్సులను పుష్కరాలకు కేటాయించడంతో ఆయా రూట్లలో బస్సుల కొరత ఏర్పడింది. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ బస్సులను పుష్కరాలకు కేటాయించడంవల్ల పాలకొండ, రాజాం, చీపురుపల్లి, శ్రీకాకుళం, బొబ్బిలి, పార్వతీపురం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నరకయాతనలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల రాకపోకలలో కోత విధించడం వల్ల చాలా గ్రామాలకు బస్సులు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సులను పుష్కరాలకు కేటాయించడం వల్ల ప్రయాణికులను ప్రైవేటువాహనదారులు నిలుపుదోపిడి చేస్తున్నారు. విజయనగరం నుంచి విశాఖపట్నం, గజపతినగరం, బొబ్బిలి, చీపురుపల్లి, రాజాం, శ్రీకాకుళం రూట్లలో తిరిగే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అనకాపల్లి, కొత్తవలస, సింహాచలం రూట్లలో కూడా తగిన్ని బస్సులు లేకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఛార్జీలను చెల్లించుకుని ప్రైవేటువాహనాలలో రాకపోకలు సాగించవల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

పాతూరి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 16: గ్రంథాలయ ఉద్యమనేత పాతూరి నాగభూషణం జీవితం యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.బాలకృష్ణ అన్నారు. పట్టణంలో కోట జంక్షన్ వద్ద పాతూరి శతజయంతి మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాతూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో గ్రంథాలయాలను స్థాపించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. గ్రంథాలయ ఉద్యమం కోసం పాతూరి అహర్నిశలు శ్రమించారని, గ్రంథాలయలు చైతన్య దీపికలని ఆనాడే పాతూరి గుర్తించారన్నారు. 1928లో తన స్వగ్రామంలో సేవాశ్రమాన్ని, జాతీయ విద్యాలయాన్ని ఏర్పాటుచేశారని, నిరక్షరాస్యత నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా శ్రీనివాస డిగ్రీ కళాశాలలో పాతూరి శతజయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాతూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో గ్రంథాలయ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథపఠనం అలవర్చుకోవాలని కోరారు. గ్రంథాలయ ఉద్యమనేత పాతూరి నాగభూషణం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యావంతుడిగా తయారుకావాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంఘాన్ని బలోపేతం చేసేందుకు యువతతోపాటు విద్యార్థులు నడుం బిగించాలన్నారు. స్థానిక ఆర్టీసీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పాతూరి శతజయంతి సభలో మండల కమిటీ కన్వీనర్ కె.దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ఏర్పాటులో యువత కీలకపాత్ర వహించాలన్నారు. వయోజన విద్య, గోసంరక్షణ, ప్రకృతి వైద్యం కోసం పాతూరి చేసిన కృషి చిరస్మీరణీయంగా నిలిచిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాగ్రంథాలయ నిర్వాహకుడు షణ్ముఖరావు పాల్గొన్నారు.

ఘనంగా గౌతులచ్చన్న జయంతి
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: తెలుగుభాషా సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్తగ్రహారంలోని మూతివారి పురపాలక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం గౌతులచ్చన్న జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్యవతి మాట్లాడుతూ గౌతులచ్చన్న తన జీవితకాలం బడుగు, బలహీన, అణగారిని వర్గాల ప్రజల కోసం అవిశ్రాంతం పోరాడిన వ్యక్తి అని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో లచ్చన్న పాల్గొన్నప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం ఆయన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా గెలిచి నిశ్వార్థంగా ప్రజలకు సేవ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆర్.బి.రామానాయుడు, పాఠశాల ఉపాధ్యాయుడు మురళి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

‘విద్యార్థులు విద్యారంగంలో రాణించాలి’
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: విద్యార్థులు విద్యారంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాయలసీమ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి జె.ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకరరావు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సౌకర్యాల కోసం చూడకుండా అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. పట్టుదలతో కష్టపడిచదివే ప్రతి విద్యార్థికి తగిన ఫలితం దక్కుతుందన్నారు. డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి ఉన్నత స్థానాలలో ఉన్న కొందరు విద్యుత్ సదుపాయాలు లేని ఇళ్లలో జన్మించి మారుమూల గ్రామాలలోని పాఠశాలల్లో చదివి ఉన్నత స్థితికి చేరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వెత్స సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

చేయిచేయి కలిపారు
* రహదారి నిర్మించారు
గజపతినగరం, ఆగస్టు 16: ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థులే చేయిచేయి కలిపి రహదారిని నిర్మించుకున్నారు. మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన ప్రజలు సుమారు లక్ష రూపాయలు సమకూర్చుకుని పాతబగ్గాం రోడ్డు నుండి బంగారమ్మపేట వరకు గ్రావెల్‌తో సుమారు కిలోమీటరున్నర రహదారిని శ్రమదానంతో నిర్మించుకున్నారు. పలుమార్లు రహదారి నిర్మించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు శ్రమదానంతో రహదారిని నిర్మించారు.
ప్రతిభా విద్యార్థులకు స్నేహ హస్తం చేయూత
గజపతినగరం, ఆగస్టు 16: ఈ ఏడాదిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ బాలుర, బాలికల హె స్కూల్ పేద విద్యార్థులకు స్నేహ హస్తం ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. బాలుర హైస్కూల్‌లో గంట్యాడ ప్రసాద్, గోక వెంకటేష్, బాలికల హైస్కూల్‌లో మీనా, ప్రీజికి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఏడాది మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.వి.బి. ఆచార్యులు, ఎం.జ్యోతి పాల్గొన్నారు.
వ్యాధులపై అప్రమత్తత అవసరం
గజపతినగరం, ఆగస్టు 16: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి స్రవంతి సూచించారు. మంగళవారం మండలంలోని వేమలి గ్రామంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 145 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. శిబిరంలో రక్తపరీక్ష, మధుమేహ పరీక్ష, బిపి పరీక్షలు జరిపారు.

‘పేదలకు వైద్యసేవలు సక్రమంగా అందాలి’
విజయనగరం(టౌన్), ఆగస్టు 16: జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం సక్రమంగా అందించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లాకేంద్ర ఆసుపత్రి వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఉషశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి భవనంలో హైఓల్టేజి సమస్యను పరిష్కరించడానికి చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు ప్రత్యేక వార్డు ఏర్పాటుపై చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ గౌరీశంకర్‌తో చర్చించారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని తనదృష్టికి తీసుకురావాలన్నారు. పేదలకు వైద్యం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు, అటెండంట్లకు మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

సరళీకృత ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె
* సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ

విజయనగరం(టౌన్), ఆగస్టు 16: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా కార్మికవర్గం సమస్యల్లోకి నెట్టబడిందని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి టివిరమణ అన్నారు. మంగళవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్‌లో విలేఖరుల సమావేశంలో సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తల పెట్టిన దేశవ్యాప్త సమ్మె వాల్‌పోస్టర్లను యూనియన్ నాయకులతో కలసి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందర వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను విస్మరించి సరళీకృత ఆర్ధిక విధానాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పారు. పెరిగిన ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనం రూ.18వేలు అమలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కనీసం ఒక పరిశ్రమ ఏర్పాటు కాలేదని, కానీ పలు పరిశ్రమలు మూతపడి వేలామంది కార్మికులు వీధిన పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. సమ్మె సందర్భంగా 18వ తేదీ వరకు కార్మికులు పనిచేసే సంస్ధలకు సమ్మె నోటీసులు అందచేస్తామని చెప్పారు. 27వతేదీన పని ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించి, 28వ తేదీనుండి మూడురోజులు జిల్లాలో ర్యాలీలు నిర్వహించి సమ్మెకు కార్మికవర్గాన్ని సిద్దం చేస్తామని వివరించారు. పక్షంరోజులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈసమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, నాయకులు జీవా, జగన్మోహన్, స్ట్ఫా వర్కర్స్‌యూనియన్ నాయకులు రాముపాల్గొన్నారు.

లైంగిక వేధింపుల కేసులో
ప్రసన్నకుమార్‌ను అరెస్టుచేయాలి
* రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
విజయనగరం(టౌన్), ఆగస్టు 16: మతం ముసుగులో అమాయక మైనర్ యువతులపై లైగింక వేధింపులకు పాల్పడిన బైబిల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాపరిషత్ మినిస్టీరియల్ భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. డెంకాడ మండలం మోదవలస బైబిల్ యూనివర్సిటీ ఘటన జరిగి మూడువారాలు దాటినా ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న బైబిల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రసన్నబాబును వెంటనే అరెస్టు చేసి యూనివర్సిటీ కార్యకలాపాలను మూసివేయించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సురేష్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శేషగిరి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు సుధారాణి, అంగన్ వాడీ వర్కర్స్‌యూనియన్ జిల్లా కార్యదర్శి కృష్ట, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సంఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. బైబిల్ వర్సిటీలో చోటుచేసుకున్న సంఘటనలపై బాధిత విద్యార్ధినులు, తల్లిదండ్రులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుచేసి మూడువారాలు దాటినా ఇంతవరకు యూనివర్సిటీ డైరెక్టర్ ఆచూకీ కనుగొనక పోవడంపై రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. జాప్యం కారణంగా కొంతమందిని తమకు అనుకూలంగా మలచుకుని సమస్యను నీరుగార్చేందుకు బైబిల్ వర్సిటీ ప్రయత్నిస్తుందని సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. మతం ముసుగులో జరుగుతున్న దురాగతాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయకపోతే పరిస్ధితులు ప్రమాదకరంగా మరతాయన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మూడునెలల్లో దీనిపై చర్యలు తీసుకుని విద్యార్థ్ధులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ ప్రదేశం జైలు మాదిరిగా ఉందని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్భయ చట్టంకింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు జగన్మోహన్ , ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి, ఇందిర పాల్గొన్నారు.

‘వృద్ధుల సమస్యలను పరిష్కరించాలి’
విజయనగరం(టౌన్), ఆగస్టు 16: వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెపి ఈశ్వర్ కోరారు. మంగళవారం వృద్ధుల డిమాండ్స్‌డే సందర్భంగా పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నల్లబ్యాడ్జీలు ధరించి వృద్ధులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ వృద్ధుల రక్షణకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగలు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్, ఇళ్లల్లోకి చొరబడి సొత్తు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎటిఎంల వద్ద వృద్ధుల దృష్టి మరల్చి డబ్బు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సుల్లో 50శాతం మేరకు వృద్ధులకు రాయితీ కల్పించాలని కోరారు. వృద్ధుల సంక్షేమానికి తగినంత సిబ్బందిని వయోవృద్ధుల సంక్షేమ శాఖలో నియమించాలని చెప్పారు. జిల్లా కేంద్రంలో 150 పడకల వృద్ధాశ్రమం, టిటిడిలోప్రత్యేకకౌంటర్, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యాదర్శి పైడితల్లి, కోశాధికారి అప్పారావు పాల్గొన్నారు.

18న జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు
విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.స్వప్న హైందవి అన్నారు. మంగళవారం కళాశాలలో పోటీల వివరాలను వెల్లడించారు. వ్యాసరచన పోటీలలో డిగ్రీ విద్యార్థులు ‘సంస్కృత భాషా ప్రాశస్త్యం’ ఇంటర్ విద్యార్థులు ‘నిత్య జీవితంలో సంస్కృతం’ ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు సంస్కృత నీతిశ్లోకాలు, వాటి భావాలు అనే అంశాలపై రచనలు చేయాలని చెప్పారు. వక్తృత్వ పోటీలలో డిగ్రీ విద్యార్థులు ‘దేశాభివృద్ధిలో సంస్కృత భాష’ ఇంటర్ విద్యార్థులు ‘సంస్కృత కవులు, వారి రచనలు’ ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు గణేష్ పంచరత్న శ్లోకాలు మొదలైన అంశాలపై ప్రసంగించాలన్నారు. 18వ తేదీ ఉదయం సంస్కృత కళాశాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

గ్రంథాలయ పితామహుడు పాతూరి

విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 16: గ్రంథాలయ శాస్త్ర వాజ్ఞయ పితామహుడు పాతూరి నాగభూషణం అని ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎస్.వి.ఆర్. ఎం.రాజు అన్నారు. పాతూరి జయంతిని పురస్కరించుకుని మంగళవారం కార్యాలయంలో పట్టణ శాఖ ప్రచురించిన పాతూరి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విద్యాశాఖ నుండి పౌర గ్రంథాలయాలను విడదీసి ప్రధాన శాఖగా ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారని, గుంటూరు జిల్లాలో ప్రయాణించేవారికి బోటు గ్రంథాలయాలను పాతూరి ఏర్పాటు చేశారన్నారు. సంఘం పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రసాద్, సుభద్ర పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

గరివిడి, ఆగస్టు 16: మండలం కొండపాలెం మేజరు పంచాయతీ పరిధిలో బండి నందు(25) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నందు మృతదేహాన్ని గరివిడి శివారు చింతపల్లిపేట సమీపంలో రైలుపట్టాలపై నుజ్జునుజ్జుయిన స్థితిలో కనుగొన్నారు. నందును భర్త, కుటుంబ సభ్యులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలు తల్లి వడ్డాది రాములమ్మ ఆరోపించారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు. కొండపాలెం పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న బండి హేమంత్‌తో బొబ్బిలికి చెందిన నందుకి ఐదేళ్లు క్రితం వివాహం జరిగిందని, వీరికి పిల్లలకు కలగకపోవడంతో తరచూ వేధిస్తుండేవారని మృతురాలు కుటుంబీకులు ఆరోపించారు.