వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు అయిదేళ్ల గౌతమికి పుట్టెడు జ్వరం. ఒళ్లు తెలియకుండా ఎగిరెగిరి పడుతోంది. చుట్టూ భయంకరారణ్యాలు, గుట్టలు వుండే ఆ పల్లెకి వైద్య సౌకర్యాలు గానీ, ప్రయాణ సౌకర్యాలుగానీ ప్రయాణ సౌకర్యాలు గానీ అప్పట్లో లేవు. మరీ అవసరమైతే ఎడ్లబళ్ల మీద గానీ, డోలీల్లో గానీ పక్కగా వున్న పట్నానికి తీసికెళ్లి వైద్యం చేయించుకుంటారు. ఏదైనా బండి దొరక్కపోతుందా అన్న ఆశతో బిడ్డని తీసుకుని కిందికొస్తూండగానే, ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో ప్రళయం వచ్చేలా మారిపోయింది వాతావరణం. అందువల్ల ఎవరూ బండి కట్టడానికి ముందుకు రాలేదు. దాదాపు స్పృహ లేనట్టున్న బిడ్డని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు ఆ దంపతులకి. అలాంటి సమయంలో, ఓ జీప్ డ్రైవర్ పట్నంలో వున్న యజమానిని తీసుకు రావడానికి వెళ్తూ వాళ్ల పరిస్థితి చూసి చలించి వాళ్లని పట్నం తీసికెళ్లడానికి ముందుకొచ్చాడు. భగవంతుడే ఆ డ్రైవర్ రూపంలో వచ్చాడనుకున్న ఆ దంపతులు అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని జీపులో కూర్చున్నారు. జీపు కదిలింది. పది గజాలు వెళ్లిందో లేదో హఠాత్తుగా కుంభవృష్టి మొదలయింది. మహావృక్షాలు కూలిపోతామని బెదిరిస్తున్నట్టు ఊగిపోతున్నాయి. గౌతమి మరణవేదనతో ఎగిరెగిరి పడిపోతోంది. అతిప్రయాసగా సగం దూరం వెళ్లిన జీప్ ఇంక కదలనని ఠక్కున ఆగిపోయింది. వానా ఆగిపోయింది. మహావృక్షాలు కూలి జీప్ మీద ఎక్కడ పడతాయో అని కాస్త ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి శంకరయ్య సహాయంతో జీప్‌ని తరలించాడు డ్రైవర్. కూతురు పడే బాధ చూడలేక ఆ పిల్లని ఎత్తుకుని కిందికి దిగింది శంకరయ్య భార్య దుర్గ. కూతురి మీద ఆశ వదులుకున్న శంకరయ్య ఆమె పక్కనే కూలబడ్డాడు. బైట వుండడం అంత క్షేమం కాదని డ్రైవర్ హెచ్చరించినా ఆ దంపతులు కదల్లేదు. అప్పుడే భూమి దద్దరిల్లేలా ఉరమడం, పక్కనే వున్న కొండ మీది నించి ఓ పెద్ద రాయి దొర్లుకుంటూ జీపు మీద పడడం, డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తూ నెత్తురు మడుగులో పడి మరణించడం క్షణాల్లో జరిగిపోయింది. జరిగిన దారుణం చూసిన దుర్గ కెవ్వుమంటూ పడి స్పృహ కోల్పోయింది. శంకరయ్యకి దిక్కుతోచలేదు. ఆ జీపులో తాము లేనందుకు క్షణం తేలిగ్గా ఊపిరి తీసుకున్నా డ్రైవర్ మృతికి, కూతురి పరిస్థితికి వణికిపోయాడు. అప్పుడే పులి మీద పుట్రలా ఓ భయంకరమైన సింహం గౌతమి మీద పడి ఈడ్చుకుపోయింది. ఆర్తనాదాలు చేస్తూ దానివెంట పరిగెత్తాడు శంకరయ్య. మరో క్షణంలో గౌతమి ఆ సింహానికి ఆహారంగా అయిపోయేదే. కానీ అప్పుడే బలాఢ్యుడైన ఒక ఆటవికుడు గన్‌తో దాని కాలు మీద కాల్చడంతో, సింహం గౌతమిని వదిలేసి పారిపోయింది. తర్వాత ఆటవికుడు శంకరయ్య కేసి తీక్షణంగా చూస్తూ ఏదో అనబోయిన వాడల్లా, గౌతమి పరిస్థితి చూసి, రెండు చేతులూ కలిపి నోటి దగ్గర పెట్టుకుని పెద్దగా అరిచాడు. అంతే బిలబిలలాడుతూ కొంతమంది ఆటవికులు వచ్చేశారు. యజమాని ఆజ్ఞ ప్రకారం గాయపడిన గౌతమిని, స్పృహలేని దుర్గని ఎత్తుకుని అడవి మధ్యలో వున్న ఓ గుహలోకి చేర్చారు. విషయం విని అక్కడి ఆడవాళ్లు వాళ్ల శుశ్రూషలు చేసి, అడవి పసర్లు వాడి గాయాలకి ఏవో చెట్ల బంక తీసి రాసి ప్రథమ వైద్యం చేశారు. వాళ్లు స్పృహలోకి రాగానే, బలవంతంగా వాళ్ల చేత ఆహారం తినిపించారు. వారి వనమూలికలతో గౌతమికి ప్రాణ గండం తప్పింది. అలా అని వాళ్లు వదల్లేదు. మూడు రోజులు అతిథుల్లా చూసి వాళ్లని మామూలు మనుషులుగా చేశారా ఆటవికులు. తర్వాత శంకరయ్యకేసి తీక్షణంగా చూస్తూ వాళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నాడు, దొరగా పిలవబడే ఆటవికుడు. అతని మాటల్లోని కాఠిన్యాన్ని, ఎర్రబారిన అతని కళ్లని చూసిన గౌతమి భయంతో వణికిపోతూ బావురుమంది. అక్కడే వున్న పది పనె్నండేళ్ల కుర్రాడు ఆమె దగ్గరకొచ్చి హాయిగా నవ్వుతూ-
‘గౌతమీ! మీరేం కంగారుపడకండి. ఈయన మా మామే. మాట అలా ఉంటుంది గానీ చాలా మంచివాడు. నా పేరు జింబో. ఇది మా మామ కూతురు చిన్ని. అన్నట్టు మా మామ పేరు చెప్పలేదు కదూ. ఆయన పేరు బ్లాక్ టైగర్. అందరూ...’
‘జింబో!’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు దొర, అతని మాట పూర్తి కాకుండానే. జింబో బిత్తరపోయాడు. ‘బ్లాక్‌టైగర్’ అన్న పేరు వినగానే, శంకరయ్య దంపతులకి వణుకొచ్చేసింది.
‘చూడు పంతులూ! నీ మాటలు నేను నమ్మాను. నువ్వు గుట్ట మీది అమ్మవార్ని నమ్ముకుని బతికేవాడివి. నేనూ ఆ తల్లి భక్తుణ్నే. ఏదో తెలియక దారితప్పి బైటివారెవరూ అడుగుపెట్టని ఈ అడవిలో ప్రవేశించావ్. నీ బిడ్డని బతికించుకున్నావ్. మాకున్నంతలో మీకు అండగా ఉండి ఓ పసి ప్రాణాన్ని నిలిపామన్న తృప్తితో వున్నాం. ఆ తృప్తి, కృతజ్ఞత నీకూ వుంటే, ఈ సంఘటనని పూర్తిగా మర్చిపో. నా పేరుగానీ, నా స్థావరం గురించి గానీ నీ నోటంట రాకూడదు’ అన్నాడు దొరగా పిలవబడే బ్లాక్‌టైగర్. శంకరయ్య కదిలిపోయాడు.
‘దొరా! మీరు బతికించింది నా బిడ్డనే కాదు. మా కుటుంబాన్ని. అలాంటి దేవుడికి అపకారం చేసేటంత దుర్మార్గుణ్ని కాదు. మీపట్ల కృతజ్ఞతా భావం మా అందరి గుండెల్లోనూ పదిలంగా ఉంటుంది. నువ్వు నిండు నూరేళ్లూ చల్లగా వుండాలని ఆ మాతకి పూజలు చేస్తాను. నన్ను నమ్ము’ అంటూ వాగ్దానం చేశాడు, శంకరయ్య చేతులు జోడించి మరీ.
దొర మొహం ప్రసన్నంగా అయిపోయింది.
‘వద్దు సామీ! మీరు మాకు మొక్కకూడదు. దీవించాలి’ అన్నాడు శంకరయ్య పాదాలంటి నమస్కరిస్తూ. తర్వాత తన మనుషుల్నే తోడిచ్చి శంకరయ్య కుటుంబాన్ని గుట్టమీదికి క్షేమంగా చేర్చాడు. జింబో, అయిదేళ్ల చిన్నారి చిన్ని ఇచ్చిన పూసల దండలు, నెమలి ఈకలు చూసుకుని మురిసిపోయింది గౌతమి.
* * *
తండ్రి చెప్పిన సంఘటనలు విన్న గౌతమి ఒళ్లు జలదరించింది. ఏనాడో జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది.
‘నేను చేసింది తప్పా గౌతమీ!’ దీనంగా అన్నాడు శంకరయ్య.
‘లేదు నాన్నా! విశ్వాసంగల మనిషి చేసేదే నువ్వూ చేశావ్. కానీ ఉచ్చు మన మెడకి పడింది’
‘కానీ నేనిదంతా ఊహించలేదమ్మా! ఆనాటి తర్వాత అతను నాకు మళ్లీ కనిపించలేదు. దేవీ భక్తుడైన అతనికి ఈ వయసులో ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో?’ బాధగా అన్నాడు శంకరయ్య.
తండ్రి మొహంలోని బాధ చూసి గిలగిల్లాడిపోయింది గౌతమి. ‘నువ్వేం బాధపడకు నాన్నా! మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆ బ్లాక్ టైగర్‌కన్నా ఈ ప్రయాగ గారూ వాళ్లని గురించే నాకు భయంగా ఉంది. అయినా ఎవరూ మనల్ని దోషులుగా నిరూపించలేరు. ఎలాగైనా అడవిలో వున్న ఆ నగలు ఇక్కడికి చేరే మార్గం ఆలోచిస్తున్నాను. నువ్వెళ్లి నిశ్చింతగా పడుకో’ అంది అనునయంగా. శంకరయ్య మొహం కాస్త తేరుకుంది. బ్లాక్‌టైగర్ని గురించి కూతురికి చెప్పడంతో మనసు కూడా తేలికైంది.
‘నాకిప్పుడెంతో హాయిగా ఉందమ్మా! ఎలాగైనా ఆ నగలు దొరికితే, నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ల నోళ్లూ మూతపడతాయి. ఆఁ! అన్నట్టు ఎన్ని పన్లున్నా నువ్వు మాత్రం అనిల్ దగ్గరకెళ్లి, క్లినిక్‌లో అతనికి సహాయం చెయ్యడం మాత్రం మానకు. అతను నీక్కాబోయే భర్త. నాకోసం కంగారుపడి పరిగెత్తుకు రాకు. నాకేం భయంలేదు. చంద్రయ్యే నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’ అన్నాడు ఉత్సాహంగా.
‘్భజనమైనా మానేస్తాను గానీ.. అనిల్ దగ్గరకెళ్లడం మానేస్తానా?’ నవ్వింది గౌతమి.
ఆయన తృప్తిగా లేచి పక్కమీద వాలాడు.
* * *
పది రోజులు గడిచిపోయాయి. తన పనులన్నీ చూసి కూతురు అనిల్ దగ్గరికెళ్లి అతని క్లినిక్‌లో పని చెయ్యడం శంకరయ్యకి చాలా తృప్తిగా ఉంది. ‘ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో, ఈలోగా వాళ్లిద్దర్నీ ఒకటి చేసేస్తే ఇంక తనేమైపోయినా పరవాలేదు’ అనుకున్నాడు మరోసారి.
ఆ రోజు నిండు పౌర్ణమి. వెనె్నల పుచ్చపువ్వులా వెలిగిపోతోంది. రాత్రి పనె్నండు గంటలయింది. శంకరయ్య, గౌతమి మంచి నిద్రలో ఉన్నారు. చంద్రయ్య బైట తన కోసం కేటాయించిన గదిలో పడుకుని సన్నగా ఏవో పదాలు పాడుకుంటున్నాడు. హఠాత్తుగా అతని పదాలు ఆగిపోయాయి. బైట ఎవరో వస్తున్న అలికిడి.
క్షణం ఆలోచించకుండా గభాల్న లేచి గన్ తీసుకున్నాడు. తలుపు తట్టిన శబ్దం కావడంతో మొండి ధైర్యంతో తలుపు తీశాడు. ఎదురుగా బలాఢ్యుడైన ఓ వృద్ధ ఆటవికుడు మిషన్‌గన్ పట్టుకుని అతనికేసి తీక్షణంగా చూస్తున్నాడు. చంద్రయ్య మనసులో కాస్త భయపడినా బైటపడకుండా ‘ఎవర్నువ్వు?’ అన్నాడు గన్ స్టడీగా పట్టుకుని. అతను క్రూరంగా చూస్తూ-
‘నీ పాలిట యముణ్ని! ఇద్దరు భీముడిలాంటి సెక్యూరిటీలని కాల్చి చంపినా ఇంకా బుద్ధి రాలేదా? నా తొడంత లేవు. నువ్వు సెక్యూరిటీవా ఈ గుడికి? ఎన్నిసార్లు హెచ్చరించినా నగల గురించి పరిశోధనలు ఆపలేదు. ఈ బ్లాక్ టైగర్‌నే సవాల్ చేస్తారా? నిన్నూ చంపితేగానీ ఆ పోలీసులకి, ఆ పి.ఎం.కీ బుద్ధి రాదు’ అంటూ మిషన్‌గన్ అతనికేసి గురి పెట్టాడు. చంద్రయ్య మొహంలో భీతి తొంగి చూసింది. తనని తాను కాపాడుకోవడం కోసం తనూ గన్ పట్టుకుని-
‘ఎవర్నువ్వు? నన్ను చంపితే మరొకడొస్తాడు. ఎంతమందిని చంపుతావ్?! ముందు నువ్వెవరో నిజం చెప్పు’ అన్నాడు నిర్భయంగానే.
‘నేనెవర్నయితే నీకెందుకురా?’ అంటూండగానే చంద్రయ్య గన్ పేల్చేశాడు. ఆ శబ్దానికి తుళ్లిపడి లేచి కంగారు లైట్లేసి తలుపు తీశారు గౌతమి, శంకరయ్య. చంద్రయ్య అంత ధైర్యం చేస్తాడని ఊహించని ఆటవికుడు జబ్బకైన గాయాన్ని చూసుకుని మండిపడుతూ విచక్షణా రహితంగా గన్ పేల్చేసి, అతను పోయాడనుకుని, లైట్లు వెలగడంతో క్షణాల్లో మాయమై పోయాడు. అయితే చంద్రయ్య చనిపోలేదు. అదృష్టవశాత్తూ బుల్లెట్స్ అతని కాళ్లకీ జబ్బలకీ తగిలి నెత్తురు మడుగులో పడిపోయాడు. బైటికొచ్చి అతని పరిస్థితి చూసిన గౌతమి హడలిపోయింది. తండ్రి సాయంతో అతన్ని లోపలికి తీసికెళ్లి వున్న మందులతోనూ, ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనూ అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్లన్నీ తీసేసి కట్టు కట్టింది. శవాకారంలో పడున్న అతన్ని చూస్తుంటే దుఃఖం వచ్చింది ఆ తండ్రీ కూతుళ్లకి.
తెల్లవారుతుండగా చంద్రయ్య కళ్లు తెరిచాడు. గౌతమిని చూసి పసివాడిలా బావురుమన్నాడు.
‘నీకేం భయంలేదు చంద్రయ్యా! నువ్వు ధైర్యస్థుడివి. సమయస్ఫూర్తి కలవాడివి కాబట్టి ఆ కిరాతకుడి నించి ప్రాణాలతో బైటపడ్డావ్. రేపు ప్రయాగ గారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నువ్వేం కంగారుపడకు. అన్నట్టు.. నువ్వతన్ని మళ్లీ చూస్తే గుర్తుపట్టగలవా?’ అంది గౌతమి. అతని కళ్లు వింతగా మెరిశాయి. భయం మాయమై ధైర్యం వచ్చేసింది.
‘గుర్తు పట్టగలను’ అంటూ మెల్లగా కొన్ని గుర్తులు చెప్పాడు.
‘సరే. నువ్వు రెస్ట్ తీసుకో. పూర్తిగా తెల్లవారాక ప్రయాగ గారిని కన్సల్ట్ చేసి అవసరం అయితే హాస్పిటల్‌లో చేర్పిస్తాం.’
‘అవసరం లేదమ్మా! ఆ గుళ్లోని దేవతే మీ రూపంలో వచ్చి కాపాడింది. మీ దగ్గరుండగా ఇంక ననె్నవరూ ఏమీ చేయలేరు’ అంటూ ఆ తండ్రీ కూతుళ్లకి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు చంద్రయ్య.
‘అలా అనకు. మనందర్నీ కాపాడేది ఆ దైవమే!’ అంటూ అతనికి మరింత ధైర్యం చెప్పి తన పనిలో పడిపోయింది గౌతమి.
శంకరయ్య మాత్రం ఏదో దీర్ఘాలోచనలో పడిపోయాడు.
కాస్త పొద్దెక్కింతర్వాత ప్రయాగకి ఫోన్ చేసి వెళ్లి కలిసి జరిగిందంతా చెప్పింది గౌతమి. అతను కుతూహలంగా విని-
‘ఆ బ్లాక్ టైగర్ అడవిని వదిలి కొండమీదికొస్తాడా? ఆ చంద్రయ్యని హాస్పిటల్‌లో చూపిద్దాం. కానీ మీరీ విషయాన్ని బైటకి రానివ్వద్దు. చంద్రయ్యతో నేను మాట్లాడతాను. ఏది ఏమైనా శ్రమ తీసుకుని విషయం చెప్పినందుకు థాంక్స్’ అంటూ నవ్వాడు ప్రయాగ.
గతుక్కుమన్నట్టు చూసింది గౌతమి. తర్వాత వుసూరుమంటూ లేచింది.
* * *
ప్రయాగ మాట ప్రకారం చంద్రయ్య విషయం గోప్యంగా వుంచినా, ఎలా తెలిసిందో తుపానులా వచ్చిపడ్డాడు ధర్మారావు. ‘నేను విన్నది నిజమేనా?’ అంటూ అతన్ని చూసి కంగారుపడినా తేరుకుని ఆహ్వానించారు శంకరయ్య, గౌతమి.
‘ఆ బ్లాక్ టైగర్ వచ్చి చంద్రయ్యని కాల్చేశాట్టగా. విషయం నాకు మాట మాత్రం చెప్పలేదేవిటయ్యా పంతులూ’ ధర్మారావు గొంతులో ఆగ్రహం తప్ప గౌరవం కాస్తయినా లేదు. అయినా పట్టించుకోకుండా-
‘్ఛ! ఎక్కడో అడవిలో అజ్ఞాతంగా వుండే బ్లాక్ టైగర్ ఇక్కడికి రావడం ఏవిటి ధర్మారావుగారూ?’ అన్నాడు శంకరయ్య తేలిగ్గా.
‘అంటే చంద్రయ్య అబద్ధం చెప్పాడంటారా?’ ధర్మారావు గొంతులోకి మరింత తీక్షణత వచ్చేసింది.
‘అబద్ధం చెప్పడం కాదు. అతను అందరిలాగే ఏనాడూ బ్లాక్‌టైగర్‌ని చూడలేదు. ఆటవికుడు వచ్చి బెదిరించేసరికి బ్లాక్‌టైగర్ అనుకునుంటాడు. నిజంగానే ఆ బ్లాక్ టైగర్ అయితే చంద్రయ్య బతికి బైట పడేవాడా?’
‘అయ్యో పంతులూ! ఈ దోపిడీ కచ్చితంగా ఆ టైగరే చేయించాడయ్యా! వాడికి తప్ప అంత ధైర్యం ఎవరికుంది. ఇలా వూరుకుంటే రేపు మీ మీద కూడా దాడి చెయ్యచ్చు. నా మాట విని గుట్టమీది నించి కొన్నాళ్లపాటు కిందికెళ్లి ఉండండి. ఏ గుడి పూజారో పగలు అర్చనలు చేసి పోతాడు. అయినా ఇంకా ఏముందని ఆ టైగర్ గుట్ట చుట్టూ తిరుగుతాడు’ అదోలా నిట్టూరుస్తూ అన్నాడు ధర్మారావు.
‘మాకా భగవంతుడే ఉన్నాడు ధర్మారావుగారూ. దోపిడీ బ్లాక్‌టైగర్ చెయ్యలేదనే మాకూ అనిపిస్తోంది. ఆ మాట మేమే కాదు ఆ ప్రయాగ గారు కూడా అదే అంటున్నారు’ అంది గౌతమి.
‘ప్రయాగగారా?’
‘అవును. విషయం ఆయనకి చెప్పాం. ఆయన వచ్చి చంద్రయ్యతో మాట్లాడారు కూడా. ఎవరో దుర్మార్గులు బ్లాక్‌టైగర్ పేరుతో ఈ దారుణాలు చేస్తున్నారని ఆయన నమ్మకం’
ఆలోచనలో పడిపోయాడు ధర్మారావు.
‘మీరేం కంగారుపడకండి ధర్మారావుగారూ! ప్రయాగ గారు చాలా పట్టుగల మనిషి. దోషుల్ని ఓ పట్టాన వదలరు. అవసరం అయితే సరాసరి ఆ అడవిలోకెళ్లి ఆ బ్లాక్ టైగర్ని బంధించి ఈడ్చుకొస్తారు. మాకూ ఆత్మరక్షణ కోసం రివాల్వర్ కూడా ఇచ్చారుగా. మీరు నిశ్చింతగా ఉండండి.’ అంది గౌతమి. మరి మాట్లాడలేదు ధర్మారావు. కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన పది నిమిషాలకల్లా వచ్చి పడ్డాడు కాంతారావు.
‘ఏవిటీ... ఆ బ్లాక్ టైగర్ చంద్రయ్యని కాల్చేశాట్టగా’ అంటూ.
‘వచ్చింది ఎవరో ఆటవికుడు. ఆ బ్లాక్ టైగర్ కాదు. అయినా ఈ విషయం మీకెలా తెలిసింది?’ మనసులో చిరాకు పడుతూనే ఆశ్చర్యం నటించింది గౌతమి.
‘నాకేవిటి.. లోకమంతా తెలిసిపోయింది. వచ్చింది కచ్చితంగా ఈ దోపిడీ ఆ బ్లాక్ టైగరే చేశాడు. ఇంకా నిధులేమైనా వున్నాయేమో అని వచ్చుంటాడు. వాడు మీమీద కూడా దాడి చెయ్యచ్చు. ఆయుధం వున్న చంద్రయ్య ఏం చెయ్యిగలిగాడు. అందుకే నా మాట విని...’
‘మా గురించి మీరు బెంగ పడకండి కాంతారావుగారూ! ఇంకా ఏ నిధులున్నాయని వాళ్ల తాపత్రయం? జరిగిన దోపిడీని గురించి ఆపించెయ్యాలని ఆ దుర్మార్గుల పథకం’ అతని మాట పూర్తి కాకుండానే గంభీరంగా అంది గౌతమి. కాంతారావు ఇంకేం మాట్లాడలేక ఏదో గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. శంకరయ్య గౌతమీ కళ్లతోనే ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత ఓ నిశ్చయానికొచ్చారు.
ఆ రాత్రి పనె్నండింటి దాకా మెలకువగా ఉండి, తర్వాత లేచారు. గౌతమి ఓ పెద్ద బేగ్ పట్టుకుని-
‘పనె్నండు దాటింది నాన్నా! ఇంక వెళ్దామా?’ అంది మెల్లగా. ఆయన అంగీకారంగా తలపంకించాడు. ఓసారి పరిసరాలు పరికించి, బ్యాగ్‌తోనూ, గన్‌తోనూ బైటికొచ్చి ఆలయం తలుపులు తీసి లోపలికెళ్లి మళ్లీ తలుపులు మూసి, అక్కడే వున్న ఓ పవర్‌ఫుల్ టార్చ్ తీసుకుని నగలు భద్రపరచిన చోటికెళ్లారు. నగలున్న పెట్టెని తెరిచాడు శంకరయ్య. వజ్రాలు పొదిగిన ఆ అమూల్య ఆభరణాలు చూడగానే కళ్లు తిరిగినంత పనయింది గౌతమికి. ఇంత నిధిని దొంగల పాలవకుండా కాపాడిన తండ్రి మీద మరింత ప్రేమ పెరిగింది. ఆ ఆభరణాలన్నీ బేగ్‌లోకి మార్చి, అక్కడివన్నీ యధాప్రకారంగా సర్దేసి, నగలతోనూ, నగలు తీసిన ఖాళీ పెట్టెతోనూ బైటికొచ్చి పరిసరాలు పరికించి ఖాళీ పెట్టెని కాస్త అవతలగా వున్న లోయలో పడేసింది గౌతమి. శంకరయ్య గుడి తలుపులు యధాప్రకారంగా లాక్ చేసేశాడు. మళ్లీ ఓసారి పరిసరాలు పరికించి ఎవరూ గమనించలేదన్న నమ్మకం కుదిరాక, గుడి వెనక వున్న పల్లంకేసి నడిచారా తండ్రీ కూతుళ్లు. ఇద్దరి మొహాల్లోనూ ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గంట తర్వాత టార్చ్‌లైట్ గుళ్లో పెట్టేసి ఇంట్లోకొచ్చి తేలిగ్గా ఊపిరి తీసుకుని పక్కలు చేరారు.
* * *
ఆ రోజు చంద్ర తన బంగ్లాలోనే రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆలయ నిధి దోచిన వాళ్లెవరో కనిపెట్టలేక పోవడం అతనికి సిగ్గుగా ఉంది. అందుకే పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని అఫిషియల్స్‌తో చర్చించాలని నిర్ణయించుకుని ఆ ఏర్పాటు చేశాడు. చంద్రయ్య మీద దాడి చెయ్యడంతో మరింత అయోమయ స్థితిలో పడి ప్రభుతో సంప్రదించి మరీ అఫిషియల్స్‌ని పిలిపించాడు. ఐజి, డిఐజిలతో కూడా విషయం రహస్యంగానే ఉంచాలని హెచ్చరించాడు. మునుపటి ఎస్.పి, సిబిఐ ఆఫీసర్ ప్రయాగ, ప్రభూ వాళ్లు అరగంట ముందే వచ్చేశారు. మిగతా వాళ్లు రాగానే, ముందుగా చంద్రయ్య మీది హత్యా ప్రయత్నం గురించి మాట్లాడుకున్నారు. కొందరు బ్లాక్ టైగర్ పనే అనీ, మరి కొందరు అడవి చుట్టుపక్కల వాళ్ల పనై ఉంటుందనీ, కాదు ఆ పూజారి పనే అనీ రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఎలాంటి విలువైన ఆభరణాలు లేని ఆలయం కేసి ఎందుకొస్తున్నారో ఎవరూ చెప్పలేక పోయారు. ‘ఆభరణాలు లేకపోతేనేం, గుడి లోపల గోడలకి, తలుపులకి తాపడం చేసిన వజ్రాల కోసం వచ్చి ఉండొచ్చు’ అన్నాడొకతను.
‘కానీ అందరికీ ఆ బ్లాక్ టైగర్ మీదే అనుమానంగా ఉంది. తగిన ఆధారాలూ వున్నాయి, ఇదే మాట పేపర్లూ, ప్రతిపక్షాలూ బల్లగుద్దినట్టు చెప్తున్నాయి. అదే నిజమైతే ఆ టైగర్ని పట్టుకోవడం ఎలా? ఏ పద్ధతిలో దాడి చేస్తే వాడు దొరుకుతాడు. దొరికినా మన నిధులు మనకి దొరుకుతాయా?’ తపనగా అన్నాడు చంద్ర.
‘సారీ సర్. ఈ మాటలతో నేను ఏకీభవించను’ అన్నాడు ప్రయాగ. అందరూ కుతూహలంగా అతనికేసి చూశారు.
‘అంటే.. ఆ టైగర్ని మనం పట్టుకోలేం అంటారా?’ అన్నాడు సి.ఎం. చంద్ర.
‘అసలా టైగర్‌కీ, ఈ దోపిడీకీ సంబంధం వుందనుకోను’ అన్నాడు ప్రయాగ స్థిర స్వరంతో.
‘కానీ ఇంత సాహసం ఎవరు చేస్తారు?’
‘చెప్తాను. మిస్టర్ ప్రభూ! డాక్టర్ గౌతమి గురించి మీ అభిప్రాయం ఏవిటి?’ ప్రభుకేసి చూస్తూ అన్నాడు ప్రయాగ.
‘నాకు మాత్రం ఏం తెలుసు? కానీ ఆవిడ మాటలు వింటే సదభిప్రాయమే కలిగింది. అంతేకాదు - దేశమన్నా, ముఖ్యంగా మన రాష్టమ్రన్నా ఆమెకి అంతులేని అభిమానమనీ, సాహసం ఆమె వూపిరనీ ఎవరో అనగా విన్నాను. ఆమె మాటలు మీరు కూడా విన్నారుగా. మీకు సదభిప్రాయం కలుగలేదా?’ కాస్త మెల్లగా అన్నాడు ప్రభు. దానికి పెద్దగా నవ్వాడు ప్రయాగ.
‘సారీ. సదభిప్రాయం మాటటుంచండి. అసలా దోపిడీ ఆమె, ఆమె తండ్రీ కలిసే చేశారని నా అనుమానం. కాదు.. నమ్మకం. వాళ్లు కనిపించేటంత మంచివాళ్లు కాదు’ అన్నాడు ప్రయాగ ఏదో ఆలోచిస్తూ.
‘నా అనుమానం అదే సర్. కానీ ఎన్ని విధాలుగా అడిగినా వాళ్లు చెప్పడం లేదు. వాళ్లేం చేశారనడానికి ఆధారాలూ లేవు. ఏం చెయ్యగలం?’ అన్నాడు ఎస్.పి. నిరాశగా.
‘ఆధారాలు లేకపోతేనేం. నాలుగు తగిలిస్తే వాళ్ల నోటి నించే ఆధారాలన్నీ బైటికొస్తాయి’ ఆవేశంగా అన్నాడో ఆఫీసర్.
‘తొందరపడకండి. ఏం చేసినా ఆలోచించి మరీ చెయ్యాలి. ఇప్పటికే చాలామంది మన గురించి ఏవేవో పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తున్నారు’ అన్నాడు చంద్ర.
‘అలాగే సర్’ అనేశాడతను.
‘మిస్టర్ ప్రభు ఏం మాట్లాడ్డలేదేవిటి?’ అన్నాడు ప్రయాగ. ప్రభు ఆవేశంగా ఏదో అనబోయి చంద్ర కనుసైగ చూసి-
‘పోలీసు డిపార్ట్‌మెంట్ వాళ్లు మీకు తెలియనివి నాకేం తెలుస్తాయి సార్!’ అనేశాడు బలవంతంగా నవ్వుతూ.
‘కేసు మొదట్నించీ మీరూ చూస్తున్నారుగా. మీకు ఆ పూజారిగారూ వాళ్ల మీద మీకనుమానం లేదా?’ ఓరగా చూస్తూ అన్నాడు.
‘లేదు. వాళ్లే దొంగలైతే తమరి సెక్యూరిటీగా వున్న చంద్రయ్యని కూడా చంపాలని ప్రయత్నిస్తారా? అదీగాక, మిషన్ గన్స్ వాళ్ల దగ్గరుంటాయనుకోను’ అన్నాడు ప్రభు గంభీరంగా.
‘ఓ! మే బీ రాంగ్’ నవ్వేశాడు ప్రయాగ. తర్వాత ఎన్నో పథకాలు వేసుకుని రెండు గంటల తర్వాత తృప్తిగా లేచారంతా.
* * *
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్