వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలోని ఇతర పనులన్నీ సవ్యంగా, సక్రమంగా జరిగిపోతున్నాయి. అడవి చుట్టూ అనుమానం వున్న ప్రతిచోటా పోలీసులు పహారా కాస్తూనే వున్నారు. కానీ అమ్మవారి నగల గురించి గానీ, దొంగల గురించి గానీ, ప్రభూ వాళ్ల ఆచూకీ గానీ తెలియలేదు.
గౌతమి కోసం ఎదురుచూస్తున్న అనిల్ కూడా ఆమె క్షేమంగా లేదన్న నమ్మకం వచ్చేసింది. ఇంత శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు వున్న చంద్ర అడవిలో వెతికించడానికి ఎందుకు వెనకాడుతున్నాడో జనాల కర్థం కాలేదు. రాష్ట్రాన్ని ఏలే సి.ఎం. దిగులు లేకుండా తన పనులని చూసుకోవడం అనిల్ లాంటి వాళ్లకి చిరాక్కలిగించింది కూడా. కాంతారావు, ధర్మారావులు కూడా సి.ఎం. అసమర్థతని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇంక ప్రతిపక్షాల గురించి చెప్పనే అక్కర్లేదు. అయినా చంద్ర మొహంలో మార్పు లేదు. వాళ్లెవరూ నగల గురించి బాధపడలేదు. అడవిలో చిక్కుకున్న గౌతమీ వాళ్ల గురించే బాధ పడుతున్నట్టు కనిస్తున్నారు. అనిల్ లాంటి వాళ్లు విజయ నాయక్‌ని కలిసి మాట్లాడాలనుకున్నా అతనెక్కడికో కేంప్ కెళ్లాడని తెలిసి ప్రయాగ వాళ్లని కలిసి తమ అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. అనిల్ అప్పుడప్పుడు వెళ్లి శంకరయ్యని చూసి ధైర్యం చెప్పి వస్తున్నాడు.
అతని మనసంతా గౌతమి ఆలోచనలతో నిండిపోయింది.
‘పాపం గౌతమి! ఆ ఆటవికుల మధ్యన ఎన్ని యాతనలు పడుతోందో? ఎన్ని అవస్థలు పడ్డా ప్రాణాలతో తిరిగొస్తే తనని గుండెల్లో పెట్టుకుని మామూలు మనిషిని చెయ్యాలి. అసలు తనని ప్రాణాలతో చూడగలనా?’ ఇలా అనుకోవడం, భయంతో వణికిపోవడం ఎప్పుడూ జరుగుతున్నదే. అలాంటి సమయంలో అతని సెల్ మోగింది. సెల్‌లో మాట్లాడాక అతని మొహంలోకి కాస్త కాంతి వచ్చింది.
‘సరే! హాస్పిటల్‌కొచ్చెయ్యండి. ప్రస్తుతం జనాలు పెద్దగా వుండరు’ అన్నాడు చాలా మెల్లగా. తర్వాత ఇంకెవరికో ఫోన్ చేశాడు. ఆఘమేఘాల మీద అన్నట్టు హాస్పిటల్‌కి చేరుకుని రామయ్యని పళ్లు తెమ్మని పంపాడు. పళ్ల మార్కెట్ అక్కడికి చాలా దూరం. అయినా మంచి పళ్లు దొరుకుతాయని అక్కడికే పంపుతాడు. స్నానం చేసి నీట్‌గా తయారయ్యాడు. మూడో అంతస్తులో వున్న తన పర్సనల్ ఏ/సి రూమ్ అంతా సర్దించి ఎవరి కోసమో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అతనెదురు చూసేవాళ్లు రాలేదు గానీ పోలీసాఫీసర్ ప్రయాగ వచ్చాడు. క్షణం కంగారుపడినా తేరుకుని ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టి గౌతమిని గురించి అడిగాడు ఆతృతగా.
గౌతమి పేరు వినగానే ప్రయాగ మొహం కూడా వాడిపోయింది.
‘మీకేమైనా తెలుసేమో అని ఆశతో నేనొచ్చాను. తన దగ్గర సెల్ వుంది కదూ?’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
‘వుంది. కానీ అది రెస్పాన్స్ లేదు. ఆ అడవిలో చార్జ్ చెయ్యడానికి కరెంటెక్కడుంటుంది?’ అన్నాడు అనిల్ భారంగా.
‘నిజమే. కానీ తను వెళ్లిన వెంటనే ట్రై చేసినా రెస్పాన్స్ లేదు కదా. ఏవిటో? అంతా అయోమయంగా ఉంది. మీకో సంగతి తెలుసా?’ గొంతు తగ్గించి అన్నాడు ప్రయాగ.
‘ఏవిటి?’ ఆతృతగా అన్నాడు అనిల్.
‘ప్రభుగారు కూడా అడవిలో చిక్కుకున్న సంగతి...’
‘తెలుసు. ఆయన కూడా సాహసం చేశారు. ఎంతమంది పోలీసులు వెతుకుతున్నా ఫలితం లేదుగా..’ ప్రయాగ మాట పూర్తి కాకుండానే భారంగా అన్నాడు అనిల్. అతని మనసంతా రాబోయే గెస్టుల మీదే ఉంది.
‘అది కాదు డాక్టర్ అనిల్! మన విజయ నాయక్ కూడా అడవిలో చిక్కుకుపోయారు’ అన్నాడు ప్రయాగ.
కెవ్వుమన్నంత పని చేశాడు అనిల్.
‘ష్! ఇది చాలా రహస్యంగా ఉంచాలి. మీరు గౌతమి గారిని గురించి కృంగిపోయారు కదా. పేషెంట్స్‌ని కూడా సరిగ్గా చూడలేక పోతున్నారని విన్న సి.ఎం.గారు ధైర్యం చెప్పమన్నారు. ఎందుకంటే విజయ నాయక్ గారి మీద అపారమైన నమ్మకం ఉంచారాయన. కాబట్టి త్వరలో ముగ్గురూ కలిసి ఆ బ్లాక్ టైగర్‌తో సహా రావచ్చు’ అన్నాడు ప్రయాగ.
పొంగిపోయాడు అనిల్. అతని చేతులు పట్టుకుని వూపేస్తూ అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అంతే కాదు గౌతమి వచ్చేసినంత ఆనందం కలిగింది.
అతను ఆఫర్ చేసిన ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి, విజయ నాయక్ విషయం రహస్యంగా ఉంచమని మరోసారి హెచ్చరించి వెళ్లిపోయాడు ప్రయాగ.
అతని కారు వెళ్లగానే నౌకర్ని పిలిచి-
‘నాకోసం ఎవరైనా వచ్చారా?’ అన్నాడు మెల్లగా.
‘వచ్చారయ్యా’ అంటూ ఎవరొచ్చారో చెప్పాడతను.
‘ఎక్కడున్నారు?’
‘కింద మీ రూమ్‌లో కూర్చోబెట్టాను’
‘ఇద్దరూ కలిసే వచ్చారా?’ ఆతృతగా అడిగాడు అనిల్.
‘లేదయ్యా! పది నిమిషాల తేడాలో వచ్చారు. వచ్చి కూడా అరగంట దాటింది’
‘ఓ! వాళ్లిద్దర్నీ ఇక్కడికి తీసుకురా! ఇటుకేసి ఎవర్నీ రానివ్వద్దు. నేను పిలిస్తే గానీ నువ్వూ రావద్దు’ అన్నాడు అనిల్. నౌకరు తలవూపి, రెండు నిమిషాల్లో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చి తను వెళ్లిపోయాడు.
వాళ్లెవరో కాదు, ధర్మారావు - కాంతారావులు. ఇద్దరి మొహాల్లోనూ చిరాకు కనిపిస్తోంది. అదేం గమనించని అనిల్-
‘ఏవిటి.. ముఖ్య విషయం అని ఫోన్ చేశావ్? కొంపతీసి ఆలయపు దొంగల గురించేమైనా తెలిసిందా?’ అన్నాడు ఉత్సాహంగా.
‘ఆఁ! తెలిసింది. నగల గురించి కూడా తెలిసింది’ చిరాగ్గా అన్నాడు ధర్మారావు.
‘ఏవిటంత చిరాకు పడిపోతున్నారు’ అన్నాడు అనిల్ ఆశ్చర్యంగా.
‘చిరాక్కాదు, ఆనందంగా ఉంది. మమ్మల్ని రమ్మని ఫోన్ చేసి నువ్వెవరితోనో కబుర్లు చెప్తూ కూర్చున్నావ్. ఇదేనా నువ్వు మాకిచ్చే గౌరవం?’ నిలదీసినట్టు అన్నాడు కాంతరావు.
‘సారీ! వచ్చింది ఎవరో కాదు. ఆ ప్రయాగ! వచ్చిన కారణం పెద్దగా ఏం లేదు గానీ జిడ్డులా పట్టుకుని వదల్లేదు. గౌతమిని గురించి ఏమైనా చెప్తాడేమో అని ఆశ పడ్డాను. కానీ ననే్న ఎంక్వయిరీ మొదలుపెట్టాడు.’ అంటూ అంతా చెప్పాడు అనిల్.
మొహాలు చూసుకున్నారు శ్రోతలు.
‘సరే! మీరు చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏవిటి? గౌతమిని గురించి ఏమైనా తెలిసిందా?’ అన్నాడు అనిల్ ఆతృతగా.
‘గౌతమిని గురించి తెలిస్తే నీకే తెలియాలి. అవునూ. మీ నర్సెలా ఉంది?’ ఓరగా చూస్తూ అన్నాడు ధర్మారావు.
‘నర్సా?’
‘అవును! ఆమెతో పనుంది!’
‘ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు నర్సులున్నారు. కానీ వాళ్లలో మీకు పనికొచ్చే వాళ్లెవరూ లేరు. ముగ్గురూ వయసు మళ్లిన వాళ్లే!’ పెద్దగా నవ్వుతూ అన్నాడు అనిల్.
‘వాళ్లు కాదు..’
‘మరి?.. ఓ! గౌతమి పెట్టిన నర్సా? ప్చ్! లాభం లేదు’ పెదవి విరిచాడు అనిల్. ధర్మారావు, కాంతారావు కూడా తుళ్లిపడ్డారు.
‘ఆమెని గౌతమి పెట్టిందా?’ అన్నారు ఏకకంఠంతో.
‘అవును! కొంపతీసి ఆమె మీద మీ కన్ను పడిందా?’ అన్నాడు అనిల్ వ్యంగ్యంగా.
‘్ఛఛ! అది కాదు. అసలామె గురించి నీకేమైనా తెలుసా?’ అన్నాడు కాంతారావు.
‘ఎందుకు తెలియదు. నమ్మకమైన మనిషి. నర్స్ ట్రైనింగ్ అయి ఏదో నర్సింగ్ హోమ్‌లో కొన్నాళ్లు పని చేసిన అనుభవం ఉంది. నా అనేవాళ్లు లేని అనాధ. అఫ్‌కోర్స్! అమితంగా ప్రేమించే మనిషి. అందంగా కూడా ఉంటుంది. నిరుపేదరాలైనా డబ్బు కోసం గడ్డి తినదు. ఇంతకన్నా ఏం తెలియాలి?’ నవ్వాడు అనిల్.
‘అబద్ధం!’ అరిచాడు ధర్మారావు.
‘ఏది అబద్ధం! అందంలోనా, అందుబాటులోనా?’ అల్లరిగా అన్నాడు అనిల్.
‘అయ్యో! ఇది తమాషా విషయం కాదు డాక్టర్. ఒక్క అందం గురించి తప్ప మిగతా విషయాలన్నీ అబద్ధాలే!’ తలబాదుకున్నాడు కాంతారావు.
‘అంటే?’
‘ఆమె ఒంటరిదాన్నన్నది కష్టాల్లో వున్నానన్నదీ. నర్స్ ట్రైనింగ్ అయ్యానన్నదీ అన్నీ అబద్ధాలే!’
‘నిజమా? తనకి బాయ్‌ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని విన్నాను. కానీ నర్స్ ట్రైనింగ్ కాలేదని తెలియదు. కానీ ట్రైన్డ్ నర్స్‌కన్నా చక్కని నాలెడ్జ్ ఉంది’ మెచ్చుకోలుగా అన్నాడు అనిల్.
‘హయ్యో! నీకెలా చెప్తే అర్థమవుతుంది అనిల్! తనది కేరళ అని చెప్పింది కదూ?’ విసుగ్గా అన్నాడు ధర్మారావు.
‘అవును! తన నేటివ్ కేరళ అని చెప్పింది’
‘కాదు. ఆమెది హైదరాబాద్!’
‘ప్చ్! ఏ వూరైతే మనకెందుకు? ఏ రాష్ట్రం అయితే మనకెందుకు. తను పేదపిల్ల కాకపోవచ్చు. డబ్బు కోసం గౌతమి కాళ్లు పట్టుకుంది. గౌతమిది జాలిగుండె. ఆమె చెప్పినవి నిజమే అనుకుని రికమండ్ చేసింది. ఇప్పుడామె గొడవెందుకు?’ విసుక్కున్నాడు అనిల్.
‘జాలి కాదు. పథకం! నువ్వు పొరపాటు చేశావ్. నీ దగ్గర నర్స్‌గా చేరిన ఆమె చండీఘర్‌లో ఎం.డి. చేసింది’ అన్నాడు కాంతారావు.
అనిల్‌కి మతి పోయినట్టయింది.
‘మీరు మాట్లాడేది నా దగ్గర పని చేసిన లూసీని గురించేనా?’ అన్నాడు అయోమయంగా.
‘ఎస్! ఆ లూసీనే మేం చెప్పిన చందన’
‘కానీ.. అంత చదువు చదివి, నా దగ్గర నర్స్‌గా ఎందుకు చేరింది?’
‘మన అంతుతేల్చడానికి!’ కసిగా అన్నాడు కాంతారావు.
‘అది మన అంతు తేలుస్తుందా?’ పెద్దగా నవ్వాడు అనిల్.
‘ఇంకా అర్థం కాలేదా? ఆమె పేరు ప్రియచందన. గౌతమికి ప్రాణస్నేహితురాలు. ఆమెది హైదరాబాద్. తండ్రి పోలీస్ కమిషనర్. గౌతమిలాగే సాహస యువతి. ఏదో పెద్ద పథకం వేసే నీ దగ్గర చేరింది. ఈ వివరాలు చాలా ఇంకా కావాలా?’ అరిచినట్టు అన్నాడు ధర్మారావు.
కొయ్యబారిపోయాడు అనిల్.
ఎంతైనా లూసీ సంగతి గౌతమికి తెలుసంటే అతను నమ్మలేక పోతున్నాడు.
‘నిజంగా లూసీ వెనక ఇంత చరిత్ర ఉందని గౌతమికి తెలిసుండదు. అదేదో కథలు చెప్పేసరికి జాలిపడి రికమండ్ చేసుంటుందని పదిమంది మగాళ్లతో తిరగడం చూసి, పేరెంట్స్ మందలిస్తే, తెలివిగా ఇక్కడ చేరుంటుందా లూసీ’ అన్నాడు కోపంగా.
‘గౌతమి అంత అమాయకురాలు కాదు. ముక్కూమొహం తెలియనిదాన్ని నీ దగ్గర పెట్టడానికి. తనకి నీకు తెలియని విషయాలు చాలా తెలుసు. అంతెందుకు? విషయం ఏమిటో ఇప్పుడే తేల్చేద్దాం. ముందామెని పిలిపించు’ విసుగ్గా అన్నాడు కాంతారావు.
‘అడగచ్చు. కానీ..’ నసిగాడు అనిల్.
‘ఏం? నిజం చెప్పదనా? అడిగే విధంగా అడిగితే దాని తల్లో జేజెమ్మ చెప్తుంది’ ఆవేశంగా అన్నాడు ధర్మారావు.
‘కాదు. తను జాబ్ మానేసి వెళ్లిపోయింది!’
‘వ్వాట్??’ కాంతారావు, ధర్మారావు అరిచినట్టు అన్నారు.
‘అవును. వాళ్ల బావ రమ్మంటే వున్నపళంగా వెళ్లిపోయింది’ అంటూ జరిగిందంతా చెప్పాడు అనిల్.
‘అబద్ధం’ మరింత గట్టిగా అరిచాడు ధర్మారావు.
‘కానీ నాకలాగే చెప్పింది!’
‘అయ్యో అనిల్! నీ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? ఒక సంగతి చెప్పు! గౌతమికి మన గురించి తెలియదుగా!’ కంగారుగా అన్నాడు కాంతారావు.
‘మన గురించేమిటి?’
‘అదే.. మన మధ్య వున్న సంబంధం గురించి!’
‘తెలియదు. తెలిస్తే మాత్రం ఏం?’
‘నీకెలా చెప్పను అనిల్! గౌతమి సామాన్యురాలు కాదు. లూసీని కావాలనే ఇక్కడ పెట్టింది. లూసీ చెప్పినవి చిన్న అబద్ధాలుకావు. ఆమె సామాన్యురాలూ కాదు. ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగల సమర్థురాలు. అతితెలివితేటలు గల గౌతమే పెద్ద ప్లాన్ చేసి ఈ డ్రామా ఆడించింది. నీకేమాత్రం అనుమానం రాకుండా తనూ నటించి నిన్నో ఫూల్‌ని చేసింది. ఎంతో తెలివిగలవాడివైన నువ్వే గ్రహించలేక పోయావు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఓ పథకం ప్రకారం వచ్చింది. పని పూర్తి చేసుకుని ఉడాయించేసిందా లూసీ. కాదు.. చందన!’
‘అంటే ఇక్కడేదో తెలుసుకోవాలని వచ్చింది. తెలుసుకుంది. ఉడాయించేసింది. ఏ క్షణాన మన పీకల మీదికొస్తుందో అని మేం హడలి చస్తున్నాం’ ఆవేశంగా అన్నాడు ధర్మారావు.
(ఇంకా వుంది)

-రావినూతల సువర్నాకన్నన్