వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిల్ మొహం వెలవెలబోయింది.
‘ఇక్కడ ఆమె తెలుసుకోవాల్సిందేం ఉంది’ అన్నాడు బలవంతంగా నవ్వుతూ.
‘మా దగ్గర కూడా అమాయకత చూపిస్తున్నావా? ఇక్కడ రహస్యం ఏం లేదా?’ చిరాగ్గా అన్నాడు కాంతారావు. అనిల్‌కి మాట రాలేదు.
‘గౌతమంటే నీకిష్టం కదూ?’ అన్నాడు ధర్మారావు.
‘ఇష్టం కాదు. ప్రాణం!’ గభాల్న అన్నాడు అనిల్.
‘అదే.. మన పీకలకి చుట్టుకోబోతోంది’
‘వాడ్డూయూ మీన్. గౌతమికీ గొడవలేం తెలియవు. అసలు తనకి నగల మీద గానీ, డబ్బుమీద గానీ ఆశ లేదు’ చిరాగ్గా అన్నాడు అనిల్.
‘ఆవేశపడకు! నువ్వింకా ఎదగాలి బాస్! పసివాడు పాముని చూసి తాడని పట్టుకున్నట్టు అందం ఆకర్షణలతోపాటు వాక్చాతుర్యం కూడా వున్న ఆ పిల్ల మాటలకి పడిపోయి పీకల మీదికి తెచ్చావు’ కాస్త వ్యంగ్యంగానూ, కాస్త చిరాగ్గానూ అన్నాడు కాంతారావు.
‘అంటే డబ్బుకాశించే నా మీద ప్రేమ నటిస్తోందంటారా?’ అన్నాడు అనిల్ విసురుగా.
‘డబ్బు కోసం కాదు. నువ్వు ఒకందుకు ప్రేమ నటించావ్. అఫ్‌కోర్స్. తర్వాత నిజంగానే ప్రేమించావనుకో, కానీ తను నిన్ను ప్రేమించలేదు. మన రహస్యాలు తెలుసుకోవడానికే నిన్ను ప్రేమించినట్టు నటించింది. లూసీని కూడా అందుకే ఇక్కడ పెట్టింది. ఇక్కడ అనుమానించదగ్గదేం కనిపించకపోయేసరికి ఆ లూసీ ఇంటికి, గౌతమి అడవికి చెక్కేశారు. గౌతమికి కూడా ఆ బ్లాక్‌టైగర్ మీది అనుమానం బలపడి ఆ నగలు తెచ్చి సి.ఎం. కప్పజెప్పాలని ఇంతకి తెగించింది. ఏమైనా ఆడపిల్లకి అంత సాహసం మంచిది కాదు అనిల్’ అన్నాడు ధర్మారావు.
‘నిజమే! కానీ తనకీ ధైర్యం కొత్తగా వచ్చిందేం కాదు’ అన్నాడు కాంతారావు.
‘అవును. ఎంత ధైర్యస్థురాలు కాకపోతే ఆ కొండ మీద నిశ్చింతగా ఉండగలదు’ మెచ్చుకోలుగా అన్నాడు అనిల్.
‘ఆ ధైర్యం ఏపాటిది. ఆమె మైకంలో పడి నువ్వు గ్రహించలేదు గానీ మైగాడ్ ఆమె చేసిన సాహసాలు, వేసిన పథకాలు... వింటే మతే పోయింది’ ధర్మారావు మొహం నిండా చెమటలు పట్టేశాయి. గౌతమిని గురించి ఏం వినాలొస్తుందో అని హడలిపోయిన అనిల్-
‘మీ మాటలు వింటూంటే నాక్కంగారుగా ఉంది. ముందు ఏదైనా తీసుకుని అప్పుడు మాట్లాడుకుందాం. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏం తీసుకుంటారు?’ అంటూ లిక్కర్ బాటిల్స్, గ్లాసులు వగైరా సిద్ధం చేశాడు. అంతే.. వాటిని చూడగానే ధర్మారావూ వాళ్లకి ఉత్సాహం వచ్చేసింది. పీకల దాకా తాగారు. తిన్నారు. వాగుడు మరింత పెరిగింది.
‘నీకో రహస్యం చెప్పనా?’ అన్నాడు కాంతారావు.
‘ఇంకో రహస్యం ఉందా?’ భయంభయంగా అన్నాడు అనిల్.
‘ఒకటా చాలా వున్నాయి. అన్నట్టు చంద్రయ్య సంగతి తెలుసుగా?’
‘తెలియడానికేం ఉంది. వాడికి మతిపోయిందిగా?’
‘పోయింది. కానీ సి.ఎం. స్వయంగా వాడికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాడు. ఎలాగైనా హంతకుణ్ని గుర్తుపట్టాలని.’
‘అయితే వాడికి మతి వస్తుందంటారా?’ ఆత్రుతగా అన్నాడు అనిల్.
‘ఇంకేం వస్తుంది. తల మీద అంత పెద్ద దెబ్బ తగిలి పుర్రె బైటికొస్తే. వాడు బతికినా చచ్చినవాడి కిందే లెక్క. అయినా వాణ్ని చంపాలనుకున్నది ఆటవికులు. వాళ్లని సి.ఎం కాదు కదా, పి.ఎం. వచ్చినా ఏం చెయ్యలేడు’ అన్నాడు ధర్మారావు.
‘ఆ జహ్వరీ ఖరీదు ఎంత ఉంటాయో?’ అన్నాడు కాంతారావు.
‘వాటికి విలువ కట్టడం అసాధ్యం. నిపుణులైన ఏ విదేశీయులో కట్టాలి’ అన్నాడు ధర్మారావు.
‘అయితే అమెరికా వాళ్లు బెస్ట్ అనిపిస్తోంది’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు కాంతారావు.
వాళ్ల మాటలు చిరాక్కలిగించాయి అనిల్‌కి.
‘ఇవేనా మీరు చెప్పే రహస్యాలు?’ అన్నాడు విసుగ్గా.
‘చెప్పిన విషయాలు నీకు ఆనినట్టు లేదు. అయితే విను. మనకి బద్ధ శత్రువు ఆ గౌతమే’ అంతకన్నా సీరియస్‌గా అన్నాడు కాంతారావు.
‘కాంతారావ్...’
‘అవును. కాంతారావునే. ఆవేశాన్ని అవతలకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ‘క్లూ’ అన్న పేరు విన్నావుగా?’
‘ఇప్పుడా ‘క్లూ’ గొడవెందుకు?’ విసుక్కున్నాడు అనిల్.
‘ఆ క్లూనే సి.ఎం. వాళ్లకి ఉప్పందించిందన్న విషయం కూడా తెలుసుగా’
‘అంతేకాదు. సెక్యూరిటీ వాళ్లని చంపి, దేవుడి నగలు ఆ బ్లాక్‌టైగరే దొంగిలించాడని చెప్పిందనీ తెలుసు. అయితే ఏవిఁటి?’ కస్సుమన్నాడు అనిల్.
‘ఆ ‘క్లూ’ ఎవరో తెలుసా?’
‘ఆఁ! మా మేనత్త కూతురు! ఏవిటీ చచ్చు ప్రశ్నలు?’ మరింత విసుక్కున్నాడు అనిల్.
‘చచ్చు ప్రశ్నలు కాదు. అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఆ ‘క్లూ’ సాక్షాత్తూ నువ్వు దేవత అనుకునే గౌతమే!’
‘వ్వాట్?’ ఆవేశంతో లేచాడు అనిల్.
‘ఎస్! మాకొచ్చిన ఇన్ఫర్మేషన్‌లో పొరపాటేం లేదు. కావాలంటే నువ్వే ఎంక్వయిరీ చేసుకో’ అంటూ లేచాడు ధర్మారావు.
‘ముందా లూసీని పట్టుకో. మన పద్ధతిలో అడిగితే మొత్తం నిజాలన్నీ కక్కేస్తుంది. మనం మళ్లీ కలుద్దాం’ అన్నాడు కాంతారావు కూడా లేచి.
ఇద్దర్నీ పంపి నీరసంగా కూలబడిపోయాడు అనిల్. ఎంత ఆలోచించినా ఆ ‘క్లూ’నే గౌతమని, ఇన్ని సాహసాలు చేస్తూ తన దగ్గర ప్రేమ నటిస్తోందని అనుకోలేక పోతున్నాడతను. ఎలాగైనా లూసీని గాలించి పట్టుకోవాలని నిర్ణయించుకుని లేచాడు.
* * *
చిన్ని వాళ్లిల్లు, జింబో వాళ్లింటితో పాటు కాస్త దిగువగా చాలా ఇళ్లున్నాయి. రెల్లుగడ్డితో చక్కని ఆవరణతో ముని వాటికల్లా చాలా అందంగా ఉన్నాయి. అలాంటి తండాలు ఆ అడవిలో చాలా వున్నాయి. కాకపోతే దొర ఇల్లు మాత్రం కాస్త పెద్దదిగానూ, మరిన్ని సౌకర్యాలతోనూ ఠీవిగా కనిపించింది.
‘మీ గూడెం చాలా బాగుంది చిన్నీ!’ అన్నాడు ప్రభు.
‘మా ఇల్లు మరింత బావుంటుంది. ముందు తోటలు, పొలాలూ చూద్దాం రండి’ అంది చిన్ని. ముగ్గురూ కలిసి జొన్నచేలూ అవీ చూస్తూ నడక సాగించారు. అప్పుడే పిడుగులా వచ్చి పడ్డాడు జింబో.
‘ఏవిఁటి దొర మీకు స్వేచ్ఛనిచ్చి ఇక్కడి రప్పించింది అడవి తల్లి అందాల్ని చూడ్డానికే గానీ ఇలా ఆడపిల్లల్ని వెంటేసుకుని జల్సా చేయడానిక్కాదు’ అన్నాడు ప్రభుకేసి నిప్పులు కురిసేలా చూస్తూ. ప్రభు బిత్తరపోతే చిన్ని మాత్రం-
‘ఏవిఁటి నీ బాధ? గౌతమి మా ఇంట్లో వుంటే, వీళ్ల మధ్యనేదో జరుగుతుందని భయంగా ఉందా? అలా అయితే ప్రభుగారు మా ఇంట్లో వుంటారు. తనని మీ ఇంటికి తీసికెళ్లు’ అంది నిర్భయంగా.
‘మా ఇంటికా?’
‘అవును. నీక్కావలసిన వాళ్లు నీ దగ్గరుంటారు. నాక్కావలసిన వాళ్లు నా దగ్గరుంటారు’ మెలికలు తిరుగుతూ అంది చిన్ని. జింబో కళ్లు ఎర్రబడ్డాయి.
‘ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?’ అన్నాడు ఆవేశంగా.
‘ఇందులో అర్థం కాకపోవడానికేం ఉంది బావా! నువ్వు గౌతమిని ప్రేమిస్తున్నావ్. అలాగే నేను ప్రభుగారిని ప్రేమిస్తున్నాను’ నవ్వింది చిన్ని.
‘నీకు మతిపోయిందా?’ అరిచాడు జింబో.
‘మతి పోయింది నాక్కాదు. నీకు!’
‘చిన్నీ!’
‘ష్! అరవకు. నీ అరుపులకి భయపడి బుర్ర వూపడానికి నేను మునుపటి చిన్నిని కాదు’ అంటూ విసురుగా వెళ్లిపోయింది చిన్ని.
నిర్ఘాంతపోయాడు జింబో. తనతో గట్టిగా మాట్లాడ్డానికే హడలిపోయే చిన్ని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడాన్ని అతను సహించలేక పోయాడు.
‘ఏవిఁటి జింబో! అలా అయిపోయావేంటి? చిన్ని నిజంగానే ప్రభుని ప్రేమించినట్టుంది. వాళ్లనొదిలేద్దూ’ అంది గౌతమి ఓరగా చూస్తూ.
‘అవును. నేనంటే తనకి చాలా ఇష్టమని నేనెప్పుడో గ్రహించాను’ అన్నాడు ప్రభు ముసిముసిగా నవ్వుతూ.
‘అబద్ధం. అది నన్ను తప్ప ఎవర్నీ ప్రేమించదు. నటిస్తోంది. అది ప్రేమించాననగానే నువ్వు పెళ్లి చేసేసుకుంటావా?’ కస్సుమన్నాడు జింబో.
‘్ఛ! నేనెందుకు చేసుకుంటాను. నేను, గౌతమి చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. చిన్ని మాటలు సరదాగా వింటున్నానంతే’ అంటూ గౌతమిని పొదివి పట్టుకున్నాడు ప్రభు.
జింబో ఒంటికి కారం రాసినట్టయింది.
‘సరే! మీ సంగతి వూరెళ్లొచ్చాక చెప్తాను’ అంటూ విసురుగా వెనక్కి తిరిగాడు.
‘జింబో!’ పిల్చింది గౌతమి.
‘ఏవిఁటి?’ అన్నట్టు ఉరిమి చూశాడు జింబో.
‘మళ్లీ ఎప్పుడొస్తావ్?’
‘పన్లయ్యా’ అరిచినట్టు అని వెళ్లిపోయాడు జింబో.
గౌతమికి దూరంగా జరిగి -
‘సారీ! తప్పనిసరై కాస్త చొరవ చేశాను’ అన్నాడు.
‘ఈ సారీలూ అవీ తర్వాత! ముందు దూరం నించి మీరడిగిన పాతాళ స్వర్గాన్ని చూపిస్తాను’ అంతవరకూ చెట్ల చాటున వున్న చిన్ని ఇద్దరి చేతులూ పట్టుకుని లాక్కెళ్లింది.
* * *
కాంతారావూ వాళ్లు వచ్చి వెళ్లాక అనిల్ మనసంతా చిరాగ్గా అయిపోయింది. గౌతమిని గురించి అలా మాట్లాడ్డం తనని చాలా బాధించింది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా గౌతమికి లూసీని గురించి వివరాలు తెలియకే తనకి రికమండ్ చేసిందని అతని నమ్మకం. ఆ నమ్మకం లూసీ మీది కోపాన్ని రెట్టింపు చేసింది. ఎలాగైనా ఆమె ఉనికి తెలుసుకుని తగిన గుణపాఠం చెప్పాలన్న ఆరాటంతో ఆమె ఇచ్చిన కేరళ అడ్రస్‌లోనూ, ఫోన్ నంబర్ల ఆధారాలతోనూ ఎంక్వయిరీలు చేయించాడు. అన్నీ ‘ఫేక్’ అని తెలిసి మరింత మండిపడ్డాడు. పిచ్చెక్కినట్టు అందరి మీదా అనవసరంగా మండిపడుతున్నాడు. దీనికి తోడు ధర్మారావూ వాళ్ల ఫోన్లు మరింత పిచ్చివాడిని చేస్తున్నాయి. హాస్పిటల్ పనులు కూడా స్ట్ఫా మీద వదిలేశాడు.
గౌతమి మీది ధ్యాస శంకరయ్య మీదికెళ్లింది. హఠాత్తుగా గౌతమికి తనిచ్చిన మాట కూడా గుర్తొచ్చింది. ఆయన్ని నీకన్నా బాగా చూసుకుంటానన్న మాట తన టెన్షన్లతో మర్చిపోయాడు. హాస్పిటల్‌కెళ్లి శంకరయ్యని ఈ మధ్య చూడనే లేదు. తనని తాను తిట్టుకుంటూ హాస్పిటల్‌కేసి వెళ్లాడు.
అయితే ఎప్పటిలాకాక పోలీసు బందోబస్తుతో హడావిడిగా ఉంది. డాక్టర్లు ఏదో కొంపలంటుకున్నట్టు పరుగులు తీస్తున్నారు. ఆ హంగామా శంకరయ్య వుండే రూమ్‌వైపే ఎక్కువగా ఉండడంతో ఆయనకేమైందో అని హడలిపోయాడు అనిల్. అక్కడ సెక్యూరిటీ దగ్గరకెళ్లి-
‘ఏవిఁటి.. హడావిడి?’ అన్నాడు మెల్లగా.
‘సి.ఎం.గారి ఆర్డర్’ అన్నాడతను క్లుప్తంగా.
‘సి.ఎం.గారి ఆర్డరా? అసలేం జరిగింది?.. శంకరయ్యగారు కులాసాగా వున్నారా?’ ఆతృతగా అడిగాడు అనిల్.
‘ఆయన ఆరోగ్యం బానే ఉంది కానీ..’
‘ఊఁ కానీ?’ ఉద్వేగంగా అన్నాడు అనిల్.
‘ఆయన మీద హత్యా ప్రయత్నం జరగచ్చనే వార్త అంది సి.ఎం.గారే స్వయంగా గట్టి బందోబస్తు చేయించారు’ గొంతు తగ్గించి గుసగుసగా అన్నట్టు అన్నాడు సెక్యూరిటీ.
‘శంకరయ్యగారి మీద హత్యా ప్రయత్నమా?’ తుళ్లిపడ్డాడు అనిల్.
‘అవును సార్! ఇది గాలి వార్త అనుకుంటున్నారా? ఎవరో ఆ పంతులుగారిని చంపాలని చూస్తున్నారట. గట్టి వార్త కాకపోతే మన సి.ఎం.గారు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారా?’

‘ఈ మాత్రం తెలియదా?’ అన్నట్టు ఓ లుక్కు పడేసి మరీ అన్నాడు సెక్యూరిటీ.
క్షణం మాట రాలేదు అనిల్‌కి. రకరకాల అనుమానాలు కందిరీగల్లా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
‘హత్యా ప్రయత్నం చేసింది ఆ బ్లాక్ టైగరే కదూ?’ అన్నాడు లోగొంతుకతో.
‘అనే అందరూ అనుకునేది. ఇంకా కొన్ని రోజులు చూసి మందీమార్బలంతో అడవి మీదే దాడిచేసే ప్రయత్నంలో వున్నారు సి.ఎం.గారు. ఆయనకి పంతం వచ్చిందంటే ఇంక ఆ దేవుడు కూడా ఆపలేడు’ గర్వంగా అన్నాడు సెక్యూరిటీ.
‘వీడెవడో సి.ఎం.కి కాకారాయుళ్లా ఉన్నాడు’ అని మనసులో తిట్టుకుంటూనే పైకి-
‘ఒకసారి నేను శంకరయ్య గారిని చూడొచ్చా?’ అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ.
‘అమ్మో! మాకు మాటొస్తుంది’ కంగారు పడిపోయాడతను.
‘నేనాయన బంధువనేనయ్యా’ మనసులో మండిపడుతూనే పైకి వేడికోలుగా అన్నాడు అనిల్. అతనేదో అంటుండగానే అనిల్ గురించి తెలిసిన సిబ్బంది-
‘ఈయన పంతులుగారి క్కాబోయే అల్లుడయ్యా. ఈయన తరచూ వస్తూంటారు’ అని చెప్పడంతో అనిల్‌ని లోపలికి అనుమతించారు సెక్యూరిటీ. తేలిగ్గా ఊపిరి తీసుకుని వాళ్లకి థాంక్స్ చెప్పి శంకరయ్య దగ్గరికెళ్లి ఆప్యాయంగా పలకరించాడు అనిల్. అతన్ని చూడగానే ఆయన మొహం వెలిగిపోయింది.
‘ఆరోగ్యం ఎలా వుందంకుల్?’ అన్నాడు అనిల్ మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చుంటూ.
‘నా ఆరోగ్యానికేం నాయనా! నా బిడ్డ...’ దుఃఖంతో శంకరయ్యకి మాట రాలేదు.
‘గౌతమిని గురించి మీరు బెంగ పడకండంకుల్. ప్రభుగారు కూడా వెళ్లారుగా. తను క్షేమంగా తిరిగొస్తుంది’ అన్నాడు అనిల్ ధైర్యం చెప్తున్నట్టు.
‘లేదు అనిల్. గౌతమి తిరిగి రాదు. తనని చంపేసి ఉంటారు’ దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు శంకరయ్య.
‘్ఛఛ! తననెందుకు చంపుతారు? ఆటవికులకి వైద్యం చేసిందని కూడా అంటున్నారు’ అన్నాడు అనిల్ మరింత ధైర్యాన్ని కలిగించాలని.
‘తనని చంపేది ఆటవికులు కాదు!’
‘మరి?’
‘ఆ ధర్మారావూ వాళ్లే నా తల్లిని పొట్టన పెట్టుకుని ఉంటారు’ తనని తాను మర్చిపోయినట్టు ఆవేశంగా అన్నాడు శంకరయ్య.
నెత్తిన బాంబు పడినట్టు తుళ్లిపడ్డాడు అనిల్.
‘అవును అనిల్! ఆ ధర్మారావు, కాంతారావు కలిసి ప్లాన్డ్‌గా చంపేసుంటారు’ బావురుమన్నాడు శంకరయ్య.
‘్ఛఛ! వాళ్లు మన గౌతమిని ఎందుకు చంపుతారు? దానివల్ల వాళ్లకేం లాభం?’
‘నీకు తెలియదు అనిల్! గుళ్లోని నగల మీద ఎప్పట్నించో వాళ్ల కళ్లు పడ్డాయి. వాటిని కాజెయ్యడానికి ఇద్దరూ కలిసి చాలా రోజులుగా పథకాలు వేసి చివరికి తెగించారు. అమూల్యాభరణాలు స్వంతం చేసుకున్నారు. ఇంకేం లాభం కావాలి’ కోపంగా అన్నాడు శంకరయ్య.
క్షణం నోట మాట రాలేదు అనిల్‌కి.
‘కానీ వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందే?’ అన్నాడు తేరుకుని.
‘అదంతా ఓ నాటకం. మనందర్నీ ఫూల్స్‌ని చెయ్యడానికి ఆడిన హైటెక్ డ్రామా! వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి గుసగుసలాడుకోవటం, కొన్ని చర్యలు చంద్రయ్య చూశాడు. అందుకే అతన్ని కూడా చంపాలనుకున్నారు.’
‘నిజమా?’ విపరీతంగా ఆశ్చర్యపోయాడు అనిల్.
‘అవును. ఈ విషయాలన్నీ గౌతమిక్కూడా తెలుసు. దొంగతనం జరగబోతోందని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. చివరికి దానే్న బలి తీసుకున్నారు’ శంకరయ్య గొంతు వణికింది. అనిల్ గుండె క్షణం ఆగి, తిరిగి రెట్టించిన వేగంతో కొట్టుకుంది.
‘గౌతమిక్కూడా తెలుసా? కానీ నాకెప్పుడూ చెప్పలేదే..’ అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ.
‘ఇది అనుమానమే కదా. అందుకే చెప్పి ఉండదు. చాలా విషయాలు నా దగ్గరా దాచింది. ఆ చంద్రయ్య ద్వారా వివరాలు రాబట్టి, ఆధారాలతో సహా వాళ్లని పట్టుకుని ఉరి తీయించాలని సిఎం గారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో నన్ను దోషిగా చూసినా ఇప్పుడు చాలా గౌరవంగా చూస్తూ ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. అంతేకాదు నా ప్రాణానిక్కూడా ముప్పుండచ్చని గట్టి బందోబస్తు కూడా చేశారు’ అమాయకంగా అన్నీ చెప్పేశాడు శంకరయ్య. అనిల్ మొహం పాలిపోయింది. గుండె దడ మరింత పెరిగింది. అయినా బైటపడకుండా-
‘ప్చ్! ఆ చంద్రయ్య బతికినా మతిచలించిందనీ, ఇంక బాగవడం కష్టమనీ విన్నాను. ఇంక అతనేం చెప్పగలడు. చెప్పినా మతి చాంచల్యం వున్న వాడి కింద జమ కట్టేస్తారు. ఇంక ఆ భగవంతుడే తన నగల్ని, అమాయకుల్ని కాపాడుకోవాలి’ అన్నాడు తెగ బాధపడిపోతున్నట్టు.
‘అదే.. ఆ భగవంతుడి లీల! నీకో సంగతి తెలుసా? తెలిసుండదులే. ఎవరికీ తెలియదు. నువ్వూ నోరు జారకు. చంద్రయ్యకి మతీ పోలేదూ ఏం లేదు. కాకపోతే గాయాలు పూర్తిగా మానక ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు’ గొంతు తగ్గించి మరీ చెప్పాడు శంకరయ్య.
ఈసారి నెత్తిన పిడుగు పడ్డట్టే అయింది అనిల్‌కి.
‘అతనూ ఈ హాస్పిటల్‌లోనే ఉన్నాడా?’ అన్నాడు ఆతృతగా. శంకరయ్య ఏదో అనబోతుండగా డాక్టర్లు హడావిడిగా వచ్చేశారు. అనిల్‌ని చూసి-
‘సారీ డాక్టర్! ఈయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విశ్రాంతి చాలా అవసరం. ఆయన్ని ఎక్కువగా మాట్లాడించకండి’ అన్నారు నిర్మొహమాటంగా.
‘అది కాదు డాక్టర్! ఈయన కూతుర్ని గురించి...’
‘ఆ విషయమే ఈయన్ని మరీ అప్‌సెట్ చేస్తోంది. అందుకే ఆయన్ని ఎక్కువగా మాట్లాడనివ్వడం లేదు. మీకు తెలియందేం ఉంది. ఇప్పుడాయనకి మానసికంగానూ, శారీరకంగానూ కూడా విశ్రాంతి అవసరం. అందుకే విజిటర్స్‌ని అలవ్ చేయడం లేదు. అఫ్‌కోర్స్. మీరీయనకి ఆత్మీయులు. చూడాలనిపించినప్పుడు చూసి వెళ్లండి’ అన్నాడో డాక్టర్ సున్నితంగానే.
‘అయామ్ సారీ! వెళ్లిపోతాను’ లోపల మండిపడుతూనే పైకి వినయంగా అన్నాడు అనిల్. డాక్టర్లు శంకరయ్యని టెస్ట్ చేసి ఎక్కువగా ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక ఊపిరందినట్టయింది అనిల్‌కి. అయితే శంకరయ్య దగ్గర్నించి విషయం ఎలా రాబట్టాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అంతవరకూ పక్కకి తొలగిన సెక్యూరిటీ గార్డ్ డాక్టర్లు వెళ్లగానే గుమ్మం బైట సెటిలై పోయాడు.
హాస్పిటల్ బైటేకాక రూమ్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉండడంతో ‘నిజంగానే ఈయన్ని ఎవరైనా చంపాలనుకుంటున్నారా? అదే నిజమైతే.. ఈయన్ని చంపే అవసరం ఎవరికుంది?’ అన్న ఆలోచనలో పడిపోయాడు అనిల్.
‘హాయ్ అంకుల్! ఎలా వున్నారు? రావడం కాస్త లేటయింది కదూ? సారీ! తీరా బయల్దేరుతుంటే ఎవరో ఫోన్లు’ అంటూ చేతిలోని బేగ్స్ టేబిల్ మీద పెట్టబోతూ స్టూల్ మీద ఓ పక్కగా కూర్చున్న అనిల్‌ని ఠక్కున ఆగిపోయిందో యువతి.
మంచానికి కాస్త దూరంగా కూర్చున్న అనిల్ కొయ్యబారిపోయాడు. గుండె దడదడలాడింది. అదోలా జలదరించింది ఒళ్లంతా.
కారణం ఆమె అందం కాదూ ఆకర్షణా కాదు. ఆమె లూసీ కావడమే.
‘లూసీ’ అన్నాడు అప్రయత్నంగా.
‘లూసీ?’ అర్థం కానట్టు చూసిందామె.
‘రా అనిల్! ఆ డాక్టర్ల మాట పట్టించుకోకు. నేనిప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను. అయినా వాళ్ల పిచ్చిగానీ డాక్టర్‌వి నీకు తెలియదా?’ అన్నాడు శంకరయ్య.
‘ఓ! అనిల్ అంటే మీరేనా?’ విశాలనేత్రాలు మరింత విశాలం చేస్తూ అందామె.
‘లూసీ’ అప్రయత్నంగా అన్నాడు అనిల్.
‘లూసీ, బ్రూసీ కాదయ్యా! మా గౌతమి ప్రాణ స్నేహితురాలు. డాక్టర్ ప్రియ చందన. మేమంతా ప్రియా అని పిలుస్తాం. ఇతను డాక్టర్ అనిల్. గౌతమి ఫ్రెండ్. తను క్షేమంగా ఉంటే భర్త కూడా’ అంటూ పరిచయ వాక్యాలు పలికాడు శంకరయ్య.
‘నమస్తే!’ చిరునవ్వుతో చేతులు జోడించిందామె.
ప్రతి నమస్కారం చెయ్యకుండానే ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాడు అనిల్.
‘ఏవిఁటలా చూస్తున్నారు?’ కాస్త ఇబ్బందిగా కదుల్తూ అందామె.
‘నువ్వు... మీరు లూసీ కదూ?’ అన్నాడతను.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్